‘అన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టాలి’

    ప్రభుత్వానికి సమాజ్ వాదీ పార్టీ నేతల విజ్ఞప్తి

పాఠశాల విద్యా వ్యవస్థ సమస్యల పరిష్కారానికి, విద్యా అభివృద్ధి కోసం బడ్జెట్, పాలనా పరమైన చర్యలను చేపట్టాలని సమాజ్ వాదీ పార్టీ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు విద్యా, ఆర్థికశాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు.

సమాజ్ వాదీ పార్టీ 2022లో నిర్వహించిన తెలంగాణ విద్యా యాత్రలో భాగంగా ప్రత్యక్షంగా చూసిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి అన్నారు.

మొదటగా తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చాలని, ప్రతి పాఠశాలలో 10 గదుల (నర్సరీ నుంచి 5వ తరగతి వరకు 8 గదులు, ఒక కార్యాలయం, ఒక లాంగ్వేజ్ గది) ఏర్పాటుతోపాటు 8 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు ఆయాలు, ఒక స్కావెంజర్, ఒక అటెండర్లను నియమించాలని కోరినట్లు తెలిపారు.

రాష్ట్రంలో గత 8 ఏళ్లుగా పాఠశాలల్లో శాశ్వత స్థాయి విద్యాధికారులు లేక పర్యవేక్షణ పూర్తిగా కుంటుపడిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యా పర్యవేక్షణ అధికారుల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన 70:30 ప్రాతిపదికన ప్రమోషన్, డైరెక్టు భర్తీ నియామకాలు చేపట్టి, 578 మండలాలకు MEO అధికారులను, ఉపాధ్యాయుల పోస్టులను పూర్తిగా భర్తీ చేయాలన్నారు. అలాగే 33 జిల్లాలలో DEO పోస్టులను కూడ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని ఉపాద్యాయులకు ప్రమోషన్లు కల్పించి, మిగిలిన ఖాలీలను వెంటనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు వెంటనే చేపట్టాలని అన్నారు. అదేవిధంగ గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూరిబా బాలికల పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని, ప్రతి పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు శాశ్వత ప్రాతిపదికన కంప్యూటర్ పాఠాలను బోధించే ఇన్స్ట్రక్టర్ ను నియమించాలన్నారు.

దాదాపు 22 వేలకు పైగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత గత 8 ఏళ్లలో ఏర్పాటు చేసిన 950 గురుకుల పాఠశాలల్లో సుమారు 70% పాఠశాలలు ప్రైవేటు భవనాలలో చాలీచాలని వసతులతో నడుస్తున్నాయని, గురుకుల పాఠశాలలన్నింటికీ పక్క భవనాలను యుద్ధ ప్రతిపాదికన నిర్మించాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాలలోని పేద కుటుంబాల నుంచి వచ్చి, ప్రభుత్వ హాస్టళ్లలో (ఎస్సీ, ఎస్ టి, బీసీ, మైనార్టీ) 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు
చదువుకుంటున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు రూ. 950 మాత్రమే మెస్ చార్జీలు చెల్లిస్తున్నారని అన్నారు.

పెరిగిన ధరల కారణంగా ఈ డబ్బులతో పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారని, ఫలితంగా గ్రామీణ పేద విద్యార్థులు చదువు కొనసాగించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు రూ. 950 నుంచి రూ. 2500 వరకు మెస్ చార్జీలు పెంచాలని, అలాగే 8, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ. 1100 మాత్రమే ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ డబ్బులతో ఎదిగే పిల్లలకు కడుపునిండా రుచికరమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించటం సాధ్యం కావడం లేదని వాపోయారు.

ఈ విద్యార్థులకు మెస్ చార్జీలను రూ. 1100 నుంచి రూ. 3000 వరకు పెంచడంతోపాటు విద్యార్థులకు సబ్బులు, హెయిర్ కటింగ్ మొదలైన ఖర్చులకు నెలకు కనీసం రూ. 200 ఇవ్వాలని కొరసరు. ఆడపిల్లకు సానిటరీ నాప్కిన్స్, హెయిర్ ఆయిల్, ఇతర అవసరాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభలోనే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంతోపాటు టై, బెల్ట్ మరియు షూసులను అందించాలన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి పదవ తరగతి తర్వాత కళాశాల విద్యను అభ్యసించడానికి పేద విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లల్లో (ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ) చేరుతున్నారు. వీరికి ప్రభుత్వం కేవలం నెలకు రూ. 1500 మాత్రమే మెస్ చార్జీలు ఇస్తోందని, ఎదిగిన పిల్లలు, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను రూ.1500 నుంచి రూ. 3,500 వరకు పెంచాలని డిమాండ్ చేశారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారని, కానీ సరైన పోషక ఆహారం అందక విద్యార్థులు వయసుకు తగిన బరువు, ఎదుగుదల లేక రక్తహీనతతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన వ్యవస్థను సమూలంగా మార్చి, విద్యార్థులకు మంజూరు చేస్తున్న బోజన రేట్లను తక్షణమే పెంచాలని కోరారు. మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరగటం వల్ల ప్రస్తుతం ఉన్న రేట్లతో వంట చేసేవారు సరైన భోజనం అందించలేకపోతున్నారని అన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 4.97 పైసలను 9 రూపాయలకు, 6, 7, 8 తరగతులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 7. 45 పైసలను 15 రూపాయలకు, 9 10 తరగతులకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 9.45 పైసలను 20 రూపాయలకు పెంచాలని విజ్ఞత్తి చేశారు. వంటచేసే వారికి ప్రస్తుతం ఇస్తున్న నెల వేతనాన్ని రూ. 1000 నుంచి రూ. 5000లకు పెంచాలని, విద్యార్థుల మెస్ చార్జీల బకాయిలు లేకుండా ప్రతినెల తప్పనిసరిగా 30 తారీకు నాడే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 100 గ్రాముల రైస్, 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 150 గ్రాముల రైస్ ఇస్తున్నారని, దీన్ని 100 గ్రాములు నుంచి 200 గ్రాములు, 150 గ్రాముల నుంచి 300 గ్రాములకు పెంచాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 30 శాతం నిధులు విద్యకు కేటాయిస్తూ, తమిళనాడు ప్రభుత్వ మాదిరి విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను అందించడంతో పాటు జూనియర్ కాలేజిల్లో విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం అమలు పరచాలని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేక బస్సులతో రవాణా సౌకర్యం కల్పించాలని, ప్రతి పాఠశాలలో శాశ్వత ప్రతిప్రాదికన మంచి నీటి వసతిని కల్పించాలని, ప్రతి మండల కేంద్రంలో 6వ తరగతి నుండి డిగ్రీ వరకు అన్ని వసతులతో కూడిన డిజిటలైజుడ్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1200ల మందికిపైగా ఉద్యమకారుల చరిత్ర మరుగున పడకుండా ఉండటంతోపాటు స్థానిక చరిత్రతో విద్యార్థులు స్ఫూర్తి పొందే విధంగా గ్రామీణ, మండల, పట్టణ ప్రభుత్వ విద్యా సంస్థలకు వారి పేర్లు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ప్రజల ఆకాంక్షలను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి, విద్యా అభివృద్ధి కోసం బడ్జెట్, పాలనా పరమైన చర్యలను చేపట్టాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎస్.సింహాద్రి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *