*వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టమని డిమాండ్ చేస్తూ
*శ్రీబాగ్ ఒడంబడిక అమలుకై నవంబర్ 16, 2022 న సత్యాగ్రహం విజయవంతం చేద్దాం
(బొజ్జా దశరథరామిరెడ్డి)
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారి పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలుగు రాష్ట్రం సాదించుకంటే, “ఆ ఏర్పడే తెలుగు రాష్ట్రంలో వెనకబడిన రాయలసీమ పట్ల వివక్ష జరగకుండా ఉండటానికి ఆనాడు కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మద్య జరిగిన ఒప్పందం శ్రీ బాగ్ ఒడంబడిక. రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీ బాగ్ ఒడంబడిక నవంబర్ 16, 1937 న జరిగింది. ఈ హక్కుల పత్రం అమలు జరుగుతుందన్న ఆశతో నాడు రాయలసీమ వాసులు కోస్తాంధ్ర నాయకులతో కలసి అలుపెరగని పోరాటం చేసారు. అక్టోబర్ 1, 1953 న తెలుగు రాష్ట్రం ఏర్పడింది.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజదాని కర్నూలు లో ఏర్పడింది. కాని తెలంగాణ ప్రాంతం నవంబర్ 1,1956 లో ఆంధ్ర రాష్ట్రంతో చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి కర్నూలులో ఉన్న రాజదాని హైద్రాబాద్ కు తరలిపోయింది.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పడిన తరువాత, రాష్ట్ర అవతరణ కంటే ముందే 1951లో ప్లానింగ్ కమీషన్ అనుమతులు పొందిన కృష్ణా పెన్నార్ ప్రాజక్ట్ కు తిలోదకాలు ఇచ్చి నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టి శ్రీబాగ్ ఒప్పందంలో మరో కీలమైన కృష్ణా జలాలో ప్రధమ ప్రాధన్యతను కృష్ణార్పణం చేసారు.
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ జూన్ 2, 2014 న విడిపోవడంతో *1953 లో ఏర్పడిన* నాటి *ఆంధ్ర* *రాష్ట్రమే* నేడు *ఆంధ్రప్రదేశ్* గా కొనసాగుతున్నది.
తెలంగాణ విడిపోయిన తరువాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేసే అవకాశం మరొక్కసారి వచ్చింది. కాని గత ప్రభుత్వం కేంద్రీకృత రాజదాని అంటూ అమరవాతి కేంద్రంగా రాజదాని, హైకోర్టు, సెక్రెటరియేట్, విద్యా, వైద్య విశ్వవిద్యాలయలు, పర్యాటక కేంద్రం, క్రీడా కేంద్రం, తదితర రంగాలన్ని అక్కడికే తరలించి *రాయలసీమ అభివృద్ధిని అడ్డుకున్నారు.* అమరావతి ప్రాంతంలో ఉద్యోగాలు అన్ని ఆక్కడి స్థానికలకే అని రాయలసీమ ప్రాంతం పట్ల వివక్ష చూపుతూ *రాయలసీమ యువత భవిష్యత్తుకు* *తీవ్ర* *విఘాతం* కలిగించారు.
సాగునీటి రంగంలో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజక్టులకు రాష్ట్ర విభజన చట్టం అనుమతించి, రాష్ట్ర ప్రభుత్వ నిదులతో పూర్తి చేయమంటే, కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం ప్రాజక్టు నిర్మాణ బాధ్యతను గత రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన ఎత్తుకొని రాయలసీమ ప్రాజక్టుల నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. ఈ వివిధంగా శ్రీబాగ్ ఒడంబడిక కల్పించిన రాజదాని, సాగునీటి హక్కులు రాయలసీమకు అందకుండా చేసారు.
ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తున్నాం అంటూ కేవలం *మాటలకే పరిమితం అయ్యారు.* చట్టబద్దమైన హక్కులున్న ప్రాజక్టుల స్థిరీకరణ ప్రాజెక్టులు గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపొతల పథకం, సిద్దేశ్వరం అలుగు అంటూనే ఒక్క అడుగు ముందుకు వేయని పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు జలాల మీద నిర్మాణం చేపట్టిన, రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన *ప్రాజక్టుల నిర్మాణం* ఇప్పుడు *”ఎక్కడ వేసిన గొంగలి అక్కడే”* లాగా తయారైంది. హంద్రీ నీవా కాలువ సామర్థ్యం పెంపు, గాలేరు నగరి మొదటి దశ ఆయకట్టుకు కాలువలు, రెండవ దశ నిర్మాణాలు అతీగతి లేని పరిస్థితి లో ఉన్నాయి. నిర్వహణలో ఉన్న అలగునూరు రిజర్వాయర్ పూర్తిగా కుంగి పోయి ఐదు సంవత్సరాలైనా నిదుల కేటాయించక పోవడం, కుందూ నది వెడెల్పు , లోతు చేయడం పేరుతో లక్ష యాబై వేల ఎకరాల *ఆయకట్టును నాశనం చేయడం, , భూగర్భ జలాలు అడుగంటించడానికి ప్రస్తుత ప్రభుత్వం పూనుకుంది.*
*పాలనా వికేంద్రీకరణ అంటూ హైకోర్టు కర్నూలు లో అంటూ ఊరిస్తూ , దానికి సంబంధించిన దస్త్రాన్ని కదలించని వైనం, కృష్ణా యాజమాన్య బోర్డును కర్నూలు కాకుండా విశాఖపట్నం లో ఏర్పాటుకు పచ్చజెండ ప్రభుత్వం ఊపుతుంది. శ్రీబాగ్ ఒడంబడిక ను గౌరవించడం అంటే ఇదేనా !*
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కడప ఉక్కు కర్మాగార ఏర్పాటు, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు, వెనుక బడిన రాయలసీమకు బుందేల్ కండ్ తరహా 30 వేల కోట్ల రూపాయల ప్యత్యేక ప్యాకేజీ మరియు ప్రస్తుత ప్రభుత్వం నియమించిన కమిటీలు, జి.ఎన్ రావు, బోస్టన్ సిఫార్సుల అమలు (ఒక్క మూడు రాజధానుల సిఫార్సు తప్ప) ఊసే లేదు. వెనుకబడిన ప్రాంతం లోని గుంతకల్ లో రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేయక పోగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మరియు అన్ని పార్టీలు డిమాండ్ చేయడం సీమ ప్రజల పట్ల వివక్షత గాక మరేమిటి?
పాలకులను ప్రశ్నిద్దాం. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేలు తలపెట్టమని డిమాండ్ చేద్దాం …..
శ్రీబాగ్ ఒడంబడక దినోత్సవం నవంబర్ 16, 2022 న విజయవాడ నడిబొడ్డున శ్రీబాగ్ ఒడంబడిక అమలుకై పాలకులను నిలదీద్దాం …..