కోట్నీస్, బెతూన్లు అంతర్జాతీయ మానవులు: సభలో కాకరాల
తిరుపతి: డాక్టర్ ద్వరాకానాథ్ కోట్నీస్, డాక్టర్ నార్మన్ బెతూన్ అంతర్జాతీయ మానవులని, మనిషనే ప్రతి వాడు వారిరువురిలా ప్రవర్తించాలని ప్రముఖ రంగస్థల, సినీ కళాకారుడు కాకరాల పిలుపునిచ్చారు.
భారత-చైనా మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరపతి జీవకోన లోని గురుకృప విద్యా మందిర్‌లో జరిగిన కోట్నీస్ 112 జయంతి సభలో ఆయన ప్రసంగించారు.
చైనాపై జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా జరిగినయుద్ధంలో చైనా సైనికులకు వైద్య సేవలందించిన కెనడాకు చెందిన డాక్టర్ నార్మన్ బెతూన్, భారత దేశానికి చెందిన డాక్టర్ ద్వరాకానాథ్ కోట్నీస్ అమూల్య మైన వైద్య సేవలందించారని తెలిపారు.
“కళాకారుడు గతాన్ని కళ్ళకట్టెదుట నిలబెడతాడు. వర్త మానాన్ని విమర్శిస్తాడు. భవిష్యత్తుకు దారి చూపుతాడు” అని డాక్టర్ నార్మన్ బెతూన్ చెప్పిన మాటలను గుర్తు చేశారు.
కళాకారుడు చేయదగ్గవి, చేయగలిగినవి చేసి, ఇతర దేశాల విప్లవాలలో భాగస్వాములవ్వాలని ఆయన పిలుపు నిచ్చారని గుర్తు చేశారు.
మనది పరాధీన ఆర్థిక వ్యవస్థ -మోహన్ రెడ్డి
భారత చైనా మిత్ర మండలి జాతీయ సెక్రటరీ జనరల్ డాక్టర్ యం. మోహన్ రెడ్డి సభలో మాట్లడుతూ, చైనా పై జపాన్ దురాక్రమణ చేసి నాన్జింగ్లో మూడు లక్షల మందిని చంపేసిందని, ఆ స్థితిలో చైనా వారు మనని వైద్య సహాయం కోరారని గుర్తు చేశారు.
కోట్నీస్ అంటే అంతర్జాతీయ భావనకు చిహ్నం, ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి స్ఫూర్తి, దోపిడీ, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా నిలబడే ధైర్యం అని కొనియాడారు.
ప్రపంచ జనాభాలో మూడవ వంతు భారత్ చైనాలోనే ఉందని, ఈ రెండు దేశాల స్నేహం ప్రపంచ శాంతికి దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు.
తిండి, బట్ట, నివాసం వంటి మౌలిక వసతుల సమస్య లేకుండా, చైనాలో దారి ద్రాన్ని జయించారని, అభివృద్ధి చెందినవని చెప్పుకుంటున్న అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పటికీ 27 శాతం ప్రజలు దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నారని గుర్తు చేశారు.
చైనాది స్వతంత్ర ఆర్థిక వ్యవస్థని, మనని పరాధీన ఆర్థిక వ్యవస్థ అని, అందు చేతనే అమెరికాలో ద్రవ్యోల్భణం ఏర్పడితే అది మన దేశం పైన ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు.
చైనాతో మైత్రి భారత్ కోసం : జతిన్ కుమార్
భారత-చైనా మిత్రమండలి జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎస్. జతిన్‌కుమార్ మాట్లాడుతూ చైనాతో మైత్రి అంటే చైనా కోసం కాదని, అది భారత దేశం కోసమని గుర్తు చేశారు.
చైనా వారు మన పైన ఆధారపడలేదు, మనమే వారి పైన ఆధారపడ్డాం అన్నారు.
భారత ప్రజలు చైనాతో మైత్రిని కోరుతున్నారు, పాలకులు యుద్ధాన్ని కోరుతున్నారని వ్యాఖ్యానించారు.
చైనాలో హార్డ్ వేర్ అభివృద్ధి చెందితే, మనం సాఫ్ట్‌వేర్‌లో ముందున్నామని, ఇద్దరం కలిస్తే మిగతాప్రపంచానికి మార్గదర్శకం అవుతామని గుర్తు చేశారు.
భారత దేశం నుంచి చైనాకు వైద్య బృందం వెళితే, అక్కడి ప్రభుత్వం వారికి అన్ని సదుపాయాలూ కల్పిస్తుందని, చైనా నుంచి వైద్య బృందం వస్తే మన ప్రభుత్వం అస్సలు పట్టించుకోదని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండే రెండు యుద్ధాలు చేసిన చైనా మన పాలకుల దృష్టిలో దురాక్రమణ దారు అని, అదే 107 యుద్ధాలు చేసిన అమెరికా శాంతి దూతా!? అని ప్రశ్నించారు.
సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ మాట్లాడుతూ చాలా మంది చైనా వస్తువులను నిషేదించాలని పిలుపిస్తున్నారని, ఒక వేళ ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోతే చైనా కేవలం రెండు శాతం మాత్రమే నష్టపోతుందని, మనం 16 శాతం నష్టపోతామని గుర్తు చేశారు. గత జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చైనా నుంచి మన దిగుమతులు 31 శాతం పెరిగాయని, మన ఎగుమతులు 36.4 శాతం పడిపోయాయని, ప్రధాని పిలుపిచ్చిన ‘ఆత్మనిర్భర భారత్’ కు అర్థం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సభకు అధ్యక్షత వహించిన బాలు మాట్లాడుతూ, డాక్టర్ ద్వారకానాథ్ కోట్నీస్ జీవిత విశేషాలను వివరించారు.
చైనా పై జపాన్ చేసిన యుద్ధంలో గాయపడిన సైనికులకు ఆయన ఎలా సేవలందించింది సోదాహరణంగా చెప్పారు.
(ఫీచర్ ఫోటో: సభలో మాట్లాడుతున్న రంగస్థల, సినీ కళాకారులు కాకరాల. వేదికపై రాఘవ శర్మ, డాక్టర్ మోహన్ రెడ్డి , డాక్టర్ జతిన్ కుమార్.)