గురజాడ -ఆనంద గజపతి మహారాజు

-గురజాడ రామదాస్

అనువాదం : రాఘవ శర్మ

మా నాన్న గురజాడ అప్పారావు గారు హైస్కూల్లో చదివేరోజుల్లోనే ‘కుకూ’ అన్న కవిత రాశారు.
దాన్ని చూసి ముచ్చటపడిన స్కూళ్ళ ఇన్ స్పెక్టర్ మన్రో ఆ తరువాత వారిని ఆనంద గజపతి మహారాజుకు పరిచయం చేశారు.
వారు డిగ్రీ పరీక్షలు రాశాక కొద్ది కాలం పాటు హైస్కూల్లో టీచర్‌గా పనిచేశారు.
తరువాత ప్రభుత్వ రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేశారు.
నాగోజీ రావు సలహా మేరకు వారిని మహారాజు తన కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్‌గా నియమించి, తనకు పేపరు చదివి వినిపించే బాధ్యతను అప్పగించారు.
ఆకాలేజీలో నాన్న గారు కొన్ని సంవత్సరాలు పనిచేశారు.
ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండడంతో కాలేజీలో ఉద్యోగం మానేసి, విజయనగర సంస్థానంలో శాసన పరిష్కర్తగా చేరారు.
మహారాజు చాలా సంస్కారవంతుడు కనుక, నాన్న గారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఏ పనీ చెప్పకుండా, వారికిష్టమైన సాహిత్య అధ్యయనానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించారు.
మహారాజు స్వయంగా కవి, పండితుడు, సంగీతజ్ఞుడు, తాత్వికుడు, క్రీడాకారుడు. వివిధ కళల్లో మంచి నిష్ణాతులైన వారిని తన వద్ద పెట్టుకునే వారు.
అది భోజరాజు సంస్థానాన్ని తలపించేది.
అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వం ఆయనది.
అందుకునే ఐరాపా వారాయనకు ‘అందాల రాకుమారుడు’ అని పేరు పెట్టారు.
గురజాడలో ఉన్న మంచి తెలివి తేటలను, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, సమగ్రతను గమనించి, వారిని పూర్తిగా నమ్మి తన వ్యక్తిగత పనులన్నిటినీ వారికి అప్పగించారు.
తన ఉద్యోగిగా కాకుండా, తన సహచరుడిగా భావించారు.
నాన్న గారు రాత్రి, పగలు అనకుండా ఎక్కువగా రాజావారి కోటలోనే గడుపుతూ, అప్పుడప్పుడూ వచ్చి తన కుటుంబంతో గడిపేవారు.
మహారాజు శాసన సభ సభ్యుడిగా శాసన సభ సమావేశాల్లో పాల్గొనడానికి మద్రాసు వెళ్ళినప్పుడు, వేసవిలో కొండ పైన విడిది చేసినప్పుడు, అసలు ఎక్కడ పర్యటించినా నాన్న గారు వారితోనే ఉండేవారు.
మహారాజుతో పాటు ఉన్నత వర్గాల వారితో తిరగడం వల్ల వారితో పరిచయాలు ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది.
స్వభావ రీత్యా వారు తన చుట్టూ ఉన్న వివిధ రకాల మనుషులను, వారి జీవన విధానాన్ని, జరిగే సంఘటనలను నిశితంగా పరిశీలించి, వారి స్వభావాలను అధ్యయనం చేసేవారు.
తన నాటకాల్లో, కథల్లో అద్భుతమైన పాత్రలను సృష్టించడానికి వారి సునిశిత పరిశీలన ఎంతగానో దోహదపడింది.
సంగీత, నాట్యాల్లో ప్రతిభావంతులైన అందమైన వేశ్యలను మహారాజు పోషించేవారు.
లలిత కళల్లో వారి నైపుణ్యాన్ని అభినందించడానికి మాత్రమే అలా చేసేవారు.
రోమ్ లో మహిళలను, మద్యపాన శాలల్లో కవులను, చిత్రకారులను, శిల్పులను, సంగీతజ్ఞులను కూడగట్టి, వారితో సంభాషిస్తూ వారిలోని కళానైపుణ్యాలను ఆరాధించేవారు.
మహారాజు మద్రాసు వెళ్ళినప్పుడు బలజ నాయుడు మేనకోడలు రామతిలకం పైన మహా ఆకాంక్షతో ఆమెను తన పక్కనే ఉంచుకునే వారు.
ఆమె మైకంలో ఉన్న సమయంలో కూడా మా నాన్నగారు కనిపించగానే చివాలున లేచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయేది.
తప్పుదోవలో పయనించే వారికి మా నాన్నగారి వ్యక్తిత్వం ఒక ఔషధంలా పనిచేసేది.
‘రామతిలకాన్ని పెట్టుకోడానికి మహాజవారికి లైసెన్స్ ఏమైనా ఉందా?’ అని నాన్నగారి మిత్రులు గిడుగు రామమూర్తి పంతులు అడిగారు.
రామతిలకం నాట్యాన్ని చూసి ఆనందించడానికే తప్ప అంతకు మించి మహారాజు ఆమెతో ఏర‌కంగానూ
వ్యవహరించరన్నారు.
‘రామ తిలకం బుగ్గల పైన ఉన్న గుంతలు, ఆమె ముఖంలోని వ్యక్తీకరణలను ఎలా కీర్తిస్తారు’ అని గిడుగు రామ్మూర్తిని ప్రశ్నించారు.
మద్దిల మహాలక్ష్మి అనే ప్రసిద్ధ వేశ్య మహారాజ వారి సేవలో గడిపేది.
సంగీతంలో ఆమె ప్రతిభావంతురాలు.
ప్రముఖ భాగవతార్ ఆదిభట్ల నారాయణ దాస్, కలిగట్ల కామరాజు వంటి వారెందరో ఆమె ప్రతిభను ప్రస్తుతించారు.
‘అమ్మాయిల నాట్యాలను చూడ్డానికి మీ నాన్నగారేమైన వెళతారా, అలా వెళ్ళకపోతే వారి జీవితాన్ని, వారి జీవన విధానాలను తన రచనల్లో అంత బాగా ఎలా రాయగలిగారు’ అని ఒక మిత్రుడు నన్నడిగాడు.
మా అమ్మ నాన్నగారు, అంటే మా తాతయ్య సంపదగల భూస్వామి.
ఆయన ఇద్దరు కొడుకులు కూడా చెడు పరిసరాల్లో పెరిగారు.
చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసలయ్యారు.
చాలా బాధపడిపోయిన మా తాత గారు వారి రెండవ కుమారుడిని చదువుకోవడానికి మా నాన్న గారి వద్దకు పంపారు.
ఆ సమయంలో మా మామయ్య విజయనగరం వచ్చి చెడు అలవాట్లను ఒంటబట్టించుకున్నాడు.
అతన్ని బాగు చేయాల్సిన బాధ్యత నాన్నగారి పైన పడింది.
మా మావయ్య విజయనగరంలో చాలా ఉల్లాసంగా గడపడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
చదువును అలక్ష్యం చేశాడు.
పొడుగు సుందరి అనే ఒక అందమైన నాట్యకత్తెను పెట్టుకున్నాడు.
ఆమె వీణ కూడా చాలా బాగా వాయిస్తుంది.
అర్ధరాత్రి పొద్దుపోయే వరకు ఆమె ఇంట్లోనే మావయ్య గడిపేవాడు.
మావయ్యను ఇంటికి తీసుకు రావడానికి నాన్నగారు చాలా సార్లు ఆమె ఇంటికి వెళ్ళే వారు.
ఆ సమయంలో వేశ్యల జీవితాలను పరిశీలించడానికి నాన్నగారికి అవకాశం లభించేది.
నాన్నగారి జీవితమంతా మహారాజు, మహారాణి సేవలో గడిచినప్పటికీ తన రచనలన్నిటిలో సమాజం పట్ల అనిర్వచనీయమైన ప్రేమ కనిపిస్తుంది.
ఆయన జీవిత నేపథ్యాన్ని తెలుసుకోకపోతే, ఆయన అసమాన వ్యక్తిత్వాన్ని వివరించలేం.
వారు స్వేచ్చను ప్రేమించారు.
మహారాజు సంస్థానంలో గడిపిన జీవితం వారి ఆదర్శాలను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయింది.
బెనారస్లోని గొప్ప గొప్ప పండితుల వద్ద ఆనంద గజపతి మహారాజు చదువుకున్నారు.
ఆయన సంస్కృత వ్యాకరణాన్ని, తర్కాన్ని, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడంతోపాటు, పురాతన లిపిని చదవడాన్ని కూడా నేర్చుకున్నారు.
ఆంగ్ల ఉపాధ్యాయుల వద్ద ఇంగ్లీషును, పర్షియా భాషను, బెంగాలి భాషను నేర్చుకున్నారు.
జీవితం పైన ఆయన దృక్పథం గౌతమ బుద్ధుడి దృక్పథం లాంటిది.
ఆనంద గజపతి మహారాజులో కోపం అనేది ఎవరూ చూడలేదని నాన్న గారు చెప్పేవారు.
ఒక రోజు మహారాజు సేవకుడు ఆయన ఇంటి నుంచి ఒక వెండి కప్పును దొంగిలించాడు.
ఈ విషయం మహారాజ వారి దృష్టికి వెళ్ళింది.
అతనెందుకు వెండి కప్పును దొంగిలించాడని మరొక సేవకుడిని అడిగాడు.
ఆ సేవకుడు అబద్దం చెప్పదలుచుకోలేదు.
‘అతని ఆర్థిక పరిస్థితి ఏమీ బాగుండలేదు. అందుకునే ఈ తప్పుడుపని చేయాల్సి వచ్చింది మహారాజ’ అని చెప్పాడు.
మహారాజు బాధపడిపోయి, వెండి కప్పు దొంగిలించిన సేవకుడి జీతాన్ని నెలకు రెండు రూపాయలు పెంచి ఆఫీసులో పనిచేసుకోమని పంపించాడు.
మరొక సందర్భంలో, ఓ వేసవి మధ్యాహ్నం పూట విశాఖ పట్నంలోని డెప్యూటీ కలెక్టర్ బుద్ధవరపు నారాయణమూర్తి విజయనగరం వచ్చి మహారాజును కలిశారు.
వారి మధ్య జరిగిన సంభాషణలో, పంఖా లాగే వ్యక్తికి, తనకు తేడా ఏమిటని నారాయమూర్తిని మహారాజు ప్రశ్నించారు.
నారాయణ మూర్తి ఏమీ చెప్పలేక మౌనం దాల్చాడు.
తాను మహారాజుకు పుట్టానని, పంఖా లాగే వ్యక్తి ఒక సేవకుడికి పుట్టాడని, అంతే తేడా అన్నారు.
ఆయన సోషలిస్టు భావాలున్న వ్యక్తి.
మహారాజు ఆది భౌతిక ఆలోచన కోసం తపించేవారు.
సమాజంలో జరిగే విషయాలపై కోటలో నాన్నగారి ఆధ్వర్యంలోనే చర్చలు జరిగేవి.
ఈ సమావేశాల్లో అనేక విషయాలు స్వేచ్చగా చర్చించేవారు.
‘మహిళలు పురుషులను మోహిస్తారు” అన్న అంశంపైన చర్చజరిగింది.
సుదీర్ఘ చర్చ తరువాత ‘పురుషులే మహిళలను మోహిస్తారు’ అని తేలింది.
ఆ విజయనగరం రాజ కుటుంబంతో మా నాన్నగారి బంధం బాగా బలపడింది.
ఆ సంస్థానంలో ఆయన్ను ఒక ఉద్యోగిగా కాకుండా, ఒక కుటుంబ సభ్యుడిగా చూసేవారు.
అంత:పురంలో ఆయన ఎక్కడికైనా వెళ్ళవచ్చు.
ఆనంద గజపతి రాజు భార్య వనజా కుమారి బాగా చదువుకున్నారు.
ఆమెకు సంగీతమన్నా, చిత్రలేఖనమన్నా చాలా ఇష్టం.
ఆమె స్వయంగా చిత్రకారిణి.
తన అంత: పురంలోని కిటికీ అద్దాల పైన అందమైన రంగులతో ప్రకృతి దృశ్యాలను, మానవ రూపాలను చిత్రించారు.
ఆమె ఉత్తర భారత దేశంలోని జైపూర్ రాజకుటుంబానికి చెందిన వారు.
మా నాన్నగారికి ప్రాధాన్యత ఇచ్చి, అన్ని విషయాలలోనూ ఆయనతో సంప్రదించే వారు.
దురదృష్ట వశాత్తు ఆమె ఎక్కువ కాలం జీవించలేదు.
బెనారస్లో ఒక శిశువుకు జన్మనిచ్చిన వెంటనే తుదిశ్వాస విడిచారు.
మహారాజు ఆమెను చాలా ప్రేమించాడు.
ఆమె పోవడంతో జీవితంలోని అన్నిటినీ పోగొట్టుకున్నాడు.
ఆయన జీవించిన చివరి సంవత్సరం పాలనా బాధ్యతలన్నిటినీ అధికారులకు అప్పగించి, స్నేహితులతో, సంస్థానంలో బాగా చదువుకున్న వారితో గడిపారు.
తన బాధను దిగమింగుకోవడానికి మద్యానికి బానిసయ్యారు.
ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేకుండా తన సంస్థానంలోని వారందరికీ ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
నాన్న గారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేని మద్యాన్ని ఇచ్చేవారు.
తరువాత నాన్న గారు చివరి వరకు కోకో వైన్ కు మాత్రమే పరిమితమయ్యారు.
మహారాజు మృతి చెందడానికి వారం రోజుల ముందు వెలగాడ కొండల్లో కొన్ని రోజులు గడుపుదామని వెళ్ళారు.
వారి తండ్రి విజయరామ గజపతి రాజు వెలగాడ కొండల్లో ఒక విశాలమైన రాజభవనాన్ని నిర్మించారు.
తన కోట నుంచి అది కేవలం నాలుగు మైళ్ళ దూరంలోనే ఉంది.
దాంతో తన రాజాస్థానమంతా అక్కడికి తరలి వెళ్ళాల్సి వచ్చింది.
వర్షం పడుతోంది.
మహారాజు గుర్రం పైనుంచి కొండ దిగుతున్నారు.
ఆయన కోటకు తిరిగి వస్తుండగా వర్షం జోరందుకుంది.
ఫూల్ బాగ్ వద్ద ఆగాలనుకున్నారు.
ఆ భవనం మెట్లపైకి గుర్రంతో వెళ్ళాలని ప్రయత్నించారు.
గుర్రం కాలు జారిపోయి, దాని జీను పైన పడిపోయారు.
ఆ గుర్రపు జీను వారి గుండెలకు తగులుకుపోయింది.
రెండు రోజులు గుండె నొప్పితో బాధపడ్డారు.
మూడవ రోజు జ్వర తీవ్రత పెరిగింది. డాక్టర్లు పరీక్షించి ఆయన ఇక బతకడం కష్టమని చెప్పేశారు.
చివరి క్షణం వరకు ఆయన స్పృహలోనే ఉన్నారు.
రాత్రి వారి తల్లి, చెల్లెలు చూడడానికి వచ్చారు.
నాన్న గారిని తీసుకురమ్మని వారిని ఆదేశించారు.
నాన్న గారిని వారి చెల్లెలికి చూపిస్తూ, “అప్పాజీ, ఈ అప్పారావు గారు మనకు నమ్మకమైన ఉద్యోగి, నా సోదరుడు. వీరిని నీకు అప్పగిస్తున్నాను. నేను వీరిని ఎంత గౌరవంగా చూశానో, నువ్వు కూడా అంత గౌరవంగా చూడాలి” అని చెప్పారు.
ఈ ఒప్పందం వల్లనే మా నాన్న గారు చివరి వరకు ఈ సంస్థాన ప్రయోజనాలు పరిరక్షించారు.
మహారాజు మృతి తరువాత ఈ సంస్థాన యాజమాన్యం అంతా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది.
ఈ సంస్థానాన్ని పరిరక్షించడానికి కలెక్టరు నియమించారు.
ఆనంద గజపతి రాజు చెల్లెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలు గలవారు.
ప్రతిభావంతులైన అధికారుల ఆధ్వర్యంలో సంస్థానాన్ని నడిపించారు.
మహారాజు తన పిల్లల్ని అలా వదిలేసి వెళ్ళలేదు.
తన తల్లి అలకా రాజ్వేరి కోరిక మేరకు చిట్టి బాబు (విజయరామ గజపతి రాజు)ను దత్తత తీసుకుంది.
అతని తరపున ఆమె సోదరుడి కుమారుడు పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించారు.
ఆనందగజపతి మరణానంతరం చిట్టి బాబు పెళ్ళి జరిగిన బెనారస్‌కు వారి తల్లి, చెల్లెలు వెళ్ళారు.
మైనారిటీ తీరని విజయనగరం రాజు చిట్టిబాబుకు, క్మాండకు చెందిన ఠాకూర్ సాహెబ్ కుమార్తెకు ఇచ్చి వివాహం చేయడంలో నాన్న గారు అందులో ఇరుక్కుపోవలసి వచ్చింది.
కాస మండకు చెందిన రాకూర్ సాహెబ్ చాలా ఎత్తుగడల మనిషి.
విజయనగరం రాజకుటుంబంతో ఎలాగైనా సంబంధం కుదురుర్చుకోవాలని, మా నాన్నగారు మాత్రమే ఆ పని చేయగలరని భావించాడు.
బలెపూర్ లో ఉన్న మా ఇంటికి ఓ రాత్రి ఠాకూర్ సాహెబ్ అనేక బహుమతులను తీసుకుని వచ్చాడు.
మా నాన్న ఆశ్చర్యపోయి ‘ఇలాంటి ముఖ్యమైన విషయాలు మాట్లాడ్డానికి ఇది సమయమూ కాదు, స్థలమూ కాదు’ అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.
ఈ సంబంధం కుదుర్చుకోకపోతే, తన కూతురిని గంగానదిలో విసిరేయడం తప్ప వేరే దారి లేదని ఠాకూర్ సాహెబ్ హెచ్చరించి, మారు మాట వినకుండా మా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
ఈ పని చేయడం మా నాన్నగారికి చాలా ఇబ్బందికరంగా తయారైంది.
దాంతో రాకూర్ సాహెబ్ ను మహారాణి వద్దకు తీసుకెళ్ళి, తన శక్తి సామర్థ్యాలను, తన పలుకుబడిని ఉపయోగించి చిట్టిబాబుకు రాకూర్ సాహెబ్ కుమార్తెతో సంబంధాన్ని అంగీకరింప చేశారు.
కట్న కానుకల కింద లక్ష రూపాయలను ఇవ్వమని ఠాకూర్ సాహెబ్ కు చెప్పారు.
దాంతో విజయనగరం రాకుమారుడు చిట్టిబాబుకుకు, ఠాకూర్ సాహెబ్ కుమార్తె లలితా కుమారికి వివాహం జరిగింది.
కొద్ది నెలల తరువాత పెళ్ళికుమారుడు, పెళ్ళి కుమార్తెతో కలిసి మహారాణి అలకా రాజేశ్వరి, ఆమె కుమార్తె మహారాజ కుమారి అప్పలకొండాయమ్మ విజయగరానికి తిరిగి వచ్చారు.
తరువాత కొద్ది కాలానికి మహారాణి అలకారాజేశ్వరి వృద్దాప్యంతో ఆనారోగ్యం బారిన పడి కన్ను మూశారు.
ఈ ఎస్టేట్ వ్యతిరేకులు కోర్టులో కేసువేశారు.
ఆనంద గజపతి కంటే ముందే మహారాణి భర్త విజయరామ గజపతి మృతి చెందడం వల్ల, ఆమెకు దత్తత తీసుకునే అర్హత లేదని కోర్టులో కేసు నడిచింది.
దీంతో తీవ్రంగా మనస్థాపం చెందిన మహారాణి అప్పల కొండాయమ్మ తన శక్తి యుక్తులన్నిటినీ ధారపోసి సంస్థానాన్ని పరిరక్షించడానికి ప్రయత్నించారు.
తన సోదరుడు ఆనంద గజపతి మృతి చెందడానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ కేసును నడిపించవలసిందిగా నాన్నగారిని పిలిపించి అడిగారు.
ఆ సమయంలో మా నాన్న గారు విజయగనరం సంస్థాన చరిత్ర రాయడానికి విలువైన సమాచారమంతా సేకరించారు.
ఈ కేసు వారి రచనకు ఆటంకమైంది.
కళింగ దేశ చరిత్ర రాయాలనుకున్నారు కానీ, ఆ తరువాత రాయడానికి వారు జీవించలేదు.
సాంస్థానం పైన పెట్టిన కేసు ఏళ్ళ తరబడి సాగింది.
నాన్న గారు ఈ కేసులో న్యాయవాదులకు సలహాలివ్వడానికి చట్టాలను అధ్యయనం చేశారు.
న్యాయ శాస్త్రంలో నాన్న గారు ఎంత ప్రతిభావంతులో చూసిన మద్రాసు హైకోర్టు అడ్వకేట్ జనరల్ శ్రీనివాస అయ్యంగార్ ఆశ్చర్యపోయారు.
న్యాయవాదులకే చట్టాలను చెప్పగలిగిన దిట్ట అని కొనియాడారు.
ఈ కేసు కోసం నియమితులైన ప్రత్యేక న్యాయమూర్తి బ్రాడే తన తీర్పులో “ఈ కేసులో అప్పారావు కదిలే చైతన్యం” అని రాశారు.
కింది కోర్టులో ఈ కేసు తీర్పు ప్రత్యర్థులకు అనుకూలంగా వచ్చింది.
కింది కోర్టు తీర్పుపై రాజా హైకోర్టులో అప్పీలు చేశారు.
రీవా మహారాణి 1912లో మృతి చెందారు.
దాంతో ఆ కుటుంబంతో మా నాన్నగారి బంధం తెగిపోయింది.
వారికి సేవ చేయడానికి ఇక కోటలో అడుగుపెట్టదలుచుకోలేదు.
రీవా మహారాణి మృతి చెందడానికి ముందు ఒక సారి విజయరామ గజపతి తగ్గని ఒక జబ్బుతో మంచం పట్టారు.
రీవా మహారాణి సలహా మేరకు ఆయన తన కుమారుల పేర ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు.
ఆ సంస్థానం, ట్రస్టు నిర్వహణకు అందులో సభ్యురాలిగా తాను చేరారు.
రీవా మహారాణి మృతి తరువాత ఏర్పడిన ట్రస్టీ ఖాళీలో విజయరామ గజపతి సతీమణి లలితా కుమారి చేరాలని ప్రయత్నించారు.
అందుకు తనకు సహాయం చేయమని, రీవా మహారాణి నాన్న గారిని ఎలా గౌరవించేవారో అలాగే తానూ గౌరవిస్తానని, కావలసినంత డబ్బు ఇస్తానని అడిగారు.
నాన్న గారు తన యజమానుల నుంచి ఏమీ కోరుకోలేదు, వారు స్వచ్ఛందంగా ఇచ్చినవి తీసుకోవడం తప్ప.
ట్రస్టీ కమిటీ సభ్యులకు నచ్చ చెప్పి లలితా కుమారిని ఆ స్థానంలో చేర్చారు.
హైకోర్టులో అప్పీలుకు వెళ్ళాలని విజయరామ గజపతి రాజు, ఆయన సతీమణి చాలా ఆత్రుతగా ఉన్నారు.
ఈ కేసులో దత్తత స్వీకారానికి సంబంధించిన సహజ లోపం ఉందని గమనించిన నాన్న గారు ప్రత్యర్థులతో రాజీ చేయించి, సంస్థానాన్ని విజయరామ గజపతి రాజుకు అప్పగించారు.

(గురజాడ అప్పారావు గారి కుమారుడు గురజాడ వెంకట రామదాసు 1890-1973)

3 thoughts on “గురజాడ -ఆనంద గజపతి మహారాజు

  1. కన్యాశుల్కం నాటక ప్రస్తావన కూడా లేకుండా.. కేవలం గురజాడ వారి దైనందిన జీవిత విశేషాలు, ఆనందగజపతి రాజుతో ఆయన అనుబంధం గురించి ఇంత వివరంగా ఇంతకు ముందు నేను చూడాలేదు. మీ అనువాదం కారణంగా గురజాడ వైయక్తిక విశేషాలను 3 కథనాాల్లో చదవగలిగాను. ప్రముఖుల సాహిత్య చరిత్రలో వారి వ్యక్తిగత చరిత్రను పొందుపర్చకపోతే ఎంత నష్టం జరుగుతుందో మీ ఈ కథనాల ద్వారా అర్థం చేసుకున్నాను. మీరు చేసిన ఈ మూడు అనువాద కథనాలను ఒక బుక్ లెట్‌గా చేసుకుని భద్రపర్చుకుని మళ్లీ మళ్లీ మననం చేసుకోవాలి. అందుకే ఆరుద్ర గారు రాసిన సమగ్రాంధ్ర చరిత్ర ఉద్గ్రంధం అంటే అంత ఇష్టం నాకు. డిగ్రీ చదువుతున్నప్పుడు నవల చదువుతున్నంత ఇష్టంగా చదివేశాను దాన్ని. అప్పట్లో 12 భాగాలుగానో 14 భాగాలుగానో వచ్చిందది. రాయచోటి లైబ్రరీ నుంచి సభ్యత్వం కట్టి తీసుకుని మరీ చదివాను ఆ పుస్తకాలను. ధన్యవాదాలు సర్. ఇంత మంచి విలువైన జ్ఞాపకాలను తెలుగు చేసి మరీ అందించినందుకు.

  2. గురజాడ అప్పారావు గారి మేధస్సును గురించి రాఘవశర్మ గారి అనువాదం చక్కగా వుంది. విలువైన చారిత్రక సమాచారాన్ని అందించిన ఘనత గురజాడ గారి కుమారునికి దక్కుతుంది. రాఘవశర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

    .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *