-నగేష్
తిరుపతి నగరంతో నాకు 22 సంవత్సరాల అనుబంధం ఉంది. 2001 లో ఉద్యోగ రీత్యా హైదరాబాద్ నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గరకు వచ్చిన నేను తిరుపతి వాసిగా స్థిరపడ్డాను. నా ఉద్యోగ, కుటుంబ అభివృద్ధి తిరుపతి తోనే ముడివేసుకు పోయింది. ఉద్యోగ రీత్యా రెండు, మూడు సార్లు సొంత జిల్లా కడపకు వెళ్ళే అవకాశం వచ్చినా వద్దు అని నిరాకరించేంత అనుబంధం తిరుపతితో ఏర్పడింది.
ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుని ఉద్యోగ రీత్యా వచ్చిన మంచి అవకాశాలను కూడా కాదనుకుని స్వామివారి పాదాల చెంత ఉద్యోగం చేసుకునే భాగ్యం దక్కించుకున్నాను. తిరుపతి నగరం దిన దినాభివృద్ధి చెందాలి. ఇక్కడి ప్రజల జీవన పరిస్థితులు బాగా అభివృద్ధి కావాలి.విద్య, వైద్యం, ఉపాధికి సంబంధించిన అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి రావాలి. తిరుపతి నగరం మహా నగరమై అంతకంతకు అభివృద్ధి చెందాలని కోరుకునే లక్షలాది మందిలో నేను కూడా ముందు వరుసలో ఉంటాను.
ఈ రకమైన అభివృద్ధి సాధించాలంటే ముందుగా ప్రజా రవాణాకు సంబంధించిన అద్భుతమైన రోడ్లు ఉండాలి. ప్రజలు ట్రాఫిక్ కష్టాలు పడుతూ ఒక మూల నుంచి మరో మూలకు పోవాలంటే గంటలబ తరబడి ప్రయాణం చేసి విసుగు చెందే ఇబ్బంది తొలగించడానికి వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో విశాలమైన కనెక్టివిటీ రోడ్లు ఉండాలి. ఒక ప్రణాళిక ప్రకారం మాస్టర్ ప్లాన్ తో ఈ రోడ్లు నిర్మించడం ముఖ్యమైన అంశం. తిరుపతి నగరంలో ఇలాంటి రోడ్లు వేసే అవకాశం ఎక్కడుంది అనుకునే వాడిని. కరకం బాడి రోడ్డులోని గెస్ట్ లైన్ హోటల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్, హీరో హోండా షో రూం, బ్లిస్స్ ప్రాంతాలకు టూ వీలర్, కారు లో వెళ్లాలంటే ట్రాఫిక్ లో ఇబ్బందులు పడి విసుగు వచ్చేది. గత 5 సంవత్సరాలుగా నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో ట్రాఫిక్ కష్టాలు చెప్పడానికి వీలు కాని విధంగా తయారయ్యాయి.
మాస్టర్ ప్లాన్ రోడ్ల తో ట్రాఫిక్ కష్టాలకు చెక్
గత మూడేళ్ళుగా తిరుపతి నగరంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి తిరుపతి వాసులకే కాకుండా స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చే యాత్రికుల ఇబ్బందులు కూడా తొలగిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల నేను, నా స్నేహితుడు వెంకీ టూ వీలర్ లో గ్రాండ్ వరల్డ్ రోడ్డు నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ కు వెళ్లాల్సి వచ్చింది. గెస్ట్ లైన్ హోటల్ పక్కనుంచి కొత్తగా వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్డులో వెళ్ళి చూద్దామనుకున్నాం. నిజంగా ఆశ్చర్యం వేసింది. కరెక్టుగా 5 నిముషాల్లో శ్రీనివాసం కాంప్లెక్స్ ముందు ఉన్నాం. మాస్టర్ ప్లాన్ రోడ్ల వల్ల ఎంత ఉపయోగమో ప్రాక్టికల్ గా అప్పుడు అర్థం అయ్యింది నాకు. తిరుపతి నగర సమగ్రాభివృద్ధికి దోహదపడే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం ఆలోచన, ఆచరణలో తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్.
భూమన అభినయ్ ప్రత్యేక కృషిని రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిందే. మురికివాడను తలపించేలా చిన్న చిన్న సందులు గొందులుగా ఉన్న కొర్లగుంట రోడ్డును విస్తరించి ప్రజలకు సువిశాలమైన రోడ్డు అందించే పనికి శ్రీకారం చుట్టడం కూడా భవిష్యత్తు అభివృద్ధిపై వీరికున్న ముందు చూపు తెలియజేస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. అలాగే అంకుర ఆసుపత్రి పక్కగా నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు గురించి అక్కడి నివాసితులు కలలో కూడా ఊహించి ఉండరు. ఇలా మొత్తం 14 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో తిరుపతి నలుదిశలను సులువుగా కలపగలిగే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉండటం ఆనందం కలిగించే అంశం. ఈ రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారానే సొంతంగా నిధులు సమీకరించే ఆలోచన చేసి దాన్ని అమలు లోకి తేవడానికి డిప్యూటీ మేయర్
అభినయ్ ఎంత కష్టపడ్డారో కూడా అధికారుల ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన అతనికి అభివృద్ధి పై ఉన్న విజన్ చూసి ‘హి ఈజ్ డిఫరెంట్ లీడర్’ అనిపించింది.
ఒక నగరం అభివృద్ధిని అక్కడి రోడ్లే చూపుతాయని పెద్దలు చెబుతారు. తిరుపతి నగర వాసులు, శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం రోజు తిరుపతికి వచ్చే దాదాపు లక్ష మంది యాత్రికుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు తిరుపతి నగర అభివృద్ధికి బాటలు వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని ఎవరు ఎలా అన్వయించుకున్నా, ఎవరు ఏ భాష్యం చెప్పినా సమీప భవిష్యత్తులో ప్రజలకు కలిగే అభివృద్ధి ప్రయోజనాలు వాస్తవాలను జనం కళ్ళకు చూపిస్తాయి.
(ఇది రచయిత వ్యక్తిగత అనుభవం, అభిప్రాయం)
నగేష్, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి.