ఆయన శేషాచలం కొండల సామ్రాట్టు
-రాఘవ శర్మ
ఈరోజు లేవగానే ఒక దుర్వార్త.
శేషాచలం కొండల సామ్రాట్టు, ట్రెక్కింగ్ సుబ్బరాయు డు నిన్న రాత్రి నిద్రలోనే కన్ను మూశాడు.
ప్రతి ట్రెక్కరుకు ఇది అత్యంత విషాదకరమైన వార్త.
సుబ్బరాయుడికి 60 ఏళ్ళుంటాయి.
శేషాచలం కొండల్లో అణువణువూ తెలిసిన వారు మన కాలంలో ఇద్దరే ఇద్దరు.
ఒకరు చిరుత పులి ఈశ్వరయ్య, మరొకరు సుబ్బరాయుడు.
ఈశ్వరయ్య మృతి చెంది చాలాకాలమైంది.
చివరి వ్యక్తి సుబ్బరాయుడు.
సుబ్బరాయుడితో కలిసి అనేక సార్లు ట్రెక్కింగ్‌కు వెళ్ళాను.
చిట్ట చివరి సారిగా గత ఏడాది ఫబ్రవరి 26వ తేదీన తలకోన కొండెక్కాం.
శ్రీరాం బృందం ఈ ట్రెక్కింగ్ ఏర్పాటు చేసింది.
మాతో సుబ్బరాయుడూ వచ్చాడు.
కుడి వైపు నుంచి తల కోన కొండెక్కాం.
తల కోన జలపాతం పడే పై భాగం నుంచి దాని అందాలను వీక్షించాం.
అక్కడే ఉన్న మానస తీర్థంలో మునకలేశాం.
ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ఆ అడవిలో మారాకతో ఒక పెద్ద సందడి.
రాత్రి వంటలు,భోజనాలు ముగిశాయి.
చలి చంపేస్తోంది.
ఎముకలు కొరికేస్తోంది.
సుబ్బరాయుడుచలి మంట వేశాడు.
చలి మంట చుట్టూ చేరిన మాకు సుబ్బరాయుడు వేటకతలు చెప్పడం మొదలు పెట్టాడు.
సుబ్బరాయుడి జీవితం అడవితో పెనవేసుకుపోయింది.
బాల్యంఅలవడిన వేటను కొన్నేళ్ళ క్రితం వదిలేశాడు.
సుబ్బరాయుడు ఒక మాటల మూట.
ఆ మూట విప్పాడు.
తన అటవీ అనుభవాలన్నిటినీ చెపుతున్నాడు.
అడవి కుక్కలు ఎలా వేటాడతాయి?
ఒంటరిగా దొరికిన చిరుతపులిని అడవికుక్కలు ఎలా చంపేస్తాయి?
ఎలుగు బంటు ఎలా దాడి చేస్తుంది?
వేట కుక్కల నుంచి అడవి పిల్లులు ఎలా తప్పించుకుంటాయి?
అడవిలో ఏ జంతువు మనుగడ ఎలా సాగుతుంది?
ఆ రోజు రాత్రి చలిమంట చుట్టూ చేరి సుబ్బరాయుడు వేట కథలు వింటుంటే నిద్ర పట్టనే లేదు.
కొందరు నిద్రలోకి జారుకుంటున్నారు.
ఓ అర్ధరాత్రి నేను కూడా నిద్రలోకి జారుకున్నాను.
సుబ్బరాయుడు తెల్లారే వరకు వేట కథలు చెపుతూనే ఉన్నాడు.
అడవికి సంబంధించిన ఎంత జ్ఞానం!
ఎంత ఓపిక!
నా ‘తిరుమల దృశ్య కావ్యం’ లో అతని ఫొటో వేసి రాశాను.
సుబ్బరాయుడి బోళా శంకరుడు.
అతనికి అడవే జీవితం.
అడవే ప్రాణం.
అలాంటి సుబ్బరాయుడు ఇక లేడంటే ఎంత బాధ!
అతని కోసం ఏమివ్వ గలుగుతాం?
రెండు కన్నీటి బొట్లు వదలడం తప్ప!
Photo caption:ఫోటో: తల కోన కొండ పైన చలి మంట ముందు కూర్చుని రాత్రి అంతా వేట కథలు చెబుతున్న సుబ్బరాయుడు( ఎడమ నుంచి మొదటి వ్యక్తి)