‘జై తెలంగాణ’: ఒక జ్ఞాపకం

 

(వనపర్తి ఒడిలో-13)

-రాఘవ శర్మ

ఎనిమిదవ తరగతిలో కొచ్చాను.
రోజూ పుస్తకాలు పుచ్చుకుని స్కూలు కెళ్ళేవాణ్ణి.
మేం క్లాసులో ఉన్నా, మా దృష్టి మాత్రం రోడ్డుపైనే ఉండేది.
ఎవరి కోసమో మా కళ్ళు ఎదురు తెన్నులు చూసేవి.
స్ట్రైక్ వాళ్ళొచ్చి స్కూల్ పై పడేవాళ్ళు.
గంట గణగణా మోగేది; లాంగ్ బెల్ లా.
పుస్తకాలు పుచ్చుకుని ఇంటికి పరుగోపరుగు.
ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.
దాదాపు ఆ ఏడాదంతా అదే తంతు.
అది 1968వ సంవత్సరం.
చెన్నారెడ్డి నాయకత్వంలో ‘జై తెలంగాణా’ ఉద్యమం మొదలైంది.
పుస్తకాలు పుచ్చుకుని ఇంటికి వస్తుంటే గోడలనిండా నినాదాలు.
‘గుంటూరు గోబ్యాక్’
‘గోంగూర గోబ్యాక్’
‘పుంటికూర జిందాబాద్’
‘గోంగూర ముర్దాబాద్’
‘ఆవకాయ గోబ్యాక్’
‘మామిడికాయ తొక్కు జిందాబాద్’
ఉద్యమ నినాదాలు చాలా లయబద్దంగా ఉండేవి.
వీటిని చదువుకుంటూ ఇంటికి వచ్చేసేవాళ్ళం.
కొన్ని చాలా దారుణంగా ఉండేవి.
నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి భార్య పేరు రాఘవమ్మ. రాఘవమ్మను తిడుతూ గోడలపైన పచ్చి బూతులు రాసేవారు.
అవి కూడా చదివే వాళ్ళం.
అక్కడక్కడా గోడలపైన కార్టూన్లు.
ఒకవ్యక్తి బ్యాగ్ పుచ్చుకుని వెళుతుంటాడు.
మరొక వ్యక్తి వెనుక నుంచి ‘ఎక్కడికి గురూ’ అంటాడు.
‘గుంటూరు గురూ’ అన్న సమాధానం.
లేదా ‘బెజవాడ గురూ’ అనే మాట.
ఆ నినాదాలు, కార్టూన్లు తెలంగాణా ప్రజల ఆవేదన నుంచి జనించినవే.
వారి ఆత్మాభిమానం నుంచి ఎగిసిపడిన ఆగ్రహజ్వాలలు.
ఒక ఏడాది పాటు, 1968-69 విద్యాసంవత్సరమంతా అంతే!
ఏ స్కూల్లోను, ఏ కాలేజీలోనూ పాఠాలు చెప్పిన పాపాన పోలేదు.
ఒక్క వనపర్తి పాలిటెక్నిక్కే తీసుకుందాం.
అందులో పనిచేసే అధ్యాపకుల్లో 90 శాతం కోస్తా, రాయలసీమ వారే!
కీలకమైన స్థానాలన్నీ వారివే.
బోధనేతర సిబ్బంది లోనూ వారే!
చివరికి విద్యార్థుల్లోనూ కోస్తా జిల్లా వారే ఎక్కువ!
అటెండర్లు, వాచ్మన్లు, స్వీపర్లు మాత్రం స్థానికులు.
కళ్ళ ముందర ఇంత పచ్చి నిజాలు కనిపిస్తున్నప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఎవరు కాదనగలరు? ఎలా కాదనగలరు!?
అయినా, కాందంటున్నారు కోస్తా, రాయలసీమ ఉద్యోగులు.
తెలంగాణా ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోశారు.
ఉదయం నా స్టా (టిఫిన్) గా జొన్న రొట్టె.
ఆర్థికంగా ఎంత ఉన్నతులైనా ఉదయం జొన్నరొట్టే.
మా అమ్మ కూడా అప్పుడప్పుడూ జొన్న రొట్టె చేసేది.
జొన్న రొట్టె లోకి గసగసాలు వేసి చేసిన గుత్తివంకాయ కూర ఎంత బాగుండేదో!
వేడివేడిగా ఒక్క రొట్టె తింటే చాలు, కడుపు నిండిపోయేది.
మధ్యాహ్నం వరకూ ఆకలేసేది కాదు.
రబీ జొన్నలు తెల్లగా ఉండేవి.
అవి చాలా రుచి, కాస్త ఖరీదు కూడా.
పచ్చ చొన్నలూ ఉండేవి రబీ కంటే కాస్త చౌకగా.
పేదలెక్కువగా పచ్చజొన్నలే తినేవారు.
వారు పచ్చజొన్నలతో రొట్టెలు గట్టిగా చేసి గంపలో పోస్తే, వారం రోజులు ఉండేవి.
గ్రామాల్లో తైదంబలి (సజ్జలతో) చేసేవారు.
తైదంబలి తాగి రైతులు, కూలీలు పనుల్లోకి వెళ్ళే వారు.
రాగులు కూడా పండేవి.
అప్పటికింకా శ్రీశైలం డ్యాం నిర్మించలేదు.
పాలమూరు జిల్లాలో పంట కాలువలు లేవు.
ఎక్కువగా మోటబావుల కిం దే సేద్యం.
కొంత చెరువుల పైనా ఆధారపడేది.
వర్షాధారం పైన పండే జొన్నలు ప్రధానమైన పంట.
తెలంగాణాలో జొన్న రొట్టెలు తింటారంటే కోస్తా జిల్లా వారికి ఎంత ఎగతాళో!
ఉద్యోగాలకోసం వచ్చిన కోస్తా జిల్లా మధ్యతరగతి వారు ఎచ్చులకు పోయేవారు.
‘అయ్ బాబోయ్..అదేటండి..! జొన్నలు తింటారండీ మీరు! మా ఊళ్ళో మనుషులు తినరండి. గొడ్లకేస్తాం’ అనేవారు.
ఆ మాటలు విన్నప్పుడు నా మనసు చివుక్కుమనిపించేది.
నాకే అలా ఉంటే తెలంగాణా వారికి ఎంత మండిపోయేదో!
అప్పుడప్పుడూ మా అమ్మ అనే మాట గుర్తుకొచ్చేది.
‘మురికి నోటికి అల్లప్పచ్చడి చేదురా బాబు’ అని.
ఎక్కడ ఏ పంటలు పండుతాయో, అక్కడి వారు అవి తింటానికే అలవాటుపడతారు.
ప్రపంచ వ్యాపితంగా ఏర్పడిన ఆహార అలవాట్లవి.
ఇలాంటి మాటలు తెలంగాణా ప్రజల కోపానికి కారణమయ్యాయి.
అక్కడి ప్రజల కట్టుబొట్టును, ఆహారపు అలవాట్లను, మాట తీరును, జాతీయాలను, పలుకుబడులను, మాండలికాల్ని ఎగతాళి చేయడం మొదలు పెట్టారు.
ఎగతాళిలో సంస్కారపు హద్దులు దాటేశారు.
ఇది కూడా తెలంగాణా ప్రజల కోపకారణమైంది.
రాను రాను ‘జై తెలంగాణ’ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.
వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.
క్లాసులు జరగడం లేదు.
స్కూళ్ళ పరిస్థితే కాదు, కాలేజీల పరిస్థితి అదే.
మేం ఉంటున్న పురాతనమైన ఇంటిని అయిదు భాగాలు చేసి, ఐదు కుటుంబాలకు ఇచ్చారు.
ఈ అయిదు కుటుంబాలకు కలిపి ఒకే పెద్ద వరండా.

ప్యాలస్ ఆవరణలో మా ఇంటి ముందర ఉన్న రెండు వేప చెట్లు. మేము ఉన్న ఇల్లు పడిపోయింది.

సాయంత్రమైతే చాలు క్వార్టర్లలో ఉండే చాలా మంది మా వరండాలోకొచ్చి కబుర్లు చెప్పే వారు.
వరండా ముందు రెండు పెద్ద పెద్ద వేప చెట్లుండేవి.
ఇప్పుడా ఇల్లు పడిపోయింది, వేప చెట్లు మాత్రం ఉన్నాయి.
‘జై తెలంగాణా’ ఉద్యమం ఊపందుకునే సరికి మా వరండాలో నే చర్చలు పెరిగాయి.
విద్యాసంవత్సరం మధ్యలోకొచ్చే సరికి ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.
కోస్తా, రాయలసీమ జిల్లాలకు చెందిన వారిని వెళ్ళిపొమ్మని చెప్పడం మొదలు పెట్టారు.
ప్యాలెస్ బైట ఉన్న వారిని వెళ్ళిపొమ్మని తొలుత చెప్పేస్తున్నారు.
వినకపోతే బెదిరిస్తున్నారు, దాడులు చేస్తున్నారు.
చాలా మంది సెలవులు పెట్టి, మూట ముల్లె సర్దుకుని వెళ్ళిపోయారు.
పాలిటెక్నిక్ ఉద్యోగులెవరైనా ప్యాలెస్ వెలుపల ఉంటే, వారికి కూడా ప్యాలెస్ ఆవరణలోని వసతి కల్పించారు.
కాలేజీ మూతపడింది.
పాలిటెక్నిక్ లోని మూడు హాస్టళ్ళను ఖాళీ చేయించారు. విద్యార్థులు వారి వారి ఊళ్ళకు వెళ్ళిపోయారు.
ఉత్తర్ ప్రదేశ్ నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు దిగాయి.
వారికి రెండు హాస్టళ్ళలో బస ఏర్పాటు చేశారు.
ఒక హాస్టల్లో ఉద్యోగులకు బస కల్పించారు.

సీ ఆర్ పీ ఎఫ్ బలగాలు బస చేసిన హాస్టల్ భవనాలు.

ప్యాలెస్ లో రోజూ పొద్దున్నే సిఆర్పిఎఫ్ కవాతు. అప్పుడప్పుడూ ఊర్లో కూడా కవాతు జరిగేది.
సిఆర్పిఎఫ్ జవాన్లు చాలా బలంగా ఉండేవాళ్ళు.
వారి చేతిలో మని షెత్తు లాఠీలు.
కసరత్తులు చేసేవారు, కుస్తీపట్లు పట్టేవారు.
వాళ్ళని చూస్తుంటే, నా లాగా బక్కగా కాకుండా, మనుషులంతా ఇంత బలంగా ఉంటే ఎంత బాగుండేది అనుకునే వాణ్ణి.
ప్యాలెస్ చుట్టూ ఉన్న కోటగోడను దశల వారిగా పగులగొట్టారు.
దాని స్థానంలో బార్బడ్ వైర్ తో ఫెన్సింగ్ వేశారు.
వాటిలో మనుషులు దూరకుండా చేశారు.
ప్యాలెస్ ఆవరణంతా సిఆర్పిఎఫ్ బలగాల డేగ కళ్ళ కాపలాలో ఉండేది.
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను తప్ప ప్యాలెస్ ఆవరణలోకి ఎవరినీ రానిచ్చేవారు కాదు.
ప్యాలెస్ ప్రధాన ద్వారం మూసేశారు.
దానికున్న చిన్న తలుపును మాత్రం అవసరాన్ని బట్టి తెరిచేవారు.
ఆ ప్రధాన ద్వారం వద్ద ఒక సిక్కును కాపలా పెట్టారు.
ప్రధాన ద్వారం పైనున్ను గదులలో అతని నివాసం.
బైటకు వెళ్ళిన వారికి భద్రత కరువైంది.
ఉద్యోగులు కూడా బైటకెళ్ళడానికి భయపడుతున్నారు.
కనీసం క్రాఫ్ చేయించుకోవడానికి కూడా వెళ్ళే వారు కాదు.
ఆ సమయంలో మా బావ పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
ఆయన కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందినవాడు.
అప్పట్లో బలమైన సమైక్య వాది.
మాటల్లో కోస్తా పౌరుషం ఎక్కువ.
తల పుట్టపర్తి సాయిబాబా జుట్టులా పెరిగిపోయింది.
క్రాఫ్ కోసం బైటికెళ్ళాడు.
‘జైతెలంగాణా’ ఉద్యమ కారులతో వాదనకు దిగాడు.
మా బావను కొట్టేంత పనిచేశారు.
ఇంటికొచ్చి బాధపడ్డాడు.
మా బావ ఆరోజుల్లో ఎంత తెలంగాణా వ్యతిరేకో, ఆ తరువాత ప్రత్యేక తెలంగాణాకు అంత అనుకూలుడైపోయాడు.
ఆయన ఉద్యోగమంతా హైదరాబాదులోనే.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వచ్చినప్పుడు ఆ ఉద్యమాన్ని పూర్తిగా సమర్థించాడు.
నాకు ఆశ్చర్యమేసింది.
అప్పుడంత వ్యతిరేకించిన వాడు, ఇప్పుడింత సమర్థిస్తున్నాడేంటని!
‘ప్రత్యేక తెలంగాణా ఇచ్చేస్తే పోతుంది. మనం ప్రశాంతంగా ఉండచ్చు’ అనేవాడు.
నాకు తెలిసి ఉద్యమ కారులు పిల్లల జోలికి, స్త్రీల జోలికి వెళ్ళే వాళ్ళు కాదు.
వాదనకు దిగితేనే వాతావరణం వేడెక్కేది.
ప్యాలెస్ లోని కోస్తా, రాయలసీమ ఉద్యోగులపై ఆర్థిక దిగ్బంధం విధించారు.
చేతిలో డబ్బులుండేవి కానీ, బైటి కెళ్ళి సరుకు కొనుక్కొచ్చే వీలుండేది కాదు.
ప్యాలెస్ లోనే డిపార్టు మెంటు స్టోర్ పెట్టారు.
సరుకులన్నీ ఆ స్టోర్లోనే తెచ్చుకునే వాళ్ళం.
బైటికెళితే భద్రత లేదు.
అనంతపురం జిల్లాకు చెందిన ఒక ఎస్ఐని ప్రత్యేకంగా నియమించారు.
గంజి పెట్టి ఇస్త్రీ చేసిన ఖాకీ గుడ్డల్లో సన్నగా, మెలితిరిగిన కండలతో బలంగా ఉండేవాడు.
మెలిపెట్టిన మీసాలతో గంభీరంగా కనిపించేవాడు.
ఫ్యాక్షన్ ప్రాంతాల్లో పనిచేసి వచ్చాడని ప్రతీతి.
అప్పుడప్పుడూ మా వరండాలో సమావేశమయ్యే వారి దగ్గరకొచ్చి ధైర్యం చెప్పేవాడు.
హీరోలా ఫోజులు కొట్టేవాడు.
ఉద్యమకారులను ఎలా అణచివేసిందీ వివరించేవాడు.
కోస్తా, రాయసీమ ఉద్యోగులపాలిట అతనొక ‘ఆపద్బాంధవుడు’
మా వరండాలో చాలా మంది ఉత్తరకుమారులుండేవారు.
వారి మాటలు కోటలు దాటేవి.
‘రజాకార్లు వచ్చి పడితే ఆంధ్రా వారే కదా వీళ్ళను రక్షించింది’ అంటూ ఒకరు కోస్తున్న లేత సొరకాయలు చూసి నవ్వొచ్చేది!
మిగతా వారంతా పకపకా!
పోలీస్ స్టేషన్లో ఉద్యమకారులను ఎలా హింసించిందీ కథలు కథలుగా చెప్పుకునేవారు.
‘ఒకరి మూత్రం ఒకరితో తాగించేవారు’
మరింత జుగుప్సాకరమైన మాటలు.
జై తెలంగాణా ఉద్యమం 1969 మార్చిలో మరింత ఉదృతమైంది.
పాలిటెక్నిక్ లో పనిచేస్తున్న కోస్తా, రాయలసీమ ఉద్యోగులంతా వెళ్ళిపోవాలని హెచ్చరించారు.
చివరికి ప్రిన్సిపాల్ కె.రామిరెడ్డిని కూడా వెళ్ళిపోవాలని కోరారు.
‘అలాగే వెళ్ళిపోతాను.
నా డ్యూటీ నువ్వు చేస్తావా?’ అని ఎదురు ప్రశ్నించారు.
అంతే నవ్వుకుంటూ వెనుతిరిగారు.
వనపర్తి వీధుల్లో ఉద్యమకారులు ఇనుప చైన్లు తిప్పుతూ ప్రదర్శన నిర్వహించారు.
కొందరిపై దాడులు చేశారు.
క్వార్టర్స్ ఇళ్ళకు తాళాలు వేసి కొందరు తమ తమ ఊళ్ళకు వెళ్ళిపోయారు.
వీరిని సిఆర్పిఎఫ్ రక్షణతో తెలంగాణా సరిహద్దులు దాటించారు.
హైదరాబాదునుంచి కర్నూలు వెళ్ళే నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి కాన్వాయ్ పైన బాంబు దాడి చేయాలని వనపర్తికి చెందిన రాములు నాయకత్వంలో ప్రయత్నం జరిగింది.
రాములు తరువాత ఆర్టీసి కంట్రోలర్ గా చేస్తూ రిటైర్ అయ్యాడు.
షాద్నగర్, బిజినేపల్లి, జడ్చర్ల దారిలో కాపు కాశారు.
బ్రహ్మానందర రెడ్డి కల్వకుర్తి దారిలో వెళ్ళిపోవడంతో బాంబు దాడి యత్నం విఫలమైంది.
వనపర్తికే చెందిన బషీర్, యూసఫ్, గిడ్డు బాబు, ప్రకాష్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
జూన్ 16న పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ రోజును ‘నిర్బంధ వ్యతిరేక దినం’గా ఉద్యమకారులు పాటించారు.
ఎలాగైనా సరే పరీక్షలు జరపాలని ఒకరంటే, జరపడానికి వీల్లేదని మరొకరు.
రోడ్ల నిండా డ్రమ్ములు, టెలిఫోన్ వైర్లు వేశారు.
పోలీసులు ఇళ్ళపైన పహారా కాశారు.

కాల్పులు జరిగిన కమాన్ ప్రాంతం

వనపర్తి సర్కిల్ ఇనస్పెక్టర్ కార్యాలయానికి ఉద్యమకారులు నిప్పు పెట్టారు.
కమాన్ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది.
ఉద్యమ కారులపై పోలీసులు లాఠీలతో విరుచుకు పడ్డారు.
దొరికిన వారిని దొరికనట్టు బూట్లతో తన్నారు.
కమాన్ ప్రాంతంలోనే కాల్పులు జరిగాయి.
పోలీసు తూటాలకు రాజనగరానికి చెందిన కరుణాకర్ రెడ్డి, వనపర్తికి చెందిన షేక్ మహమూద్ లు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు ఉద్యమ కారుల ఇళ్ళలోకి చొరబడి కొట్టారు.
రాములును పోలీసులు పట్టుకుపోయి, రాయలసీమలోని ఒక పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు.
రాములును ఎన్ కౌంటర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఓ కానిస్టేబుల్ పసిగట్టి, మూత్ర విసర్జన పేరుతో రాములును వదిలేశాడు.
రాములు పారిపోయి హైదరాబాదులో కొంత కాలం తల దాచుకున్నాడు.
రాములును పోలీసులు చంపేశారని అంతా భావించారు.
కొన్ని నెలలకు రాములు తిరిగొచ్చాడు.
ఇంత ఉద్రిక్తతలో మేం అక్కడ ఉండడం మంచిది కాదని మా అమ్మమ్మ గారింటికి బందరు వెళ్ళిపోయాం.
మూడు నెలలు బందరులో తలదాచుకున్నాం.
జై తెలంగాణా ఉద్యమం దేశ విభజనలా తయారైంది.
ఉద్యమం చల్లారాక వనపర్తికి తిరిగి వచ్చేశాం.
ఒక ఏడాదంతా మాకు చదువులు చట్టుబండలయ్యాయి.
ఎనిమిదవ తరగతి చదవకుండానే తొమ్మిదిలోకి ప్రమోషన్.
పబ్లిక్ పరీక్షలు మాత్రం రాయాల్సి వచ్చింది.
పరీక్షలు రాయడానికి మా బావ సహా కోస్తా, రాయలసీమకు చెందిన విద్యార్థులను అనంతపురం పంపించారు.
తెలంగాణా అంతా చదువులు దెబ్బతిన్నాయి.
ప్రత్యేక తెలంగాణా రాలేదు.
చెన్నారెడ్డి నాయకత్వంలోని జైతెలంగాణా ఉద్యమం గాడి తప్పింది.
వనపర్తికి చెందిన ప్రజా వైద్యుడు డాక్టర్ బాలకృష్ణయ్య లాంటివారు జై తెలంగాణా ఉద్యమాన్ని సమర్థించలేదు.
సమైక్య వాదిగానే ఉన్నారు.
మాజీ సంస్థానాదీశుడు
రాజా రామేశ్వరరావు ఉద్యమానికి దూరంగా ఉన్నారు.
జై తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తే, రాజకీయంగా ఇబ్బంది.
ఉద్యమాన్ని సమర్థిస్తే, తన కాలేజీలో ఉన్న  కోస్తా, రాయలసీమ వారిని ఏం చేయాలన్నది ప్రశ్న.
ఈ సందిగ్ధావస్థలో రామేశ్వరావు క్యాన్సర్ చికిత్స అంటూ అమెరికా వెళ్ళిపోయారు.
‘సమైక్యాంధ్ర’ ఉద్యమం లాగానే, ‘జై తెలంగాణా’ కూడా ఒక విఫల ప్రయోగమే.
రెంటికీ దగ్గర పోలికలున్నాయి.
తెలంగాణాపై ఆర్థిక, రాజకీయ, సామాజిక పట్టు సాధించిన కార్పొరేట్ శక్తుల జోలికి జై తెలంగాణా ఉద్యమకారులుపెద్దగా పోలేదు.
మధ్యతరగతి ఉద్యోగులపై పడ్డారు.
వారి పై దాడులు చేసి తెలంగాణా నుంచి తరిమేశారు.
గోడల నిండా అసభ్యకర రాతలు రాశారు.
చివరికి బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాఘవమ్మ పైన కూడా గోడలపై బూతు పంచాంగం విప్పారు.
రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు లేకుండా, లుంపెన్ లా విరుచుకుపడ్డారు.
కేసీయార్ నాయకత్వంలోని ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి పోటీగా కోస్తా, రాయలసీమల్లో వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఈ లోపాలే పునావృతమయ్యాయి.

తిరుపతి లో సోనియా, కేసీఆర్ బొమ్మల పెళ్ళి ఊరేగింపు

అవి మరీ దారుణంగా తయారయ్యాయి.
సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల నుంచి కాకుండా ప్రాయోజిత కార్యక్రమంలా సాగింది.
కేసీయారును నోటికొచ్చినట్టు తిట్టారు.
వికారపు కార్టూన్లన్నీ వేశారు.
కేసీయార్, సోనియా గాంధీల పెళ్ళి శుభలేఖలు కొట్టించారు.
వారి ఫొటోలకు తిరుపతిలో పెళ్ళి జరిపించారు.
వారి ఫొటోలను ఆటోల్లో ఊరేగించారు.
కొందరు యూనివర్సిటీ అధ్యాపకులు సైతం మాటలతో ఆజ్యం పోశారు.
వికారపు నినాదాలు చేశారు.

మదనపల్లె లో సమైక్యాంధ్ర ఊరేగింపు.

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో తిరుపతిలో జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
అందరూ సమైక్యవాదమే వినిపించారు.
కొందరు కేసీయారును తిట్టిపోశారు.
దీనిక భిన్నంగా నేను మాట్లాడాను.
తెలంగాణా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నారో, చారిత్రికంగా దాని నేపథ్యమేమిటో 45 నిమిషాలు వివరించాను.
నాటి టీవీ9 రిపోర్టర్ ఒకరు నా చేతిలో మైకు లాగేసుకున్నాడు.
ఇంకొక్క అయిదు నిమిషాలు మీ చేతిలో మైకున్నా మేమంతా ‘జై తెలంగాణా’ అనాల్సి వస్తుందన్నాడు.
భిన్నాభిప్రాయాన్ని వినకూడదన్నట్టు ఆ రౌండ్ టేబుల్ సమావేశం సాగింది.
రౌండ్ టేబుల్ సమావేశమయ్యాక చాలా మంది నా దగ్గరకు వచ్చి నా వాదనతో ఏకీభవించారు.
అక్కడ చెప్పే ధైర్యం లేదు.
నాటి జై తెలంగాణా ఉద్యమానికి, సమైక్యాంధ్ర ఉద్యమానిక పెద్ద తేడాలేదు.
రాజకీయ కోరిక ఎంత బలమైందైనా, న్యాయమైందైనా సభ్యత ఒదిలేస్తే సమాజం అంగీకరించదు.
ఇది చరిత్ర చెప్పిన గుణపాఠం.

Aluru Raghava Sarma
(రచయిత ఆలూరు రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *