-రాఘవ శర్మ
మళ్ళీ వనపర్తి కోటలోకి వచ్చేశాం.
ఆ మూడేళ్ళూ అది అందరాని చందమామే అయ్యింది!
దాని నుంచి అజ్ఞాత వాసం పూర్తి చేసుకున్నాను.
ఇప్పుడా చందమామ మళ్ళీ నా ముందిలా నిలిచింది.
లేదు లేదు, నేనే దాని ముందు కొచ్చి ఇలా నిలిచాను.
ప్యాలెస్ కు ఉత్తర దిక్కునే ఓ పురాతన ఇంట్లో చేరిపోయాం.
అది చాలా పెద్ద ఇల్లు.
ఆ ఇంటిని అయిదు పోర్షన్లు చేసి, ఐదు కుటుంబాలకు ఇచ్చారు.
అందులో మూడు కుటుంబాలకు కలిపి ఒకటే పెద్ద వరండా.
వరండా ముందు ద్వారపాలకుల్లా రెండు పెద్ద పెద్ద వేప చెట్లు.
ఒకప్పుడు ఆ భవనం రెవెన్యూ కార్యాలయమై ఉండవచ్చు.
ఇటుకలతో, గానుగ సున్నంతో నిర్మించారు.
నా తొలి జ్ఞాపకం మోటబావి అలానే ఉంది.
గతంలో ఆ బావి ముందు మేమున్న ఇంట్లోకి వి. వి. ఎస్ మూర్తి వచ్చారు.
మూర్తి మంచి చిత్రకారుడు, వ్యంగ్య చిత్రకారుడు.
ఆయన వేసే కార్టూన్లు ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చేవి.
బొమ్మలు వేయడంలో నాకు మెళకువలు నేర్పారు.
ఆ దిక్కున కోటగోడ కొంత కూలగొట్టినా, అప్పటికింకా కొంత మిగిలే ఉంది.
ఈశాన్యం నుంచి ఉత్తరం వైపునకు వరుసగా అనేక క్వార్టర్లు నిర్మిస్తున్నారు.
వాటిలోకి ఒకరొకరు వచ్చి చేరుతున్నారు.
వారిలో లెక్చరర్లు, విభాగాధిపతులు.
మా ఇంటికి దగ్గరలో, కోట గోడకు ఉత్తర దిక్కు ద్వారం అలానే ఉంది.
ఆ ద్వారానికి ఆనుకుని ఉన్న ఓ గదిలో గూర్ఖా.
తెల్లగా, పొట్టిగా , ఖాకీ యూనిఫాం వేసుకుని ఉండేవాడు.
ముఖంలో మంగోలాయిడ్ లక్షణాలు.
బెల్టుకు బారెడు కత్తి వేలాడేసుకుని తిరిగేవాడు.
ఈశాన్యదిక్కునున్న గూర్ఖాలాండ్ నుంచి వచ్చినట్టున్నాడు.
ఉద్యోగుల కుటుంబాలతో ప్యాలెస్ ఆవరణంతా చాలా సందడి సందడిగా తయారైంది.
అప్పుడే ఒక పిల్ల సైన్యం అక్కడ కళ్ళు తెరిచింది.
ముద్దు ముద్దు మాటలతో మురిపెంగా ఉంది.
అమ్మా నాన్నల చేతులు పట్టుకుని బుడిబుడి అడుగులతో నడక నేర్చుకుంటోంది.
ఆ అడుగులు ఎక్కడికి దారితీస్తాయో తెలియదు!
ఏ దూర తీరాలను తాకుతాయో తెలియదు!
ఏకాంతంగా ఉన్న ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు.
అప్పటికదే వారి ప్రపంచం.
ప్యాలెస్ ఆవరణంతా అలుముకున్న పచ్చదనం.
పెద్ద పెద్ద చెట్లు, మహావృక్షాలు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఎండిపోయిన పూల తీగలు మళ్ళీ చిగురించేవి.
నేలంతా ఎర్రని గడ్డిపూలు పరుచుకునేవి.
వాటి మధ్య ఎగిరే సీతాకోక చిలుకలు.
ఆ ఆవరణంతా సప్తవర్ణశోభితం.
శీతాకాలంలో కోట ఆవరణంతా మంచుతెరలు పరుచుకునేవి.
వెదురు పొదల నుంచి వీస్తున్న గాలులు వింత వింత శబ్దాలు చేస్తుంటాయి.
వెదుర్లు ఒకదాన్నొకటి రాచుకుంటున్న మూలుగులు.
అవి ఊసులాడుకుంటున్న ఆనవాళ్ళు.
అప్పుడప్పుడు విపరీతంగా వీస్తున్న గాలులకు పెద్ద పెద్ద చెట్లు తల విరబోసుకుని విరగబడి నవ్వుతున్నట్లుంటాయి.
రేగి చెట్లు, మర్రి వృక్షాలు.
చెట్ల పైన కాకులు, రకరకాల పక్షులు.
ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎక్కడికో పయనమవుతుంటాయి. మనం రోడ్లో అడ్డదిడ్డంగా వెళ్ళినట్టు కాదు.
ఒక పద్ధతి ప్రకారం, సైనిక విన్యాసంలాగా వెళుతుంటాయి.
వాటికెంత క్రమశిక్షణ!
వసంత కాలంలో కూసే కోకిలలు.
వాటితో పోటీపడే పిల్లల కంఠ స్వరా లు.
రెచ్చిపోయి మళ్ళీ వినిపిస్తున్న కోకిలల కుహూకాలు.
మా ఇంటికి పడమర దిక్కున కవల పిల్లల్లా రెండు పొడవాటి పొగడ చెట్లు.
అవి ఆకాశానికి ఎగబాకుతున్నట్టుంటాయి.
తెల్లారి లేస్తే చాలు, నేలంతా తెల్లటి పూలు పరుచుకునుంటాయి.
చెట్టుకింద నిలబడితే పూలతో మనల్ని అభిషేకిస్తుంటాయి.
అన్ని అందాలను ఎలా ఆస్వాదించామో!
ఇన్ని అందాలను ఎలా భరించామో !
వాటిని అనుభ వించడానికే పెట్టి పుట్టినట్టున్నాం!
గతాన్ని తలుచుకున్నప్పుడల్లా తన్మయులైపోతాం!
ఉబ్బితబ్బిబైపోతాం!
అసలు చీకుచింత లేకుండా, అవి తెలియకుండా, ఇంత సౌందర్యం మధ్య జీవించడం ఎంత అదృష్టం! ప్యాలె స్ చుట్టూ ఇదే వాతావరణం.
ఆ వనపర్తి కోటే మా లోకం.
కోట ప్రధాన ద్వారం చాలా ఎత్తుగా ఉంటుంది.
పై భాగంలో అర్ధచంద్రాకారపు అంచులు.
దానికి రెండు పెద్ద పెద్ద లావాటి కొయ్య తలుపులు.
ఆ కొయ్య తలుపులకు పెద్ద పెద్ద ఫిరంగి గుండ్ల వంటి లావాటి ఇనుప గుబ్బలు.
ఆ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
ఎప్పుడో తప్ప మూసేవారు కాదు.
ఒక తలుపునకు మధ్యలో చిన్న ద్వారం.
తలుపులు మూసినప్పుడు మాత్రం ఆ చిన్న ద్వారం నుంచి లోనికి వంగి వచ్చేవాళ్ళం.
ద్వారం పైన గదిలో సిక్కు వాచ్ మన్ నివాసం.
సైన్యంలో పనిచేసొచ్చినట్టున్నాడు.
తల పాగా, పెద్దపెద్ద మీసాలతో గంభీరంగా ఉండేవాడు.
ఎప్పుడూ ఖాకీ యూనిఫాంపైన, నడుముకు కత్తి వేలాడుతుండేది.
పిల్లల దగ్గర అప్పుడప్పుడూ మేజిక్ చేసేవాడు.
ఒక చేతితో ముఖాన్ని తడుముకోగానే, రెండు పళ్ళు మీసాల పైకి వచ్చికూర్చునేవి.
మళ్ళీ చేతితో తిప్పి వాటిని మాయం చేసేవాడు.
అవియధా స్థితికి వెళ్ళేవి.
ఆపళ్ళు ఎక్కడి నుంచి వచ్చేవో, ఎలా చేసేవాడో తొలుత తెలిసేది కాదు.
చాలా కాలానికి అర్థమైంది, ముందున్నవి రెండు కట్టుడు పళ్ళని, వాటితో పిల్లల దగ్గర తమాషా చేస్తుంటాడని.
అతని కొడుకు నా సహవిద్యార్థి.
కోట ప్రధాన ద్వారానికి దక్షిణ దిక్కున పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది.
ఆదివారం నాడు అధ్యాపకులకు, విద్యార్థులకు మధ్య గ్రౌండ్ లో క్రికెట్ పోటీ.
గ్రౌండ్ చుట్టూ విద్యార్థులంతా చేరి అరుపులు, కేకలు.
అదొక సరదా, అదొక సంబరం.
ఆరోజుల్లో క్రికెట్ కాంమెంట్రీ రేడియోల్లో వినేవాళ్ళం.
ఇక్కడ కూడా కామెంటరీ మొదలయ్యేది.
కామెంటరీ చెప్పడంలో శాస్త్రి సిద్ధహస్తుడు.
మధ్య మధ్యలో తెలుగులోనూ కామెంటరీ చెప్పేవాళ్ళు సరదాగా.
‘ కొట్టాడు కొట్టాడు కొట్టాడు.. బౌండ్రీ కొట్టాడు.. సిక్సర్ కొట్టాడు.. పరుగు తీశాడు.. హా… ఔటయ్యాడు.!’
ఇలా సాగేది ఆ కామెంటరీ.
తెలుగు కామెంటరీ చెప్పడమంతా కామెడీగా ఉండేది.
ప్రేక్షకుల్లోనేకాదు., క్రీడాకారుల్లోనూ నవ్వుల పువ్వులు విరిసేవి.
ఇంగ్లీషు కామెంటరీకి అలవాటు పడ్డ వాళ్ళకు తెలుగు కామెంటరీ అతికేది కాదు.
ఆరోజుల్లో జాతీయ,అంతర్జాతీయ క్రికెటర్లు పటౌడీ, ఇంజినీర్ పేర్లు బాగా వినిపించేవి. ఎవరైనా బాగా ఆడితే ఆ పేర్లతో కామెంట్ చేసేవాళ్ళు.
ఉత్తర భారతదేశంలో పటౌడీ ఒక సంస్థానాదీశుడు.
ప్రముఖ నటి షర్మిలా టాగూర్ను వివాహం చేసుకున్నాడు.
ఆమె రవీంద్రనాథ్ టాగూర్ మనవరాలు,
ఆ గ్రౌండ్ పక్కన ఇనుప పైపులతో వ్యాయామానికి నిర్మించిన బార్ ఉండేది.
మోటబావి పక్కనున్న పురాతన భవనంలో తొలిప్రిన్సిపాల్ హఫీదుల్లా నివాసం.
ఆయన ఒక ఏడాది మాత్రమే చేసినట్టున్నారు.
ప్యాలెస్ కు మేం తిరిగొచ్చేసరికి కనిపించలేదు.
గోరెమ్మ, సుభాని కూడా కనిపించ లేదు.
ప్రిన్సిపాల్ నివాసం కాస్తా ఉద్యోగుల కల్చరల్ క్లబ్ అయిపోయింది.
సాయంత్రమైతే సరదాగా అక్కడ పేకాట, ఛెస్.
దానిపక్కన ఒక విశాలమైన మర్రిచెట్టుండేది.
మా ఇంటి ముందున్న వేప చెట్లకు, ప్యాలెస్ కు మధ్య టెన్నిస్ కోర్టు.
ప్రధాన ద్వారానికి, మా ఇళ్లకు మధ్యలో వాలీబాల్, బ్యాస్కెట్ బాల్, బాల్ బాట్మింటన్ ఆడేవారు.
కోట ఆవరణంతా పెద్ద ప్లేగ్రౌండ్ లా తయారైంది.
సాయంత్రమైతే విద్యార్థులు, అధ్యాపకులూ క్రీడాకారులైపోయేవారు.
ప్రతి ఏడాది ఆటలపోటీలు జరిగేవి.
కబడ్డీ మొదలుకొని, అన్ని ఆటలకూ పోటీలే.
చివరికి రన్నింగ్ సహా, హైజెంప్, లాంగ్ జెంప్ కూడా!
ముత్యాలప్ప క్రీడలను పర్యవేక్షించేవారు.
అసలిది పాలిటెక్నిక్కా, పక్కా ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజా!?
ఒక పక్క ఆటలు, మరొక పక్క ఎన్ సీ సీ పెరేడ్.
ఆ డ్రిల్ చూస్తుంటే, అదొక సైనిక శిబిరంలా ఉండేది.
ఎన్ సీ సీ బాధ్యతలు కెప్టెన్ హెూదాలో పట్టాభిరామయ్య పర్యవేక్షించేవారు.
ప్యాలెస్ కు నైరుతి వైపు తోట ఉండేది.
ఆ తోటలో రకరకాల పళ్ళు, పూలు పండించేవారు.
ఇప్పుడున్న పాలెస్ 1885లో నిర్మించినప్పటికీ, కోట మాత్రం అంతకు ముందెప్పుడో కట్టింది.
దశల వారిగా కోట గోడను పగుల గొట్టారు.
పగలగొట్టిన కోట గోడ నుంచి పెద్ద పెద్ద కొండ రాళ్ళు బయటపడ్డాయి.
వాటితో ప్యాలెస్ వెనుక మూడు పెద్ద పెద్ద హాస్టళ్ళను నిర్మించారు.
నైరుతి దిక్కున ఉన్న గుర్రపు శాల కాస్తా వర్క్షాప్ అయ్యింది.
వర్క్షాప్ ప్యాలెస్కు మధ్య ఉన్న పాత భవనం కొత్త ప్రిన్సిపాల్ రామిరెడ్డికి నివాసమైంది. ప్రిన్సిపాల్ ఇంటి సమీపాన ఉన్న పాత ఇళ్లను కూడా ఉద్యోగుల క్వార్టర్స్ గా మార్చేశారు.
ప్యాలెస్ ముందు ముడికాళ్ళపైన కూర్చుని ఓ అనామకుడుండే వాడు.
పొట్టిగా, మాసి పోయిన తెల్లని పూనా పైజామా, మాసిపోయిన తెల్లని జుబ్బా (లాల్చీ).
తలకు సన్నని తెలుపు చారల ఎర్రని తలపాగా.
అంతా అతన్ని మైబల్లీ అని పిలిచేవారు.
మెహబూబ్ ఆలీ కాస్తా కోస్తా జిల్లా వాళ్ళ నోళ్ళలో పడి మైబల్లీ అయిపోయాడు.
ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మ్యూజియం ఉండేది.
దానిలో సంస్థానానికి చెందిన పురాతన వస్తు సామాగ్రిని దాచారు.
సింహాసనాలు, కిరీటాలు, కత్తులు, బాకులు, వెండి కర్రలు, అంబారీలు. అంతా వెలకట్టలేనివి.
ఎవరైనా చూడాలని అనుమతి తీసుకుంటే, ప్రిన్సిపాల్ వద్ద కెళ్ళి మైబల్లి తాళం చేతులు తీసుకొచ్చేవాడు.
ఆ గ్రౌండ్ ఫ్లోర్ కు కిటికీలు లేవు.
మైబల్లి తలుపులన్నీ వేసేవాడు. లోపలంతా చీకటి.
పసుపు రంగు కాంతి వెదజల్లే ఒకప్పటి బల్బులు ఆన్ చేసేవాడు. అంతవరకు ఆ మ్యూజియం అలా చీకట్లో మూలుగుతుండేది.
వెలకట్ట లేని ఆ రాజరిక సంపదకు మైబల్లి కాపలా కాసే నమ్మిన బంటు.
మైబల్లిపైన ఎంత నమ్మకముంటే ఆ తాళం చేతులు ఆ బికారికి ఇస్తారు!?
ప్యాలెస్ మొత్తాన్ని కంటికి రెప్పలా కాపలా కాసేవాడు.
రాజా రామేశ్వరరావు వచ్చినప్పుడు మొదటి అంతస్తులో కుడి వైపున ఆయననివాసం.
ఎవరినీ ఆ వైపునకు మైబల్లీ వెళ్ళనిచ్చేవాడు కాదు.
రామేశ్వరావుకు తానే వంట చేసి పెట్టేవాడు.
అన్నీ తానై చూసేవాడు.
ప్యాలెస్ ప్రభుత్వ పరమయ్యే వరకు ఆ మ్యూజియం అక్కడే ఉంది.
మ్యూజియం 1970 తరువాత హైదరాబాదుకు తరలిపోయింది.
ఆ తరువాతే ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ ఏర్పాటు చేశారు.
ఫ్యూడల్ బాహువుల్లో దశాబ్దాలపాటు బందీ అయిన ప్యాలెస్ కు మహర్ధశ వచ్చింది.
పుష్కరకాలం పూర్తిగా పాడుపడ్డ కోటలో మళ్ళీ చలనం మొదలైంది.
నీటిలో చేపల్లాగా, కోటంతా మనుషుల కదలికలు.
ప్యాలెస్ కు పునరుజ్జీవనం వచ్చింది.
అది సాంకేతిక విజ్ఞాన వీచికలను వెదజల్లుతోంది.
స్వాతంత్ర్యానంతరం ఇప్పుడు స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటోంది.
సోదర ప్రియత్వాన్ని పంచుతోంది.
పాలిటెక్నిక్ అనేది అంత:పుర కాంతి.
కుల,మత, ప్రాంతీయ భాషా బేధాలు లేకుండా, వర్గ, జాతి వైషమ్యాలకు అతీతంగా తన బాహువులను చాచి ఆహ్వానిస్తోంది.
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, రచయిత, ట్రెక్కర్)
ఆ నాటి ప్రకృతి ఇప్పటికీ గుర్తు వుండటం ఆశ్చర్యకరం.
కేవలం గుర్తు మీద ఇన్ని కబుర్లు చెబుతున్నారంతే ఆజీవితాన్ని ఎంతగా ఆస్వాదించారు…తెలుస్తుంది.ఆ రోజుల్లో స్టూడెంట్స్ కి డైరీ రాసే అలవాటు ఉండేది..మీరు కూడా ఏమైనా maintain చేశారా అనుకోవటానికి.అప్పటి మీవయసు చాలా.చిన్నది.
ఏమైనా.ఆజేవితాన్ని తిరిగి జీవిస్తూ మకో చూపిస్తున్నారు.ఈ ప్రజ్ఞకు శతధా వందనం .
మిత్రమా…
నేను 1977 – 80 మధ్యకాలంలో అక్కడ మెకానికల్ డిప్లమా చదివాను. మీ సమీక్షతో మళ్లీ ఆ పాతకాలం రోజుల్లోకి తీసుకెళ్లారు .నిజంగానే ఆ ప్యాలెస్ పరిసరాల్లో మా A- హాస్టల్ రూమ్ నెంబర్ 5 లో ఉన్నట్టుగానే మీ కథనం మాకు పోయిన జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చాయి. చాలా చక్కటి పద ప్రయోగంతో మళ్లీ పాత రోజుల్లోకి తీసుకువెళ్లినందుకు మీకు వేల వందనాలు 🙏
కె. కిషన్ [M77-80],
చర్లపల్లి, హైదరాబాద్