కుమారధార-శక్తి కటారి మధ్య
ఉత్కంఠ భరిత సాయస యాత్ర
(రాఘవ శర్మ)
తిరుపతి జ్ఞాపకాలు-55
(రాఘవశర్మ)
రెండు ఎత్తైన కొండల నడుమ ఎన్ని రూపాలు!
ఎన్ని అందాలు! ఎన్ని వింతలు! ఎన్ని విడ్డూరాలు!
ఎన్ని సొగసులు, ఎన్ని ప్రకృతి సోయగాలు!
కుమార ధార-శక్తి కటారి తీర్థాల మధ్య ఈ ఆదివారం సాగిన మా సాహస యాత్ర.
అంతా ఉత్కంఠభరితం!
తెల్లవారు జామునే తిరుమలకు బయలుదేరాం.
తెలతెలవారుతుండగా అక్కడికి చేరుకున్నాం.
చల్లని వాతావరణం.
ఆకాశమంతా మబ్బులు కమ్మాయి.
సన్నటి చినుకు, వర్షం వచ్చే సూచనలు.
కుమార ధార ప్రాజెక్టు వరకు వాహనాల్లో వెళ్ళాం.
అక్కడ నుంచి మా నడక.
దారంతా బోద పెరిగిపోయింది.
లోయలోకి దిగుతుంటే అంతా చెట్లు కమ్మేశాయి.
ఆ దారిలో ఈ మధ్య నడిచిన ఆనవాళ్ళు కనిపించడం లేదు.
లోయలోకి దిగాం.
రెండు కొండల నడుమ రాళ్ళను ఎక్కుతూ, దిగుతూ సాగుతున్నాం.
అదిగో కుమార ధార లోయ.
రాతి బండపై నుంచి ఏటవాలుగా దిగుతున్నాం.
ఎడమ వైపున కుమార ధార దుముకుతున్న శబ్దం.
ఒక మనోహర దృశ్యం.
దిగుతున్న కొద్దీ పెరిగిన చెట్ల మధ్య జల ధార దాక్కున్నట్టుంది.
కిందటి ఏడాది వేసిన ఇనుపనిచ్చెన కనిపించడం లేదు.
ఇరవై అడుగుల ఒక లావాటి పైపు మాత్రం కనిపిస్తోంది.
కిందకు దిగడం ఎలా|?
ఒక చెట్టు మొదలుకు తాడుకట్టి, దాన్ని పక్క నున్న ఇనుప కమ్మీకి తగిలించి కిందకు వదిలాం.
ఆ తాడు పట్టకుని నిట్ట నిలువుగా ఉన్న ముప్పై అడుగుల లోయలోకి ఒకరొకరుగా దిగాం.
మా బుజాలకున్న సంచులను ఆ తాడుకు కట్టి జారవిడిచాం.
లోయలో సెల్‌ఫోన్లు మూగబోయాయ్.
ఉదయం ఎనిమిదవుతోంది.
కుమార ధార కింద స్నానాలు, సరదాలు , అల్పాహారాలు ముగిశాయి.
మధ్యాహ్న భోజనం మంచినీళ్ళు తప్ప సామానంతా అక్కడే పెట్టి బయలుదేరాం.
కుమార ధార వాయవ్యం నుంచి ఈశాన్య దిశగా సాగుతోంది.
రెండు కొండల నడుమ ఆ ధార సాగే వైపు మా నడక మొదలైంది.
ఎత్తైన కొండల నడమ పెద్ద పెద్ద బండ రాళ్ళు.
అవి ఎక్కుతూ,దిగుతూ సాగుతున్నాం.
కొండ ఒక్కో దగ్గర ఒక్కోరూపం.
ఒక్కో దగ్గర సన్నని దారి.
మరొక దగ్గర వెడల్పైన దారి.
నేలపైన రాళ్ళ మధ్య నుంచి పారుతున్న సెల ఏరు.
ఆసెల ఏరు ఒక్కో దగ్గర ఒక్కో రాగం ఆలపిస్తోంది.
నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయ్!
అందులో లెక్కలేనన్ని చేప పిల్లలు!
నీళ్ళలో మానవ అలికిడిని చూసి బిత్తరపోతున్నాయ్.
భయంతో లోపలకు పారిపోతున్నాయ్.
సెల ఏటిని దాటుతూ, దాటుతూ వెళుతున్నాం.
వాటిని తప్పించుకుంటూ గెంతుతున్నాం.
ఆ సెల ఏరు ‘ఎక్కడికీ పోతావు చిన్నవాడ. నా చేతుల్లో చిక్కుకున్న కుర్రవాడ’ అని పాటపాడు తు న్నట్టుంది.
ఏటిలోకి దిగక తప్పలేదు.
లోతు లేనిదగ్గర నడుచుకుంటూ, లోతున్న దగ్గర ఈదుకుంటూ సాగుతున్నాం.
ఆ ఏరు మమ్మల్నలా తనలోకి దింపేసుకుంది.
కేరింతలు కొడుతూ, లోఈతలతో సాగుతున్నాం.
ఒక దగ్గర కొండకు కుడి వైపున రెండు పెద్ద పెద్ద రంద్రాలలాంటి గుహలు.
ఒక గుహలోకి ఎక్కడం సాధ్యం కాలేదు.
ఒక దాంట్లోకి మాత్రం వెళ్ళగలిగాం.
అలా ముందుకు సాగుతున్నాం.
రాళ్ళలో కూడా మొలిచిన చెట్లు.
వాటి నుంచి కిందికి వేలాడుతున్న ఊడలు.
రాళ్ళకే పెనవేసుకున్నపెద్ద పెద్ద వేర్లు.
ఒక దగ్గర చిన్నరాతిగుహ.
ఆరాయంతా తెల్లని, నల్లని పాలరాతిలా ఉంది.
మధ్యలో ఒక మర్రి చెట్టు
సాధువు జటాజూటాల్లా సన్నని ఊడలు వేలాడుతున్నాయి.
అవి నేలకు తాకుతున్నాయి.
ఈ ఏటికి ఎన్ని ఎన్ని రాగాలు! ఎన్ని స్వరాలు!
స్వచ్చమైన నీళ్ళు.
అడుగున ఉన్నగులకరాళ్లు, బండరాళ్ళు కూడా కనిపిస్తున్నాయి.
పై నుంచి రాలిన ఆకులు తేలాడుతున్నాయి.
నీళ్ళలో దిగి ఫొటోలు దిగి నిలుచుంటే, మరిగుజ్జుల్లా ఉన్నాం.
మొత్తం రాతి నేలే!
రెండు కొండలు దగ్గరకొచ్చేశాయి.
ఆ రెండు కొండలనడుమ నుంచి నీళ్ళు పారుతున్నాయి.
సన్నని దారిలో పారుతున్న ఏటిపైన మూత వేసినట్టు, ఒక బరువైన రాతిపలక ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి అడ్డంగా పడింది.
బండదాటితే లోతైన నీటి మడుగు.
ఎలా వెళ్ళాలి!.
బండ ఎక్కి వెళ్ళవచ్చు.
కానీనీళ్ళలో నడుస్తుంటే కాళ్ళు పాకుడుకు జారుతున్నాయి.
నీళ్ళలో కూర్చుని జారుతూ ముందుకు సాగితే బండ తలకు తగులుతుందేమో!
ఒక ప్రయోగం చేశాం.
నీళ్ళలో వెల్లకిలా పడుకుని, ఆ పాకుడులో జారుడు బండలా ముందుకు జారాం.
బండకు తల తగులుతుందేమోనని తలెత్త లేదు.
ఆ బండ రాయి తన ముందు మమ్మల్ని తల వంచేలా చేసింది.
ఆరెండు కొండలనడుమ నీటి ప్రవాహం ఎంత ఉదృతంగా ఉంటుందో!
ఆ పరిసరాలను చూస్తే తెలుస్తుంది.
దాదాపు ముప్పై, నలభై అడుగుల ఎత్తున ఆలోయలో ఏరు ప్రవహించిన ఆనవాళ్ళు.
అది ఇంకా ఎత్తుగా, ఎంతో ఉదృతంగా ప్రవహించి ఉంటుంది.
ఆ ఉదృతికి రాతి కొండ కూడా నునుపు దేలి వివిధ రూపాలను సంతరించుకుంది.
ఎన్ని చెట్లు పడిపోయాయో!
ఎన్ని రాళ్ళు కొట్టుకొచ్చాయో!
కుమారధారలో వేసిన లావాటి ఇనుప నిచ్చెనలు కూడా ఈ ఏటి ప్రవాహానికి ఆగడంలేదు.
అవి కొన్ని కిలో మీటర్ల దూరం కొట్టుకు వచ్చాయి.
కుమారధారకు రెండు కిలోమీటర్ల దూరంలో రెండు ఇనుప నిచ్చెనలు కనిపించాయి.
ఇరవై మంది మోస్తే తప్ప కదలనంతటి లావునిచ్చెనలు.
అందుకునే ప్రతి ఏడాది కుమార తీర్థ ఉత్సవానికి కొత్త నిచ్చెనలు వేయాల్సి వస్తోంది.
పెద్ద పెద్ద బండరాళ్ళే కాదు, మహావృక్షాలు కూడా ఆ నీటి ఉదృతికి కూలిపోతున్నాయి.
ఒక మహావృక్షం వేళ్ళతో పెకిలించుకుని ఏటికి అడ్డంగా ఆ మూల నుంచి ఈ మూల వరకు పడిపోయి ఉంది.
ఆ చెట్టును చూస్తే అంతా పిల్లలమైపోయాం.
ఒక పక్క నుంచి అంతా కలిసి ఆ చెట్టుపైన కూర్చున్నాం.
మళ్ళీ బాల్యంలోకెళ్ళిపోయాం!
ఆ చెట్టు కాండంపైనే కూర్చుని జైబాలాజీ ధ్యానం చేశాడు.
చేతికి అందనంత ఎత్తులో అడ్డంగా పడిన ఆ చెట్టు కిందనుంచే వెళ్ళాం.
అలా సాగుతూ, సాగుతుంటే కనుచూపు మేరలో ఒక ఎత్తైన కొండ.
అది శక్తి కటారి తీర్థం అన్నారు మధు.
అక్కడి కెళ్ళాలి మనం.
మళ్ళీ సన్నన్ని దారిలో నీటి జారుడు బండ.
కింద లోతైన నీటి గుండం.
ఆ నీటి గుండంలోకి దూకుతాం. ఎక్కడం ఎలా!?
ఎక్కేటప్పుడు తాడవసరం ఉంది.
తాళ్ళు కుమార ధార వద్ద వెలాడదీసి వచ్చేశాం.
మరొక తాడు తీసుకువస్తేనే ముందుకు సాగగలుగుతాం.
ఒక ఇద్దరు సాహసికులు గుండంలోకి దూకారు.
పైకి రాలేకపోతున్నారు.
ఒక చెట్టు ఊడలు నరికి తీసుకొచ్చి వేలాడదీశారు.
అవి పట్టుకుని ఎక్కడం వీలు కావడం లేదు.
జై బాలాజీ
మాలోని జైబాలాజీకి ఒక ఆలోచన వచ్చింది.
పక్కనే ఉన్న గొంతు లోతు నీటి గుండంలోకి దిగి నిలుచున్నాడు.
ఒంటిపొరతో కట్టుకున్న తన పంచె ఊడ దీసి ఇచ్చాడు.
పాపం అండర్‌వేర్ కూడా లేదు.
అందరి ముఖాల్లో నవ్వులు.
అతనూ నవ్వుతున్నాడు.
జైబాలాజీ పంచెను మెలిపెట్టి నీటి గుండంలోకి వదిలారు.
మిగతా వారంతా పైన దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఆ పంచెను పట్టుకుని ఆ ఇద్దరూ ఎక్కి వచ్చారు.
ఎవరీ జై బాలాజీ!?
నల్లగా లావుగా, బలిష్టంగా ఉండే జై బాలాజీ తిరుమల వాసి.
తెల్లని ఒంటి పొర పంచె కట్టుకుంటాడు.
తలకు తెల్లని పాగా చుట్టుకుంటాడు.
చేతిలో ఎప్పుడూ మోగని వేణువు.
జంజం వేసుకుంటాడు.
నామాలు పెట్టుకుంటాడు.
అతనికి తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు.
ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం తిరుమల వచ్చిన భక్తుల్లోంచి ఒక పిల్లవాడు తప్పిపోయాడో?
తల్లదండ్రులే వదిలేసి వెళ్ళిపోయారో? తెలియదు.
అలా తప్పిపోయిన పిల్లవాడు జై బాలాజీ గా తిరుమలలోనే పెరిగాడు.
పెళ్ళిచేసుకోలేదు.
తన వాళ్ళంటూ ఎవరూ లేరు.
ఒక మఠం పెట్టుకున్నాడు.
సేవాదృక్పథంతో బతికేస్తున్నాడు.
తిరుమలలో ఉత్సవ మూర్తుల ఊరేగింపులప్పుడు దివిటీలు పట్టుకుంటాడు.
నిజంగా ఆరోజు తన పంచె ఇవ్వాలన్న ఆలోచనే జై బాలాజీకి రాకపోతే ఎంత కష్టం!
తాడు లేకపోవడం వల్ల ముందుకు సాగలేకపోయాం.
పన్నెండేళ్ళ క్రితం తాంత్రిక లోయకు వెళ్ళినప్పుడు ఆ లోయలో శక్తి కటారి తీర్థాన్ని చూశాను.
ఆ జలపాతం పడే కొండ పైనుంచి దాన్ని చూడాలనే మా తపనతో ఈ సాహసం.
తాడు లేకపోవడం వల్ల వెనుతిరిగాం.
చూసిన లోయ అందాలన్నీ మళ్ళీ చూస్తూ సాగుతున్నాం.
ఈలోయలో మా మధ్యాహ్న భోజనం సంచులు పెట్టిన ప్రాంతానికి చేరుకున్నాం.
అన్ని తిండి సంచులూ బాగానే ఉన్నాయి.
నా సంచి మాత్రం చిరిగిపోయి చిందరవందరగా పడి ఉంది.
ఇది కోతుల పనే అయి ఉంటుంది.
అన్నిటినీ వదిలేసి నా సంచినే ఎందుకు చించింది!?
అంతా చపాతీలు, పూరీలు, పెరుగన్నం; రకరకాల తిళ్లు తెచ్చారు.
నేను మాత్రం పులిహోర కట్టుకొచ్చాను.
ఒక పులిహోర పాకెట్ అదనంగా తెచ్చాను.
కోతి ఒక పాకెట్ మాత్రమే సగం చించి అందులో కొంత తిన్నట్టుంది.
రెండు పెరుగు పాకెట్లు తాగేసింది.
మరో మూడు పెరుగు పాకెట్లు, ఒక పులిహోర పొట్లం ముట్టుకోలేదు.
అందరి తిళ్లు వదిలేసి నా తిండి మాత్రమే కోతులు తినడం ఇది రెండవ సారి.
శేష తీర్థతానికి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్న రెండు పులిహోర పాకెట్లనూ కోతులు తినేశాయి.
మిగతా వారి పొట్లాలు ముట్టుకోలేదు.
దీంతో అర్థమైంది, కోతులు పులిహోర వాసన పట్టేస్తాయి అని.
వాటికి పులిహోర అంటే మహా ఇష్టం.
ఈ తడవ పులిహోర తీసుకెళ్ళ కూడదు.
మళ్ళీ కుమార ధారకు చేరుకున్నాం.
ఇంకా మధ్యాహ్నం ముడు గంటలే.
ఇంత తొందరగా ఎందుకు వెళ్ళి పో వాలి!
కుమార ధారలో ఒక అరగంట వెల్లకిలి పడుకున్నాం.
మూడున్నరకు మళ్ళీ తాళ్ళు పట్టుకుని కొండెక్కి తిరుగు ప్రయాణ మయ్యాం.
చీకటి పడకముందే తిరుపతి చేరుకున్నాం.
ఇది నిజంగాసాయస యాత్రే!
ఆ పద్నాలుగు మందీ సాహసికుల్లో నేనూ ఉండడం నిజంగా సంతోషదాయకం!
(ఆలూరి రాఘవ శర్మ సీనియర్ జర్నలిస్ట్ , ప్రకృతి ప్రియుడు. తిరుపతి)
మీ ఈ తాజా కథనం ఆద్యంతం బాగుందండి. కానీ ఒక సవరణ. ఆ కోతులు మీ పులిహోరను ఆబగా ఆరగించాయంటే వాటి ఆకలిని మీరు తీర్చినట్లు. ఈ సారి కూడా ట్రెక్కింగ్ వెళ్లినప్పుడు వాటికోసం ఒక పులిహోర ప్యాకెట్ ను అదనంగా తీసుకుపోండి. అడవిలో ఉన్నప్పుడు తిండి పదార్థాలను మనుషులు పంచుకున్నట్లే జంతువులకు కూడా ఎంతో కొంత పంచిపెట్టాల్సిందే. నిజానికి కోతులు మన వద్దకు వచ్చి ఏదైనా చేతిలో ఉంటే ఎంత మార్దవంగా, సున్నితంగా తీసుకుంటాయంటే మైమర్చిపోతాం మనం రాయచోటి జిల్లా లక్కిరెడ్డి పల్లెకు కాస్త దూరంలో ఉండే గండి క్షేత్రంలో కొన్నేళ్లక్రితం ప్రత్యక్షంగా అనుభూతి చెందాను నేను. అక్కడ ఉండే వందలాది కోతుల్లో ఏ ఒక్కటి మన వద్ద ఉండేది కొట్టేయాలని ప్రయత్నిచలేదు. దగ్గరకి వచ్చి నిలుచుంటాయి. మనవద్ద ఏదైనా ఉంటే, చేయి చాపితే సుతారంగా తీసుకుని వెళ్లిపోతాయి. కోతి ఉగ్రరూపమెత్తి గోళ్లతో బరికితే ఎంత లోతు గాయం అవుతుందో తెలిసిందే మనకు. కాని మన వద్దనుంచి దేన్నయినా అందుకున్నప్పుడు మెత్తటి చేతి స్పర్శను అనుభూతి చెందుతాం మనం. ఆ దృశ్యం ఇప్పటికీ నాకు మరుపురాలేదు. అపరూపంగా వర్ణించారు ఈసారి. చాలా బాగుంది.
అలాగే కొండపైన పారేది వాగు, జలపాతమే కదా. వాటిని ఏరు అంటామాా… సాధారణంగా మైదానంలో సమతలం ప్రదేశంలో పారే నీటిప్రవాహాన్నే ఏరు అంటామని గుర్తు. కొండపైన పారే నీరును కూడా ఏటి నీరు అంటారంటే నిజంగా కొత్త విషయమే నాకు..
సెలయేరు అనవచ్చేమో…