రెండు ప‌గ‌ళ్ళు, ఒక రాత్రి: శేషాచ‌లం కొండ‌ల్లో సాహ‌స‌యాత్ర‌

తిరుప‌తి జ్ఞాప‌కాలు-57

(రాఘ‌వ శ‌ర్మ‌)

ఆకాశాన్ని క‌మ్మేసిన అడ‌వి..
నింగిని తాకుతున్న‌ కొండ‌లు..
ఎత్తైన రాతి కొండలు నిట్ట‌నిలువుగా ఎక్కుతూ, దిగుతూ..
లోతైన లోయ‌ల్లో బండ రాళ్ళ‌పై న‌డుస్తూ..
జ‌ల‌పాతాల్లోకి దూకుతూ..
చిమ్మ చీక‌ట్లో వాహ‌నాలు న‌డుపుతూ..
ప‌డుతూ, లేస్తూ, దొర్లుతూ..
రెండు ప‌గ‌ళ్ళు, ఒక రాత్రి అడ‌వి త‌ల్లి ఒడిలో సేద‌దీరాం.
ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు, ప‌ద‌హారు మందిమి.
పిల్ల ట్రెక్క‌ర్లు, పీచు ట్రెక్క‌ర్లు లేరు.
అంతా డేర్ డెవిల్ ట్రెక్క‌ర్లు..
ఆరుగురు త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చారు.
వారి లో ఇద్ద‌రు పిల్ల‌లు, ఒక మ‌హిళ కూడా!
శేషాచ‌లం కొండ‌ల్లో నాలుగు తీర్థాల‌ను చూశాం.
అడివంతా తెలుగు త‌మిళ న‌వ్వుల‌తో ప‌ర‌వ‌శించింది.
ద్ర‌విడ మాధుర్యాన్నిరుచి చూసింది.
శ‌నివారం తెల్ల‌వారు జామునుంచి, ఆదివారం సాయంత్రం వ‌ర‌కు.
శేషాచ‌లం కొండ‌ల్లో 36 గంట‌ల‌ ట్రెక్కింగ్.
కైలాస తీర్థం..యుద్ధ‌గ‌ళ..హ‌లాయుధ తీర్థం..అన్న‌ద‌మ్ముల బండ‌..మ‌ధ్య‌లో చామ‌ల కోన సౌంద‌ర్యం.

లోయ లోకి దిగుతున్న ప్రకృతి ప్రియులు

శ‌నివారం తెల్ల‌వారు జామున 5 గంట‌ల‌కు తిరుప‌తి నుంచి బ‌య‌లుదేరాం.
తిరుమ‌ల‌లో శిలాతోర‌ణం నుంచి ధ‌ర్మ‌గిరి వైపు సాగుతున్నాం.
దారంతా రాళ్ళు, ర‌ప్ప‌లు.
వాటిపైన మా వాహ‌నాలు గంతులేస్తున్నాయ్‌.
వేద పాఠ‌శాల ప‌క్క నుంచి కుమార ధార వైపు వెళ్ళాం.
దూరంగా అదిగో కుమార ధార‌, ప‌సుపు ధార.
వాటికి ఎడ‌మ వైపు నుంచి వెళుతున్నాం.
కొంత దూరం వెళ్ళాక వాహ‌నాల‌ను నిలిపేశాం.
మా కాళ్ళు కైలాస తీర్థం వైపు సాగాయి.
ఎదురుగా ఉన్న అడ‌విలోకి న‌డుస్తున్నాం.
సూర్యుడు ఎటు ఉన్నాడో తెలియ‌డం లేదు.
ఎప్ప‌డు ఉద‌యించాడో తెలియ‌దు.
ఆకాశ‌మంతా మ‌బ్బులు క‌మ్మాయి.
కొండ ఎక్కుతున్నాం.
మ‌నిషెత్తు పెరిగిన బోద‌లోంచి సాగుతున్నాం.
చుట్టూ ఎర్ర‌చంద‌నం , మ‌ధ్య‌లో ఈత, ర‌క‌ర‌కాల చెట్లు.
ముందుకు సాగుతున్న కొద్దీ అడ‌వి చిక్క‌బ‌డుతోంది.
ఆకాశం క‌నిపించ‌కుండా ప‌లుచ‌బ‌డుతోంది.

లోయ లో నీటి ఉధృతికి వేళ్లు పోయిన వృక్షం

లోయ‌లోకి దిగ‌డం మొద‌లు పెట్టాం.
లోయ‌లోకి దిగుతున్న కొద్దీ ఇరువైపులా రాతి కొండ క‌మ్మేస్తోంది.
ఒక పక్క నుంచి ప‌డుతున్న జ‌ల‌ధార‌.
లోయ‌లో నీటి ప్ర‌వాహానికి కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద బండ రాళ్ళు.
ఎన్ని మ‌హావృక్షాలు అడ్డంగా ప‌డిపోయాయో!
కొన్ని వేళ్ళ‌తో పెకిలించుకుపోయాయి.
లోయ‌లోకి ఒరిగిపోయినట్టున్న‌ కొండ అంచులు.
ఆ అంచును పెన‌వేసుకుపోయిన ఒక మ‌హావృక్షం.
కొండ ప‌డిపోకుండా అది మోపుతున్న‌ట్టుంది.
ఆ మహావృక్షం ఒరిగిపోతున్న కొండ‌ను మోపుతోందా!?

ప‌డిపోతున్న మ‌హావృక్షాన్ని కొండ త‌న బాహువుల్లోకి ఇముడ్చుకుందా!?
ఆ దృశ్యాన్ని ప్ర‌కృతి ఒక ప్ర‌శ్న‌లా నిల‌బెట్టేసింది.
లోయ మ‌ధ్య‌లోఒక చెట్టు ధ్వ‌జ‌స్తంబంలా నిల‌బ‌డిపోయింది.
మ‌రొక మ‌హా మ‌హావృక్షం వేళ్ళ‌న్నీ నీటి ప్ర‌వాహానికి కొట్టుకుపోయి వృద్ధ‌మాత‌లా ఉంది.
చూస్తే గాలిలో వేలాడుతున్న‌ట్టే ఉంది.
నిజానికి ప‌క్క‌నున్న పిల్ల వేరు సాయంతో బ‌తుకుతోంది.

లోయ లో కొండతో పోటీ పడుతూ ధ్వజస్తంభం లా ఆకాశానికి ఎగబాకు తున్న చెట్టు.

ఇరువైపులా రెండు కొండ‌ల‌కు అనేక రాతి రూపాలు.
ఏ రాళ్ళు ఎక్కాలి, ఎటు వైపు దిగాలి అనేది ఎప్ప‌టి క‌ప్పుడు అన్వేష‌ణే.
లోయ చివ‌రికెళ్ళే స‌రికి ఉద‌యం ప‌దిగంట‌లైంది.
ఎక్క‌డా ఎండ పొడ‌లేదు.
కుడి వైపు నుంచి ఎడ‌మకు ఒక ఏరు ప్ర‌వ‌హిస్తోంది.
అక్క‌డే అల్పాహారం ముగించాం.
ఆ ఏరు వెంటే సాగుతున్నాం.
ఆ ఏటిలో ఎన్ని రూపాలు!
పారుతున్న ఏరు ఎన్ని మెలిక‌లు తిరిగుతోందో!
ఎన్ని శ‌బ్దాలూ చేస్తాందో !
వ‌య్యారంగావెళ్ళి ఒక పెద్ద నీటి గుండంలోకి దూకుతోంది.
నీటి గుండాన్ని చూస్తే చాలు, మా వాళ్ళ‌కు ఒళ్ళు తెలియ‌దు.
దూక‌డ‌మే దూకడం.

లోతయిన లోయలో ఇలా సాగుతూ..

అక్క‌డే బూట్లు వ‌దిలేసి ఒట్టి కాళ్ళ‌తో న‌డ‌క మొదలు పెట్టాం.
కైలాస తీర్థ జ‌ల‌పాతం దుముకుతున్న తీరు చూద్దామ‌ని.
మ‌ళ్ళీ వెన‌క్కి రావ‌చ్చులే అని.
కైలాస తీర్ధం కింద‌కు వెళ్ళాలంటే, కొంత‌ వెన‌క్కి తిరిగి వ‌చ్చి కొండ ఎక్కి దిగాలి.
దాని ఎడ‌మ ప‌క్క నుంచే సాగుతున్నాం.
గుండాన్ని దాటుకుని ముందుకు వెళితే, కుడి వైపునున్న కొండ వైపున‌కు ఎక్కాం.
ఒక మ‌హాద్భుతం!
మా వెంట వ‌చ్చిన‌ ఏరు కొండ పైనుంచి కింద‌కు దూకుతోంది.
అదే కైలాస తీర్థం పై భాగం.

కైలాస తీర్థం పై భాగం

జ‌ల‌పాతం దుముకుతున్న‌హోరు.
అబ్బుర ప‌ర‌చింది, ఆనంద ప‌ర‌చింది.
జ‌ల‌పాతం కింద‌కు వెళ్ళాలంటే మ‌ళ్ళీ వెన‌క్కి వెళ్ళి, కొండ ఎక్కి దిగాలి.
ఇటు నుంచి ఇటే కొండ దిగేస్తే దూరం త‌గ్గుతుంది క‌దా!
ఒట్టి కాళ్ళ‌తోనే కొండ ఎక్కాం.
రాళ్ళు, ర‌ప్ప‌లు, బోద‌పైన న‌డ‌క‌.
బండ రాళ్ళ పైనుంచి లోయ‌లోకి దిగుతున్నాం.
అరి కాళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి.
లోయ‌లోకి దిగుతున్న కొద్దీ జ‌ల‌పాత‌పు హోరు వినిపిస్తోంది.
ఎత్తైన కొండ నుంచి దుముకుతున్న జ‌ల‌పాతమ్

ఒక‌టే రొద చేస్తోంది.
దాని ముందొక పెద్ద నీటి గుండం.
అదే కైలాస తీర్థం.
నీటి గుండం పెద్ద లోతు లేదు.
ఉద‌యం ప‌ద‌కొండున్న‌ర‌వుతోంది.
న‌డిచి న‌డిచి శ‌రీరం వేడిక్కినా లోయ‌లో చ‌లి త‌గ్గ‌లేదు.
గుండంలో నీళ్ళు చ‌ల్ల‌గా ఉన్నాయి.
ఈదుకుంటూ జ‌ల‌పాతం కింద‌కు వెళ్ళాం.
ఎత్తైన కొండ పైనుంచి పెద్ద పెద్ద జ‌ల‌ముత్యాలు రాలి ప‌డుతున్నాయి.
మ‌ధ్యాహ్నం ప‌ద‌న్నెండ‌వుతోంది.
ఎండ క‌నిపిస్తున్నా వేడి మాత్రం లేదు.
మ‌ళ్ళీ ఒట్టి కాళ్ళ‌తో కొండెక్కాం.
జ‌ల‌పాతం ప‌డుతున్న పైభాగానికి చేరాం.
నీటి గుండం ప‌క్క‌న ఒదిలిన బూట్లు వేసుకునే స‌రికి ఎంత హాయ‌నిపించిందో!
కైలాస తీర్థం చూడాల‌న్న ఆనందంలో అరికాళ్ళు ప‌డే ఇబ్బందిని కూడా లెక్క‌చేయ‌లేదు.
మ‌ళ్ళీ అదే లోయ‌లోంచి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యాం.
చూసిన వ‌న్నీ మ‌న‌నం చేసుకున్నాం.
వెళ్ళే తొంద‌ర‌లో చూడ‌కుండా వ‌దిలేసిన దృశ్యాల‌న్నిటినీ చూశాం.

కైలాస తీర్థం మనోహర దృశ్యం

ఆ లోయ‌లో మ‌హావృక్షాలు ఆకాశాన్ని అందుకోవాల‌ని కొండ‌తో పోటీ ప‌డుతున్నాయి.
ఆక‌లి చంపుతోంది. అడుగులు భారంగా ప‌డుతున్నాయి.
వాహ‌నాల వ‌ద్దే ఆహారాన్ని ఒదిలేసి వ‌చ్చాం.
ఎప్పుడెప్ప‌డు వెళ్ళ‌గ‌లుగుతామా అని, ఆత్రంగా అడుగులు వేస్తున్నాం.
అదిగో దూరంగా కుమార‌ధార‌, ప‌సుపు ధార‌.
దానికి స‌మీపంలోనే మా వాహ‌నాలు.
సాయంత్రం నాలుగైంది.
మ‌హా ఆక‌లి మీదున్న మేం, ఆబ‌గా తినేశాం.
మా వాహ‌నాలు యుద్ద‌గ‌ళ వైపు బ‌య‌లు దేరాయి.
చీక‌టి ప‌డే లోగా యుద్ధ‌గ‌ళ చేరాలి.
(ఇంకా ఉంది)

Aluru Raghava Sarma
Aluru Raghava Sarma

(రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రియుడు, తిరుపతి)

.

2 thoughts on “రెండు ప‌గ‌ళ్ళు, ఒక రాత్రి: శేషాచ‌లం కొండ‌ల్లో సాహ‌స‌యాత్ర‌

  1. భూమ్మీద ‘మహాదృష్టవంతులు’ మీరే మరి. రెండు పగళ్లు, ఒక రాత్రి శేషాచలం కొండల్లో గడిపారా.. ఎంత చక్కటి కొండగాలిని ఆస్వాదించారో మరి. మీ అనుభవం ట్రెక్కింగ్ ప్రియులందరికీ శాశ్వతానందం కలిగిస్తుంది. ఇలాగే సాగిపోండి. అందరూ… క్షేమంగా, భద్రంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *