రాయలసీమ గురించి ఏమ్మాట్లాడరా?

దశాబ్దాలుగా రాయలసీమకు పాలకులు అన్యాయం చేస్తూనే వున్నారు. CRDA చట్టంలో సవరణలు చేసి వెనుకబడిన ప్రాంతాలకు కూడా సమన్యాయం చేయాలి

మూడు రాజధానులు వికేంద్రీకరణ అంటూ ప్రభుత్వం మభ్యపెడుతోంది. రాజకీయ పార్టీలు రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక అమలుకు ఉద్యమించాలి. రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు కల్పించిన హక్కులు తక్షణమే అమలు పరచాలి

—బొజ్జా దశరథరామిరెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి.
***
దశాబ్దాలుగా పాలకులు రాయలసీమకు అన్యాయం చేస్తూనే వున్నారనీ, ప్రస్తుత ప్రభుత్వం కూడా మూడు రాజధానుల పేరుతో రాయలసీమ అభివృద్ధికి కార్యాచరణ చేపట్డకపోవడం అన్యాయమని, రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు కల్పించిన హక్కులను అమలు పరిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.

బుధవారం విజయవాడ ధర్నా చౌక్ లో రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేయాలని కోరుతూ రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆద్వర్యంలో రాయలసీమ సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..

శ్రీబాగ్ ఒడంబడిక జరిగి 85 ఏళ్ళైనా, శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో తెలుగు రాష్ట్రం ఏర్పడి 70 ఏళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 జరిగి 8 ఏళ్ళైనా రాయలసీమ వెనుకబాటు తనం అలాగే కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమ హక్కులు నెరవేరుస్తాం, రాయలసీమ అభివృద్ధికి బాటలు వేస్తాం అంటూనే  పాలకులు గత ఏడు దశబ్దాలుగా మభ్యపరుస్తూనే ఉన్నారన్నారు.

శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా సిద్దించిన రాయలసీమ హక్కులు సాధించుకునే దశలో విశాలాంధ్ర ఆంటూ కర్నూలు రాజధానిని హైదరాబాద్ కు,  50 వ దశకంలోనే కేంద్రం అనుమతించిన కృష్ణా పెన్నార్ ప్రాజక్టు నిర్మిస్తే తమిళులకు నీరు లభిస్తుందని, తమిళులపై ద్వేషం రగల్చి, మనలను ఏమార్చి మనకు చుక్క నీరు రాకుండా   కోస్తాంధ్ర లో 30 లక్షల ఎకరాలకు సాగు నీటి హక్కు లతో నాగార్జున సాగర్ నిర్మాణం జరిపించిన  నాటి పాలకులు, రాజకీయ పార్టీలు నేటి వరకు మభ్యపరుస్తూ అన్యాయం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ర్ట ప్రభుత్వ నిధులతో  నిర్మించాల్సిన తెలుగు గంగ, హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులను మూలన పడేసి, ఆ డబ్బులతో  హైదరాబాద్ లో 10 ఏళ్ళు  ఉండాల్సిన రాజదానిని అమరావతి లో, కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరంను నెత్తినెత్తుకొని  రాష్ట్ర నిధులను మళ్ళించి నిర్మాణం కొనసాగిస్తూ  రాయలసీమ ప్రజలను మభ్య పరిచి *“జై అమరావతి – జై పోలవరం”* అని గత ప్రభుత్వం మనచేతనే అరిపించిందన్నారు.  రాష్ట్ర రాజధానిగా నిర్ణయించి  అమరావతిలో అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి, నివాస హక్కులు 29 గ్రామాలవే అంటూ CRDA చట్టం చేసి వెనుకబడిన ప్రాంతాలకు విఘాతం కలిగిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు నోరు మెదపకపోవడం బాధిస్తోందన్నారు.

మూడు రాజధానులతో పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అని ఊరిస్తూ ….. రెండేళ్ళైనా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టక పోవడం, కృష్ణా నది నీటి నిర్వహణకు కీలకమైన  KRMB కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయకుండా  కృష్ణా నదితో సంబంధంలేని విశాఖపట్నానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాధించడం రాయలసీమకు ఏమి న్యాయం చేస్తున్నారని దశరథరామిరెడ్డి ప్రశ్నించారు.

  కుందూ నదిని ఆధునీకరణ పేరుతో నదిని కాలువగా మారుస్తూ లక్షా యాభై వేల ఎకరాల ఆయకట్టుకు నీరు లేకుండా చేసి నెల్లూరు జిల్లాకు తరలించడం ఏపాటి న్యాయమని ఆయన ప్రశ్నించారు.

*“శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తున్నాం”* అనే మభ్య పరిచే మాటలతో  *“మూడు రాజదానులకు జై”* అని మనచేత అరిపిస్తూ  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మభ్యపరుస్తుందని ఆయన విమర్శించారు.

రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులు; రాయలసీమ కోస్తాంధ్ర తో సమానంగా  ఆర్థిక, సాంస్కృతిక, సామాజికంగా అభివృద్ధి చెందడానికి 30 వేల కోట్ల రూపాయాల ప్రత్యేక ప్యాకేజి, కడప ఉక్కు, గుంతకల్లు రైల్వే జోన్, జాతీయ స్థాయి వ్వవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు, AIMS  అనంతపురంలో ఏర్పాటు, సీడ్ హబ్ గా కర్నూలు అభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయం, AP సీడ్స్, AP విత్తన ధృవీకరణ సంస్థ, విత్తన పరీక్ష కేంద్రాల ప్రధాన  కార్యాలయాల ఏర్పాటు, ఉద్యానవన పంటల కేంద్రంగా రాయలసీమ అభివృద్ధికి పరిశోధన, ప్రాససింగ్, శీతల గోడౌన్లు, రోడ్డు, రైల్, విమాన రవాణ మౌళిక వసతులు ఏర్పాటు చెయకుండా  రాయలసీమ ప్రాజెక్టులకున్న చట్టబద్ద నీటి హక్కులను పొందడానికి సిద్దేశ్వరం అలుగు‌, గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ గురించి మనం అడిగితే వినే రాజకీయ పార్టీనే లేదన్నారు. దీనికి ఎదురుగా ప్రత్యేక హోదా (నీరు, రహదారి మౌళిక వసతులైన రోడ్డు, రైలు, విమానా, నౌకా రంగాలున్న కోస్తాంధ్ర ప్రాంతానికి ఉపయౌగపడే అంశం), విశాఖ రైల్వేజోన్, విశాఖ ఉక్కు, పోలవరం‌, అమరావతి, మూడు రాజదానుల పై మన చేత ఉద్యమం చేయించడానికి తమ తాబేదార్లను ఎగేసే రాజకీయ పార్టీలు దాపురించాయని మా మొర వినండయ్యా అని రాయలసీమ ప్రజలు అంటే‌, *“అన్ని అమరావతికే”* అంశానికి మీ మద్దతా? కాదా? అని ఎదురు ప్రశ్నించే రాజకీయ వ్యవస్థ నేడు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నదన్నారు.

గత ప్రభుత్వం చేసిన CRDA  చట్టం అమరావతి ప్రాంతంలో ఉద్యోగ, నివాస,అభివృద్ధి అనుభవ  హక్కులన్ని  29 గ్రామాలకే దారదత్తం చేసిందన్న హైకోర్టులో వాదనలు, మరి ప్రస్తుత ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ అంటూ  కేవలం మాటలకే పరిమితమైన విషయాన్ని రాయలసీమ వాసులు గమనించాలని కోరారు.

ప్రస్తుత ప్రభుత్వం తమ రాజకీయ లబ్ది కోసమే శ్రీబాగ్ ఒడంబడికను ప్రస్తావిస్తూ, రాయలసీమ అంశాలను గాలికి వదిలిన విషయాన్ని రాయలసీమ వాసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

గత ఏడు దశబ్దాలుగా మనలను ఏమారస్తూ మన కంటిని, మన వేలుతో మనం పొడుచుకునే కార్యక్రమాలు పాలకులు నిర్వహించారని, మన ప్రాంత అభివృద్ధికి విఘాతం కలిగించే అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు వంతపాడాయని, ఇకనైనా మేల్కొందాం. మన ప్రాంత అభివృద్ధి కై ప్రశ్నిద్దామని దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు.

స్వచ్చందంగా రాయలసీమ ఎనిమిది జిల్లాల నుండి మహిళలు, రైతులు యువకులు, విద్యార్థులు, మేధావులు వందలాదిగా తరలివచ్చి సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేసారనీ, ఇదే స్ఫూర్తితో రాయలసీమ హక్కుల సాధనకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.

అరుణోదయ సాంస్కృతిక కళావేదిక అభ్యుదయ సంస్థ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షురాలు తమ విప్లవ కళాకారిణి విమల రాయలసీమ సత్యాగ్రహ దీక్షకు సంఘీభావం తెలిపి తమ కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారనీ అన్నారు.

సత్యాగ్రహ దీక్షలో పలు తీర్మానాలు  .

1.  శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర భూభాగాలతోనే కొనసాగుతున్న నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న నిర్వహించాలి.

2.  పాలనా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కర్నూలు లో  హైకోర్టు ఏర్పాటుకు నిర్ఢయించిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణను వెంటనే ,చేపట్టాలి.

3.  హైకోర్టు తో పాటు సెక్రెటరియేట్ లోని  విభాగాలు, అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, సంస్థలు, డైరెక్టరేట్ల ఏర్పాటులో  రాయలసీమకు సమ ప్రాతినిధ్యం ఇవ్వాలి.

4.  కృష్ణా నది యాజమాన్య బోర్డు ను కర్నూలులో ఏర్పాటు చేయాలి.

5.  రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న బుందేల్ కండ్ తరహా  30 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలి.

6. రాయలసీమ సాంప్రదాయ వనరులైన చెరువుల, కుంటల అభివృద్దికి, నిర్మాణానికి “ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేయాలి.

7.కల్వకుర్తి నుండి కర్నూలు జిల్లాల ఆత్మకూరు వరుకు నిర్మించే  జాతీయ రహదారిలో  భాగంగా సిద్దేశ్వరం వద్ద బ్రిడ్జి తో పాటు అలుగు నిర్మాణానికి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్దితో కార్యాచరణ చేపట్టాలి.

8.  గోదావరి జలాలను నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాకు మల్లించి శ్రీశైలం ప్రాజక్టును పూర్తిగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాల అవసరాలకే వినియోగించాలి.

9. గుంతకల్లు కేంద్రంగా రైల్వేజోన్,  సెయిల్ ఆధ్వర్యంలో కడప ఉక్కు కర్మాగారం పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి.

10. రాష్ట్ర విభజన చట్టం  13 వ షెడ్యూలులో పేర్కొన్న సంస్థలలో కీలకమైన ఎయిమ్స్ మరియు జాతీయ ప్రధాన్యత కల్గిన వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు చేయాలి.

11. కర్నూలు జిల్లాను సీడ్ హబ్ గ చేయడానికి APSSDC, APSSCA, వ్యవసాయ కమేషనరేట్, విత్తనా దృవీకరణ కేంద్రం లను కర్నూలులో ఏర్పాటు చేయాలి.

12. కడపలో మైనింగ్ యూనివర్శిటీ, తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్, శ్రీశైలంలో ఇప్పటికే తెలుగు విశ్వవిద్యాలయంలో భాగమైన చరిత్ర శాఖ కేంద్రంలో తెలుగు విశ్వవిద్యాలయం పాలనా కేంద్రంను  కొనసాగించాలి.

13.  జి ఎన్ రావు, బోస్టన్ కమిటి రిపోర్టులను అమలు పరచాలి.

14.  తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ, హంద్రీ నీవా కాలువ విస్తరణ, గాలేరు నగరి రెండవ దశ నిర్మాణాలను చేపట్టాలి.

15. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణకు అమృత సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో పాటు, 8 టి ఎం సి ల సామర్థ్యంతో  వేదవతి ఎత్తిపోతల పథకం మరియు తుంగభద్ర దిగువ కాలువ స్థిరీకరణకు వేదవతి పై 20 మీటర్ల ఎత్తిపోతల పథకం చేపట్టాలి.

16. గుండ్రేవుల రిజర్వాయర్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందాలి.

17. వెలుగోడు బాలన్సింగ్ రిజర్వాయర్ నుండి బ్రహ్మసాగర్ కు నీటిని తీసుకొని పోయే మద్రాస్ కాలువను బలోపేతం చెయ్యాలి.

18. కుందు నది వెడెల్పు, లోతు పెంచే నిర్ణయంతో రాయలసీమలో లక్షా యాబై వేల ఎకరాల ఆయకట్టును, పర్యవరణాన్ని నాశనం చేయడాన్ని వెంటనే ఆపాలి. కుందూ నదిపై  ప్రతి 5 కి మీ కు బ్రిడ్జ్ కం బ్యారేజి ల నిర్మాణం చేపట్టాలి .

19. నవంబర్ 16 ను రాయలసీమ హక్కుల దినంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని తీర్మానాలను ఆమోదించారు.

ఈ సత్యాగ్రహ దీక్షలో రాయలసీమ సాంస్కృతిక వేదిక నాయకులు డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రాయలసీమ కో-ఆర్డినేషన్ కమిటి నాయకులు రాజు, రాయలసీమ సోషల్ మీడియా ఫోరం నాయకులు అశోక్, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు కృష్ణ, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ఏరువ రామచంద్రారెడ్డి, రైతు కూలీ సంఘం నాయకులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు రత్నం ఏసేఫు, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు బాలవెంకటరెడ్డి, నందిరైతు సమాఖ్య నాయకులు కృష్ణారెడ్డి, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు రవికుమార్, RCC నాయకులు శ్రీకాంత్ రెడ్డి, మహిళా న్యాయవాద లక్ష్మీ ప్రసన్న, POW నాయకురాలు సుగ్ఞానమ్మ,, చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాధ మరియు రాయలసీమ ఎనిమిది జిల్లాల నుండి వందలాది మంది రైతులు పాల్గొన్నారు.

ఈ సత్యాగ్రహ దీక్షకు న్యూ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శి పొలారి, కుల నిర్మూలన సమితి నాయకులు దుడ్డు కృష్ణ సంఘీభావం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *