దారీతెన్నూ లేని వింత ఈ ‘దశావతారం’

తిరుపతి జ్ఞాపకాలు-63

రాఘవ శర్మ

రెండు కొండల నడుమ హెూరుమంటున్న ఏరు.
ఆ ఏటికి ఎన్ని లయలు ! ఎన్ని హెుయలు!
ఏటిని పట్టేసుకోవాలని ఆశపడుతున్న కొండలు.
ఏరు ముందుకు జారిపోతోంది.
చేతికి చిక్కకుండా పారిపోతోంది.
కొండలు ఎన్ని మెలికలు తిరుగుతున్నాయో!
ఏరు కూడా అన్ని మెలికలూ తిరుగుతోంది!
ప్రకృతి మాత ప్రేమ గీతానికి, రెండూ కలిసి నాట్యం చేస్తున్నాయి.
కొండ అంచుల్లో చెట్లు విస్తుపోతున్నాయి.
ఆకాశంలో పక్షులు పరవశిస్తున్నాయి.
అడ్డంగా వచ్చిన కొండ రాళ్ళ పైనుంచి ఏరు దుముకుతోంది. రాళ్ళ సందుల్లోంచి దూరిపోతోంది.
జలసంగీతాన్ని వినిపిస్తోంది.
దశావతారతీర్థ దర్శనంలో ఎన్ని సొగసులు! ఎన్ని సొబగులు!
ఈ ప్రాకృతిక సౌందర్యంలో ఎన్ని వింతలు! ఎన్ని విడ్డూరాలు!
పేరుకే ఇది ‘దశావతార తీర్థం’.
దీనికి లెక్కలేనన్ని అవతారాలు!
దాని అసలు రూపాలు చూడాలని శనివారం బయలుదేరాం.
పదిహేడు మంది ప్రకృతి ప్రియులం.
తిరుపతి, విజయవాడ, పాండిచ్చేరి, చెన్నైనుంచి వచ్చారు. తెల్లవారుజామున అయిదున్నర అవుతోంది.
అలిపిరి నుంచి తిరుమలకు మా వాహనాలు కదిలాయి.
గంటలో గోగర్భం డ్యాం చేరుకున్నాం.
అప్పుడే చీకటి తెరలు తొలగి పోతున్నాయి.
డ్యాం దాటి ఎడమ వైపున శేషతీర్థం వెళ్ళే దారిలో కదిలాం.
కొంత దూరం వెళ్ళాక వాహనాలు ఆపేశాం.
చుట్టూ పచ్చని చెట్ల మధ్య నుంచి మా నడక.
కాస్త ఏటవాలుగా ఉంది.
అప్పుడే సూర్య కిరణాలు చెట్ల మాటునుంచి తొంగి చూస్తున్నాయి. శేషతీర్థం వెళ్ళే కాలిబాటంతా బోద పెరిగి పూడుకుపోయింది.
ఏప్రిల్లో వచ్చే శేషతీర్థ ఉత్సవానికి ఏడాదికొకసారే వెళతారు.
ఈ మధ్య ఎవ్వరూ ఈ దారిన వెళ్ళిన ఆనవాళ్ళు లేవు.

శేష తీర్థం లోయ లోకి ఇలా దిగు తూ..

దారి నిండా ఎలుగు బంట్లు చేసిన గుంతలు.
ఎక్కడ గుంతో, ఎక్కడ లేదో కాలు పెడితే కానీ తెలియడం లేదు.
ఎదవరకు పెరిగిన బోద మధ్య ఈత చెట్లు పెరిగాయి.
దిగువకు సాగుతున్నాం.
ఎదురుగా సానమిట్ట.
మరి కొస్త దూరం వెళ్ళాక లోయలోకి దిగడం మొదలైంది.
మెలికలు తిరిగిన దారిలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం.
పట్టు దొరకని చోట జారుతోంది.
వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద బండ రాళ్ళు.
రాళ్ళ పైన నడక మరొక సర్కస్ ఫీట్.
ఇక్కడే అరుదైన అకేషియా డల్హసి చెట్టు.

ఇది మర్రి జాతికి చెందింది.
విదేశాల నుంచి పక్షుల ద్వారా వచ్చిన విత్తనం శేషాచలం అడవుల్లో పడి మొలిచింది.
దీని ఆకులు తుంచినప్పుడు వచ్చే పాలు తెల్లగా ఉంటాయి.
కాసేపటికి అవి లేత నీలిరంగుకు తిరుగుతాయి.
శేషతీర్థం చేరే సరికి తొమ్మిదైంది.

శేష తీర్థం

టిఫిన్లు ముగించుకుని శేషతీర్థం లోకి వెళ్ళాం.
ఈ శేష తీర్థానికి లెక్కలేనన్ని సార్లు వచ్చాం.
మా బృందంలో చూడని వాళ్ళున్నారు. తీర్థంలోకి ఈదుకుంటూ వెళ్ళాం.
ఎన్ని మెలికలుతిరిగిందో ఆ కొండ!
మధ్యలో వచ్చిన పెద్ద కొండరాయిని ఎక్కి ఆవలికి దిగాం.
అడుగడుగునా వింత వింత కొండ రూపాలు.
సుళ్ళు తిరిగిన నీటి ఉధృతికి కొండ కూడా ఎన్ని మెలికలు తిరిగిందో!
చెన్నై నుంచి వచ్చిన వనతి శంకర్ దంపతులు ఈ అందాలకు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు.
వనతి కాలు మెలికపడింది.
అతికష్టం పైన వెనుతిరిగింది.
ఒడ్డుకు చేరాక మధు ప్రాథమిక చికిత్స చేశాడు.
దశావతారం వరకు ఎలా నడవగలుగుతుంది!?
అందరిలో కాస్త సందేహం?
జారుతూ, పడుతూ, లేస్తూ, ఈదుతూ గుండంవద్దకు చేరాం.
గుండాన్ని చుట్టేసుకున్న కొండ.
కొండ చీలికనుంచి పడుతున్న జలధార.
గుండం పొంగి పొర్లుతోంది.
జలధార కిందకు ఈదుకుంటూ వెళ్ళాం.
నీళ్ళు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
కాసేపటికి వెనుతిరిగి వచ్చేశాం.
దశావతారాల తీర్థానికి వెళ్ళడానికి మూడు దారులు.
మా మండూరు నుంచి ఒక దారి.
శేషతీర్థం లోయలో దిగడానికంటే ముందు కుడి వైపున లోయలోకి దిగి వెళ్ళే దారి మరొకటి.
శేషతీర్థం నుంచి ఆ నీళ్ళు ప్రవహించే రెండు కొండల నడుమ నుంచి వెళ్ళడం ఇంకొక దారి.

రెండు కొండల నడుమ ఇరుక్కున్న రాయి పై నుంచి ఏటి లోకి దూకి సాగాలి

ఈ దారి చాల సాహసోపేతమైంది.
ఈత వస్తే తప్ప ముందుకు సాగలేం.
గతంలో ఒకే ఒక్కసారి ఈ దారిన ఎవరో వెళ్ళినట్టు వినికిడి.
నిజానికి ఈ దారి నూతన అన్వేషణే.
శేషతీర్థం నుంచి నీరు తూర్పునకు ప్రవహించే వైపు బయలు దేరాం.
ప్యాంట్లు, షర్టు బ్యాగులో పెట్టేసి, షార్ట్లు, టీషర్టులతో కదిలాం.
రెండు కొండల నడము ఉన్న బండరాళ్ళ మధ్య నుంచి ఏరు ప్రవహిస్తోంది.
కాస్త ముందుకెళ్ళేమో లేదో, పదిహేనడుగుల లోతుకు ఏరు జాలువారుతోంది.
తాళ్ళతో ఒక్కొక్కరిని దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ముందు బ్యాగులను దించి, ట్యూబులపైన పెట్టి తడవకుండా ఆవలకు చేర్చడం.
ఒక్కొక్క బ్యాగు అలా తీసుకెళ్ళడం చాల ప్రయాసతో కూడుకున్నది.
ఈ లోగా చెన్నై నుంచి వచ్చిన సాహసికులు నిట్టనిలువునా ఉన్న కొండ అంచు నుంచి ఎక్కడం మొదలు పెట్టారు.

కొండ అంచున సాహ సో పేతమైన నడక

అంతా ఆదారినే పట్టాం.
కాకపోతే తొలి అడుగులు ఎత్తుకు పడడం చాలా కష్టం.
అంతా కొండ అంచునే నడుస్తున్నాం.
బెత్తెడున్న కొండ అంచులో కాళ్ళు పెట్టి, పై నున్న కొండ అంచును పట్టుకుని సాగుతున్నాం.
నిజంగా ఇది సాహసమో! దుస్సాహసమో!
మళ్ళీ రెండు కొండల నడుమ ఉన్న ఏటిలో మానడక.
ఒక చోట వెడల్పుగా, మరొక చోట సన్నని గొందిలా ఉంది.
పాదాలు మునిగే నీళ్ళు, మోకాలు లోతు నీళ్ళు, నడుము లోతు నీళ్ళు.
రెండు కొండల నడుమ మళ్ళీ ఒక పెద్ద బండరాయి వచ్చింది.

ముందు ఇద్దరు ముగ్గురు బండరాయి పైనుంచి నీటిలోకి దూకారు.
దూకితే నీళ్ళు గొంతువరకు వస్తాయి.
పై నుంచి తాడుకట్టి ఒక్కో బ్యాగు కిందకు దించితే, కింద వాళ్ళు అందుకుంటున్నారు.
ట్యూబుల పైన ప్లాస్టిక్ కవరు వేసి, దాని మధ్యలో బ్యాగు పెట్టి ఆవలికి లాక్కుపోయారు.

అయిదడుగుల నీటి లోంచి బ్యా గు లు తరలిస్తున్న వైనం

ఇలా బ్యాగులన్నీ పంపడానికి చాలా సమయం పట్టింది.
ఆ రాయి ఇరువైపుల నుంచి నీళ్ళు కిందకు దుముకుతున్నాయి.
గుండ్రటి రాయి పదిహేనడుగులుంది.
ఆరాయి పైనుంచి కొందరు తాడుపట్టుకుని నీళ్ళలోకి దూకుతున్నారు.
కొందరు అలాగే నీళ్ళలోకి దూకుతున్నారు.

రెండు కొండల నడమ సాగుతున్నాం.
కొండ అంచుల్లో ఎన్ని వింతలు! మధ్యాహ్నం ఒంటిగంటవుతోంది.
భోజనాలకు ఉపక్రమించాం.
శేషాచలం కొండలు, వాటి అందాలు, వైవిధ్యం గురించేకబుర్లు.
మళ్ళీ మా నడక మొదలైంది.
జాగ్రత్తగా కింద చూస్తూ, అడుగులు వేస్తూ నడుద్దామా?
అలా అయితే ఈ ప్రాకృతిక అందాలను తనివితీరా చూడలేం.
చూస్తూ నడుద్దామా అంటే ఏ రాయిపైనో, ఏనీటిలోనో జారిపడతాం.
జారి పడినప్పుడల్లా దెబ్బలు తగలడం మాటటుంచి, నవ్వులు పూస్తున్నాయి.
ఎవరెక్కువ సార్లు జారిపడ్డారో ఒక లెక్క!
జారిపడడం ట్రెక్కర్ల జన్మహక్కు.
ఒక్కసారి కూడా పడకుంటే ట్రెక్కర్లు కాలేరు.
ఇరువైపులా ఉన్న కొండలు, కోనలు, చెట్లు, పుట్టలు పక్షులూ నవ్వుతున్నాయి.
మా వెర్రితనాన్ని చూసి.

కొండ అంచు ల్లో గుహలు.

రెండు కొండల అంచుల్లో లెక్కలేనన్ని గుహలు!
ఎలుగు బంట్లకు ఆవాసాలై ఉండవచ్చు.
అనుమానం లేదు, సహజసిద్ధంగా ఏర్పడ్డవే.
‘కరోనాలో ఏదైనా కొత్త వేరియంట్ వస్తే! మనకు ఈ గుహలే గతి’ అన్నాడు మధు.
నగరజీవితాన్ని ఒదిలేసి, శేషాచలం కొండల్లో తిరుగుతూ ఉండిపోవాలన్న ఆశ.
కొండలు దగ్గరకొచ్చినప్పుడల్లా, వేగంగా ఏరు ముందుకు సాగిపోతోంది.
నడిచినంత ప్రాంతంలో ఎండ పొడ ఎక్కడా పడలేదు.
శేషతీర్థంలో ఉదయం పదకొండు గంటలకు మొదలైన మా నడక, సాయంత్రం నాలుగున్నరకు ఆపేశాం.
దశావతార తీర్థం ఇక్కడకు దగ్గరే.
అక్కడ రాత్రి బస చేసే సదుపాయం లేదు.
పారుతున్న ఏటికి ఆవల, ఈవల కాస్త విశాలమైన రాతి నేల.
పొద్దున్నుంచి నడుస్తున్న మా కాళ్ళు అలసిపోయాయి.

ఏటి లో వేసుకున్న గుడారాలు.

ఒకపక్క టెంట్లు వేయడం మొదలు పెట్టారు.
మరోపక్క ఎండిన కట్టెపుల్లలు ఏరుకొచ్చారు.
పడిపోయిన పెద్ద పెద్ద దుంగలను ఎత్తుకొచ్చారు.
ఇక్కడ త్వరగా చీకటి పడుతుంది.
పవర్ బ్యాంకులతో లైట్లు ఏర్పాటు చేశారు.
సాయంత్రం ఆరున్నరకే వేడి వేడి భోజనాలు సిద్ధమయ్యాయి. క్రమంగా చలిమొదలవుతోంది.
అంతా చలిమంట ముందు చేరారు.
చలిమంట ముందు వెచ్చటి కబుర్లు.
ఎనిమిదింటికే గుడారాల్లో దూరి గురకపెట్టే వాళ్ళు.
పదింటికి పడకపైకి చేరే వారు మరి కొందరు.
మధ్యలో లేచి మంటను ఎగదోసే వారు ఇంకొందరు.
మా గుడారం చలిమంట పక్కనే ఉంది.
పెద్దగా చలి అనిపించలేదు.
కానీ, నేలలోంచి చలిపైకి ఎగదన్నుతోంది.
మధ్య రాత్రిలో లేచి గుడారాల్లోనే కూర్చుని చలికాచుకున్నాం.
రెండు ఎత్తైన కొండల నడుమ ఏరు రొద చేస్తూనే ఉంది.
దానికి రాత్రీ పగలు తేడా తెలియదు.
సూర్యుడు మాపై కినుకు వహించినట్టున్నాడు.
పగలంతా కనిపించలేదు.
చందమామమాత్రం కనికరించింది.
ఏటిలో తన ముఖాన్ని చూసి మురిసిపోతోంది.
తెల్లారేవరకు మమ్మల్ని గమనిస్తూనే ఉంది.
తెలతెలవారుతుండగా పక్షుల పలకరింపులు.
మా వాళ్లంతా చలిమంట చుట్టూ చేరి మళ్ళీ కబుర్లు.
మధు ఒక ప్రశ్నను సంధించాడు.
‘ఎర్రచందనం దుంగ పొడి చేసి, వేడి నీళ్ళలో బాగా ఉడక బెట్టి, చల్లారాక వడకట్టి తాగితే!?”
‘తాగితే ఏమవుతుంది?’ శ్రీహరి ప్రశ్న.
‘యవ్వనం వచ్చేస్తుంది. వృద్ధులు కూడా యువకులై పోతారు’ చెప్పాడు మధు.
చలిమంట ముందు ప్రసాద్ నవ్వులు.
‘ఈ జాస్ తాగిన పండు సారు చూడండి. ఇంత వయసొచ్చినా యువకుడిలా మనతో కలిసి ఎలా నడుస్తున్నాడో’ మధు కొనసాగించాడు.
భరత్ రెడ్డి, లాయరు పకపకలు.
‘దీన్నిక్కడే వీడియో తీసి ఒదులుతాను.
మీరందరూ సపోర్టుగా మాట్లాడాలి’
‘సరిప్ప. ఓకే’ అన్నది చెన్నైకి చెందిన వనతి.
ఆమె భర్త శంకర్ నవ్వుతూ మద్దతుగా చెయ్యెత్తాడు.
‘అరె పాండిచ్చేరి నువ్వు కూడా సపోర్టు చేయాలి’
‘ఓకే అన్నా’
‘ఈ వీడియో వదిలితే అంతే సంగతులు’ అన్నాడు యశ్వంత్ .
‘మీరు ఎట్లా అంటే అట్లా. కాకపోతే అంతా వచ్చి శేషాచలంపై పడతారు’ చిన్నగా బ్రేక్ వేశాడు పవన్.
‘ట్రెక్కింగ్ అంటే పోనీలే అనుకున్నాం. ఇదేందిరా ఇది’ అని ప్రభాకర్ రెడ్డి సార్ నన్నే తిడతాడు’ అని మధు తనను తాను సమాధానపరచుకున్నాడు.
ఆ ఎపిసోడ్ అంతటితో ముగిసింది.
మరొక ఎపిసోడ్, ఇంకొక ఎపిసోడ్.
టెంట్లలో బ్యాగులు పెట్టేశాం.
వేడి వేడి కిచిడీ తిని, మళ్ళీ ఏటిలో నడక.
రెండు కొండల నడుమ మళ్ళీ నీటిగుండం.
కొండల పక్కనే నడవలేం.

మొదలైన దశా వ తార తీర్థం

రెండు పెద్ద పెద్ద కొండ రాళ్ళను దాటితే తప్ప నీటి గుండం దాటలేం.
గుండానికి ఇరువైపులా కొండ అంచులు.
ఆ అంచుల్లో నడిచినా పట్టు దొరకదు.
దాంట్లో దూకడమే మార్గం. ఒక్కొక్కరూ దూకుతున్నారు.
ఇక్కడి నుంచే దశావతార తీర్థం మొదలయ్యేది.
అలా ముందుకు సాగుతుంటే ఎన్ని గుండాలు.
ఒకదానికొకటి పోలికేలేదు.
రెండు కొండల నడుమ ఏటవాలుగా నీటి ధార.
మా వాళ్ళంతా ఆ నీటిలో జారుడు బండలా జారారు.
నడివయస్కులు కూడా పిల్లలైపోయారు.
ఈ ఏరు ఎన్ని మెలికలు, ఎన్ని సుళ్ళు తిరుగుతోందో! దశావతారం అంటే పదిగుండాలా! పది అవతారాలా!? అవి లెక్కలేనన్ని గుండాలు, లెక్కలేనన్ని వాటి అవతారాలు.
వీటన్నిటి సమాహారమే దశావతార తీర్థం.

మెలికలు తిరుగుతూ సాగుతున్న ఏటి లో జారుడు బండ లా జారు తున్న ప్రకృతి ప్రియులు

ఆ ఏటిలో ఎంత దూరమైనా వెళ్ళవచ్చు.
కానీ, కాలం తరుముకొస్తోంది.
ఆ అందాలను మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తూ వెనుతిరిగాం.
గుడారాల వద్దకు చేరే సరికి మధ్యాహ్నం పన్నెండైంది.
గంటలో వంటలు భోజనాలు పూర్తయ్యాయి.
మంటల్ని ఆర్పేసి బయలు దేరాం.
మధ్యాహ్నం ఒంటిగంట అవుతోంది.
వచ్చిన దారిలోనే కాస్త దూరం నడిచాం.
ఎడమ వైపు కొండెక్కడం మొదలు పెట్టాం.
ఇక మొత్తం ఎక్కుడే!
కొండ నిట్టనిలువుగా ఉంది.
దానికి దారీతెన్నూ లేదు.
రాళ్ళను పట్టుకుని ఎగబాకుతున్నాం.
ఒక్కొక్క సారి పట్టు దొరకడం లేదు.
కాళ్ళు జారుతున్నాయి.
కొండ సగం ఎక్కాక నేలంతా బోద.
బోదలో కాలు పెడితే జారుతోంది.
ఒక్కొక్క చోట పట్టు కోసం చెట్లు ఆసరాగా ఉన్నాయి.
మూడడుగులు ముందుకు, ఒకడుగు వెనక్కు లా మా నడక.
ఎత్తైన కొండ కొస కనిపిస్తూనే ఉంది.
ఆకొసకు చేరే సరికి కొండ కొస మరికాస్త ముందున్నట్టు కనిపిస్తోంది.
మా గమ్యం ఎండ మావిలా మారింది.
ఎండ కోసం ఒక రోజంతా మొహం వాచిన వాళ్ళం.
ఇప్పుడు ఎండ మాడ్చేస్తోంది.
మళ్ళీ చెట్ల మధ్యనే నడక.

శేషాచలం అడివిలో ప్రకృతి ప్రియులు

ఆ దారి ఎన్ని మెలికలు తిరిగిందో!
గుబురుగా ఉన్న చెట్ల మధ్య కాస్త విశ్రాంతి.
మిగిలిన తినుబండారాలన్నీ బైటికి తీసి కానిచ్చేశాం.
మళ్ళీ నడక.
ఇంకా ఎంత దూరం.. ఎంత దూరం..
సాయంత్రం నాలుగవుతోంది.
శేషతీర్థం వెళ్ళే దారిలోకి వచ్చేశాం.
చెట్ల మధ్య అంతా బోద పెరిగింది.
దారి కనిపించడం లేదు.
దారి తప్పుతున్నాం, మళ్ళీ దారిలో కలుస్తున్నాం.
మానడక పడమర వైపు సాగుతోంది.
మా వాహనాలు పెట్టిన దగ్గరకొచ్చేసరికి నాలుగున్నరైంది.
ఒకరికొకరు సెలవు తీసుకుని తిరుమలకు చేరాం.
తిరుపతి వెళ్ళి ఇళ్ళకు చేరే సరికి సాయంత్రం ఆరైంది.
దశావతారానికి దారి తెన్నూ లేదు.
చూడాలనుకుంటే దారి చేసుకుని వెళ్ళాలి.
అడవులు, కొండలు, బండ రాళ్ళు, ఏర్లు, సెలఏర్లు, చెట్లు పుట్టలు దాటితే తప్ప దశావతార తీర్థాన్ని చేరుకోలేం.
అత్యంత కష్టతరమైనదీ తీర్థ యానం.
ప్రాకృతిక సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే, ఆ మాత్రం కష్టపడక తప్పదుగా మరి.

Aluru Raghava Sarma
Aluru Raghava Sarma

(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *