‘అదానీ’ పేరే లేకుండా ప్రభుత్వ స్పందన  

  –డాక్టర్. యస్. జతిన్ కుమార్ 

అదానీ గ్రూప్ షేర్లలో మాంద్యం గురించి సుప్రీంకోర్టు ఆందోళనలు వెలిబుచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం  ఆకస్మిక మార్కెట్ ఒడిదుడుకుల నుంచి భారతీయ పెట్టుబడిదారులను రక్షించాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది, స్టాక్ మార్కెట్ ఇప్పుడు “విలువైన పెద్ద పెట్టుబడిదారులకు” మాత్రమే పరిమితం కాదని, “విస్తృత మైన మధ్యతరగతి మదుపరుల శ్రేణి” కూడా అధికంగా వుందని  పేర్కొంది. కనుక ప్రభుత్వం వారి నష్టాన్ని ఏ విధంగా నివారించగలదో చెప్పాలని కోరింది.సుప్రీంకోర్టు తదుపరి విచారణలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ వ్యవస్థపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి నోట్ కోరింది. 

ఢిల్లీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డుతో సమావేశం అనంతరం అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, అత్యున్న త న్యాయస్థానంలో కేంద్రం ప్రతిస్పందన ఎలా ఉంటుందో తాను వెల్లడించబోనని ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏదేమైనా, మంత్రి ఇలా అన్నారు: ” – భారతదేశ నియంత్రణదారులు చాలా, చాలా అనుభవజ్ఞులు, వారు వారి రంగం లో నిపుణులు. కాబట్టి, రెగ్యులేటర్లు ఈ విషయాన్ని నిష్పాక్షికంగా పరిగణనలోకి తీసుకున్నారు వారు ఇప్పుడు మాత్రమే కాదు వీటిని పరిష్కరించటానికి  ఎప్పటికీ సంసిద్ధులుగానే  ఉంటారు “అని ఒక ప్రకటన చేశారు. అయితే  ప్రతిపక్షాలు ఎంతగా పట్టుబడుతున్న, పార్లమెంటులో చర్చ జరగలేదు, ప్రధాని సుదీర్ఘ ప్రసంగంలో ఆదాని ప్రస్తావనే లేదు. అసలు దేశంలో అలాటి కుంభకోణం జరిగినది అన్న సోయి కూడాలేదు.  ఒక ప్రైవేటు కంపెనీలో జరిగిన డానికి ప్రభుత్వ బాధ్యత ఏమిటి  అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కానీ  ఇదంత తేలికయిన విషయం కాదు.  ప్రజలకు 10 లక్షల కోట్ల మేరకు నష్టం కలిగించే ఆర్ధిక కుంభకోణం.  

 భారత కుబేరుడు గౌతమ్ అదానీ తనఅప్పులు తీర్చడానికి కోట్ల కోట్ల రూపాయలు సమీకరించడానికి కొత్త షేర్లను జారీ చేసే ప్రణాళికలను ప్రకటించాడు. 20000 కోట్ల డాలర్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన అదానీ గ్రూప్ పై, ఈ సమయంలో హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనే చిన్న అమెరికన్ సంస్థ ఒక నివేదిక ప్రచురించింది. హిండెన్ బర్గ్ తన దర్యా ప్తులో, అదాని గ్రూపు”దశాబ్దాలుగా నిస్సిగ్గుగా, స్టాక్ మానిప్యులేషన్ ,అకౌంటింగ్ ఫ్రాడ్ స్కీమ్” లతో వ్యాపారం నిర్వహిస్తున్నదని ఆరోపించింది. అదానీ వెంటనే ఈ నివేదికను “నిరాధారమైనది” “హానికరమైనది” అని ఖండించా రు, కాని మార్కెట్ ప్రతిస్పందన అతి వేగంగా, క్రూరంగా వచ్చింది. వారం తిరగక ముందే ఆ వ్యాపార సామ్రాజ్యం  స్టాక్ మార్కెట్ విలువలో 7000 -11000 కోట్ల డాలర్లను కోల్పోయింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో  126.4 బిలియన్ డాలర్ల సంపదతో మూడవ స్థానం లో వున్న ఆదాని  స్టాక్స్ పతనం తర్వాత 61.9 బిలియన్ డాలర్ల తో 17వ స్థానానికి పడిపోయాడు . రోజు రోజు కు ఈ స్థానం పడిపోతూనే వున్నది . ఈ పరాజయం అదానీకి పెద్ద యు-టర్న్. గత కొన్ని సంవత్సరాలు గా భారత స్టాక్ మార్కెట్లో అతని కొన్ని కంపెనీ ల షేరు ధరలు 1,000% పైగా పెరిగాయి అన్న నేపధ్యంలో ఈ దారుణ మైన పతనం ఎలా జరిగినది మనం తెలుసుకోవాలి. భారతీయ మదుపరు లకు లక్షల కోట్ల నష్టం జరిగిందని చెబుతున్నప్పటికీ  ప్రభుత్వం ఎందుకు నోరు మెదపటం లేదో  తెలుసుకోవాలి.  భారత ఆర్ధిక వ్యవస్థ ఏ తీరున నడుస్తున్నదీ అర్ధం చేసుకోవాలి 

 గౌతమ్ అదానీ 1988 లో కేవలం 2.2 కోట్ల  టర్నోవర్ గల  కమోడిటీస్ ట్రేడర్ గా కెరీర్ ప్రారంభించి  కొద్దికాలం లోనే అనూహ్యమైన రీతిలో తనదైన ఒక పెద్ద ఆర్ధిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. సుమారు 12 లక్షల కోట్ల సంపద తో  ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగాడు. మొన్నటి వరకు ప్రపంచంలో మూడో అతిపెద్ద ధన వంతుడిగా స్థానం సాధించాడు. దాదాపు ఇదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండి, హిందుత్వ వాదిగా, మతవాద విద్వేషానికి, హింసకు కారణమని కుఖ్యాతి పొందినప్పటికీ, అనేక వ్యూహ ప్రతి వ్యూహాలతో, అభివృద్ది, జాతీయ ఔన్నత్యం అనే నినాదాలతో భారత ప్రధానిగా, ఒక అంతర్జాతీయ నాయకునిగా ఎదిగాడు నరేంద్ర మోడీ. అదానీ, మోడీ ఇద్దరూ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు కావడంతో ఇద్దరూ ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్నారు.  వీరిద్దరి బంధం పట్ల దేశ, విదేశాలలో ఆసక్తి, అనుమానం, తరచి చూడాలనే అభిప్రాయం కలిగింది. మోడీ కేంద్ర  అధికారంలోకి వచ్చిన 2014 నుండి అదాని జైత్ర యాత్ర అప్రతిహతంగా కొనసాగింది. 800  కోట్ల డాలర్ల నుండి 15000 కోట్ల డాలర్లకు ఆయన సంపద పెరిగింది. అందులో సుమారు 10000 కోట్ల డాలర్ల ఆస్తి గత మూడు సంవత్సరాలలోనే  షేర్ల ధరల పెరుగుదలవల్ల  సమకూరింది.

 అదాని సమకూర్చిన వనరులు, వసతులు, విమానాలు  ఉపయోగించుకునే మోడీ ప్రధానిగా ఎదిగారని అనేక మంది నమ్ముతారు. దానికి  ప్రత్యుపకారం గానే, నిబంధనలను ప్రక్కకు తోసివేసి, ఆయన ప్రత్యర్థులపై యి. డి, సి. బి. ఐ లాంటి  కేంద్ర నిఘా సంస్థలను ఉపయోగించి  బెదిరింపులు, వేధింపులు,  దాడులు చేసి, పోటీ నుంచి తొలగించి  కేంద్ర ప్రభుత్వం ఆయనకు అనేక ప్రయోజనాలు సమకూర్చటం నిజం కాదా అని అనేకులు అడుగుతున్నారు. ఆయనకు ముంబై తో సహా ఆరు విమానాశ్రయాలు, ఆంధ్రా లోను ఇతరచోట్ల  అనేక ప్రధాన ఓడ రేవులు కట్టబెట్టారు. అనేక ప్రభుత్వ బ్యాంకులు, సంస్థల నుండి లెక్కలేనన్ని అప్పులు ఇచ్చి, ఆయన వ్యాపారానికి అనుకూల మైన షరతులు తయా రు చేశారు. విదేశాలలో గనులు, పవర్ ప్రొజక్టులు  వంటివి రాజకీయ ప్రాపకంతో, ముఖ్యంగా మోడీ ప్రత్యక్ష ప్రమే యం తో దక్కాయని  జనాభిప్రాయం. అదానీ గ్రూప్ బహుళజాతి సంస్థగా ఎదిగింది. మోడీ సర్కార్ అంటే అదాని సర్కార్ అని కొంత మంది భావిస్తున్నారు. అనేకమంది విశ్లేషకులు, ప్రత్యర్థులు వీరిని లోతుగా పరిశీలిస్తున్నారు.   

మార్కెట్ అంచనాలకు పొంతన లేకుండా శరవేగంతో పెరుగుతున్న అదానీ ఆస్తులను, వ్యాపారాలను పరిశీలించి 24 జనవరి 2023 న  హిండేన్ బర్గ్  సంస్థ  ఒక నివేదికను విడుదల చేసింది. అది ఒక పెను ఉత్పాతంలా పడి అదాని సామ్రాజ్యం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. 

 ఆ కంపెనీ తన సంపద విలువను అధికంగా చూపుతున్నదనీ, తన అప్పులను తక్కువచేసి చెప్పడానికి, తన లాభాలను పెంచి చూపడానికి, అనైతిక అకౌంటింగ్ పద్ధతులను ఉపయోగించిందని హిండెన్బర్గ్ నివేదిక ఆరో పించింది. ఈ ఆర్థిక ఆక్రమాలతోపాటు, అదానీగ్రూప్  ఇన్ సైడర్ ట్రేడింగ్, పన్ను ఎగవేతలకు కూడా  పాల్పడిందని హిండెన్ బర్గ్  ఆరోపించింది. భారత ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి సేకరించిన డాక్యుమెంట్లను ఉటంకిస్తూ ఈ ఆరోపణలను చేసింది. కంపెనీ పెద్ద ఎత్తున అటవీ నిర్మూలన కు పాల్పడు తోందని, పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తోందని, భూగర్భ జలాలను, గాలిని కాలుష్య భరితం చేస్తోందని ఆరోపించింది. హరిత సాంకేతికత . గ్రీన్ ఎనర్జీ పేరున ఈ పర్యావరణ విధ్వంసం జరగడం మరీ విచిత్రం.ఆస్ట్రేలియా లో కంపెనీ ప్రతిపాదించిన కార్ మైఖేల్ బొగ్గు గని  పెద్ద  పర్యావరణ ప్రమాదం అని హిండెన్బర్గ్ రీసెర్చ్ పేర్కొంది.  అదానీ గ్రూప్ స్థానిక సమాజాల ఆందోళన లను విస్మరించిందని, పర్యావరణ నిబంధనలను పాటించలేదని నివేదిక పేర్కొంది.  

ఈ కంపెనీ తన రాజకీయ సంబంధాలను  భారత ప్రభుత్వం నుంచి సానుకూల అనుమతులు  పొందడానికి, దేశీయ  పరిశ్రమలో అన్యాయమైన ప్రయోజనాలను పొందడానికి, విదేశాలలో సైతం  ప్రతిష్టాత్మ కమైన  ప్రోజెక్టులు  సాధించ టానికి  ఉపయోగించు కొంటోంది. వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ నియంత్రి స్తున్నారని, మైనారిటీ వాటాదారు లకు నష్టం వాటిల్లు తోందని హిండెన్ బర్గ్ రీసెర్చ్ పేర్కొంది.22 మంది కీలక డైరెక్టర్లలో 8 మంది ఆడాని కుటుంబ సభ్యులే.  ఆదానీ తమ్ముడు రాజేష్ ఆదాని  గ్రూపు మేనేజింగ్  డైరెక్టర్. అతను గతంలో ఆర్ధిక నేరాలపై రెండుసార్లు అరెస్టు అయ్యాడు. ఆదానీ బావ సమీర్ వోరా ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అతను వజ్రాల వ్యాపారంలో  ఆర్ధిక మోసాల  రింగ్ లీడర్ అని డి అర్ ఐ  ఆరోపించిది.

.ఈ కంపెనీ పన్నుల స్వర్గధామాలయిన కొన్ని దేశాలలో బోగస్ [షెల్  ]కంపెనీలను పెట్టి భారత దేశంలో మనీ లాండరింగ్ చేస్తూ పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలకు, ఆర్ధిక అక్రమాలకు పాల్పడిందని, గౌతం ఆడాని అన్న ,దొరకని దొంగ అని పేరు పడ్డ వినోద్ ఆడాని దాదాపు  38 షెల్ కంపెనీలు నడుపుతున్నాడు,  వారి రుణ స్థాయి అత్యంత  ఆందోళన కరంగా వుందని ఈ నివేదిక సారాంశం. గ్రూప్ షేర్లను పూచీకత్తుగా ఉపయోగించడం ద్వారా స్టాక్ ధరలను  తారుమారు చేసిందని హిండెన్ బర్గ్ రీసెర్చ్  ఆరోపించింది.

అదానీ సామ్రాజ్యం 3000 కోట్ల డాలర్ల రుణభారం మోస్తోంది. దేశంలోనే అత్యధిక అప్పుల్లో కూరుకు పోయింది అని ఫిచ్ గ్రూపునకు చెందిన రీసెర్చ్ సంస్థ క్రెడిట్ సైట్స్ గత ఏడాది అదానీ గ్రూప్ గురించి “డీప్ ఓవర్ ఎలివేటెడ్” పేరుతో ఒక నివేదికను ప్రచురించింది, ఇందులో దాని రుణ నిధుల వృద్ధి ప్రణాళికల గురించి బలమైన ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై అదానీ గ్రూప్ స్పందిస్తూ తమ కంపెనీల పరపతి నిష్పత్తులు ఆరోగ్యకరంగా కొనసాగుతున్నాయని, ఆయా రంగాల్లోని పరిశ్రమ బెంచ్ మార్క్ లకు అనుగుణంగా ఉన్నాయని తెలిపింది. దేశీయ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గత ఏడాది కాలంలో ఈ అంశాలపై దర్యాప్తు చేసింది. ఈ అవకతవకల గురించి పొంచి వున్న ప్రమాడం గురించి  హెచ్చరించింది.  వినోద్ ఆదాని  కాగితం  కంపెనీలకు  ధర్మేష్  దోషి,  కేతన పరేఖ్ వంటి పేరుమోసిన షేరు మార్కెట్ నేరస్థులతో దగ్గరి సంబందాలు వున్నాయి. ఈ పెట్టుబడుల గురించి సెబీ  విచారణ  చేస్తోంది.

 ఈ నివేదిక తర్వాత వారి  లిస్టెడ్ కంపెనీల షేర్లు క్షీణించి, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 50 శాతానికి పైగా తుడిచి పెట్టుకుపోయింది. లిస్టెడ్ స్టాక్స్ లో 8600 కోట్ల డాలర్ల నష్టానికి, విదేశా ల్లో జాబితా చేయబడిన దాని బాండ్ల అమ్మకానికి దారితీసింది. ఇది అదాని చేసిన అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుంభ కోణంగా పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయాలని ,జె పి సి ని ఏర్పాటు చేయాలని కోరితే  విదేశీ నివేదికల ఆధారంగా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయటానికి పార్లమెంటును వాడుకోవద్దని  రాజ్యసభ ఛైర్మన్  ప్రకటించాడు. దేశ ఆర్ధిక అభివృద్ధికి అదాని ఎంతో తోడ్పడుతున్నాడని  కనుకనే  విదేశీ దాడికి గురవుతున్నాడని అర్. ఎస్. ఎస్ అతనికి వత్తాసుగా రంగం లోకి దిగింది. ప్రభుత్వం ఆదానీని కాపాడే సర్వ ప్రయత్నాలు చేస్తోంది. అవినీతి వ్యాపారాన్ని దేశభక్తి తో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోంది.           

నివేదికలో పేర్కొన్న అంశాలను అదానీ గ్రూప్ తోసి పుచ్చడంతో పాటు ఆ సంస్థపై చట్ట పరమైన చర్యలు తీసుకుం టా మని ప్రకటించింది. 400 పేజీలకు పైగా సుదీర్ఘమైన, ఆగ్రహావేశాలతో కూడిన ఖండన విడుదల జేసింది. తాము భారతీయ చట్టాలు, నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, అత్యున్నత నైతిక విలువలతో, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని కంపెనీ పేర్కొంది. సామాజికంగా బాధ్యతా యుతమైన ప్రాజెక్టులను అందించడంలో తన నిబద్ధతను నొక్కి చెప్పింది..

 అమెరికా షార్ట్ సెల్లర్ విమర్శలతో భారత టైకూన్, స్టాక్స్ విలువ బిలియన్ల కొద్దీ తుడిచిపెట్టుకుపోవడంతో అదానీ ఎంటర్ప్రైజెస్ తన 2.5 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని నిలిపివేసింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనంపై రెగ్యులేటర్ “పూర్తి స్థాయి” దర్యాప్తును ప్రారంభించిందని, బోర్డు తమ పరిశీలనను కొనసాగిస్తుందని, అవసరమైన తాజా సమాచారాన్ని సేకరిస్తుందని ప్రకటించింది. 

 స్టాక్స్ పతనం మధ్య ఇన్వెస్టర్ల భయాలను తొలగించడానికి ఇన్వెస్టర్లను తిరిగి ఆకర్షించడానికి గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం వివిధ లిస్టెడ్ సంస్థల షేర్లను తాకట్టు పెట్టి సేకరించిన 11,140 లక్షల డాలర్ల విలువైన రుణాలను  2024 సెప్టెంబర్ వరకు గడువు వున్నప్పటికి ముందస్తు గా చెల్లించారు. స్వల్పకాలంలో చూస్తే  మార్కెట్లు సెంటి మెంట్ తో నడుస్తాయని, ఈ నివేదిక తర్వాత అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా సెంటిమెంట్లు పని చేస్తున్నాయ” ని బ్రోకరేజీ సంస్థ స్టోక్స్ బాక్స్ రీసెర్చ్ డైరెక్టర్ స్వప్నిల్ షా అన్నారు 

మనం గమనించవలసింది అదానీ గ్రూప్ ఆర్థిక పనితీరు, వ్యాపార విధానాలపై ఈ నివేదిక కీలక ప్రశ్నలను లేవ నెత్తింది. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించినప్పటికీ, నివేదికలో చేసిన వాదనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టడం చాలా ముఖ్యం. వ్యాపార ప్రపంచం లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగాల్సిన అవసరాన్ని,కంపెనీలు నైతికంగ, స్థిరంగా పనిచేసే లా చూడవలసిన  ప్రాముఖ్యతను ఈ నివేదిక  ఎత్తి చూపుతోంది. 

బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గత వారంలో అతని వ్యక్తిగత నికర విలువ నుండి దాదాపు 4000 కోట్ల డాలర్లు తుడిచిపెట్టుకు పోయినప్పటికీ, ఇంకా అతను 8200 కోట్ల డాలర్లతో ఆసియా లోనే అత్యంత ధనవంతుడిగా వున్నాడు. ఇది తోటి భారతీయ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంటే 200 కోట్ల డాలర్లు ఎక్కువ .ఆయన సంపదను కూడబెట్టిన వేగం అసాధారణమైనది, అనూహ్యమైనది అని నిపుణులు అంటున్నారు. భారత దేశంలో ప్రభుత్వ విధానాల వల్ల  సూపర్ రిచ్ వ్యక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మొదటి తరం పారిశ్రామిక వేత్త అయిన అదానీ, 1988 లో కమోడిటీ ట్రేడింగ్ వ్యాపారాన్ని స్థాపించాడు. ఇది అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఎఇఎల్) గా అభివృద్ధి చెందింది. అతను భారత ప్రభుత్వం 1990 లలో చేపట్టిన ఉదారవాద  ఆర్ధిక సంస్కరణలు, ప్రపంచీకరణ సౌలభ్యాలను ఆసరా చేసుకుని  తన ఆర్ధిక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మన పాలనా వ్యవస్థను తనకు అనుకూలం గా మలచుకోవడంద్వారా విస్తరించ సాగాడు. గతంలో ధీరూ భాయి అంబానీ కూడా 75000 కోట్ల విలువైన తన రిలయన్స్ సామ్రాజ్యాన్ని అప్పటి ఇందిరా ప్రభుత్వ విధానాలను  ఉపయోగించుకోవటం ద్వారానే నిర్మించు కోగలిగా డు. ఈ వ్యవస్థలో ప్రభుత్వ ఆర్ధిక విధానాలే  ఈ గుత్త  పెట్టుబడిదారుల ఆర్థిక వృద్ధికి ఊతమిస్తున్నాయి. ఈ వ్యవస్థ లో చట్టాలను, విధానాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని వాటిని అనుకూలంగా వాడుకోవడం, అనువుగా మలచు కోవటం, ఉన్నత స్థాయి ఉద్యోగుల అధికారుల చేతులు తడపటం, విధానాల లోని లొసుగులను ఆధారం చేసుకుని పనులు చక్కబరుచుకోవటం, పెట్టుబడిని వృద్ధి చేసుకోవటానికి  కీలకం అని అంబానీ  తన విజయ రహస్యం చెప్పే వాడు. అయితే ఈ లాలూచి కాస్త గోప్యంగా వుండేది. నేటి పెట్టుబడిదారులు రాజకీయ రంగాన్ని ఆక్రమించి ప్రభుత్వ విధానాలు  తమకు అనువుగా రూపొందించడంలో మరింత ముందంజ వేశారు. ఇలాటి పద్దతులతోనే అదానీ కూడా  తన సంపదను పెంచు కున్నాడు. 1994లో ముంబైలోని స్టాక్ ఎక్సేంజ్ లో లిస్ట్ అయిన ఆడాని  తొలి కంపెనీగా ఏఈఎల్ గుర్తింపు పొందిం ది. ఒక సంవత్సరం తరువాత, అదానీ గుజరాత్ లోని ముంద్రా పోర్టును నిర్వహించడం ప్రారంభించాడు. ఆ పోర్టు  భూములను అదానికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. తరువాత గుజరాత్ లో వచ్చిన  బిజెపి ప్రభుత్వాలతో కూడా  ఆయన సన్నిహితంగా వున్నాడు. ఇక  2000 ల నుండి ఆ వ్యాపార వేత్త కు గుజరాత్ ముఖ్యమంత్రిగా  వున్న నరేంద్ర మోడీ నుండి ఇతోధిక ప్రోత్సాహం లభించింది. దానితో అదానీకి చెందిన పలు కంపె నీలు ఆయా రంగాల్లో అగ్రగామి సంస్థలుగా మారాయి. నేడది  23,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న బృహత్తర గ్రూపు.  

. ఇటీవలి సంవత్సరాలలో, అతను మీడియా, డేటా సెంటర్ల నుండి విమానాశ్రయాల వరకు అనేక  రంగాలకు విస్తరించాడు. అదానీ మోడీకి సన్నిహిత మిత్రుడిగా కనిపిస్తాదు. ప్రధాని అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిన రంగాల్లో ఆయన పెట్టుబడులు పెడతాడు. శిలాజ ఇంధనాలనుండి గ్రీన్ ఎనర్జీ విస్తరణ వరకు అతని వ్యాపారాలు, లాభాలు పెరిగేలా ప్రభుత్వ విధానాలు తయారు చేస్తున్నారు.ఇది ఒక రాజకీయ-ఆర్ధిక లాలూచీ సంబంధం  ఒక ఆశ్రిత పక్షపాతం .అంటే ఆయన ఎదుగుదల ఆశ్రిత పెట్టుబడి దారీ విధానం [క్రోనీ క్యాపిటలిజం] పైనే ఎక్కువగా ఆధారపడి ఉందని అర్ధమవుతుంది. ఉదాహరణకి  ప్రభుత్వ సంస్థ ఎల్ ఐ సి  ఈ గ్రూపులో 35917 కోట్ల రూపాయల[ నేటి మార్కెట్ వాల్యు సుమారు 57000 కోట్లు] కు పైగా పెట్టుబడి పెట్టటాన్ని, యస్, బి. ఐ  బ్యాంకు 27000 కోట్ల రూపాయల [బుక్ వాల్యు] అప్పు ఇవ్వడాన్ని చూడవచ్చు. ఆదానీ గ్రూపు కంపెనీలకు మొత్తం రెండు లక్షల కోట్ల అప్పు వుందని, అందులో 40% అంటే సుమారు 80,000 కోట్లు ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చినదే అని ఈ మధ్య . సి. ఎల్. యస్. ఏ. రిపోర్ట్ పేర్కొంది.   ప్రభుత్వం మారితే ఇతని సామ్రాజ్యం మనుగడ సాగించ గలదా అని చాలామంది సందేహపడుతున్నారు.  

 గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరించే  “నైబర్ హుడ్ ఫస్ట్”-  పొరుగు దేశాలకు ప్రాధాన్యం-  అనే లక్ష్యానికి అనుగుణంగా  పొరుగున ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్,  మయన్మార్  దేశాలతో జరుగుతున్న వాణిజ్యంలో పెద్ద పీట ఆదానీకే చిక్కుతుంది.భారతీయ మౌలిక సదుపాయాల ప్రోత్సాహ కంగా ప్లాన్ చేసిన బంగ్లాదేశ్ పవర్ ప్రాజెక్ట్  ఆదానీకే దక్కింది. శ్రీలంకలో 5000 లక్షల డాలర్ల విలువగల గ్రీన్ ఎనర్జీ  ప్రోజక్టు  ఆదానీకే ఇచ్చారు. మోడీ సిఫారసు పైనే అలా ఇచ్చామని శ్రీలంక ఎనర్జీ బోర్డు ఛైర్మన్ వాళ్ల  పార్లమెంటు పానెల్ కు చెప్పారు కూడ. [అయితే తరువాత ఆయన ఆ ప్రకటన ఉపసంహరించుకుని ఇది రెండు దేశాల ప్రభుత్వాలు చేసిన నిర్ణయం అని  మాట మార్చాడు  దీని వెనుక ఉన్నత స్థాయి రాజకీయ ప్రమేయం వుందని ఎవరైనా అర్ధం చేసుకోగలం]. అంతకుముందే శ్రీలంక పోర్ట్ అథారిటీ 7000 లక్షల డాలర్ల విలువైన పెద్ద రేవు నిర్మాణాన్ని అదానీకే  ఒప్పగించింది.మోడీ విదేశీ పర్యటనలకు ముందో, వెనుకో లేక ప్రధానితో కలిసో ఆదాని ఆ దేశాలను సందర్శించి  వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కేవలం యాదృశ్చ్చిక మని  పరిగణించలేము

అదాని వ్యాపారంపై వచ్చిన విమర్శలను భారతీయ వ్యతిరేకతగా చిత్రించి తాను బయట పడాలని అదాని ప్రయ త్నిస్తున్నారు. ఆడాని పై విదేశాల భారీ కుట్ర అని, కొందరు అమ్ముడుపోయిన వామపక్ష వాదులు, దేశభక్తి హీనులు  అదాని ప్రతిష్టను దెబ్బతీయటానికి 2016 నుండి  కుట్ర చేశారని  అందులో భాగమే హిందేన బర్గ్  నివేదిక అని  అర్ యస్ యస్ పత్రిక ఆర్గనైసర్ పత్రిక రాస్తోంది. ఆదానీని విమర్శించటం అంటే మోదీని విమర్శించడమే అనికూడా వారు రాశారు.  మోదిని విమర్శిస్తే భారత్ ను విమర్శించినట్లే  అనే ప్రచారం ఒకటి గతం నుంచి  వుంది. దాని కొనసాగింపుగా ఇప్పుడు అదానీని తప్పుపడితే కూడా దేశాన్ని కించపరచడంగా ప్రచారం చేస్తున్నారు.    

అదానీ ఖండనపై హిండెన్ బర్గ్ స్పందిస్తూ- ‘జాతీయవాదంతో మోసాన్ని కప్పిపుచ్చలేం’ అని వ్యాఖ్యానించారు. అదానీ గ్రూప్ తన ఎదుగుదలను  దేశ ఎదుగుదల గాను, చైర్మన్ గౌతమ్ అదానీ సంపదను భారత దేశ సంపద గాను  దేశ విజయం గాను వక్రీకరించి,  తనకో రక్షణ దుర్గం నిర్మించుకోవటానికీ ప్రయత్నిస్తున్నదని  ట్విటర్లో పేర్కొన్నారు .

ఈ ఆరోపణలపై భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఇంకా ఎటువంటి ప్రకటనలు చేయలేదు, కానీ అదానీ గ్రూప్ లో  400 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ ” వాస్తవ పరిస్థితి ఏమిటో మాకు ఖచ్చితంగా తెలియదు. మేము భారీ పెట్టుబడి సమకూర్చాము కాబట్టి, ఆ కంపెనీని  సంబంధిత ప్రశ్నలు అడిగే హక్కు మాకు ఉంది, మేము ఖచ్చితంగా వారితో చర్చిస్తాము” అని పేర్కొన్నారు. “వారు వ్యవస్థాగతంగా ముఖ్యమైన వ్యాపారాలలో బాగా స్థిరపడిన గ్రూపు. వాళ్ళు ఎక్కడికీ పోరు,అతి త్వరలోనే సంక్షోభం నుండి బయట పడతారు  ” అని  ఆర్థిక సలహా సంస్థ సనా సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు రజత్ శర్మ అన్నారు. “మా మొత్తం అప్పులలో ఆదానికి ఇచ్చింది వక్క శాతం మాత్రమే” అని, ఎస్. బి. ఐ. బ్యాంక్  ఛైర్మన్, “ మా అసెట్ వాల్యు  లో 0.9% మాత్రమే ఆదానీ గ్రూపులో  పెట్టుబడి  పెట్టామని” ఎల్. ఐ. సి, ప్రకటిస్తున్నాయి. ఆడాని సంక్షోభం  మన ఆర్ధిక వ్యవస్థను ఏమీ ప్రభావితం చేయలేదని చెప్పుకోవటానికి తాప త్రయ పడుతున్నారు. నష్టంలో వారి పాత్రను తగ్గించి చూపుకోవటానికి, ఆదానీని తద్వారా మోడీ ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో పతనం కాకుండా కాపాడటానికి ఇలాటి ప్రకటనలు చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. 

బడా పెట్టుబడిదారులతోనూ, విదేశీ  దోపిడి దారుల తోనూ ఈ ప్రభుత్వాలు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగు తున్నాయి ఒకరి కొకరు అండగా ఉంటూ, తోడు దొంగలుగా ప్రజల శ్రమ ఫలితాలను దోపిడి చేస్తున్నారు.  మిలియనీర్లు మాత్రమే ఎం.ఎల్. ఏ లు గాను, ఎం.పి లు గాను ఎన్నికై  ప్రత్యక్షంగా చట్ట సభలలో  తమకు కావలసిన చట్టాలు చేసుకుంటున్న వ్యవస్థ మనది. అందువల్ల ఇది కేవలం మోడీ-ఆదానిల స్నేహానికి పరిమితమైన విషయం కాదు. గుత్త పెట్టుబడి దారులకు-ప్రభుత్వాలకు మధ్య వున్న మైత్రి. ఇది వర్గ మిత్రత్వం. అది ఒకరోజు ధీరూభాయి అంబానీ-ఇందిరా గాంధీ ల  ప్రచ్చన్న సహకారం రూపం లో వుండవచ్చు. మరో రోజు ముకేష్ అంబానీ- కాంగ్రెస్ ల మధ్య బంధంగా  కనిపించ వచ్చు, లేక కొటక్-కాంగ్రెస్ ల  దోస్తీ కావొచ్చు. మోడీ-అదానీల మైత్రి లా ప్రత్యక్షంగా కనిపించవచ్చు. నడుస్తున్నది ధనస్వామ్యం, పైకి చెప్పేది ప్రజాస్వామ్యం.   పెట్టుబడిదారుల అనుకూల ప్రభుత్వాలు కాకపోతే మోడీ- అంబానీ వ్యక్తిగత మిత్రులు కాకపోయినా, ముకేష్ అంబానీ రోజు సంపాదన 300 కోట్లు ఎలా సాధ్యం? అతని దగ్గర  మూడు లక్షల కోట్ల ఆస్తి ఎలామూలుగుతోంది?

 స్టాక్ మార్కెట్ కుంభకోణాలు, ఈనాడు బయటపడిన అదానీ వ్యవహార శైలి కూడా కొత్తవి కావు. కానీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం విడ్డూరంగా వుంది.  బ్యాంకుల రసీదులను అడ్డం పెట్టుకుని పొగుచేసిన ఫండ్స్ తో షేర్ల విలువలు అడ్డగోలుగా పెంచిన మార్కెట్ బుడగ పగిలిపోయిన 1992 లో హర్షద్ మెహతా స్కామ్- 5000 కోట్లు ; ఫిక్సేడ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్  ను ఉపయోగించి షేర్ల రేట్లు రిగ్గింగ్ చేసిన 1996 భన్సాలి 1200 కోట్లు  ;2001 లో ఖేతన్ పరేఖ్  బ్యాంకుల నుంచి సేకరించిన ఫండ్స్ తో కృత్రిమంగా షేర్ల విలువను పెంచిన వైనం 40,000 కోట్ల స్కామ్ , యు టి ఐ  మూచ్యువల్ ఫండ్స్ తో చేసిన  అల్లకల్లోలం, 2009 లో  సత్యం రామలింగరాజు ఆస్తులను అనేకరెట్లు  అధికంగా చూపిన [ 545 రూపాయల షేరు 12 రూపాయకు పడిపోయిన] ఉదంతంలో  వాతాదారులకు  7800 కోట్ల  నష్టం ,  చట్ట వ్యతిరేకంగా రెండున్నర కోట్ల మంది ప్రజల నుండి 24000 కోట్లు వసూలు చేసిన  సహారా[సుబ్రతో రాయ్] కుంభకోణం, 17 లక్షల మంది నుండి  20000-30000 కోట్ల రూపాయలు సేకరించి   2013లో కూలిపోయిన శారదా చిట్ ఫండ్ [సుదీప్త సేన్] కుంభకోణం వంటివి అన్ని దాదాపుగా లేని ఆస్తుల ని ఆకాశమంత  విలువలతో చూపించి అత్యధిక లాభాల ఆశ కల్పించి  ప్రజలనుండి వాటాధనం సేకరించి  తరువాత బోర్డు తిప్పి వేయటమే. ఈ అన్ని కుంభ కోణాలలోనూ పెద్ద పెద్ద రాజకీయ శక్తుల ప్రమేయం వుండటం నిజం.  

ఆర్ధిక తిమింగలాలు, రాజకీయ అగ్రనేతల మధ్య అపవిత్ర సంబంధం ఏ స్థాయిలో వుందంటే  అదాని ఆస్తులను జాతీయం చేయాలని, వాటిని వేలం వేసి నష్ట పోయిన వారిని ఆదుకోవాలని ,బి జె పి తన సత్శీలతను నిరూపించు కోవాలని సుబ్రహ్మణ్య స్వామి వంటి బి జే పి సీనియర్ నాయకుడే కోరుతున్నాడు.

 దేశ సంపడలో 40%  అత్యున్నత స్థాయిలో ఉన్న 1% ధనవంతుల చేతిలో వుండగా, క్రింది స్థాయిలో ఉన్న50% జనాభాకు [అంటే 70 కోట్ల మందికి] దక్కుతున్నది కేవలం 3% మాత్రమే. ఈ పరిపాలనలో 85% ప్రజల ఆదాయం  క్షీణించి పోతుంటే, బిలియనీర్ల సంఖ్య మాత్రం పెరిగి పోతున్నది. 2020 లో 102 మంది వున్న బిలియనీర్లు 2022 చివరికి 166 కి పెరిగారు. వారిలో  పై వరసలో వున్న 10 మంది ధనవంతుల ఆస్తులు  27.5 లక్షల కోట్ల కు పెరగగా [32% వృద్ధి] , అత్యంత నిరుపేదల సంఖ్య 22.89 కోట్లకు చేరి  ప్రపంచ ప్రధమ స్థానం పొందాము. సంపద పంపిణీలో ఇంత తీవ్రమైన అసమానత మరెక్కడా లేదు. దేశంలో సర్వైవల్ ఆఫ్ ది  ఫిటెస్ట్ బదులు సర్వైవల్  ఆఫ్ డి రిచెస్ట్  అన్న సూత్రం అమలు అవుతోంది. సమర్ధుల మనుగడ బదులు ధనవంతుల మనుగడ కు ప్రోత్సాహం దొరుకుతోంది.  అపార కుబేరుల ఆస్తి నిమిషానికి 2.5 కోట్ల చొప్పున పెరుగుతోంది. ఈ అసమాన అభివృద్ధి ఫలితం గానే  అన్నార్తుల సంఖ్య 19 కోట్ల నుండి 35 కోట్లకు పెరిగింది. ఇంకా ఎంతకాలం ఈ వ్యవస్థను భరిస్తూ మన భుజాల మీద మోయడం అన్నది అసలు ప్రశ్న.   ి

Dr S Jatinkumar

(రచయిత ప్రముఖ రాజకీయ ఆర్థిక  విశ్లేషకుడు. వృత్తిరీత్యా డాక్టర్. ఇ.మెయిల్:  drsjatinkumar@gmail.com)

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *