అబ్బా, ఇది ‘డబ్బారేకుల కోన’ (తిరుపతి జ్ఞాపకాలు-61)

 

(రాఘవ శర్మ)

ఎన్ని జలపాతాలు..
ఎన్ని నీటి గుండాలు..
ఎన్ని మలుపులు..
ఎన్ని రాగాలు..
ఎన్ని గారాలు..
ఎన్ని హెుయలు..
ఒక్క ఏరులో.. ఒక్క కోనలో..!
ఇన్ని ఆస్వాదించగలమా..!
ఇది శేషాచలం కొండల్లోని డబ్బారేకుల కోన..!
‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ కాదిప్పుడు.
ఈ కోన పేరు ‘డబ్బా’ దీని హృదయం చాలా ‘గొప్ప..!’
ఆదివారం సంక్రాంతి పండగ.
డేర్ డెవిల్ ట్రెక్కర్లకు ట్రెక్కింగ్ ను మించిన పండగేముంటుంది !?
అందులో అది తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్.
ఆదివారం తెల్లవారు జామున శేషాచలం కొండల్లోని ‘డబ్బారేకుల కోన’కు బయలుదేరాం.
అంతా ఎనిమిది మందిమే.
ద్విచక్రవాహనాల్లో తిరుమల చేరే సరికి ఏడవుతోంది.
అప్పటికింకా చలి ఒణికిస్తోంది.
తిరుమలలో పార్వేట మండపం దాటాం.
కుడి వైపున అటవీ శాఖ గేటులోంచి శ్రీగంధం తోటలోకి దారి తీశాం.
రహదారి అంతా రాళ్ళు, రప్పలు, గుంటలు, మిట్టలు.
ద్విచక్రవాహనాల్లో వెళుతుంటే గుర్రపు స్వారీ చేసినట్టుంది.
రోడ్డు ఎన్ని మలుపులు తిరుగుతోందో!
ఇంకా పొగ మంచు వీడలేదు.
తూర్పెటో, పడమరెటో తెలియడం లేదు.
ఏట వాలుగా ఉన్న ఆ రాళ్ళరహదారిలో మా వాహనాలు ఎగిరెగిరి పడుతున్నాయి.
పార్వేట మండపం నుంచి మూడు కిలోమీటర్లు దాటాక , ఎడమ వైపున కొంత దూరం వెళితే 14-15 శతాబ్దాల నాటి పురాతన సత్రాలు, పాడుపడిన కోనేరు వస్తాయి. రాత్రంతా వర్షంలా మంచు కురిసినట్టుంది.
దారికి ఇరువైపులా బోద పెరిగింది.
మంచుకు తడిసిన బోద మమ్మల్ని పలకరిస్తోంది.
పన్నీరనుకుందో ఏమో పాపం!
రాత్రంతా తన పైన కురిసిన మంచును మా పైకి విరజిమ్ముతోంది.
నీ ప్రేమ చల్లగుండా..నీ పలకరింపుతో మా హెల్మెట్లు, జర్కిన్లు, లోయర్లు తడిచిపోయాయి గదే!
మధు జర్కిన్ లేకుండా, టీషర్టుతో వచ్చాడు!
ఆ మంచుకు ఒణికిపోతున్నాడు.
బండినడుపుతుంటే చేతి వేళ్ళూ కొంకర్లు పోతున్నాయి.
‘చద్దికూడు తిన్నమ్మకి మొగుడాకలి తెలియదు?’ అన్నట్టు, జర్కిన్లు వేసుకొచ్చిన మాకు మధు బాధ ఏం తెలుస్తుంది!?
ఆ మంచులో, ఎగుడు దిగుడు రోడ్లలో ఎనిమిది కిలోమీటర్లు సాగాం.
వాహనాలు నిలిపేసి ఎడమ వైపు లోయలోకి దిగడం మొదలు పెట్టాం.
ఏడాడదిన్నర క్రితం వెళ్ళిన మార్కండేయ తీర్థం దారది.
దట్టంగా బోద, ఈత చెట్లు మనిషెత్తు పెరిగాయి.
దారి కనిపించడం లేదు.
వాటి మద్య దారి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.
ఈత ముళ్ళు గుచ్చుకుంటున్నాయి.

నడుస్తుంటే చలి తగ్గి, శరీరం చెమటపట్టి వేడెక్కాలి.
కానీ చలి ఒణికిచ్చేస్తోంది.
దూరంగా ఏరు ప్రవహిస్తున్న శబ్దం చెవులకు సోకుతోంది.
లోయలోకి దిగేసరికి అరగంట పట్టింది.
ఏడాదిన్నర క్రితం వెళ్ళినప్పుడు ఏటిలో నీరు ప్రవహించడం లేదు.
కొట్టుకొచ్చిన రాళ్ళ కింద ఎక్కడో ప్రవహిస్తూ, మార్కండేయ తీర్థంలో దుమికేది.
ఏటి మధ్యలో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ముందుకుసాగుతున్నాం.
పైనున్న గరుడ, గంధర్వ, పాల్గుణ తీర్థాల నంచి వస్తున్న నీరు ఈ ఏటి ద్వారా మార్కండేయ తీర్థం వైపు సాగుతోంది.
ఏటికి ఆవల బుడబుడ మంటూ శబ్దాలు.
దగ్గరకెళ్ళి చూస్తే ఎక్కడా పై నుంచి పడుతున్న ఆనవాళ్ళు లేవు.
భూమిలోంచే నీరు పైకి ఉబికి వస్తోంది.
ఇక్కడ తప్ప శేషాచలంలో ఎక్కడా ఈ వింత కనిపించదు.
రాళ్ళ పైనుంచి దాటుతూ, అక్కడక్కడా జారుతూ సాగుతున్నాం.
కొంత దూరం వెళ్ళే సరికి ఆ ఏరు మార్కండేయ తీర్థంలోకి జాలువారుతోంది.
ఆ నీటి గుండంలోకి దూకుదామని జర్కిన్లు తీసేస్తే చలిచంపేసింది.
ముందు డబ్బారేకుల కోనకెళ్ళి, తిరిగొచ్చేటప్పుడు మార్కండేయలో మునుగుదామనకున్నాం.

మార్కండేయ తీర్థం లో సంక్రాంతి రోజు భోగి మంట.

తొమ్మిదవుతున్నా లోయలో చలి వదలడం లేదు.
చలికి తట్టుకోలేక మంట వేసుకుని అల్పాహారం ముగించాం
సంక్రాంతి పండగరోజు ఇలా భోగి మంట వేసుకున్నాం!
మార్కండేయ తీర్థం ఉదృతంగా దుముకుతూ ముందుకు సాగుతోంది.
తెచ్చుకున్న మధ్యాహ్న భోజనం, కొంత సామాగ్రి అక్కడే వదిలేసి ఏరు వెళ్ళే వైపు బయలుదేరాం.
ఇరువైపులా కొండలు.
మధ్యలో లోతైన లోయ.
లోయ మధ్యలో ఏరు ప్రవహిస్తోంది.
ఆ రాతి నేల ఎన్ని ఒంపులు తిరిగిందో, ఏరు అన్ని ఒంపులూ తిరిగింది.
ఆ మెలికల్లో నాట్యం చేస్తోంది.
తన హృదయాన్ని మీటుతోంది.
రాళ్లమధ్య రాగాలు పలుకుతూ, గారాలు పోతోంది.
మనం వినాలే కానీ, ఆ శబ్దాల్లో ఏటికి ఎన్ని స్వరాలు! ఎన్ని రాగాలు!
ఆ సంగీతాన్ని విని అడవి అడవంతా తన్మయమైపోతోంది.
కొండలు, కోనలు పరవశించిపోతున్నాయి.
మేం ముందుకు సాగిపోతున్నాం.
జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం.
రాళ్ళ మధ్య పడుతూ లేస్తున్నాం.
ఏరు ఏటవాలుగా సాగుతోంది.
దానికి నదురు లేదు, బెదురు లేదు.
అంచులంచులుగా ఉన్న కొండలపైనుంచి కిందకు దుముకుతోంది.
కొండ పైనుంచి దుముకుతున్న జలపాతం పక్కకొచ్చాం.
కింద నీటి గుండం.
జలపాతం మధ్యలో కొచ్చి దాని పక్కనే నిలబడ్డాం.
అక్కడి నుంచి ఆ జలపాతంలోకి దూకాలనిపించింది.
కానీ ఆ దుస్సాహసం చేయలేదు.
పక్క నుంచే కిందకు దిగాం.

గుండం లోకి దుముకుతున్న జలపాతం

విశాలమైన గుండంలోకి జలపాతం దుముకుతోంది.
ఆ గుండంలోకి మేమూ దూకాం.
ఆ జలపాతం మాతో వాదులాడినట్టు ఈదులాడాం. కొండ అంచునే మళ్ళీ మా నడక.
ఏటి మద్యలో రాళ్ళ పైన, ఏటి పక్కన కొండ అంచున, ఎటు వీలైతే అటు నడుస్తున్నాం.
నిటారుగా ఉన్న కొండ ఎక్కడంలో బెత్తెడు అంచు కూడా దొరకడం లేదు.
ఒక్కొక్క దగ్గర పట్టు అస్సలు దొరకడం లేదు.
కొన్ని చెట్ల ఊడలు కొండ రాతిని పెనవేసుకున్నాయి.
ఆ ఊడలు పట్టుకుని కొండ ఎక్కుతున్నాం.
ఊడలు పట్టుకునే కొండ దిగుతున్నాం.
జారుతున్నాం, దొర్లుతున్నాం, ముందుకు సాగుతున్నాం.

ఊడలు పట్టుకుని కొండ దిగుతున్న వై నం.

మళ్ళీ జలపాతపు శబ్దం చెవులకు సోకింది.
అది కంటికి కనిపించడం లేదు.
కొండ అంచునే చెట్ల మధ్య సాగుతున్నాం.
కొండ దిగేసరికి పై నుంచి ఒక పెద్ద జలధార దుముకుతోంది.
దాని కింద విశాలమైన నీటి గుండం.
ఎంత లోతుందో!
అందులో మళ్ళీ మునకేశాం.
గుండంలో నీళ్ళు జిల్లుమంటున్నాయి.
ఉదయం పదకొండైనా చలి తగ్గలేదు.

నీటి గుండం లో పడుతున్న జల పాతం ముందు ట్రెక్కర్స్

హవన్ అంటే పవన్ అనుకున్నా. కానీ, వాడు మండే సూర్యుడు.
అతనొక పిల్ల సాహసికుడు.
నాల్గవ తరగతి చదువుతున్నా పెద్ద వాళ్ళతో పాటు నడుస్తున్నాడు, నీటి గుండాల్లో దూకుతున్నాడు.
తిరుపతి వాసే, కానీ హైదరాబాదులో నివాసం.
ఈ ట్రెక్కింగ్ కోసం తండ్రి తో తిరుపతి వచ్చాడు.
మేమంతా గుండంలో జలకాలాడుతున్నాం.

రెండు కొండల నడుమ ఉదృతం గా ప్రవహిస్తున్న ఈ ఏటి లో ఈదుకుంటూ ముందుకు సాగాలి

రెండు ఎత్తైన కొండల నడుమ సన్నని దారిలో ఏరు నిండుగా ప్రవహిస్తోంది.
ముందుకు వెళ్ళాలంటే దారిలేదు.
ఆ ఏటిలోంచి ఈదుకుంటూ వెళ్ళాల్సిందే.
‘దారి ఎలా ఉందో చూసొస్తాం’ అని మధు మరొకరితో కలిసి మందుకు సాగాడు.
‘దారి బాగుంటే గట్టిగా ఈల వేస్తాం, వచ్చేయండి’ అన్నారు.
గుండం నుంచి పారే ఏటిలో ఈదుకుంటూ వెళ్ళారు.
ఎంత సేపైనా రాలేదు.
ఈల వేయలేదు.
మాకు ఖంగారనిపించింది.
ఎట్టకేలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాళ్ళిద్దరూ పక్క నున్న కొండ పైనుంచి వేసిన ఈల వినిపించింది.
ఈత రాని ఇద్దరిని అక్కడే ఉండమన్నాం.
ఆ రెండు కొండల నడుమ నిండుగా ప్రవహిస్తున్న ఏటిలో ఈదుకుంటూ ముందుకు సాగాం.
ఏరు రొద చేస్తూ తన సొదలన్నీ వినిపిస్తోంది.
పాచిపట్టిన నేలలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఏటిని దాటుతున్నాం.
ఎదురుగా మొత్తం బండే; విశాలంగా ఉంది.
మెట్లు మెట్లుగా ఉన్న రాతి అంచుల నుంచి ఆ ఏరు కిందకు జాలువారుతోంది.
నేలంతా ఏటవాలుగా ఉంది.
దాన్ని దిగడం కష్టమే!
బూట్లు జారుతున్నాయి, మేజోళ్ళతో ఉన్నా జారుతోంది.
ఒట్టి కాళ్ళతో కిందకు దిగుతున్నాం అతి కష్టంపైన.
కొండ అంచునే చెట్ల కొమ్మలు పట్టుకుని దిగుతున్నాం.
ఎదురుగుండా ఎత్తైన రాతి కొండ.
ఎవరో చెక్కినట్లు, నౌరూప్య చిత్రాలు చిత్రించినట్టు వెడల్పుగా ఎర్రని రాతి కొండ.
దాని అంచుల్లో అనేక తేనె తుట్టెలు.
మెడ వెనక్కి వాలిస్తే తప్ప కొండ అంచులు కనపడవు.
ఆకాశాన్ని తాకుతున్నట్టు ఎత్తుగా విశాలంగా ఉంది.
ఏరు ప్రవహించే రాతి నేలకు, ఎదురుగా వచ్చిన ఎర్రని కొండకు మధ్య ఒక పెద్ద అగాధం.

ఏట వాలు గా ఉన్న రాతి బండ పై నుంచి దిగుతున్న వై నం.

తొంగి చూస్తే కళ్ళు తిరుగు తున్నాయి.
కొండ అంచులకెళితే, కాళ్ళు జివ్వున లాగు తున్నాయి.
ఈ ఏరు ఆ అగాధంలోకి దుముకుతూ రొదు చేస్తోంది.
లోతైన అగాధంలో పడి ఎడమ వైపునకు ఉదృతంగా ప్రవహిస్తోంది.
ఆ జలపాతానికి పై భాగంలో ఏటి కి ఎడమనుంచి కుడివైనకు దాటాం.
ఏ మాత్రం జారినా ఏటిలో కొట్టుకుపోయి, అగాధంలో పడితే!?
అంతే సంగతులు.
ఒకరి చేతులు ఒకరుపట్టుకుని ఆరుగురూ దాటాం.
కొండ అంచునే ఆ చివరికెళ్ళి
జలపాతకు సోయగాన్ని దూరం నుంచే తనివితీరా చూశాము.
ఈ జలపాతపు ఏరు ముందున్న దేవతీర్థంలోపడి, తిరుపతి సమీపంలో ఉన్న మల్లెమడుగులో సంగమిస్తుంది.
దేవతీర్థానికి ఇటు వెళ్ళడం సాధ్యం కాదు.
దానికి వేరే దారి ఉంది.
శేషాచలం కొండల్లోని తీర్థాలన్నిటికీ పౌరాణిక పేర్లు పెట్టారు.
అనేక జలపాతాలు, నీటి గుండాలు, ఏర్లు, సెల ఏర్లను తనలో నిలుపుకున్న అద్భతమైన ఈ కోనకు మాత్రం ‘డబ్బారేకుల కోన’ అని యునాదులు నామకరణం చేశారు.
ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు.
పేరులో ఏముంది!?
గిరిజనుల ఆత్మ సౌందర్యాన్ని అది ఆవిష్కరిస్తోంది.
మళ్ళీ వచ్చిన దారినే తిరుగు ప్రయాణమయ్యాం.
కొండ పైనుంచి అంచునే వచ్చాం.
రెండు కొండల నడుమ నిండుగా ప్రవహిస్తున్న ఏటి పక్కన కొండ పైకి వచ్చాం.
ఆ కొండ పైనుంచి దిగుతున్నాం.
రాతి కొండను అతుక్కున్న బలమైన చెట్ల ఊడలను పట్టుకుని దాదాపు ఇరవై అడుగుల లోతుకు దిగాం.

డ బ్బా రేకుల కోనకు వీడ్కోలు.

చూసిన జలపాతాలను, నీటిగుండాలను మళ్ళీ చూసుకంటూ వచ్చిన దారినే మార్కండేయ తీర్థానికి వచ్చేశాం.
మధ్యాహ్నం రెండు అయ్యింది.
ఎండ కాస్త చుర్రుమంటోంది.
కడుపులో ఆకలి నకనకలాడుతోంది.
నేను తెచ్చుకున్న పులిహోర పొట్లం కాస్తా కోతులు తినేశాయి.
నా పెరుగుపొట్లాలు చించు కుని తాగేశాయి.
ఇతరులు తెచ్చుకున్న పూరీలు, ఇడ్లీలు, పళ్ళు ముట్టుకోలేదు.
పులిహోర అంటే పాపం వాటికి ఎంత ఇష్టమో!
కోతులు నా పులిహోర తినేయడం ఇది మూడవ సారి.
అవి పులిహెూర వాసన పట్టేస్తున్నాయి.
ఈ తడవ పులిహెూర తెచ్చుకోకూడదనుకుంటాను. కోతుల ముందు ప్రతి సారీ ఇలా ఓడిపోతూనే ఉంటాను.
సర్దుకుని తినేసి మధ్యాహ్నం మూడుగంటలకు బయలుదేరాం. మళ్ళీ ఆ ఏటి పక్కనే నడక.
మళ్ళీ లోయలోంచి కొండ ఎక్కాం. వచ్చిన దారినే తిరుమలకు అక్కడినుంచి తిరుపతికి. డబ్బారేకుల కోన ఇలా గొప్ప అనుభూతిని మిగిల్చింది.

(ఆలూరు రాఘవశర్మ, జర్నలిస్ట్, రచయిత, ట్రెక్కర్)

One thought on “అబ్బా, ఇది ‘డబ్బారేకుల కోన’ (తిరుపతి జ్ఞాపకాలు-61)

  1. Excellent. You are great, the team exploring the beautiful nature and your expedition/adventure is really more great.
    Your presentation, compilation , pics/narration marvellous . We are very luckey at least to see in your presentation, it’s very inspire us. Sri Raghava Sharma sir we are very jealous on you about your interest, trekking, adventure in this age.
    We are wishing you and the team to enhance, enrich your capacities, health for your holistic well being.
    Your beloved
    Balakrishna Moorthy
    PASS. NGO. Family
    9848131901

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *