కాకరాల జీవన యానం-4
-రాఘవ శర్మ
“సినిమాల్లో చిన్న పాత్రలు, పెద్ద పాత్రలు ఉంటాయి కానీ, చిన్న నటులు, పెద్ద నటులు అంటూ ఉండరు.
పాత్ర స్వభావాన్ని బట్టి నటులుంటారు.
పాత్ర ఏదైనా నటులు నటులే.” అంటారు ప్రముఖ రంగస్థల, సినీ కళాకారులు కాకరాల.
తిరుపతిలో వైద్యం చేయించుకుంటున్న కాకరాలను బుధవారం కలిసిన సందర్భంగా తన సినీ రంగ జీవితంలో స్వాభిమానానికి సంబంధించిన విషయాలను ఇలా ముచ్చటించారు. అవి వారి మాటల్లోనే విందాం.
“నేను స్వతహాగా స్వాభిమానం ఎక్కువగా ఉన్నవాడిని.
దానికి కారణం ఏమిటని ఆలోచిస్తే, నేను పుట్టి పెరిగిన వాతావరణంలో అది మా పెద్దల నుంచే నాకు వచ్చిందని అనుకుంటున్నా.
అందువల్ల నా సినిమా జీవితాన్ని ఆలోచించుకుని చెప్పాలనుకుంటే, నాకు ఆ స్వాభిమానమే ఎదురై కూర్చుంటుంది.
దీని వల్ల నేను పోగొట్టుకున్నదే ఎక్కువై ఉండవచ్చు.
కానీ, నేను పోగొట్టుకున్న దాని కన్నా నేను నిలబెట్టుకున్నదే విలువైందని నా కనిపిస్తుంటుంది.
ఈ దృష్టి నుంచి నేను చెప్పే నా సినిమా జీవితాన్ని పాఠకులు అర్థం చేసుకోవాలని నా ఉద్దేశ్యం”
“అలా చూస్తే నాకు డాక్టర్ గరికపాటి రాజారావు గారి ఎరీనా తప్ప మిగిలనవేవీ నాకు ఎక్కువగా దగ్గర కాలేవు.
ఆ దృష్టి నుంచి చూస్తే, రాజమండ్రిలో రాజారావుగారి శిష్యుడిగా నేను సాధించింది ఏమిటి అని ఆలోచిస్తే, ఆయన ద్వారా నాకు అందిన నట జీవితమే నా జీవితం అనుకుంటున్నాను.
ఈ దృష్టి నుంచి నేను నా సినిమా రంగ జీవితాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.”
“ఆయన నాకు చెప్పిన దానికన్నా ఆయన నుంచి చూసి నేర్చుకుని అనుసరించినదే ఎక్కువ.
ఈ నేపథ్యం నుంచి నా పరిమితిని, నా పరిధిని మీరు అర్థం చేసుకుంటే నేను నాటక రంగంలోకి, సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నానో నా జీవితం అక్కడనే ఉందని మీకు తెలుస్తుంది.
మామూలుగా సినిమా నటులకు ఉండే విస్తృత జీవితం నాకు అందలేదు, అది అందాలనీ నేను కోరుకోలేదు.
ఆ విధంగా రాజమండ్రిలో రాఘవ కళాసమితిలో ఆయన శిష్యుడిగా నా జీవితం ప్రారంభమైంది.
అదృష్ట వశాత్తు అక్కడితో ఆగిపోకుండా, ఆయన వెనకే ఆయన అభిమానంతో చెన్నైకి రావడంతో ఆయన పరిధిలోనే నా సినిమా జీవితం ఆరంభమైంది.
ఆ విధంగా నాకు సినిమా అంటే రాజారావు గారి దగ్గర నేను గ్రహించింది, నాటకం అంటే రాజారావుగారి దగ్గర గ్రహించింది. అంతే తప్ప సినిమా నుంచి విస్తృతంగా అందింది తక్కువ. అందాలని నేను అనుకోవడం లేదు కూడా.”
“ఇక చెన్నైలో నా సినిమా జీవితం రాజారావుగారి అంతే వాసిగా కొనాసాగిస్తున్నప్పుడు నేను ఊహించని విధంగా నాకు తాపీ చాణుక్య గారితో పరిచయం ఏర్పడింది.
మేం రిహార్సల్ చేస్తుండగా, ప్రజానాట్య మండలి నటుడు సాలార్ నా దగ్గరకు వచ్చి ‘నేను చాణుక్యను కలవడానికవెళ్ళానయ్యా.
రాజారావుగారి ట్రూ లో బక్కపలుచగా, పొడుగ్గా ఉండేవాడు చూడు, అతను ఉన్నాడా?’ అని అడిగాడు.
‘అతను ఉన్నాడుస అని చెప్పగానే ‘ఒక్క సారి నన్ను కలవమను’ అని కబురు చేశాడు.
‘నిన్ను చాణుక్య గారు కలవమన్నారయ్యా. తప్పకుండా వెళ్ళికలువు. వేషం కోసమే అయి ఉంటుంది.” అన్నారు.
అప్పటి దాకా నేను ఆయన పేరు వినడమే కానీ, మనిషిని చూడలేదు. అయినా కబురు చేశారు కనుక కలుద్దామని బయలు దేరి వెళ్ళా.
ఆయన కాటేజి దగ్గరకు వెళ్ళగానే నన్ను గుర్తు పట్టి, ‘ఆ.. రండి మీ కోసమే చూస్తున్నా’ అన్నారు. నేను ఉత్సాహంగా లోపలికి వెళ్ళి కూర్చున్నా. ‘నేను మీ నాటకాలు చూశాను.
మీరు ఏ క్యారెక్టర్ అయినా చేయగలరు.
కానీ, నా దగ్గరకు వేషం కోసం రాకండి’ అన్నారు.
నాలో ఉత్సాహ మంతా జారిపోయింది.
‘మీరు ఇలా బాధపడతారని తాకు తెలుసు.
కానీ, ఇండస్ట్రీ గురించి నాకు తెలిసిన విషయం ఒకటి చెపుతాను.
సినిమా రంగంలో పెట్టుబడి పెట్టే ఫైనాన్షియర్ దగ్గర నుంచి, సినిమాకు చిన్న నటులను సప్లై చేసే వాళ్ళ దాకా ఎవరి కాండెట్స్ వారి కుంటారు.
అంచేత ఈ మ్యూజికల్ చైర్ ఆటలో ఫైనాన్షియర్ చాలా సార్లు ఫెయిల్ అవ్వచ్చు. సప్లైర్ సక్సెస్ కావచ్చు.
ఇప్పుడు మీకు వేషం ఇస్తానని భరోసా ఇస్తే, మీరు దాని గురించి కలలు గనడం సహజం.
అంచేత నేను మంచి వేషమే ఇవ్వాలని ప్రయత్నిస్తా.
మనం స్నేహితులుగా కలుసుకుందాం కానీ, వేషం కోసం కలుసుకుందామని అనుకోవద్దు.’ అన్నారు.
మొత్తం సినిమా రంగ స్వభావం అంతా ఆయన మాటల్లో నాకు అర్థమైంది.
‘మనం స్నేహితులుగా కలుసుకుందా. మీకు వేషం ఇవ్వాలని ప్రయత్నిస్తా.’
ఇంత నిక్కచ్చిగా సినిమా రంగం గురించి అవగాహన కల్పించడం నేను ఎవరి దగ్గరా వినలేదు. ఆ విధంగా సినిమా రంగానికి సంబంధించి చాణుక్య గారిని నాకు గైడ్ గా నేను భావించుకున్నాను. ఆ విధంగా ఆయన దగ్గరే నా సినిమా జీవితం మొదలైంది. అది రామానాయుడు గారు తీసిన ‘రాముడు-భీముడు’ సినిమా. అందులో ఒక ఫ్యాక్టరీ వర్కర్ క్యారెక్టర్.
అప్పటికే అని శిట్టి సుబ్బారావు గారి తమ్ముడు అప్పారావు గారు నాకు ఆత్మీయ మిత్రులయ్యారు.
ఆ విధంగా నేను చిన్న వేషాలన్నీ చాణుక్య గారి ద్వారానే నేను వేశాను.
ఇది కూడా రాజారావుగారి ఎరీనాను దాటని అవకాశమే.
ఆ వేషం సెట్స్ మీదకు వెళ్ళగానే నన్ను ముందు నటించమన్నారు.
నేను నాకు అలవాటైన పద్ధతిలో నటించాను.
ఆయన వెంటనే కట్ చేసి ‘అది కాదు, నేను ఊరికే చేసి చూపిస్తాను చూడండి’ అని చేసి చూపించాడు.
అది సినిమాకి, నాటకానికి నటనలో ఉండే తేడాని చెప్పింది.
అప్పుడు నేను ‘చేస్తాను సార్ . నాకు అర్థమైంది’ అన్నాను.
ఫస్ట్ టేకే ఒకే అయ్యింది. ముందే చెప్పినట్టు అక్కడి నుంచి ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లోనే ఎక్కువ చిన్న వేషాలు కనిపించేవి.
నటనకు అవకాశం ఉన్నవి వేస్తూ వచ్చాను.
ఇంతకాలం నటుడుగానే ఎదిగిన పరిస్థితిలో కూడా ప్రేక్షకులు ఆ పాత్రనే గుర్తు పట్టి నన్ను మెచ్చుకుంటూ ఉంటారు.
ఆ విధంగా నా చిన్న పాత్రల సినిమా జీవితం మొదలైంది.
ఇలా నేను సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉండగా, ఒక దర్శకుడిని కలుసుకున్నాను. ఆయన రేపురా, మాపురా అని వాయిదాలు వేస్తూ, తిప్పుకున్నారు.
అయినా తప్పదు కదా!
ఓపిగ్గా తిరుగుతూ ఉన్న సమయంలో ఓ రోజు ‘యహ్.. ఇప్పుడు సినిమా వేషం ఏమీ లేదు వెళ్ళు, వెళ్ళు’ అని చిరాకు పడ్డాడు.
అది నా స్వాభిమానం మీద పెద్ద దెబ్బ తీసింది.
ఆరోజు అనుకున్నాను, ఇక సినిమాలకు వేషాల కోసం తిరగకూడదు అని.
అవసరం మేరకు ఎవరి దగ్గరకు వెళ్ళినా వీడి దగ్గరకు మాత్రం వేషానికి రాకూడదు. ఆ విధంగా నేను సినిమా వేషాల కోసం ప్రయత్నం చేయడం మానేశాను.
అప్పటి దాకా రాజారావుగారితో కలిసి ఉంటున్న రాజబాబు ‘వేషానికి తిరక్కపోతే ఎలారా? నువ్వు ఏమైనా ఎస్వీ రంగారావా? వెళ్ళి ప్రయత్నించాలి’ అని వాడి ధోరణిలో వాడు చెప్పాడు.
అతను హర్ట్ కాకుండా ఎవరి స్వభావాలు వారివి.
నీ ప్రయత్నాలు నీవు చేయి, నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను అన్నాను.
ఇలా ప్రయత్నాలు జరుగుతుండగా ఆరోజుకి ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో రాజారావుగారి సినిమాకి చిన్న నటులను తీసుకొచ్చే రాజు గారు ‘ఏమిటి అలా ఉన్నారు? డబ్బులు లేవా?’ అన్నారు. అవునండి అన్నాను. ‘సరే నేనొక చిన్న వేషం ఇప్పించగలను.
పదిహేను రూపాయలు ఇస్తారు. నేను అయిదు రూపాయలు తీసుకుంటాను. మీకు పది రూపాయలు ఇస్తాను.
అభ్యంతరం లేకపోతే ఇప్పుడే తీసుకెళతాను.” అన్నారు.
ఆయన ‘భక్త జయదేవ ‘ లో చిన్నడైలాగ్ క్యారెక్టర్ అవరమై నన్ను తీసుకెళ్ళారు.
వెళ్ళి కూర్చుని నా వేషం కోసం ఎదురుచూస్తుండగా, అందులో హీరో పాత్ర వేస్తున్న అక్కినేని నాగేశ్వరరావు గారి నోటంబట మాట వినిపించింది.
‘మనం ఊరికే వారి సిఫార్సుతో వచ్చింది, వీరి సిఫార్సుతో వచ్చింది అనుకుంటాం గానీ, నటుడన్న వాడికి ఓర్పు
ఉంటే, నేర్పు దానంతట అదే వస్తుంది.
ఓర్పు లేకపోతే నేర్పు కూడా పోయే అవకాశం ఉంది.
అలా అని గ్రహించి ఓర్పుగా ఉన్న వాడు వాడికి నేర్పు రావడానికి అవకాశం కూడా ఉంది.” అన్నారు.
ఆ మాట నాకు నిజమనిపించింది.
ఆయన మాటను శిరోధార్యంగా గుర్తు పెట్టుకున్నాను.
అక్కడి నుంచి నా స్వాభిమానం దెబ్బతినకుండా సినిమా రంగంలో మసలుకోవడం మొదలైంది.
ఆయనకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా.
బిఎన్ రెడ్డి గారి ‘రంగుల రాట్నం’ అవకాశం వచ్చేదాకా నా జీవితాన్ని నడిపించుకు రాగలిగాను.
వాహినిలో బిఎన్ రెడ్డి గారి ‘రంగుల రాట్నం ‘ సినిమాకి అసోసియేట్ గా పనిచేస్తున్న నా మిత్రుడు సివి. రమణ నాకోసం ప్రయత్నం చేశాడు.
ఆయన నా నాటకాలన్నీ చూసిన కారణంగా, వాహినీ వారి ‘రంగుల రాట్నం ‘లో పెద్ద వేషం ఇచ్చారు.
అక్కడి నుంచి బి.నరసింగరావు ‘మా భూమి’ సినిమాలో అవకాశం వచ్చే దాకా వెనక్కి చూడకుండా, నాకే తెలియకుండా నేను సినిమా రంగంలో నటుడిగా నిలదొక్కుకున్నాను.
దాన్నే ఒక్క మాటలో చెప్పాలంటే ‘బిఎన్ టు బిఎన్’ అని సంతృప్తిగా నా నట జీవితం జరిగిందని నేను భావించాను.”
“ఇక చిన్న నటుడిని కాకపోయినా, చిన్న నటుడిగా చూడబడుతున్న నా అనుభవాలను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను.
చిన్న పాత్రలు ఉంటాయి కానీ, చిన్న నటులు ఉండరు.
పాత్ర చిన్న దైనా పెద్దదైనా తన స్వరూప స్వభావాలతో కచ్చితంగా ఉంటుంది.
దాన్ని నటుడు గ్రహించి చేయగలిగితే ఆ చిన్న పాత్ర స్వభావాన్ని వ్యక్తం చేయగలిగితే తప్పకుండా అది ప్రేక్షకుణ్ణి ప్రభావితం చేస్తుంది.
ఇది నా అనుభవం. ‘అందాల రాముడు’ సినిమాలో రాజబాబు, నేను చేసిన ఒక పాత్ర అలాగే వ్యక్తమైంది.
ఇది ఉదాహరణ మాత్రమే.
నేను చేసిన చిన్న పాత్రలు ఒకే డైలాగుతో ఉన్న దాని స్వభావాన్ని వ్యక్తం చేసినవి ఎన్నో ఉన్నాయి.
అందు చేత పెద్దలు చెప్పినట్టు చిన్న పాత్రలు ఉంటాయి కానీ, చిన్న నటులుండరనేది నిజమే అయినా, పెద్ద పాత్రల ఇవ్వబోయిన నిర్మాతలు కూడా నన్ను చిన్న పాత్రలకే పరిమితం చేశారు. అది నాకు గర్వకారణమే కాని, కించపడవలసిన విషయం కాదు.”
“సినిమా కంపెనీల వివిధ విభాగాలలో పనిచేసే వారందరూ వీళ్ళని తక్కువ చూపుతో చూస్తారు కానీ, పెద్ద వేషాలు కూడా వేస్తున్నప్పటికీ పెద్ద నటుడికి ఇచ్చే గౌరవం ఇవ్వరు.నాలాంటి వారు అలాంటి వారి అజ్ఞానానికి నవ్వుకుంటాం కానీ, పట్టించుకోం.
చిన్న పాత్రలు వేస్తూ, పెద్ద పాత్రల అవకాశాలు వచ్చి స్థిరపడిన వాళ్ళు, చిన్న పాత్రల నటులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు.
చూసీ చూడనట్టుగా మొహం తిప్పుకునేలా వెళ్ళిపోవడం సాధారణంగా జరుగుతుంది. ఇక మా బోటి వాళ్ళకు వారి అజ్ఞానానికి నవ్వుకోవడమే మిగులుతుంది.
అప్పుడప్పుడు కొందరు ఎదురుపడితే అప్పుడే గుర్తించినట్టు తమ ప్రదర్శన చేసి దులుపుకుని వెళ్ళిపోతారు.
ఇంకొందరు అక్కడి దాకా వస్తూ, చూడనట్టు మొహం తిప్పుకుని వెళ్ళిపోతారు. లోకం రీతిని చూసి నవ్వుకోవడమే మా లాంటి వారు చేయగలిగింది.” అంటూ కాకరాల ముగించారు.
(ఆలూరు రాఘవ శర్మ, జర్నలిస్ట్, రచయిత, తిరుపతి)
కాకరాల మాస్టారు గారితో తిరుపతిలో మీ పలకరింపు హృద్యంగా ఉంది. ఆరేడు దశాబ్దాలుగా తెలుగు సినీజీవుల మనస్తత్వం ఇలాగే ఉంది కదా.. స్వాభిమానం చంపుకోకుండా సినిమాల్లో నటించడం ఎంత కష్టమో ఆయన కళ్లకుకట్టినట్లు చెప్పారు. అందాల రాముడు సినిమాలో ఆయన నటన కానీ ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు గారితో పోటీపడి చేసిన నటన కానీ, కర్తవ్యం సినిమాలో మధ్యతరగతి తండ్రిగా ఆయన పలికిన హావభావాలు కాని మర్చిపోగలమా.. కానీ ఆయన సినిమాల్లో కానీ టీవీ సీరియల్స్‌లో కానీ పెద్దగా గుర్తింపు లేకుండా మిగిలిపోవడానికి ఆయన అవకాశాల కోసం వెంటపడకపోవడమే కారణం. పరిచయం ఉండి కూడా చూసీ పలకరించకుండా పక్కకు తిప్పుకుని పోవడం సినిమా రంగంలో అలవాటైపోయిందని చాలామంది గతంలోనూ చెప్పారు. ఇది మాస్టార్ గారి వెర్ఖన్లో కొత్త జోడింపు మాత్రమే అనుకుంటాను. చాలా మంచి పరిచయం, చాలా మంచి విషయాలు ఆయన పంచుకున్నారు. మీ చొరవకు అభినందనలండి.