గురజాడ జ్ఞాపకాలు

డాక్టర్ గిడుగు వెంకట సీతాపతి

(అనువాదం : రాఘవశర్మ)

“ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు” అన్న సామెతకు చాలా విస్తృతమైన అర్థం ఉంది.
కానీ, గురజాడ వెంకట అప్పారావు విషయంలో మాత్రం ఇది నిజం కాదు.
శారీరకంగా ఆయన అంత ఆరోగ్యవంతుడు కాకపోయినా, మనసు మాత్రం చాలా ఆరోగ్యకరమైనది.
ఫొటోలో ఆయన ముఖాన్ని చూస్తే ఆయన శరీర పరిస్థితి అర్థమైపోతుంది.
విశాలమైన పాలభాగంలో మెరిసే కళ్ళు, చిన్న కనుగుడ్లు, పొడవాటి ముక్కు, సన్నని పెదాలు, చక్కగా అమరిన చెవులు, మధ్యస్థంగా ఉండే బుగ్గలు, కింద పెదవి కింద అందమైన ఒంపు, దాని చివరి కొస మధ్యలో చిన్న సొట్ట, సున్నితంగా ఉన్న విశాలమైన బుగ్గలు; ఇవ్వన్నీ ఇటు పూర్తి గుండ్రం, అటు పూర్తి కోలగా కాకుండా మధ్యరకంగా ఉండే ముఖానికి తోడయ్యా యి.

పలుచగా చక్కగా అమరిన కనుబొమ్మలు, మెలితిరిగిన మీసాలతో నిజాయితీ. ఎవరైనా కొత్త వ్యక్తి ఆయన ముఖాన్ని చూసి, అనేక రకాల దుస్తులు వేసుకున్న ఆయన శరీరాన్ని గమనించినట్టయితే ఆశ్చర్యపోతారు.
శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడు కుచేలుడి రూపం గుర్తుకు వచ్చేలా ఆయన శరీరం బక్కపలుచగా, బలహీనంగా ఉంటుంది.

చిన్నతనం నుంచి బలహీనంగా ఉన్న అప్పారావుగారి సున్నితమైన శరీరాన్ని చూసి, ఆయన స్థాయిని గమనించినట్టయితే అది అతిశయోక్తి అనుకుంటారు. దగ్గరగా చూసి ఆయన పక్కటెముకలను కూడా లెక్కపెట్టవచ్చు. కొట్టవచ్చినట్టు కనిపించే వారి బలహీనత అటుంచితే, అలసట లేకుండా నడిచేవారు.
తాను నివసించే విజయగరం నుంచి అటు కలకత్తాకు, ఇటు మద్రాసు, ఊటీకి కూడా తరచూ ప్రయాణించేవారు.
అప్పారావుగారు 1896-1897 మధ్య సైకిల్ కూడా తొక్కేవారు.

తనకు తండ్రితో సమానమైన విజయనగరం మహారాజు ఆనందగజపతి 1897లో మృతి చెందిన తరువాత, ఆయన వారసత్వం గురించి విశాఖ పట్నం జిల్లా కోర్టులో కేసుకోసం శారీరంకంగా, మానసికంగా చాలా సంవత్సరాలు నిర్విరామంగా తిరిగి పనిచేశారు.

కేసుకు సంబంధించిన పత్రాలను సేకరించడం, వాటిని అచ్చు వేయించడం, కేసులో ఉన్న నిజానిజాలను న్యాయవాదులకు వివరించడం, తగిన సాక్షులను తీసుకురావడం, ప్రధాన న్యాయవాదికి సహాయం చేయడానికి మద్రాసు నుంచి న్యాయవాదులను తీసుకురావడం, విజయనగరం సంస్థానం నుంచి గుమాస్తాలను తీసుకురావడం వంటి పనులన్నిటికీ అప్పారావు కేంద్ర బిందువుగా పనిచేశారు.
కేసు చివరి దశలో ఉండగా 1906లో నేను కోర్టు ఆవరణలోకి వెళ్ళాను.

పందిరి లాంటి ఒక పెద్ద గుడారం కింద వందలమంది లాయర్లు, వారికి కుర్చీలు బెంచీల ఏర్పాటు చూసి ఆశ్చర్యపోయాను. ఆ శిబిరంలో చాలా చోట్ల అనేక ప్లేట్లలో జీడిపప్పులు, మిఠాయిలు, పూతరేకులు,పళ్ళు, శీతల పానీయాలు అమర్చారు.

కాఫీ కప్పులు, జగ్గులు పుచ్చుకుని అనేక మంది సేవకులు అటు ఇటు తిరుగుతున్నారు.
నేనొక మూల హాయిగా కూర్చున్నానని అక్కడికి వచ్చిన నా స్నేహితులు నా పైన ఆరోపించారు.
నా కుర్చీ ముందున్న టీపాయ్ పైన ఒక ప్లేటు నిండా రకరాకాల ఆహార పదార్థాలు, ఒక కప్పు కాఫీ పెట్టారు.
కొందరు రాస్తున్నారు, కొందరు టైప్ చేస్తున్నారు, మరికొందరు న్యాయశాస్త్రాలను చదువుతున్నారు.
ఇంకొందరు వాటిని సంక్షిప్తంగా రాసుకుంటున్నారు.

ఈ పనులన్నీ అప్పారావుగారు, మరి కొందరి పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
ఆయన బలహీనంగా ఉన్నప్పటికీ 1914 వరకు ఆయన ఆరోగ్యం మామూలుగానే ఉంది.
తన వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు జీర్ణ వ్యవస్థను అదుపులో పెట్టుకున్నారు.
చాలా శ్రద్ధతో తన కోసం ప్రత్యేకంగా వంటకాలు తయారు చేయించుకుని, తన శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేవారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు తనతో గడపాలని 1913లో ఒక రోజు నన్ను ఆహ్వానించారు.
స్నానం చేయడం, దుస్తులు ధరించడం, భోజనం చేయడం, సాహిత్య పనులు వంటి వారి పనులను దగ్గరగా పరిశీలించే అవకాశం దాంతో నాకు దొరికింది.

మా నాన్న గిడుగు రామమూర్తి పంతులు గారు అప్పారావు గారికి చాలా ఇష్టమైన స్నేహితుడు.
మహారాజ కుమార్‌కు, వారి సోదరి రాజకుమారికి మా నాన్న గారు ట్యూటర్ గా పనిచేస్తున్నప్పుడు నేను వారితో కలిసి ఉండేవాడిని.

మా ఇల్లు అప్పారావుగారింటికి కేవలం వంద గజాల దూరంలో ఉండేది.
ఉదయం 8 గంటలకు అప్పారావు గారింటికి వెళ్ళే వాడిని. అప్పటికే వారు తన ఇంటి మొదటి అంతస్తులోని గదిలో తన పనిలో ఉండేవారు. మొదటి అంతస్తు చివరి మెట్టు ఎక్కగానే వారి గదికనిపించేది.
ఖాళీ కుర్చీని తన దగ్గరకు లాక్కుని కూర్చోమనేవారు. వారి కుర్చీ ముందర ఉన్న టేబుల్ పైన ఖాళీ కాగితాలు, రాత సామాగ్రి ఉండేది. వచ్చిన వారిలో ముఖ్యులు కూర్చోడానికి ఆయనకు ఎదురుగుండా రెండు కుర్చీలు వేసి ఉండేవి.

తరువాత ప్రధాన్యత ప్రకారం వారి కోసం వాటికి ఇరువైపులా రెండు బెంచీలు వేసి ఉండేవి.
గదిలోకి ప్రవేవిశించే దగ్గరగా మరొక ఖాళీ బెంచి వేసి ఉండేది. నేను ఆ గదిలోకి ప్రవేశించే సరికి గది అంతా నిశ్శబ్దంగా ఉంది. సందర్శకులు ఎవరూ లేరు. అప్పారావుగారు తన పనిలో నిమగ్నమై ఉన్నారు.
నేనేమనుకున్నానంటే, గదిలోకి ప్రవేశించే సరికి వచ్చిన సందర్శకుల మధ్య అప్పారావు గారు ఏదో రాసుకుంటూ ఉంటారనుకున్నాను కానీ, అలా లేదు. వారేదో ముఖ్యమైన సాహిత్య వ్యాసం రాసుకుంటున్నారని రెండు నిమిషాల తరువాత గమనించాను. సందర్శకుల్లో ఒకతను వచ్చి మెల్లగా ఏదో మాట్లాడడానికి ధైర్యం చేశాడు. అది అతని వ్యక్తిగత ప్రయోజనానికి సంబంధించింది. అప్పారావు గారు తల కూడా పైకెత్త లేదు. చిరు నవ్వు నవ్వి, “అవును నేను దాని గురించి విన్నాను. హుజూర్ మేనేజర్ వద్దకు వెళ్ళి నేను కలవమన్నానని చెప్పు” అన్నారు. అలాగే చేస్తానని అతను వెళ్ళిపోయాడు. చాలా మంది సందర్శకులు వస్తున్నారు, సన్నని గొంతుతో చెప్పి వెళ్ళిపోతున్నారు. సందర్శకుల రాకతో ఆయన ఏమాత్రం ఇబ్బంది పడకుండా, ఆ పది నిమిషాలలో మూడు కాగితాలు రాయడం పూర్తి చేశారు.

ఇద్దరు మనుమ రాళ్ళలో ఒకరు వచ్చి “తాతయ్యా.. చూడు తాతయ్యా.. అక్క నా దగ్గరకొచ్చి దొంగ పిల్లిలా మియావ్ మియావ్ అంటోది” అని ఫిర్యాదు చేసింది. ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు చేసిన ఫిర్యాదు అది.
అప్పారావు గారు ఆ అమ్మాయి వేపు జాలిగా చూసి, “అయ్యో.. అలా చేసిందా! నువ్వు వెళ్ళి మీ అక్క ముఖం మీద ‘పారిపో చిట్టెలుకా పారిపో’ అని అరువు” అని నచ్చచెప్పారు.

ఆ అమ్మాయి ఆనందంతో తాతగారు చెప్పినట్టు అరుస్తూ వెళ్ళిపోయింది. మాకు పిలుపు రావడంతో టిఫిన్ కోసం మేం కిందనున్న డైనింగ్ హాలుకు వెళ్ళాం. మేం తినే సాధారణ తిండికంటే వారి భోజనం భిన్నంగా ఉంది.
అది వారి సతీమణి చేశారు. నేను ఆమెను ‘పెద్దమ్మ’ అని పిలిచేవాడిని.
నాలుగైదు రకాల వంటకాలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఒకటి రెండు ముద్దలకు మించి లేదు.
ఆ వంటకాలన్నీ రెండు సార్లు ఉడికించిన బియ్యంతో చేసినవి. రుచికి మసాలా దినుసులు వేశారు.
భోజనం ముగిశాక తిరిగి వారి గదికి వెళ్ళాక “నేనొక అరగంట పడుకుంటాను. ఈ లోగా నా వ్యాసాన్ని చదువు” అని చెప్పి ఆ గదికి అనుకుని ఉ న్న పడగ్గదిలోకి వెళ్ళి పడుకునేశారు.
ఆ వ్యాసాన్ని చదివాను.

కొన్ని రోజుల క్రితం హిందు పత్రికలో వచ్చిన వ్యాసానికి సమాధానం అది.
అప్పారావుగారి కుమారుడు రామదాస్ వచ్చి ఆ పేపర్లను టైప్ చేయించడానికి తీసుకెళ్ళాడు.
అక్కడ టేబుల్ పైన ఉన్న తాజా ‘మద్రాస్ మెయిల్’ ను చదివాను.
అరగంటలో అప్పారావు గారు తిరిగి వచ్చాక మేం కొద్ది సేపు మాట్లాడుకున్నాం.
మహారాజు నుంచి పిలుపు రావడమే కాకుండా, వారిని తీసుకెళ్ళడానికి బండి కూడా వచ్చింది.
ఉన్నితో చేసిన చలికోటు అప్పటికే ఆయన వేసుకున్నారు.

చొక్కాపైన వెయిస్ట్ కోటు తొడుక్కుని, దాని పైన లాన్ కోటు వేసుకున్నారు.
బుజం పైన శాలువా కప్పుకున్నారు. సిద్ధంగా ఉన్న తల పాగా పెట్టుకున్నారు.
మెడ చుట్టూ ఒక ఉలన్ కండువా చుట్టుకున్నారు.
ఆయనను ఆశ్చర్యంగా చూస్తూ నవ్వు ఆపుకోలేకపోయాను.
“నాతో రా సీతాపతి” అన్నారు.
“కోటకు నువ్వు కూడా నా వెంట రా” అన్నారు. (మహారాజ వారి రాజభవనానికి ఉన్న పేరు కోట).
బండిలో కూచోగానే “నా శరీరం చాలా సున్నితంగా తయారైంది.
చల్లని గాలిని కానీ, కాస్త వేడిని కానీ తట్టుకోలేదు.
చలిని తగ్గించడానికి ఇన్ని దుస్తులు వేసుకోవలసి వస్తోంది.
అవి వేసుకోకపోతే కొన్ని రోజుల పాటు పడకేయాల్సి వస్తుంది.” అన్నారు నాతో.

ఒక పావుగంటలో మేం కోటకు చేరుకున్నాం. ప్రధాన ద్వారం గుండా బండి లోపలకు వెళ్ళింది. ప్రధాన బంగళా పక్కన ఉన్న ఔట్ హౌస్ వద్ద మమ్మల్ని దించేసింది. బండి దిగి వరండాలోకి వెళ్ళాం.
ఒక సేవకుడిని పిలిచి తాను వచ్చానని మహారాజుకు చెప్పమని పంపించారు. శాలువా విప్పి దానిలోంచి ఖాళీ కాగితాలు, ఒక పత్రిక, ఫౌంటెన్ పెన్ తీసుకున్నారు. ఆ పత్రికను నాకిచ్చి, మరొక వ్యాసం రాయడం మొదలు పెట్టారు. మాకు కాస్త దూరంగా ఒక కంసాలి నెక్లెస్ ను తాయారు చేస్తున్నాడో, బాగు చేస్తున్నాడో తెలియదు కానీ, చిన్న సుత్తితో కొడుతున్నాడు. ఆ సుత్తి శబ్దాలు కాస్త ఇబ్బందికలిగించేలా ఉన్నాయి.
ఆ శబ్దాలను ఏ మాత్రం పట్టించుకోకుండా అప్పారావు గారు తన సాహిత్యరచన కొనసాగించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మేం కూర్చున్న అరగంటకు మహారాజు నుంచి పిలుపు వచ్చింది.
తాను రాసే కాగితాలు నాకు అప్పగించి లోప‌లికి వెళ్ళి అయిదు నిమిషాలలో తిరిగి వచ్చారు.
“ఇంటర్వ్యూ అయిపోయిందా” అని అడిగాను
. “అయిపోయింది కానీ, వారు అనుమతించేవరకు ఇంటికి వెళ్ళడానికి వీలులేదు” అన్నారు.
మళ్ళీ తన రచనను కొనసాగించారు.
మరొక పావు గంటలో మళ్ళీ పిలుపు రావడంతో వెళ్ళి పదినిమిషాలలో తిరిగి వచ్చేశారు.
అలా ఐదు సార్లు వెళ్ళి వచ్చారు.
లోపలికి వెళ్ళి మాట్లాడిన సమయం కంటే పిలుపు కోసం వేచి ఉ ండే సమయం చాలా ఎక్కువ.
ఆ మధ్య కాలంలో ఆయన అయిదారు పేజీలు రాసేశారు.
ఆ సమయంలో నేను పత్రికలో 40 పేజీలు చదివేశాను.
చివరగా మూడుగంటల తరువాత ఇక ఇంటికి వెళుతున్నామని చెప్పారు.
ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న ఈ పరిస్థితిని ఆయన ఎలా భరించగలుగుతున్నారో కానీ “దీనికి నేను అలవాటుపడిపోయాను’ అని అన్నారు.

మరొక సారి 1914లో నన్ను, మా నాన్న గారిని అప్పారావు గారు భోజనానికి పిలిచారు.
తనపైన దాడిచేసినప్పుడు వారు వాదించే విధానం ఎలా ఉ ంటుంది, సున్నితమైన హాస్యం ఎలా ఉంటుందో పరిశీలించే అవకాశం నాకు కలిగింది.

వివేకాన్ని ప్రదర్శించడంలో మా నాన్నగారికి, అప్పారావు గారికి చాలా పెద్ద తేడా ఉంది.
మానాన్న గారు రహస్యాన్ని ఎక్కడా దాచలేరు. ఆయన హృదయం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది.
కొన్ని రోజుల ముందు మా నాన్నగారితో కన్యాశుల్కం రెండవ ముద్రణ కంటే మొదటి ముద్రణే నాకు నచ్చిందని అన్నాను. మా నాన్నగారు గొప్ప పండితుడు, భాషా శాస్త్ర వేత్త కానీ, కళలకు సంబంధించిన విషయాలను అంత బాగా సమీక్షించలేరు. నేను చెప్పింది విని ఊరుకుండిపోయారు.

ఆరోజు మేం భోజనం చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి మా నాన్న గారు “మా అబ్బాయి సీతాపతి కన్యాశుల్కం రెండవ ముద్రణను విమర్శించాడు. దాని కంటే మొదటి ముద్రణే కళాత్మకంగా బాగుందని అన్నాడు” అని అప్పారావు గారితో చెప్పారు.
“అబ్బా.. మన పిల్లలే మన పుస్తకాలను విమర్శించడం ఎంత బాధ! దానితో పాటు ఎంత సంతోషం! ” అన్నారు అప్పారావు గారు.
నా వేపు తిరుగుతూ “నీ విమర్శలో ముఖ్యమైన విషయాలేమిటి?” అని నన్నడిగారు.
“కన్యాశుల్కంలో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి.
మీ నాటకం కన్యాశుల్కమా, గిరీశమా?
మీరు మధురవాణి పాత్రను పెంచి, ఆమెకు ప్రాధాన్యతనిచ్చారు.
మీ నాటకానికి యువతరంలో ప్రాచుర్యాన్ని పెంచడానికి కాదా ఇలా చేసింది?” అన్నాను.
అప్పారావు గారు మా నాన్న వేపు తిరిగి “సీతాపతి సరైన దగ్గర దెబ్బకొట్టాడు. నేను దానికి సమాధానం చెపుతాను” అన్నారు.
“ముఖ్యమైన విషయానికి మద్దతుగా ఈ అంశాన్ని బాగా పెంచాను. మధుర వాణిని సాధారణ వేశ్యలాగా చూపించదలుచుకోలేదు. వేశ్యా కుటుంబంలో పుట్టి, సహజ సిద్ధమైన ధర్మాలు కలిగి ఉండి, సంస్కరణలు సరైన పద్ధతిలో సాగుతుంటే, వేశ్యావృత్తిని విమర్శిస్తూ, ఆ వృత్తిలో ఉండే అమ్మాయిలకు వివాహం చేసుకోవాలని ప్రోత్సహించే ఉద్యమానికి మధురవాణి నాయకత్వం వహిస్తుంది. ఈ విషయాలను తరువాత వివరిస్తాను.” అన్నారు.

ఆ తరువాత నేను పర్లాకిమిడికి వెళ్ళిపోయాను. మళ్ళీ కలిసి చర్చించే అవకాశం రాలేదు.
నయంకాని జబ్బుతో 1915లో మృతి చెందడానికి ముందు మాత్రమే వారిని కలిశాను. కావ్య భాష సమర్ధకులకు, ఆధునిక తెలుగు వ్యవహారిక భాష సమర్ధకులకు మధ్య భాష విషయంలో వాదోపవాదాలు తలెత్తినప్పుడు వారెప్పుడూ వ్యక్తిగత దాడికి పూనుకోలేదు. తన వ్యతిరేకుల మనోభావాలు దెబ్బతినేలా ఎప్పుడూ కఠినమైన భాషను వాడలేదు. చలోక్తులు విసరడంలో మంచి హాస్య ప్రియులు. అప్పారావు గారు రాసిన వ్యాసాన్ని అసంబద్దంగా విమర్శించిన రామశాస్త్రి కి ఇలా సమాధానం చెప్పారు.
“రాముడు విడిచిన బాణం ఏడు వేప చెట్ల నుంచి దూసుకుపోతే, రామ శాస్త్రి విడిచిన బాణం ప్రత్యర్థులపైన కాకుండా తనవైపుకే దూసుకొచ్చింది.”

వారు ప్రయోగించిన వ్యంగాస్త్రాలు కఠిన మైన భాషకంటే చాలా బలంగా, ఇతరులను సమాధాన పరిచేలా ఉంటాయి. సంస్కారవంతంగా, విజ్ఞానంతో, వివేకవంతంగా, తెలివిగా, చాలా దయతో కూడి ఉంటాయి.
ఆయనలో ఉన్న ఈ లక్షణాలు ఉ న్నతంగా, హుందాగా,సంస్కారవంతంగా ఉండే మహారాజు ఆనందగజపతి దగ్గరకు చేర్చాయి.

ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఒక సంఘటనను గుర్తుకొస్తోంది.
అప్పారావుగారితో పాటు విజయనగరం సంస్థానంలో ఉండే మంచి పండితుడు, కావ్య భాష సమర్థకులు యనమందల నారాయణ మూర్తి గారు ఆధునిక తెలుగు భాషా ఉద్యమాన్ని ఖండిస్తూ 1913లో సుదీర్ఘ వ్యాసం రాశారు. ఉపాధ్యాయుల మహాసభకు హాజరవడానికి నేను మద్రాసు వెళ్ళిన రోజునే ఆ వ్యాసం మద్రాసు
మెయిల్ లో అచ్చయ్యింది. నేను దాన్ని చదివి ఆ పత్రికకు సమాధానం రాశాను. నారాయణ మూర్తి వ్యాసం వచ్చిన రెండు రోజుల తరువాత అందులో నా వ్యాసం అచ్చయ్యింది. పర్లాకిమిడికి వెళుతూ మా నాన్నగారిని కలవడానికి విజయనగరంలో దిగాను. ప్రొఫెసర్ శేషాద్రి గారు, మరికొంత మంది నా వ్యాసాన్ని మెచ్చుకున్నారు.
కానీ, నా వ్యాసం పట్ల మా నాన్న గారు మాత్రం సంతృప్తి చెందలేదు.
దానికి ముందు రోజు నారాయణ మూర్తి వ్యాసానికి తగిన సమాధానం తయారు చేయడానికి మా నాన్న గారు అప్పారావుగారిని కలిశారు. అనుకోకుండా పి.టి. శ్రీనివాస అయ్యంగారు విజయనగరం వచ్చారు.
అందరం కలిసి అప్పారావుగారి గదిలో నేను ఇచ్చిన సమాధానంలోని విషయం గురించి చర్చించాం.
అప్పారావుగారు హుందాగా చిరునవ్వుతో ఇలా అన్నారు.
“సీతాపతి నీవు రాసిన సమాధానాన్ని అభినందించకుండా ఉండలేను.
వివాదాస్పద విషయాల పైన తక్షణం సమాధానం రాయడమనేది నీలోని తెలివికి నిదర్శనం.
కానీ, చెప్పే విషయంలో లోతు కొరవడడమే కాకుండా, వ్యక్తీకరణ కాస్త పలచబడుతుంది.
నువ్వు చూపించిన ఉదాహరణలతో నీ వాదన సరిగా లేదని మీ నాన్నగారు చెప్పేవాదనతో
నేను ఏకీభవించడం లేదు. నీవు మరింత అప్రమత్తంగా ఉండాలనే నీ తొందరపాటును వారు వ్యతిరేకించారు.
నారాయణ మూర్తి గర్వంతో ఆవేశంగా ఉ న్నారు. ఇక్కడ ఉన్న వారందరికంటే తాను గొప్ప పండితుడిననుకుంటున్నారు. అయినప్పటికీ ఆలస్యంగా నైనా సమాధాన పరిచే తగిన సమాధానం ఇవ్వాలి.
అందుకునే ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నది. అనుకోకుండా పి.టి. శ్రీనివాస అయ్యంగారు కూడా ఇక్కడే ఉన్నారు.” అన్నారు.

నారాయణ మూర్తి వ్యాసంలో ఉ న్న అనేక విషయాలపైన చర్చించారు. మన ముగ్గురిలో-రామమూర్తి, అయ్యంగార్, అప్పారావు – ఎవరు సమాధానం చెప్పాలి? తరువాత దాన్ని మిగతా వారు మార్పులు చేర్పులు చేయవచ్చు. నాన్నగారు తాను సమాధానం చెప్పనని అడ్డంగా తలూపారు. నారాయణ రావు దానికి తగిన గట్టి మనిషని చెప్పారు.
దానికి సమాధానం చెప్పమని అయ్యంగారిని అప్పారావు అడిగారు. కా నీ, అయ్యంగారు మాత్రం “విషయం మీకే బాగా తెలుసు కనుక మీరే సమాధానం చెప్పాలి.” అన్నారు అప్పారావు గారితో. చివరగా అప్పారావు గారు చెపుతుంటూ నేను రాశాను. మా నాన్న గారికి వినికిడి సమస్య ఉండడం వల్ల నేను రాస్తుంటే నా పక్కన కూర్చుని చూస్తూ, వారేం చెపుతున్నారో గమనించారు. మరింత బలమైన వ్యక్తికరణ కోసం అయ్యంగారు, మా నాన్న గారు సవరణలు చెప్పారు. వారు చెప్పడం అయిపోయాక నన్ను చదివి వినిపించమన్నారు.
నేను చదివి వినిపిస్తుంటే ధోరణికి తగిన విధంగా ఉన్నదని అప్పారావు గారు గుర్తించారు.
” చెప్పింది చెప్పినట్టు రాయడానికి సీతాపతి ఏమీ యంత్రం కాదు.
ఆయన కూడా తన విచక్షణను ఉపయోగించే తెలివిగల రచయిత” అన్నారు అప్పారావు గారు.
నన్ను నేను సమర్థించుకోకుండా, “లేదండి, వినేటప్పుడు పొరపాట్లు దొర్లవచ్చు. ఆ పొరపాటు తగిన వ్యక్తీకరణ కావచ్చు. కానీ, మీరు దాన్ని సలహాగా చెప్పారు” అన్నాను.
“నువ్వు చెప్పింది సరిగా ఉంది. వినటంలో నీ లోపం ఉంటే, అర్ధం చేసుకోవడంలో నా లోపం ఉంది.
అది అలాగే ఉండనియ్యి. ఇక చదువు” అన్నారు.

అప్పారావు గారి భావాలు చాలా సున్నితమైనవి. ప్రశాంతమైన వారి మనసు వారి చిన్నతమ్ముడి మృతితో తీవ్రంగా కలత చెందింది. ఆయన పట్టభద్రుడే కాకుండా, చెప్పుకోదగ్గ పండితుడు.
ఆంగ్ల పద్యాలను సమకూర్చాడు. అవి గురజాడ రచనలు వాల్యూమ్ 1లో , ( 4 పీపీ 114-115 విశాలాంధ్ర పబ్లిషింగ్) ఉన్నాయి. అప్పారావు గారు 1900లో రాసిన తన డైరీలో అతని పట్ల తన గౌరవాన్ని ప్రకటించారు.
శ్యామలరావు, అతని తల్లి అన్న శీర్షికలో “కొన్ని పనులు చేయాలి” అని, “నా తమ్ముడి కోసం ఒక గడియారం, పెన్ను కొనాలి. మా అమ్మ కోసం ఒక నెక్లెస్, దుప్పటి కొనాలి” అని రాసుకున్నారు.
అప్పారావు గారు మద్రాసులో ఉండగా వారి తండ్రి రామదాసు గారు 1905 ఏప్రిల్ 22వ తేదీన ఒక విషాద స్థితిలో మృతి చెందారు.

“మా నాన్న గారు పోయారు. నేను విజయనగరం వెళ్ళాలి” అని డైరీలో రాసుకున్నారు.
విజయనగరానికి సమీపంలోని వాగుకు ఉత్తర దిక్కున అప్పారావుగారికి పొలాలు ఉన్నాయి.
రామదాసు ఆ వాగుమధ్యలో ఎద్దుల బండిలో పోతుండగా వరద వచ్చింది.
ఆ వరద నీటిలో బండి పడిపోయింది. బండికి కట్టిన ఎద్దు, బండిని నడిపే వ్యక్తి బయటపడ్డారు కానీ, రామదాసు మాత్రం ఇసుకలో కూరుకు పోయారు.

అప్పారావు గారి కుటుంబం తెలుగు బ్రాహ్మణ కుటుంబాలలోని ఆరువేల నియోగుల శాఖకు చెందిన సంస్కారవంతమైన నాగరికమైంది. గ్రామ కరణాల్లో తొంభై శాతం మంది వందల సంవత్సరాలుగా ఈ శాఖకు చెందిన వారే. అప్పారావు గారి పూర్వీకులు నాలుగు తరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు.
వీరి పూర్వీకులు కృష్ణా జిల్లాలోని గన్నవరం తాలూకా గురజాడ గ్రామానికి చెందిన వారు.
పెద్ద ఎత్తున వర్తక వ్యాపారం చేస్తూ, ఫ్రెంచి అధికారి వద్ద దుబాసీగా ఉన్నశ్రీనాథుని కోదండ రామయ్య వద్ద అప్పారావుగారి ముత్తాత పట్టాభిరామయ్య గారు ఉద్యోగం సంపాదించారు.
ఫలితంగా పట్టాభిరామయ్య మచిలీపట్నంలో స్థిరపడ్డారు. పట్టాభిరామయ్య చేసే పనికి మెచ్చి కోదండరామయ్య తన కూతురినిచ్చి వివాహం చేశారు. పట్టాభిరామయ్యకు నలుగురు కొడుకులు. వారిలో పెద్ద వారు సీతారామయ్య.
సీతారామయ్యకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్ద కుమారుడు వెంకట రామదాసు తన పాండిత్యంతో మచిలీపట్నం జిల్లా కలెక్టర్ దృష్టిని ఆకర్షించారు.

కలెక్టర్ వల్ల విజయనగరం సంస్థానంలోని చీపురుపల్లి తాలూకాలో ఉన్న కుమరం రానాలో వెంకట రామదాసుకు గుమాస్తా ఉద్యోగం లభించింది. అదే సమయంలో రామదాసుకు పేష్కా ర్ గా ప్రమోషన్ వచ్చింది.
జలంతర సంస్థానానికి రెవెన్యూ అమీన్ గా, శృంగవరపు కోట డివిజన్ సూపర్ వైజర్ గా చేశారు.
చివరగా అప్పారావు గారి కోరిక మేరకు వెంకట రామదాసును విజనగరం కోట ఖిలేదార్‌గా మహారాజు నియమించారు.

కుమరమ్ పేష్కా గా పనిచేస్తున్న రోజుల్లోనే రామదాసుకు కౌసల్యమ్మతో వివాహమైంది.
ఆమె యలమంచిలిలోని జిల్లా మున్సిఫ్ కోర్టు శిరస్టార్ గా పనిచేస్తున్న గోదావరి కృష్ణయ్య పంతులుగారి కుమార్తె.
యలమంచిలి సమీపంలోని రాయవరం గ్రామంలో కృష్ణయ్య పంతులు కుటుంబం నివసించేది.
అందుకే అప్పారావు గారు 1862 సెప్టెంబర్ 21 వ తేదీన రాయవరంలో జన్మించారు.
ఆ అప్పారావు బాల్యం అంతా రాయవరంలోనే సాగింది. జీవించడానికి కుమరం గ్రామం అనుకూలమైన ప్రాంతం కాదు. అక్కడ ఒక పాఠశాల కానీ, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కానీ లేరు.
ఆ సమయంలో కుమరం సమీపంలోని గులివింద గ్రామంలో ఒక అనుకూలమైన ఇల్లు చూసుకుని అక్కడ తన కుటుంబంతో స్థిరపడ్డాడు.

అప్పటి వరకు అప్పారావు తన తల్లి తరపున తాతగారు కృష్ణయ్య పంతులు ఊరు రాయవరంలో ఎలిమెంటరీ విద్యనభ్యసించారు. అప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఆయన ఆ తరువాత పిల్లల్లో గుర్తింపు పొందారు.
వారి కుటుంబం గులివిందలో స్థిర పడడంతో వెలివాల రామమూర్తి అనే ఉపాధ్యాయుడు రామదాసు సూచన మేరకు అప్పారావుకు తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం నేర్పడానికి కుదిరారు.
ఈ సందర్భంగా భాషలకు సంబంధించిన ఒక విషయం చెప్పదలుచు కున్నాను.
తెలుగు మాతృభాష, ప్రాచీన భారత సంస్కృతి నిక్షిప్తమై ఉన్న సంస్కృతం, పాలకుల భాష ఇంగ్లీషు విద్యలో చాలా ముఖ్యమైనవి.

మిగతా అంశాలలోని జ్ఞానం తక్కువ ప్రధాన్యత గలవి.కొద్ది కాలానికే లోయర్ సెంకడరీ చదువు కోసం అప్పారావును విజయనగరం పంపించారు. గులివిందలో కానీ, చేపురుపల్లిలో కాని లోయర్ సెకండరీ చదువు లేదు.
అయితే విజయనగరంలో అప్పారావును ఎక్కడ పెట్టాలనేది వీడని సమస్య. వెంకట రామదాసు అక్కడ మరొక కాపురం పెట్టేంత స్థితి మంతుడు కాదు. అప్పారావు మహారాజ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్ర శేఖర శాస్త్రి దృష్టిలో పడడంతో సమస్య పరిష్కారమైంది. చంద్రశేఖర శాస్త్రి సంస్కృతంలో మహా పండితుడగా ప్రసిద్ధులు.
సంస్కృతం నేర్చుకోవడంలో అప్పారావుకున్న ఆసక్తిని గమనించి ఆయన తన ఇంట్లోనే తన కుటుంబ సభ్యుడిగా ఉండిపొమ్మన్నారు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.
అదొక గొప్ప అదృష్టం. సంస్కృతంలో, ఇంగ్లీషులో మంచి పండితుడైన చంద్రశేఖర శాస్త్రి వద్ద చేరడంతో అప్పారావు భవిష్యత్తుకు మంచి పునాది పడింది.

అప్పారావు గారు 1880లో మెట్రిక్కులేషన్ ఫస్ట్ క్లాస్లో పాసయ్యారు. తరువాత ఎఫ్.ఏ పరీక్షకు కూర్చోవలసి ఉంది.
ఆర్థిక అవసరాల కోసం నెలకు 25 రూపాయల జీతం పైన స్కూల్ టీచర్ గా చేరారు. కానీ పట్టభద్రుడుకావాలనే ఆకాంక్ష ఆయనలో చాలా ఎక్కువగా ఉండడంతో ఆ ఉ ద్యోగానికి రాజీనామా చేసి కాలేజీలో చేరి 1886లో ఇంగ్లీషు పార్ట్ 1లో డిస్టింక్షన్లో బి.ఏ. పాసయ్యారు.

లాయర్ కావాలన్న కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక కారణాల వల్ల లా చదవడం సాధ్యం కాలేదు.
దాంతో విజయనగరంలోని డెప్యూటి కలెక్టర్ కార్యాలయంలో 1887లో హెడ్ క్లర్క్ గా చేరారు.
కానీ, ఆ ఉద్యోగం కొద్ది రోజులే చేశారు.

విజయనగరం మహారాజు అప్పారావు చదువును, గుణగణాలను గమనించి కాలేజీలో నాలుగవ లెక్చరర్ గా నెలకు వందరూపాయల జీతంతో నియమించారు. విజయనగరం కలెక్టర్ గా ఉన్న జగన్నాథ పంతులు అప్పారావును శక్తి సామర్థాలను పరీక్షించి మంచి పండితుడిగా గుర్తించారు.

ఆ కాలేజీలో అప్పారావు తొమ్మిది సంవత్సరాలు(1887-1896) పనిచేశారు.
ఎఫ్.ఏ, బి.ఏ., విద్యార్థులకు ఇంగ్లీషు, తరచూ సంస్కృతం బోధించారు. ఎఫ్.ఏ. విద్యార్థులకు గ్రీకు, రోమన్ చరిత్రను బోధించారు. దీంతో పాటు పరీక్షలకు అవసంం లేకపోయినప్పటికీ నాగరికతకు సంబంధించిన వాస్తవాలను కూడా బోధించే వారు. ఆయన విద్యార్థులలో ఒకరైన పైడి గంటం కృష్ణారావు అప్పారావు పాండిత్యానికి, ఉదార స్వభావానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు.

కవిత్వంతో పాటు అప్పారావుకు నవల, నాటకం పైన కూడా చాలా ఆసక్తి ఉండేది.
కృష్ణా రావుకు కవిత్వం పైన పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ, అప్పారావు గారికి ఉ న్న ప్రతిభను ప్రస్తుతించారు.
అప్పారావు వద్ద పాఠాలు నేర్చుకోవడం వల్ల తనకు నవలలన్నా, నాటకాలన్నా ఆసక్తి పెరిగిందని చెప్పారు.
ఒక తమాషా సంఘటనను చెప్పారు.

కృష్ణా రావు తండ్రి జగన్నాథరావు అప్పారావు కుటుంబానికి సన్నిహితులు కావడంతో ఎఫ్.ఏలో కృష్ణారావుకు సంరక్షకులుగా అతన్ని పరిశీలించమని కోరారు.

వేసవి సెలవులకు 1992లో కాలేజీ మూసేసినప్పుడు కృష్ణారావు పర్లాకిమిడికి వెళ్ళాలనుకున్నాడు కానీ వెళ్ళ లేదు.
కృష్ణారావు ఎక్కడున్నారో ఆయన తండ్రి జగన్నాథరావుకు తెలియలేదు.
కొడుకు గురించి విచారించడానికి ఆయన అప్పారావు గారి వద్దకు వచ్చారు.
కృష్ణారావు నాటకాల బృందంతో విజయనగరం వెళ్ళి కాకినాడ తిరిగి వస్తున్నాడని తెలిసింది.
ఆరోజుల్లో రైళ్ళు లేవు. విజయనగరం నుంచి విశాఖపట్నానికి ఎద్దుల బండిలో వెళ్ళి అక్కడనుంచి స్టీమర్ లో కాకినాడ వెళ్ళాలి.

నాటకాలపై ఆసక్తి పెంచి యువకుల మనసులను పాడు చేస్తున్నారని అప్పారావు గారిని జగన్నాథరావు కోప్పడ్డారు.
అప్పారావు ఏ మాత్రం ఆవేశపడకుండా చిరునవ్వుతో “నష్టం ఎక్కడ జరిగింది? ప్రపంచాన్ని తెలుసుకోవడం వల్ల కృష్ణారావుకు చాలా అనుభవంతో తెలివి తేటలను పెంచుకుంటాడు” అన్నారు.
ఆ మాటతో సంతృప్తి చెందని జగన్నాథరావు తన కుమారుడి చదువు దెబ్బతింటోందని భావించారు.
అప్పారావు తన కాలానికి చాలా మందున్నారు.

యువతరం ఆయన్ని ఇష్టపడుతుండగా, పెద్ద తరం మాత్రం ఆయన్ని ఒక విప్లవ కారుడుగా భావించేది.
కానీ, ఏ ఒక్కరూ ఆయన గురించి పల్లెత్తు మాట మాట్లాడేవారు కాదు. ఎందుకంటే ఇటు విద్యార్థులలోనే కాకుండా, కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టిలో, మహారాజ దృష్టిలో కూడా అప్పారావు ఒక గొప్ప పండితుడిగా, చరిత్రకు సంబంధించిన కళలపైన నిష్ణాతుడిగా మంచి గుర్తింపు పొందారు. స్థానికంగానే కాకుండా వివిధ పత్రికలకు అప్పారావు రాసిన వ్యాసాలు మహారాజు దృష్టిలో పడ్డాయి. దాంతో ప్రతిరోజు తన వద్దకు వచ్చి దినపత్రికలు చదివి వినిపించే అదనపు బాధ్యతను నెలకు 80 రూపాయలు అదనంగా ఇచ్చేలా నిర్ణయించారు.
అప్పారావు గారికి 1891 లో సీనియర్ లెక్చరర్ గా ప్రమోషన్ ఇచ్చి జీతాన్ని నెలకు 120 రూపాయలు చేశారు.
ఆయన ఆరోగ్యం క్షీణించి, 1895లో గొంతు పీలగా తయారైంది.

దాంతో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఇబ్బంది ఏర్పడింది. ఈ పరిస్థితులలో అప్పారావు గారు కాలేజీలో లెక్చరర్ గా కొనసాగినట్టయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని మహారాజ భావించి 1896లో తన సంస్థానంలో శాసన పరిష్కర్తగా ఆయన్ని నియమించారు.

(గిడుగు వెంకట సీతాపతి (జనవరి 28, 1885 – ఏప్రిల్ 19, 1969) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది చిలకమ్మపెళ్ళి.)

One thought on “గురజాడ జ్ఞాపకాలు

  1. గిడుగు సీతాపతిగారి వ్యాసంపై మీ అనువాదమే మొదటిదయితే ఇది చారిత్రక కరపత్రంలా చరిత్రలో నిలిచిపోతుందండి. గురజాడ వ్యక్తిగత, ఉద్యోగ జీవితం గురించి ఎన్నికొత్త విషయాలు ఈ వ్యాసంలో ఉన్నాయో.. కన్యాశుల్కంపై సీతాపతి గారి విమర్శనుకూడా గురజాడ ఎంత సానుకూలంగా తీసుకున్నారో.. ఒక్కమాటలో చెప్పాలంటి ఈ వ్యాసం, మీ అనువాదం అపురూపం.. అమూల్యమూనూ…. వ్యాసం మొదటే సంఖ్యాదోషం దొర్లిందండి ఒకచోట 2014 అని ఉంది. దాన్ని 1914 అని మార్చండి. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *