*పెట్టుబడి పై పోరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగవర్గం సైతం రేపు చేరాల్సిందే!
*జూకర్ బర్గ్ తాజా చర్య నేర్పే పాఠం ఇదే!
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
ఒక్క కలం పోటుతో నిన్న 11 వేల మంది ట్విట్టర్ ఉద్యోగుల్ని మెటా సంస్థ అధిపతి ఇలాన్ మస్క్ తొలగించారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో కలకలం రేగింది. ఇండియాలో దాదాపు అరకోటి మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైనది. గత కొంత కాలంగా మూన్ లైటింగ్ పేరిట ఉద్యోగుల బర్తరఫ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. తాజా చర్య పరాకాష్ట దశకు చేరింది. ఈ నేపథ్యంలో ఒక వ్యాఖ్యను చేద్దాం.
జూట్ మిల్లు కార్మిక సంఘాల అనుభవంతో ముందుగా ఒకమాట!
మార్క్స్ పేర్కొన్న లాభం (అదనపు విలువ) రేటు లెక్కింపు కోసం నెల్లిమర్ల జూట్ మిల్ కేంద్రంగా ఓ పాతికేళ్ళ క్రితం పరిశీలన చేశాం. ఉత్పత్తి ప్రక్రియతో సహా అధ్యయనం చేశాం. ముడిసరుకు, రవాణా, యంత్రాలు, యంత్రాల అరుగుదల, జీతాలు, విద్యుత్, పన్నుల వంటి ఖర్చుల్ని లెక్క కట్టాం. సరుకు (గోనె సంచులు) ధరని లెక్కించాం.
నాడు జూట్ కార్మికుల రోజు జీతం సుమారు ₹150 ఉండేది. ఒక్కొక్క వర్కర్ రోజువారీ శ్రమశక్తి పై యాజమాన్యం పొందే నికర లాభం ₹100 పైగా ఉండేది. ఆనాటి మా అవగాహన మేరకు మా లెక్కించే విధానం ఉంది. సమగ్ర విశ్లేషణా ప్రక్రియ కాకపోవచ్చు. కానీ గురికి బెత్తెడు దూరంలో తప్ప ఎక్కువ తేడా రాదు. ఐదు వేల మంది కార్మికులతో మిల్లు నడిచే కాలమది. మొత్తం లాభం రోజుకు లక్షల్లో భారీగా వున్నా, ప్రతి వర్కర్ పై సగటున వర్కర్ జీతంతో పోల్చితే 75%–100% లాభాల్ని జూట్ యాజమాన్యాలు పొందేవి. యాజమాన్యం పై కార్మికవర్గం వ్యతిరేకత వ్యక్తం చేసేది. కార్మికవర్గం లో వర్గచైతన్యం ప్రేరేపించే అవకాశం వుండేది. అది వర్గ పోరాటాలకు దారి తీస్తుండేది. అదో క్రమం.
కాలం గడిచింది. కొన్ని పాత పరిశ్రమలకి గ్రహణం పట్టింది. కొత్తవి ఉనికిలోకి వచ్చాయి. అలాంటిదే IT సేవా రంగం కూడా!
తొలి కాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగవర్గంలో తమ IT యాజమాన్యాల పట్ల భక్తిభావం ఉండేది. పైగా జూట్ వంటి పరిశ్రమల వర్కర్లకి పోరాటాలు ఒక హాబీగా మారాయని సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుండి విమర్శ వినిపించేది. మా కార్మిక సంఘాల పట్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగులలో వ్యతిరేక భావం ఉండేది.
దుమ్ము, ధూళి మధ్య యంత్రంలో యంత్రంగా మారి చాకిరీ చేసే జూట్ వర్కర్ల జీతం రోజుకు ₹150 నుండి ₹250 కి పెరిగింది. కానీ శీతల ప్రాంగణంలో ఉద్యోగం చేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వేతనం ₹2000 నుండి ₹10,000 కి పెరిగింది. వర్గ పోరాటాల భావనకి తావులేని రంగంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కళ్ళకు IT రంగం కనిపించేది.
సమాజంలో అందరి బ్రతుకుల్ని కరోనా బాగా దిగజార్చింది. IT ఉద్యోగ వర్గానికి చెప్పుకోదగ్గ ఇబ్బంది రాలేదు. పైగా కొత్తగా నియామకాలు జరిగాయి. *వర్క్ ఫ్రమ్ హోమ్*, (WFH) సౌకర్యం చేకూరింది.
ఎందుకైనా మంచిదని ముడి లెక్కలు వేద్దామని ఇటీవల IT సెక్టార్ పై అధ్యయనం చేసాము. జూట్ సెక్టార్ వలె IT పట్ల లోతైన అవగాహన లేదు. చిత్తు అంచనాలు వేశాం. లెక్కలు జూట్ లో గురికి బెత్తెడు దూరం ఉంటే, IT లో జానెడు వుండొచ్చు. మరింత తేడా కూడా వుండొచ్చేమో!
రోజుకు ₹10,000 చొప్పున ఒక్కొక్క సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి వేతనం చెల్లించే యజమానులు ఉద్యోగి చేసే IT సేవలపై ₹25,000 లేదా మించే లాభం పొందుతారు.
జూట్, టెక్సటైల్స్, షుగర్, స్పిన్నింగ్, జిన్నింగ్ వంటి పరిశ్రమల్లో మోటు పనిచేసే కార్మికులకి జీతం ₹500 చెల్లిస్తే, మిల్లుల ఓనర్లకు ₹300 నుండి ₹500 వరకు నికర లాభం వస్తోంది. IT ఉద్యోగులకి రోజుకి ₹10,000 చెల్లిస్తే, వారి మీద కొల్లగొట్టే ఓనర్ల నికర లాభాలు ఐదారు రెట్లు వస్తున్నాయి.
జూట్, షుగర్, స్పిన్నింగ్ వంటి పరిశ్రమల వర్కర్లకి చెల్లించే ప్రతి ₹100 తో పోల్చితే, అతడి లేదా ఆమె మీద ₹100 కంటే తక్కువే లాభాల్ని వాటి ఓనర్ల గడిస్తున్నారు. కానీ సాఫ్ట్ వేర్ (IT) సెక్టార్ లో ఉద్యోగి శ్రమశక్తికి చెల్లించే ప్రతి ₹100 తో పోల్చితే, ఐదారు రెట్ల లాభాల్ని IT ఓనర్లు గడిస్తున్నారు.
ఎవరి లాభాల రేటు ఎక్కువ? ఎవరి దోపిడీ తీవ్రత ఎక్కువ? ఎవరి లూటీ ఎక్కువ? కానీ ఎవరు తమ ఓనర్లని శతృవర్గంగా చూస్తోంది? ఎవరు తమ ఓనర్లను గొప్పవాళ్లుగా, తండ్రులు గా చూస్తోంది?
జూట్, టెక్స్టైల్స్, షుగర్, స్పిన్నింగ్, జిన్నింగ్ వంటి పరిశ్రమల కార్మికవర్గం తమ మిల్లుల ఓనర్లను శతృవర్గంగా భావిస్తుంది. నిత్యం తమని పీడిస్తున్న వర్గంగా చూస్తుంది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగవర్గం తమ IT కంపెనీల ఓనర్ల పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తారు. బిల్ గేట్స్, జూకర్ బర్గ్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, నారాయణ మూర్తి, అజీమ్ ప్రేమ్ జీ వంటి వారిని ఆ ఉద్యోగులే ఇంద్రుళ్లు, చంద్రుళ్లు గా స్తుతిస్తారు.
ఇది శాశ్వత ధోరణిగా చిత్రించి కొత్త సూత్రాల్ని ప్రచారంలోకి తెచ్చారు. వర్గరహిత రంగాలు నేడు ఉనికిలోకి వస్తున్నాయనే ప్రచారం జరిగింది. వారిది వర్గ సంబంధం బదులు భార్యాభర్తల బంధంగా, తండ్రి కొడుకుల బంధంగా కొత్త సూత్రీకరణలు కూడా ముందుకు వచ్చాయి. ఒక జూకర్ బర్గ్, ఒక సుందర్ పిచాయి, ఒక నారాయణ మూర్తి, ఒక అజీమ్ దైవ సమాన పురుషులుగా తమ ఉద్యోగులతోనే పొగడబడ్డారు. మైకంలో మునిగిన ఆ ఉద్యోగుల చెవులకు వర్గాలు, వర్గ పోరాటాల మాటలు కర్ణకఠోరంగా మారాయి. కార్మికవర్గ పోరాటాల్ని చిన్నచూపు తో చూసే ధోరణి తలెత్తింది. నేడు ఏం జరుగుతోంది?
ఒక్క కలంపోటుతో జూకర్ బర్గ్ 11000 మందికి పైగా ట్విట్టర్ ఉద్యోగుల్ని ఉద్యోగం నుండి తొలగించాడు. యాజమాన్య, ఉద్యోగ వర్గాల మధ్య సంబంధం భార్యాభర్తల అనుబంధం వంటిదనే సూత్రీకరణలు వట్టి భ్రమేనని జూకర్ బర్గ్ తేల్చిచెప్పాడు. సాఫ్ట్ వేర్ (IT) కంపెనీ కుటుంబం వంటిదనీ, వాటి ఓనర్లు కుటుంబ పెద్దల వంటి వారనీ ఇన్నాళ్లూ చెప్పిన నీతులు గాలిలో కలిసి పోతున్నాయి.
నిజానికి వర్గాలకూ, వర్గ పోరాటాలకు కాలదోషం పట్టలేదు. ఓకే ఒక్కకలం పోటుతో నిర్దాక్షిణ్యంగా ఇంటికి వెళ్లగొట్టబడే సాఫ్ట్ వేర్ ఉద్యోగవర్గం తమ మనుగడకై అనివార్యంగా ఉద్యమ పధంలో అడుగు వేయక తప్పదు. క్రమంగా వారు సంఘాల నిర్మాణం చేసుకొని తీరతారు. వర్గ పోరాటాల్లోకి ముందో వెనకో రాక తప్పదు.
ఆర్ధిక సంక్షోభం ఓ భౌతిక సత్యం. పెట్టుబడిదారీ వ్యవస్థ సహజలక్షణమది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత ఆర్థిక వ్యవస్థ అతీతం కాదు. సంక్షోభ స్థాయి మూరెడు ఉంటే మీడియా అండతో బారెడు చిత్రీకరణ చేసి ఓ అభద్రతా పరిస్థితిని IT ఉద్యోగుల్లో సృష్టించడం జరుగుతుంది. తామే స్వచ్చందంగా వేతనాల కోతకు సిద్ధపడే విధంగా మైండ్ గేమ్ వ్యూహమూ వుండొచ్చు. ఓ అరకోటి భారత్ IT ఉద్యోగుల మెడపై కత్తి వేలాడే స్థితి.
జూకర్ బర్గ్ తాజా చర్య సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నేర్పే నూతన పాఠాల్ని అధ్యయనం చేద్దాం. వారి సంఘాల నిర్మాణాలకు చేయూతనిద్దాం.
గమనిక:–IT సెక్టార్ లో అదనపు విలువ లెక్కింపు కోసం శాస్త్రీయ గణన వివరాలు తెల్సిన మిత్రుల నుండి నిర్దిష్ట సమాచారం ఆశిస్తున్నా.