కుంగిన అలగనూరు రిజర్వాయర్ ను తక్షణమే పునరుద్దరణ చేసి వచ్చే ఖరీఫ్ కు రిజర్వాయర్ కింద వున్న ఆయకట్టుకు నీరందించాలని కోరుతూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి వ్రాసిన లేఖను నంద్యాల కె.సి.కెనాల్ E.E. తిరుమలేశ్వరరెడ్డి గారికి అందచేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి.
లేఖ పూర్తి పాఠం…
శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు
గౌరవ ముఖ్య మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
అయ్యా,
విషయం : అలగనూరు రిజర్వాయర్ పునరుద్దరణ తక్షణమే చేపట్టడం
రాయలసీమలో అత్యంత పురాతనమైన సాగునీటి కాలువ కెసి కెనాల్. ఈ కాలువ 1863 – 70 కాలంలో నిర్మించబడింది. ప్రపంచ వారసత్వ సాగునీటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. కెసి కాలువకు బచావత్ ట్రిబ్యునల్ చట్టప్రకారం 39.9 టి.ఎం..సి. ల నీటిని కేటాయించింది. ఈ కాలువ ద్వారా కర్నూలు కడప జిల్లాలో సుమారు 2.77 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది.
కెసి కెనాల్ కు కేటాయించిన నీటిలో కేవలం 1.1 టి ఎం సి ని నిలువచేసుకునే సామర్థ్యం మాత్రమే సుంకేశుల ఆనకట్టకు ఉంది. దీనితో కర్నూలు కడప జిల్లా ఆయకట్టు చివరి భూములకు నీటిని అందడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ఇబ్బందులును తొలగించడానికి తుంగభద్ర నదిలో వరద కాలంలో ప్రవహించే నీటిని నిలువ చేసుకొనడానికి అలగనూరు వద్ద 2.965 టి ఎం సి ల సామర్థ్యం తో రిజర్వార్ నిర్మాణానికి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు గారు జి వో నెం. 327 తేది 25.11.1985 ద్వారా అనుమతులు ఇచ్చారు. 2005 వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేసారు.
నిర్మాణం పూర్తి అయ్యి కెసి ఆయకట్టుకు, కుందూ పరివాహక ప్రాంతానికి నీరందించడం మొదలు పెట్టిన పుస్కర కాలానికి (12 ఏళ్ళకు) రిజర్వాయర్ లో నీరు నిలువ ఉంచడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. 2017 వ సంవత్సరంలో (ఐదు సంవత్సరాల క్రిందట) మొదలైన ఇబ్బందుల పరంపర కొనసాగి, గత రెండేళ్ళలో చుక్క నీటిని కూడా నిలబెట్టలేని పరిస్థితి కి దిగజారింది. దీనితో తుంగభద్ర నది నుండి వందలాది టి ఎం సి ల నీరు శ్రీశైలం రిజర్వాయర్ చేరి సముద్రం పాలౌతున్న ఒక్క చుక్క నీటిని కూడా అలగనూరు లో నిలబెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
అలగనూరు రిజర్వాయర్ వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించడానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రైతుల బృందం నవంబర్ 29, 2022 న రిజర్వాయర్ ను సందర్శించింది.
ఈ సందర్శనలో రిజర్వాయర్ దగ్గర ఉన్న పరిస్థితులు రైతుల బృందానికి దిగ్బ్రాంతికి గురిచేసాయి. అలగనూరు రిజర్వాయర్ లో నీళ్ళు లేకపోవడం వలన పశువులకు ఆవాసంగా మారింది . కొందరు రైతులు పంటల సాగు కూడా చేస్తున్నారు. కేసి కెనాల్ స్థిరీకరణకు కీలకమైన ఈ రిజర్వాయర్ ఈ దుస్థితికి చేరడం, పునరుద్ధరణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం రాయలసీమ పట్ల పాలకుల వివక్షకు పరాకాష్టగా రాయలసీమ సమాజం భావిస్తున్నది.
మీరు దృష్టి కేంద్రీకరించి అలగనూరు రిజర్వాయర్ పునరుద్ధరణపై వచ్చే వర్షాకాలానికి పూర్తి చెయ్యాలని విజ్ణప్తి చేస్తున్నాము.
ధన్యవాదాలు
బొజ్జా దశరథరామిరెడ్డి,
అధ్యక్షులు,
రాయలసీమ సాగునీటి సాధన సమితి.
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు M.మహేశ్వరరెడ్డి, M.V.రమణారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.