*నెల్లిమర్ల కాల్పులకు నేటికి 29 ఏళ్ళు
*నేటి నుండి ఫిబ్రవరి 4వరకు స్మారక వారం
*ఫిబ్రవరి 1న నెల్లిమర్ల పై పుస్తక ఆవిష్కరణ!
*నెల్లిమర్ల కార్మికవర్గ పోరాటం మీద పోలీసు కాల్పులకు నేటికి 29 ఏళ్ళు. నాటి నెల్లిమర్ల అమరత్వాన్ని మళ్లీ స్మరించుకుందాం. ఐదుగురు నెల్లిమర్ల అమర వీరులకు జోహార్లు చెబుదాం. వారు అందించిన పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని దీక్ష వహిద్దాం.
*నేటి నుండి ఫిబ్రవరి 4 వరకు నెల్లిమర్ల స్మారక వారం జరపాలని ఇఫ్టూ రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చింది. దానిని జయప్రదం చేద్దాం.
*జనజీవితాల్ని సర్వ విధ్వంసం చేసే స్థాయికి నేడు బడా కార్పోరేట్ వ్యవస్థ చేరుతోంది. గత వారం రోజులుగా దేశ ఆర్థిక వ్యవస్థని తీవ్రంగా కుదిపేస్తోన్న తాజా పరిణామాలు అందుకు నగ్నమైన ఉదాహరణ!
*ఒక్క క్రోనీ కాపీటలిస్టు కుటుంబం 135 కోట్ల జనాభా గల భారతదేశ దేశ ఆర్ధిక వ్యవస్థను ఎలా అతలాకుతలం చేస్తుంది? ఇది ఇలా సర్వ విధ్వంసక శక్తిగా ఎలా మారింది? ఇలా మారే కార్పోరేట్ వ్యవస్థ మీద మున్ముందు “శ్రమ భారత్” పోరాడాల్సిన ఆవశ్యకతను మనకు గుర్తు చేస్తోంది. నాలుగు లేబర్ కోడ్లపై పోరాటం కూడా అందులో ఒక అంతర్భాగమే. వాటిపై పోరాటాల్ని కూడా తీవ్రతరం చేద్దాం.
*సమరశీల శ్రామికవర్గ పోరాటాల్ని నిర్మించడం నేటి చారిత్రక అవసరం. నేటి భౌతిక పరిస్థితి, రాజకీయ ఆవశ్యకతతో పోల్చితే కార్మికవర్గ పోరాట శక్తులు నేడు చాలా బలహీనంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి మున్ముందు ఇలాగే ఉండదు. “శ్రమ భారత్” విధిగా గర్భం ధరిస్తుంది. అది అనివార్యంగా శ్రామికవర్గ విప్లవ పోరాటాలకు పురుడు పోస్తుంది. భూమి మీద ఏ శక్తులూ అడ్డుకోలేవు. అది రేపటి నిజం.
*రేపు అనివార్యమైన కార్మికవర్గ పోరాటాల్ని నిర్మించడానికి ఉద్యమ స్ఫూర్తిని అందించే అరుదైన కార్మికోద్యమ చరిత్రలలో నెల్లిమర్ల ఒకటి. అట్టి నెల్లిమర్ల చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం నేటి శ్రామికవర్గ విప్లవ శక్తులకు ఉంది. అందుకై నెల్లిమర్ల చరిత్ర లిఖిత రూపంలోకి రావాల్సి ఉంది. అందుకై ఇఫ్టూ రాష్ట్ర కమిటీ ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నది.
*వీరోచిత నెల్లిమర్ల కార్మికోద్యమ చరిత్ర ఓ భారతం వంటిది. ఆ చరిత్ర రచన నేటికీ మిగిలిపోయిన ముఖ్య కర్తవ్యమే. ఇప్పటి రచన అదికాదు. మరైతే ఇఫ్టూ రాష్ట్ర కమిటీ చేపట్టిన నేటి రచన ఏమిటి?
*నెల్లిమర్ల కార్మికవర్గం తమ సాంప్రదాయ ట్రేడ్ యూనియన్ పంథాకు హఠాత్తుగా ఎందుకు గుడ్ బై చెప్పింది? అది సమరశీల పోరాట పంథా వైపు ఎందుకు మొగ్గింది? ఆ పరివర్తన జరగడానికి వాస్తవ నేపథ్య కారణాలు ఏమిటి? పై పరివర్తనకు తెర వెనుక ఏళ్ల తరబడి చరిత్ర వుండొచ్చు. కానీ తెర పై అరవై రోజుల పరివర్తనా చరిత్ర ఉంది. 30-9-1991 నుండి 30-11-2991 వరకు సాగిన ఆ 60 రోజుల చరిత్ర ఎన్ని మలుపులు తీసుకుంది? అది ఓ డాక్యుమెంటరీగా రికార్డ్ కావాల్సిన చరిత్ర! ఇఫ్టూ రాష్ట్ర కమిటీ అందుకై ఒక చిన్న ప్రయత్నం చేస్తోంది. ఆ పుస్తక ఆవిష్కరణ 1-2-2023 బుధవారం నెల్లిమర్లలో చేపట్టింది.
*నెల్లిమర్ల అమర వీరుల 29వ వర్ధంతి సందర్భంగా బుధవారం సంస్మరణ సభలో చేపట్టే పుస్తకావిష్కరణ ప్రోగ్రామ్ ని జయప్రదం చేద్దాం.
(ఇఫ్టూ రాష్ట్ర కమిటీ, ఆంధ్రప్రదేశ్)