హస్తాల్ పూర్ గ్రామంలో అగ్నిపర్వతలావా బూడిదను గుర్తించిన కొత్త తెలంగాణా చరిత్ర బృందం.
తెలంగాణాలో టోబా అగ్నిపర్వత లావా బూడిద
కొత్త తెలంగాణా చరిత్ర బృందం పరిశోధనలో వెలుగుచూసిన టోబా వాల్కనో ఆష్ మౌండ్స్
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని హస్తాల్ పూర్ గ్రామంలో అగ్నిపర్వత లావాకు సంబంధించిన బూడిదగుట్టలను కొత్త తెలంగాణా చరిత్రబృందం పరిశోధకుడు బీ.వీ. భద్రగిరీశ్ గుర్తించారు. ఇటీవల హస్తాల్ పూర్ గ్రామంలోని పాండవులగుట్టపై ఉన్న చరిత్ర పూర్వయుగంనాటి రాతిచిత్రాలను చూడడానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులు గ్రామశివార్లలో స్థానికంగా సుద్దగుట్టలని పిలిచే బూడిదగుట్టలున్నాయని చెప్పిన సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రగిరీశ్ పరిశీలించారు.
గ్రామం శివార్లలో ఉన్న నరసింహస్వామిగుట్టకు ఆగ్నేయంగా ఒక కిలోమీటరు దూరంలో సుమారు అర కిలోమీటరు పరిధిలో రెండు అడుగులు లోతుగా బూడిద విస్తరించివుండడం కనుగొన్నారు. స్థానికులు ఈ బుడిదను సుద్దగా వాడేవారని తెలిపారు. అయితే హస్తాల్ పూర్ గ్రామంలో పాండవుల గుట్టపై చరిత్రపూర్వయుగంనాటి రాతి చిత్రాలు వుండడం, ఆ చుట్టుపక్కల సూక్ష్మరాతిపనిముట్లు లభించడం మరియు ఇనుము కరిగించిన ఆనవాళ్ళు ఉండడంవల్ల ఈ బూడిదను ఇనుము కరిగించిన కొలుముల నుండి వచ్చిన బూడిదగా ఇంతకుముందు భావించడం జరిగింది.
కానీ బూడిదగుట్టలను మరోసారి పరిశీలించిన కొత్తతెలంగాణా చరిత్ర బృందం పరిశోధకుడు, ఆ బూడిద నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా దానిలో దాదాపుగా కర్బనం లేకపోవడం, కేజీకి దాదాపు 5 మిల్లీగ్రాములదాకా గంధకం వుండడం కనుగొన్నారు.
మైక్రోస్కోపులో బూడిదలో ఉన్న రేణువులను పరీక్షించగా అగ్నిపర్వత లావా బూడిదలో ఉండే మొనతేలిన కణాల రేణువులు కనిపించాయి.
జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ జనరల్ శ్రీ చకిలం వేణుగోపాలరావుగారు ఈ వివరాలను పరీశీలించి, ఈ బూడిద 75 వేల సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో బద్దలైన టోబా అగ్నిపర్వతలావా బూడిదగా నిర్ధారించవచ్చని తెలిపారు.
సుమారు 75 వేల ఏళ్ల కింద ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం బద్దలై వెలువడిన బూడిద వేల కిలోమీటర్ల దూరం విస్తరించింది. అలా పడిన బూడిద నీటి ప్రవాహాలతో కొట్టుకుపోయి కొన్నిచోట్ల కుప్పగా చేరింది. అదే తరహాలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆ అగ్నిపర్వతం బూడిద కుప్పలు మేటవేసి ఉండటాన్ని గుర్తించారు. హస్తాల్ పూర్ గ్రామం మంజీరా నదిలో కలిసే హరిద్రానది వొడ్డున ఉండడం గమనార్హం.
కొత్తగూడెం సమీపంలోని ముర్రేరు వద్ద, మంజీరా లోయలోని కొన్ని ప్రాంతాల్లో సదరు బూడిద కుప్పలను జియోలజిస్టులు ఇప్పటికే గుర్తించారు. ఏపీలోని బనగానపల్లి సమీపంలో జ్వాలాపురం గ్రామంలో మెరుగుసుద్దగా పిలుచుకునే బూడిద కుప్పలు కూడా వీటిలో భాగమేనని చెబుతున్నారు.
అలాగే తెలంగాణాలో ఇతర ప్రాంతాలలో ఉన్న బూడిదగుట్టలు ఇంతకుముందు భావించినట్టుగా చరిత్రపూర్వ యుగంలో పశువులపేడను కాల్చగా ఏర్పడిన బూడిదగుట్టలు కాకపోవచ్చని, వాటిని పునఃపరిశీలించాల్సివుందని ఆయన అభిప్రాయపడ్డారు. సుమారు ఎనభైవేల సంవత్సరాలక్రితం ఇండోనేషియాలో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం అతితీవ్రంగా బద్దలైందనీ, దాని నుండి వెలువడిన లావా బూడిద బంగాళాఖాతంలోనూ మరియు భారతదేశంలో దక్కన్ పీఠభూమిలోని ఇతర నదీ లోయలలో గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు.