తిరుపతి గజానన టీ స్టాల్ గమ్మత్తు

(భూమన్)

తిరుపతిలో గత 30 సంవత్సరాలుగా యాదవ వీధి మొదట్లో గజానన టీ స్టాల్ ఎందరినో ఆకర్షిస్తున్నది. తిరుపతిలో 70వ దశకంలో గాంధీ రోడ్డు లో డీలక్స్ హోటల్ లోని ఇరానీ ఛాయ్ తర్వాత ఇదే నిరంతరాయంగా కొనసాగుతున్న కొట్టు.

గజేంద్ర రెడ్డి తో రచయిత భూమన్

మూడు దశాబ్దాల క్రితం హైదరాబాదు నుండి ఒక ఇరానీ ఛాయ్ స్పెషలిస్టును పిలిపించుకొచ్చి స్టాల్ పెడితే… అతను పదేపదే విసిగిస్తుంటే అదేమంత మర్యాదపూర్వకమైన పని కాదు. మూసేసి మరేదైనా పని చేసుకోండి… అని చెబితే బి.ఏ. చదివిన ఆకుతోట గజేంద్ర రెడ్డికి టీ మీద ఉన్న ప్రేమ.. ఇష్టంతో.. తానే మాస్టరై.. ఈ కొట్టును కొనసాగిస్తున్నాడు.

స్థానికుడైన గజేంద్రకు మరేదయినా ఉపాధి దొరికే అవకాశం ఉంది. కానీ పని, శ్రమపట్ల ఖచ్చితమైన దృక్పథం ఉండటంతో ఇదే సరైన బతుకు తెరువుని నమ్మటమే ఈ కొట్టు ప్రత్యేకత.

ఇరానీ ఛాయ్ హైదరాబాద్ ప్రత్యేకత. దాన్ని తిరుపతి వాసులకు అలవాటు చేసి అనేకమందిని టీ ప్రియులను చేసిన ఆకుతోట గజేంద్ర రెడ్డి మంచి చదువరి అన్న సంగతి ఈ ఊర్లోని సాహిత్యకారులకు చాలామందికి తెలుసు.

గురజాడ దగ్గర నుండి నామిని వరకు అతను చదవని పుస్తకం లేదు. టీతోపాటు పుస్తక పఠనం తన జీవితంలో భాగమైపోయిందని చెప్పే ఈ ఆకుతోట గజేంద్ర రెడ్డి 1977-1982 వరకు ఇంటర్మీడియట్, డిగ్రీ లో… నా విద్యార్థి.. నా విద్యార్థి ఒక టీ వాలా గా ఉన్నతమైన స్థానంలో బతుకుతున్నందుకు గర్వపడుతున్నా. మామూలుగా పోయే నేను, మొన్న పోతే.. మళ్ళీ “ఏడు తరాలు” చదువుతున్నాన్సార్… అంటే ఎంతో సంతోషంగా అనిపించిందో!.

ఆకుల గజేంద్ర రెడ్డిని మంచి పాఠకుడిగా పసిగట్టి మొన్నటికి మొన్న సాకం నాగరాజు, వాకా ప్రసాద్, నాయుని కృష్ణమూర్తి స్మృతి పథంలో కన్యాశుల్కం ఒక పరామర్శ… మొదటి ప్రతి నందించినందుకు గజాననలో టీ సేవించినంత తృప్తిగా ఉంది.

జీవితంలో ఏదో ఒక రంగంలో తృప్తిగా బతుకుతున్న ఇటువంటి వాళ్ళని చూసి గదా…. మనం సమాజాన్ని అర్థం చేసుకోవాల్సింది. ప్రతి ఊళ్లోనూ గుర్తుపెట్టుకునే.. తరాలుగా ఇష్టపడే కొన్ని కొట్లు, మెస్సులు, దోసెలంగళ్ళు, కడ్డీ చీల బంకులుంటాయి. మా ఊళ్లోని యాదవ వీధిలో గజాననా టీ కొట్టు ఒక్క టీ ని మాత్రమే ఇస్తూ శిఖరాయమానంగా ఉన్నందుకు గర్వంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *