చార్మినార్ సందర్శన, చరిత్ర చుట్టూరా ఒక ప్రదక్షిణ

 

(భూమన్)

జయహో చార్మినార్

ఎన్ని మార్లు హైదరాబాద్ వచ్చినా చార్మినార్ ప్రాంతం ఆకర్షణ ఎంత మాత్రమూ తరగడం లేదు. 70వ దశకంలో నా విద్యార్థి దశలో జ్వాలాముఖిని కలుసుకునేందుకు ఓల్డ్ సిటీ కాలేజీకి వచ్చేది.

జ్వాలా ఆ ప్రాంతంలో ఒకచోట ఒక తిండి ,మరొక చోట మరొక తిండి ఇరానీ చాయ్, రాం ప్యారి పాన్ రుచులన్నిటిని నేర్పించింది ఇక్కడే. పూరి లోని తీపులు తినడం నేర్పించింది ఇక్కడే. ఏం మనిషి అతను. ఎంతటి స్నేహశీలి. వయసు తేడా లేకుండా హైదరాబాదును సన్నిహితంగా పరిచయం చేసిన మహానుభావుడు జ్వాలా. “చాదర్ఘాట్ ” నయాగరా బిర్యాని, మదీనా పాయ , నాంపల్లి లతా థియేటర్లో పాకీజా సినిమాను పరిచయం చేసింది జ్వాలానే. అబిడ్స్ లోనే రాత్రంతా ఆపి గల్లీ గల్లీ తిప్పి చరిత్రనంతా విప్పి చెబుతుండేవాడు . బషీర్ బాగ్ బ్లూ డైమండ్ లో మంచి తిండి తినిపించి హైదరాబాదును నా అక్కున చేర్చిన ప్రియ బంధవుడు జ్వాలా. అంతేనా స్నేహ పరిమళాలను వెదజల్లిన వాడు.

అదిగో అప్పటినుండి హైదరాబాద్ అంటే నాకు ఓల్డ్ సిటీ , చార్మినార్. ఎన్ని పదుల సార్లు ఆ చుట్టూ తిరిగి ఉంటానో ? అయినా పాత బడలేదు. అట్లాంటి అయస్కాంతపు ఆకర్షణ . మేం అత్యవసర పరిస్థితి రోజుల్లో ముషీరాబాద్ జైల్లో ఉండగా ఉస్మానియా హాస్పిటల్ , గాంధీ హాస్పిటల్ , మెంటల్, చెస్ట్ ఆసుపత్రుల , వాటి వైభోగం చూసి ఆశ్చర్యపోయేవాణ్ణి . సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆకృతి , నాంపల్లి స్టేషన్ అందం, ఆల్ఫా చాయ్ అప్పటినుండి ఆకట్టుకుంటూనే ఉన్నాయి.

చార్మినార్ను కనులారా చూడడం, పరవశించడం ఒక గొప్ప అనుభూతి. మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో ప్లేగు వ్యాధిని నిర్వాహ నివారణకు గుర్తుగా నిర్మించిన ఈ చార్మినార్ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక ఐకాన్ .

చార్మినార్ పైన మసీదుని చూడడం అక్కడ నుండి చూసినంత దూరం నగరపు మిరుమిట్లు నొక అద్భుతం.
పక్కనే ఉన్న మక్కా మసీదు, యునానీ ఆసుపత్రి, 1592 లో కట్టబడిన చార్మినార్ కమాన్, కాలీ కమాన్ , మచిలీ కమాన్, షేర్ ఏ బాతుల్ కమాన్లు చూపరులను అబ్బురపరుస్తాయి .

 

 

చార్మినార్ కు ఉత్తర వీధుల్లో ఉన్న లాడ్ బజార్లో అర గంట తిరగడమే ఒక జీవిత సాఫల్యం, రకరకాల మనుషులు, గాజుల గలగలలు రకరకాల రంగుల మైయం అది.
చార్మినార్ చుట్టూ ఉండే మార్కెట్ ఒక అద్భుత ప్రపంచం. దొరకని వస్తువంటూ, రుచికందని తిండి అంటూ లేదు.

ముత్యాల మధ్య పగడాల అంచున అత్తర్ల మైకం లో అనుభవించాల్సిందే ఆ బజారు జీవితాన్ని. దారి పొడవునా పూల అమ్మకం దార్లు, ఆవాసనలు, చిత్ర విచిత్రపు పాదరక్షలు, షేర్వానీలు గౌన్లు , అల్లికలు , తోపుడు బండ్లు, హెన్నా, గంధపు చెక్కలు, ఖర్జూరాలు అహో చెప్పుకోవాలి కానీ అందుకోవాలనిపించే అందాలవి.
విజయనగర కొలువునాటి బజార్లకు పోటీగా నా అన్నట్టుంటుంది.

చార్మినార్ కింద దేవాలయం…

చార్మినార్ కింద ప్రస్తుతం ఉన్న దేవాలయం 1957 వరకు లేదు “ద హిందూ ” వివరంగా చెప్పింది. మత సామ రహస్యానికి ఏడోకా లేకుండా ఈ చార్మినార్ విరాజిల్లాలి. చార్మినార్ పై భాగంలో ఉన్న నాలుగు వైపులా నాలుగు గడియారాలు 1889లో లండన్ నుండి ఆలీ ఖాన్ తెప్పించినాడు .

ఆ రోజుల్లో జ్వాలాముఖి తర్వాత ఓల్డ్ సిటీ లో నేను వెళ్లిన ఇల్లు MT KHAN ది. ఏంటీ ఖాన్ ఓల్డ్ సిటీ సర్వజ్ఞాని. మఖ్దుం దగ్గర నుండి రియాసత్ వరకు ఎన్ని సంగతులు చెప్పేవాడో .

తర్వాత ఓల్డ్ సిటీ వాడు అశోక్ జైల్లోమాతో పాటు ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త చాలాప్రేమగా తన ప్రాంతానికి పిలిచి పిలుచుకుపోయి కస్తూరిబాయ్ స్కూల్లోఒక సమావేశం ఏర్పాటు అనేక కబుర్లు చెప్పినారు.

ఈ మారు NIMRAH CAFE చాయ్ ,OSMANIA బిస్కెట్ లని నడుచుకుంటూ పోయి SHABAD లో బిర్యాని తినడం ఒక మంచి అనుభవం. ఇంకో అత్యంత ముఖ్యమైన సంగతి ఏమిటంటే తెలంగాణ టూరిజం వాళ్లు చార్మినార్ హెరిటేజ్ వాక్స్ నడుపుతున్నారు ఐదేళ్ల క్రితమే నాలుగు వాక్స్ వేసినాము ప్రతి నెల ప్రతి ఆదివారం ఉంటాయి. ఉదయం ఏడు గంటలకు చార్మినార్ చేరుకోవాలి ఒక ఆదివారం చార్మినార్ నుండి చౌమా హల్లా ప్యాలస్ , ఇంకో ఆదివారము చార్మినార్ నుండి బద్షాహి అశ్రుఖానా, ఇంకో ఆదివారము చార్మినార్ నుండి పురాణీ హవేలీ , చివరి ఆదివారం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నుండి సిటీ కాలేజ్ వరకు , ఫీజు ₹100 వాక్ పూర్తి కాగానే మంచి రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ మరియు టీ ₹100 లోనే , ఒక మంచి గైడ్ దాదాపు ఉచితమేననుకోండి. అదొక అద్భుతమైన ఏర్పాటు. ఉపయోగించుకునే వాళ్లే కరువు . ఆ రోజుల్లో మాతోపాటు పదంటే పది మందే ఉండేవారు అదీ పరాయి దేశస్తులు దారి పొడవునా విశేషాలు వివరిస్తూ పోయే ఈ కాలినడక గొప్ప విజ్ఞాన వీచకలు.

గొప్ప జీవితానందాన్ని ప్రసాదిస్తున్న చార్మినార్ జయహో!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *