శేషాచలం కొండల్లో నక్కిన మలయప్ప గుహ

(తిరుపతి జ్ఞాపకాలు-64)

-రాఘవశర్మ

ఒక పెద్ద రాతి కొండకు తెరుచుకున్న నోరు.
తన లోనికి ఆహ్వానిస్తున్నట్టు తలుపులు బార్లా తెరుచుకుంది.
దాని నోటిలో ఎన్ని ఖనిజాలున్నాయో!
ఎన్ని నిజాలున్నాయో!
ఎంత చరిత్ర దాగుందో!
అది ఎన్ని ఆశలు కల్పించిందో!
ఎందరిని ఎంత శ్రమకు గురిచేసిందో!
అర్ధ చంద్రాకారపు ఆర్చిలాగా లోనికి చొచ్చుకుపోయి ఉంది.
వంద మంది దాకా పట్టేంత విశాలమైన గుహ.
దీన్ని మలయప్ప గుహ అని, మలయప్ప గవి అని అంటారు.
ఈ గుహ కచ్చితంగా ఎక్కడుందో తెలియదు.
తిరుమలలోని శేషాచలం కొండల్లో దీని అన్వేషణ కోసం ఈ మధ్య కాలంలో రెండు మూడు ట్రెక్కింగ్ బృందాలు ప్రయత్నం చేశాయి.
ఇది ఎక్కడ నక్కి ఉందో కంటపడలేదు.
ఆ బృందాలు నిరాశగా వెనుతిరిగాయి.
మలయప్ప గుహను చూడాలని ఆదివారం మా అన్వేషణ మొదలైంది.

అసలు ఈ అన్వేషణ సాగించాలా, వద్దా అని శనివారం రాత్రి వరకు సందిగ్ధం సాగింది.
ఒద్దులే అనుకుని రాత్రి పది గంటలకు నిద్రపోయాం.
తెల్లారితే ఆదివారం.
రాత్రంతా మధుకు నిద్రపట్టలేదు.
ఆదివారం అడవిలో ఉండకుండా మధు ఊర్లో ఏం చేస్తున్నాడు!? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.
అడిగిన వారికంతా సమాధానం చెప్పుకోవాలి!
మధుకు కొన్నేళ్ళుగా ఇదే సమస్య.
ఆదివారం ఉదయం ఆరుగంటలకు మధు సిద్ధమయ్యాడు.
ఫోన్లు చేస్తే అప్పటికప్పుడు ఆరుగురు సిద్ధమయ్యాం.
ఉదయం ఏడున్నరకు అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరాం.
గంటలో పాపనాశనం డ్యాం వద్దకు చేరాం.
అక్కడ నుంచి తూర్పునకు మా నడక.
లోయలోకి దిగాం.
మధ్యలో చిన్న ఏరు ప్రవహిస్తోంది.
వర్షాకాలంలో ఉదృతంగా ప్రవహించే ఏటి ధాటికి రాళ్ళు కొట్టుకు వచ్చాయి.
ఆరాళ్ళలోనడుస్తూ ముందుకు సాగాం.
ఎదురుగా ఎత్తైన కొండ ఎక్కడం మొదలు పెట్టాం.
కొండ నిటారుగా ఉంది.
దారి తెన్నూలేదు.
చెట్ల లోంచి దారి చేసుకుంటూ ముందుకు సాగి, కొండ కొసకు చేరాం.
‘తూర్పు వైపున ఇక్కడెక్కడో గుహ ఉన్నట్టు చెప్పారు’ అని మధు అన్నాడు.
‘అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను’ అని జై బాలాజీ వంతపలికాడు.
తూర్పు వైపునకు దిగడం మొదలు పెట్టాం.

ఏటి రాళ్ళ పై నుంచి నడక

ఎక్కడా దాని ఆనవాళ్ళు కానరాలేదు.
కొండ దిగుతున్నా దారి తెన్నూ లేదు.
కొంత దిగేసరికి పై నుంచి ప్రవహిస్తున్న ఏటి ఆనవాళ్ళు కనిపించాయి.
ఆ ఏటి నుంచి పెద్ద పెద్ద రాళ్ళు వర్షానికి దొర్లుకొచ్చి పడ్డాయి.
ఆ రాళ్ళ పక్కనుంచే కొండ దిగుతున్నాం.
దారిలో అంతా ముళ్ళచెట్లు.
నేలంతా ఎండిన ఆకులు, బోద.

అడుగుపెడితే కాళ్ళు జారుతున్నాయి. మొత్తానికి కొండ దిగాం.
ఎదురుగా మరొక కొండ.
ఆ రెంటి మధ్య నుంచి వర్షాకాలంలో ఏరు ప్రవహించిన ఆనవాళ్లు.
అంతర్లీనంగా రాళ్ళ కింద నుంచి ఇప్పటికీ ప్రవహిస్తోంది.
సమీపంలో సెలఏటి శబ్దం.
లోయలో ఉన్న నెల్లి చెట్లపైన పడ్డారంతా.
ఇవి నాటు నెల్లి కాయలు, టౌన్ లో దొరకవు.
పడమర వైపున గుహాన్వేషణ కోసం మధు, యశ్వంత్ బయలుదేరారు.
లోయలో మధ్యాహ్నం ఎండ చంపేస్తోంది.
ఒక చెట్టుకిందకు చేరి నడుం వాల్చాం.
లోయలో రాతి నేల ఎంత చల్లగా ఉందో!
ఏటిలో మాడ్చేసే ఎండ! చెట్టు కింద చలి!
ఏమిటీ వింత వాతావరణం!
ఒకతోక పిట్ట కనిపించింది.
ఫొటో తీద్దామని దగ్గరకెళ్ళే సరికి తుర్రుమన్నది.
ఆ బండ పైనే అంతా ఒక కునుకు తీశాం.

లోయ లో విశ్రాంతి తీసుకుంటూ..

మధు, యశ్వంత్ వెళ్ళి గంటన్నర అవుతున్నా, వారి జాడ లేదు.
మధ్యాహ్నం ఒంటిగంటవుతోంది.
ఆపసోపాలు పడుతూ వచ్చారు.
అన్నీ ముళ్ళే, ఒళ్ళంతా గీక్కున్నాయి కానీ, మలయప్ప గుహ కనిపించలేదు.
అక్కడే భోజనాలు చేసి, వచ్చిన దారిలో ఏటి వెంట కొండ ఎక్కడం మొదలు పెట్టాం.
చీకటి పడే ముందువరకు అన్వేషణ సాగించాలనుకున్నాం.
రాళ్ళ పైనుంచి కొండ ఎక్కుతున్నాం.


ఏటి లో రాళ్ళ పై నుంచి ఇలా కొండ ఎక్కు తూ..

అలా గంట సేపు ఎక్కామో లేదో, కొండ కొస కనిపించింది.
అదిగో కొండకు రాతి అంచు.
ఇక్కడేదో గుహలా ఉందే!
వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు, అదుగో అదే మలయప్ప గుహ.
పడిన కష్టమంతా ఆవిరైపోయింది.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం.
చెట్ల మధ్య, కొండ అంచున ఈ గుహఎలా దాగుందో !
చేతులు చాచి మమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుంది.
ఎంత పెద్దగా ఉందో!
దాదాపు వంద మంది వరకు పడుకోవచ్చు.
ఎలుగు బంట్లు, పులులకు అది ఆవాసమై ఉండవచ్చు.
గుహలో గుప్త నిధుల కోసం తవ్వేసిన ఆనవాళ్ళు.
బాంబులు పెట్టి కూడా పేల్చినట్టున్నారు.
గుహ చివరి భాగం మూసుకుపోయింది.

మూసుకుని పోయిన కొండ గుహ చివరి భాగం.

రాళ్ళు అడ్డంగా పడి ఉన్నాయి.
లైట్లు వేసుకుని చూస్తే తప్ప మరికొంత గుహ లోపలి భాగం కనిపించలేదు.
ఈ గుహ రాళ్ళలో ఏమైనా ఖనిజాలు ఉన్నాయా అని శ్రీహరి, రవి సహజమైన ఆసక్తితో అన్వేషణ మొదలు పెట్టారు.
రాళ్ళ మధ్యలో స్పటికాలు (క్రిస్టల్స్) ఉన్నాయి.
వాటిని తీయడం సాధ్యమయ్యే పనికాదు.
దీని దగ్గరకు వస్తే తప్ప ఇక్కడొక గుహ ఉన్నట్టు తెలియదు.
అక్కడే గంటపైగా గడిపి తిరుగు ప్రయాణమయ్యాం.

మలయప్ప గుహ ముందు అన్వేష కులు.

వచ్చిన దారిలో కాకుండా, ఆ రాతి కొండ ఆంచునే బయలు దేరాం. అసలు దారి లేదు.
బోదను, ఎండిపోయిన చెట్లను తొక్కుకుంటూ ముందుకు సాగుతున్నాం.
ఆ కొండను సగం వరకు చుట్టేశాం.
దూరంగా తుంబురు వెళ్ళే దారి.
దాని కంటే ముందు రామకృష్ణ తీర్థం వెళ్ళే కొండ.
ఆ పక్కనే తాంత్రిక లోయకు వెళ్ళే దారి.
దూరంగా ఆ రాతి కొండ కనిపిస్తోంది.
అక్కడే కుమారధార, పసుపు ధార ప్రాజెక్టులు ఉంటాయి.
దక్షిణ దిశగా కొండ దిగడంతో మా నడక సాగుతోంది.
దారి లేదు, అదే ప్రయాస!
గంట కల్లా సన్నగా ప్రవహించే ఏటి దగ్గరకు వచ్చాం.

దారి తెన్నూ లేని కొండలు

ఇదే వెంకటేశ్వర తీర్థం అన్నాడు మధు.
రవి, జై బాలాజీ అందులో మునకేశారు.
మళ్ళీ మా నడక మొదలైంది.
ఆ ఏటిలోనే పాపనాశనం వైపు సాగుతున్నాం.
రెండు కొండల నడుమ ఏరు సన్నగా ప్రవహిస్తోంది.
ఏరు దాటుకుని గుట్ట ఎక్కాం.
మా వాహనాలు పెట్టిన పాపనాశనం డ్యాం సమీపానికి వచ్చేశాం.
తిరుమలలో జై బాలాజీ ఆశ్రమాన్ని చూసి తిరుపతికి తిరుగు ప్రయాణ మయ్యాం.
ఇళ్ళకు చేరే సరికి రాత్రి ఏడైంది.
మలయప్ప కోన అన్వేషణలో పన్నెండు గంటల కాలం అలా గడిచిపోయింది.,
ప్రయాస పడినా మలయప్ప గుహను కనుక్కోగలిగామన్న ఆనందం నిలిచిపోయింది.

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

One thought on “శేషాచలం కొండల్లో నక్కిన మలయప్ప గుహ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *