1. విశాఖ ఒక్కటే రాజధానని, శ్రీబాగ్ ఒప్పందం మేరకే ఈ నిర్ణయమని, మీకున్న పైత్యాన్ని బహిరంగంగా వెల్లడించారు కదా! శ్రీబాగ్ ఒప్పందంలో విశాఖ రాజధానని ఉన్నదా? ఆ ఒప్పందాన్ని మీరు అసలు చదివారా?
2. కర్నూలు న్యాయ రాజధానని నిన్నటి వరకు ఊరించారు, ఊదరగొట్టారు, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టారు. లోపభూయిష్టమైన చట్టాన్ని కూడా తెచ్చారు. హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందని ఊహించి ఆ చట్టాన్ని భేషరతుగా రద్దు చేసుకున్నారు. తాజాగా మూడు రాజధానులన్నది తప్పుడు అవగాహన, ఒకటే రాజధాని, అది విశాఖ మాత్రమేనని సెలవిచ్చారు. అమరావతి రాజధాని అంశంపైన విద్వేషపూరితమైన, విధ్వంసకర విధానాన్ని అమలు చేసినందుకు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పే విజ్ఞత మీకున్నదా?
3. “హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్”ను కర్నూలులో ఏర్పాటు చేస్తామంటూ మళ్ళీ మోసపూరిత ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? ఆ అధికారం మీకులేదని తెలుసుకొని, మీరు తెచ్చిన చట్టాన్ని ఉపసంహరించుకున్నారు. మోడీ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. తమ పరిధిలో లేదని మోడీ ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది కదా! హైకోర్టు అమరావతిలోనే ఉందని, ఉంటుందని సుప్రీం కోర్టుకు మీ ప్రభుత్వమే కదా! విన్నవించింది? మరి, “హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్”ని ఎలా ఏర్పాటు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో “ప్రిన్సిపల్ సీట్” అని పేర్కొన్నారు. మీరేమో ‘ప్రిన్సిపల్ బెంచ్” అన్నారు. కొన్నాళ్ళ తర్వాత నాలుక మడతేసి “హైకోర్టు బెంచ్” అంటారేమో! అవునా?
4. రాయలసీమను గురించి మాట్లాడే మీరు కృష్ణా నది యాజమాన్య బోర్డును కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని కర్నూలులో కాకుండా విశాఖలో పెట్టమని సిఫార్సు చేసిన జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఎలా కొనసాగుతున్నారు?
5. బచావత్ ట్రిబ్యునల్ నికరజలాలు కేటాయించిన రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ, కె.సి. కెనాల్ కు, శ్రీశైలం జలాశయం ఆధారంగా నిర్మించబడిన – నిర్మాణంలో ఉన్న ఎస్.ఆర్.బి.సి., తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు ముప్పుగా పరిణమించబోతున్న ఎగువ భద్ర ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, వార్షిక బడ్జెట్ లో రు.5,300 కోట్లు కేటాయిస్తే నోరు మెదపకపోగా బడ్జెట్ బాగుందని మీరే కదా కితాబిచ్చారు?
6. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో నిర్మిస్తామన్న గుండ్రేవుల ప్రాజెక్టు ఏమయ్యింది? ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మించాక తుంగభద్ర డ్యాం దిగువన నిర్మించ తలపెట్టిన గుండ్రేవులకు నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి?
7. హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువను విస్తరిస్తామన్నారు కదా! ఎందుకు విస్తరణ పనులను చేపట్టలేదు?
8. మీరు రాష్ట్ర ఆర్థిక మంత్రి కదా! గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ఎందుకు అటకెక్కించింది? ఆ ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టు ఎక్కడుందో తమరికి తెలుసా? ఎప్పుడైనా ఆ ప్రాంతానికి వెళ్ళారా?
9. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు కదా! మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయలేక చేతులెత్తేశారు?
10. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో వెనుకబడ్డ రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు కదా! దాని కోసం మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేక పోతున్నారు?
(టి.లక్ష్మీనారాయణ,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)