చిరకాల మిత్రుడు, సాహితీ ప్రేమికుడు, రాజకీయ చైతన్య శీలి, ప్రజోద్యమకారులకు ఆత్మీయ మిత్రుడు, చాలాకాలం HMT లో పనిచేసిన దేవినేని అశోక్ కుమార్( చిన్న, పెద్ద అందరి తో. బాబాయ్ అని పిలిపించుకుని, ఆప్యాయత కురిపించే దగ్గరివాడు) అమెరికాలో కొడుకును చూద్దామని వెళ్లి 15.01.23 న(భారత కాలమానం ప్రకారం 16.01.23 ఉదయం 10 గంటలకు) తీవ్రమైన గుండెపోటు తో మరణించారు.
ఈ విషాద వార్తను అందించటానికి మాట రావడం లేదు.
దేవినేని అశోక్ 8 అక్టోబర్1949 న క్రిష్ణాజిల్లా ముసునూరు గ్రామంలో జన్మించారు.
తండ్రి దేవినేని నాగభూషణం గారు తల్లి నాగరత్నం గారు.
నూజివీడులో బి.యస్.సి.పూర్తి చేసి ఉపాధి నిమిత్తం 1970 లలో హైదరాబాదు చేరుకున్న ఆయన ఆనాటి విప్లవ రాజకీయాలను ఒంట పట్టించుకున్నారు.కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంటేశ్వరరావు గారి నాయకత్వం లో రూపు దిద్దు కున్న విప్లవ పంథా కు అంకితమై పని చేశారు.తొలిగా నవోదయ సాహితీ సాంస్కృతిక.సంస్థ చర్చలలో, జీవనాడి పత్రిక ప్రచురణ లోనూ, ప్రచారం లోనూ సాంస్కృతిక కార్యకర్తగా దీక్షగా పనిచేశారు.
అదే సమయం లో HMT లో చేరి సరియైన కార్మికోద్యమ నిర్మాణానికి తోడ్పాటు నిచ్చారు. హైదరాబాదు లోని పబ్లిక్ రంగ కార్మిక ఉద్యమం లో బాధ్యతాయుత నాయకునిగా చురుకుగా పనిచేశారు.ఆ కాలం లో వచ్చిన అనేక కార్మిక వ్యతిరేక చట్టాలను, IR చట్టాలను, ఎదిరిస్తో జరిగిన కార్యక్రమాలలో పరిశ్రమల ముందు గేటు మీటింగులు నిర్వహించడం, తరువాత సింగరేణి కార్మికుల సమ్మెలకు మద్దతుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి పనిచేసి వచ్చే వారు.కార్మికులలోఒక విప్లవ రాజకీయ చైతన్యం కలిగేలా సూచనలు ఇచ్చేవారు.
ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణ ఉద్యమానికి హృదయ పూర్వకంగా,రాజకీయ చైతన్యంతో తన వంతు కృషి నందించారు. ఎప్పటికప్పుడు తన రాజకీయ అవగాహనకు పదును పెట్టుకుంటు,మంచి పుస్తకాలు చదువుతూ అన్యా యాలను, అక్రమాలను కచ్చితంగా వ్యతిరేకిస్తూ చివరంటా కమ్యునిస్టు నిబద్దత తో, విప్లవ గాఢానురక్తితో జీవించారు. చైనా తన లక్షణాలతో సాగిస్తున్న సోషలిస్టు నిర్మాణ పంథాను. నిశితంగా అధ్యయనం చేసి దా న్ని పూర్తిగా సమర్థించారు.
భారత చైనా మిత్రమండలి కార్య కలాపాలలో పాల్గొనే వారు. సభలు సదస్సులలో నిర్వహణపరంగా సహాయం చేసేవారు.కొద్దిసంవత్సరాల క్రితం చైనాను పర్యటించారు. నెల రోజుల పాటుఅప్పుడు వివిధ పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాక చాలా గ్రామ సీమలు సైతం పరిశీలించి ఆ వ్యవస్థను ఆకళింపు చేసుకున్నారు.అది ఎంతో ప్రజానుకూల వ్యవస్థ అని మిత్రులకు వివరించి చెప్పేవారు.
కామ్రేడ్స్ డి.వి,టి.ఎన్ సంస్మరణ సభలకు అనేకసార్లు అధ్యక్షత వహించి ఆ నాయకుల పట్ల తనకి గల ప్రత్యేక అభిమానాన్ని ,వారి సిద్ధాంతాల పట్లగల నిబద్ధతను చాటుకున్నారు. ఎన్నికలలో కూడా పార్టీ ప్రచార కార్యక్రమాలకు తోడ్పడే వారు.
తనదైన ప్రత్యేక వ్యంగ్య శైలిలో అతివాద, మితవాద, అవకాశవాద రాజకీయాలకు చురకలు వేస్తూ భారత కమ్యునిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (UCCRI.ML)ప్రతిపాదించిన విప్లవ పంథా కు కట్టుబడి , చివరివరకు తన శక్తి మేరకు మద్దతు నిచ్చారు.
క్రియాశీలంగా తన కృషిని కొనసాగిస్తూ ముఖ్యంగా విప్లవ వ్యతిరేకులు, పక్క దారి పట్టిన వారు విప్లవానికి చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టేవారు. సామాన్య ప్రజల మధ్య అకుంఠిత విప్లవ రాజకీయ ప్రచారం చేస్తూ ఆదర్శ ప్రాయంగా నిలిచిన అశోక్ ను కోల్పోవటం ప్రజా ఉద్యమాలకు బాధాకరమే కాదు,తీరని లోటు కూడా. ఆయన శ్రీమతి పద్మ, అశోక్ గారు నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు మద్దతు నివ్వటమేకాక తను కూడా స్వయంగా వాటిలో పాల్గొనే వారు. ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు
ఆ కామ్రేడ్ కు విప్లవ జోహార్లు పలుకుతూ ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నాము.
-డాక్టర్. జతిన్ కుమార్
ఉపాధ్యక్షుడు
-డి. విజయేందర్ రావు
ప్రధాన కార్యదర్శి
ప్రజాస్వామ్య హక్కుల పరి రక్షణ సంస్థ..తెలంగాణ.