రాజధానుల వివాదం కోర్టు విచారణలో ఉంది. అది సబ్ జ్యుడీస్ అని తప్పుకున్న కేంద్రం
రాజ్యసభలో వైసీపీ ఎం పి విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
***
తొందరలో నే వైజాగ్ రాజధాని అని, తన కార్యాలయం వైజాగ్ కు తరలుతుందని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్న సమయం లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వివాదం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి అని వైఎస్సార్సీపీ సభ్యులు బుధవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ అంశం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6కు అనుగుణంగా నూతన రాజధాని ఏర్పాటుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణల కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ నివేదికను తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు అమరావతిని రాష్ట్ర రాజధాని నగరంగా ప్రకటిస్తూ 2015 ఏప్రిల్ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తదనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఆర్‌డీఏ చట్టం, 2020ని రద్దు చేసింది. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సంఘటిత అభివృద్ధి చట్టం, 2020 (ఏపీడీఐడీఏఆర్)ని తీసుకువచ్చిందని మంత్రి వివరించారు.
ఈ చట్టం చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని అన్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఈ చట్టాన్ని రద్దు చేసింది. మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ అప్పీల్ (సివిల్)ను దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ అంశం విచారణలో ఉందని మంత్రి చెప్పారు.