సహపంక్తికి వెళ్ళినందుకు గురజాడను ఇంట్లోకి రానివ్వని భార్య
(రాఘవ శర్మ)
గురజాడ అప్పారావు సంస్కరణ వాదానికి శాస్త్రీయ ప్రతినిధి. స్త్రీ సమస్యలను లోతుగా, విశాలంగా పరిశీలించి న కవి,రచయిత. స్త్రీ పీడనకు గురవడానికి గల సామాజిక ఆర్థిక మూలాల్ని పరిశీలించాడు.
బాల్య వివాహాల్ని వ్యతిరేకిస్తూ ‘పూర్ణమ్మ కథ’ రాశాడు.
‘కన్యాశుల్కం’ దురాచారాన్ని ఎంతగా ఎగతాళి చేయాలో అంతగా ఎగతాళి చేసి ఒదిలిపెట్టాడు. స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా విమర్శించాడు.
ఆనాటి వివాహ వ్యవస్థ స్త్రీ జీవితాన్ని ఏవిధంగా విషవలయంలోకి తోసేస్తోందో తన రచనల ద్వారా నిరూపించాడు.
ప్రేమ, మానవతా పునాదులుగా స్త్రీ, పురుష సంబంధాలు ఉండాలని బోధించాడు. మిగతా సంస్కరణవాదులతో పోల్చుకుంటే గురజాడ ఉన్నత శ్రేణికి చెందిన సంస్కరణ వాది.
అలాంటి గురజాడ అప్పారావు సంప్రదాయాల్లో మునిగి తేలే భార్య వల్ల కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
గురజాడ మునిమనుమడు గురజాడ వెంకట ప్రసాద్, ఆయన సతీమణి ఇందిరా దేవి తిరుపతి వచ్చిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం మా( రాఘవ శర్మ) ఇంటికి వచ్చారు.
గురజాడకు సంబంధించిన అనేక విషయాలు ముచ్చటించాక, కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
గురజాడ అప్పారావు సతీమణి అప్పల నర్సమ్మ,
ఆమె ఎల్లాప్రగడ సన్యాసి రాజు కుమార్తె. గురజాడ రచనలలోనే కాకుండా ఆచరణలో కూడా గొప్ప సంస్కరణ వాది.
అప్పల నర్సమ్మనిత్యం మడి, దడి ఆచారాలతో జీవించే సంప్రదాయవాది. మహానైవేద్యం అయితే కానీ మధ్యాహ్న భోజనం వడ్డించేది కాదు.
రాత్రి త్వరగా భోజనం చేసి నిద్రకుపక్రమించేది.
గురజాడ ఓ రోజు బరంపురం వెళ్ళి, సహపంక్తి భోజనం చేసి అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వస్తుంటే అప్పల నరసమ్మ ఆయన్ని ఇంట్లోకి రానివ్వలేదు. భర్తతో చాలా సేపు గొడవపడింది.
సహపంక్తి భోజనానికి బరంపురం వెళ్ళి వచ్చిన బట్టలు విప్పేసి, ఆ అర్ధరాత్రి చన్నీటి స్నానం చేస్తే తప్ప గురజాడను ఇంట్లోకి అనుమతించలేదు.
సహపంక్తి భోజనం చేశాడని గురజాడతో అప్పలనర్సమ్మ రెండు రోజులు మాట్లాడనేలేదు. ఇద్దరి ఆలోచనలు పరస్పరం భిన్నమైనవి.వ్గురజాడ సంస్కరణ వాది, అప్పల నరసమ్మ పచ్చి సంప్రదాయవాది. గురజాడ సమాజ విషయాలు, రాజకీయాలు పట్టించుకోవడం అప్పలనరసమ్మకు ససేమిరా ఇష్టం ఉండేది కాదు.
ఎందుకంటే గురజాడ ఎక్కువ సమయం అక్కడే గడిపి, ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వస్తాడని, గురజాడతో మట్లాడాలంటే అప్పల నరసమ్మ తెల్లవారు జామున 5 గంటలకు లేచి మాట్లడేది.
ఆనందగజపతి సంస్థానంలో గురజాడ పనిచేయడం వల్ల ఎక్కువ సమయం అక్కడే గడపాల్సి వచ్చేది.
పైగా రేవారాణికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసేవాడు.
దాంతో సంస్థానంలో అంతా నిద్రపోయాక గాని గురజాడ ఇంటికి వచ్చే అవకాశం ఉండేది కాదు.
గురజాడ 1915లో మృతి చెందగా అప్పల నర్సమ్మ 1926లో మృతి చెందారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే గురజాడ అప్పారావు కుమారుడు గురజాడ రామదాసు 1973 నవంబర్‌లో మృతి చెందారు. అప్పటికి గురజాడ అప్పారావు మునిమనుమడు గురజాడ వెంకట ప్రసాద్ వయసు 13 ఏళ్ళు.
తాతగారి ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నారు.
గురజాడ అప్పారావు మరణించిన మరుసటిరోజు నుంచి ఆయన తల్లి కౌసల్య కొడుకుపైన చాలా బెంగ పెట్టుకుంది.
గురజాడను దహనం చేసిన చోటికి ప్రతిరోజు వెళ్ళి ‘నాయనా అప్పారావు ఇంటికి తిరిగిరా నాయనా’ అంటూ ఏడ్చేది.
అలా ఏడాది పాటు ఆ తల్లి కుమారుడి దహనక్రియలు జరిగిన ప్రాంతానికి రోజూ వెళ్ళి విలపిం చింది.
అలా విలపించి, విలపించీ ఆ మరుసటి ఏడాది ఆమె కూడా మృతి చెందింది.
గురజాడ సంస్కరణ వాది అయినా, సంధ్యావందనం చేసేవాడు. అంటే సూర్యుడికి నమస్కరిం చే వాడు.
గురజాడకు సంగీతమంటే చాలా మక్కువ.
ఆయన వీణ వాయించేవాడు.గురజాడ ఎంత సంస్కరణాభిలాషి అయినా, ఇంట్లో ఎదురీదక తప్పలేదు.
గురజాడ వెంకట ప్ర సాద్, ఆయనస తీమణి ఇందిరాదేవి మా ఇంటికి వచ్చి మా అమ్మ విమలా దేవి(91)తో పాటలు పాడించుకుని మురిసిపోయారు.
పుత్తడి బొమ్మ పూర్ణమ్మలోని కొన్ని చరణాలను కూడా మా అమ్మ ఆలపించింది. మాఇంటి నుంచి తనపల్లి లోని నామిని ఇంటికి వెళ్ళి, రాత్రికి విజయనగరానికి తిరుగు ప్రయాణమయ్యారు.
(రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి)
ఏ రకంగా చూసినా గురజాడ కుటుంబానికి సంబంధించిన అపురూప జ్ఞాపకాలను ఇక్కడే చూస్తున్నానండి. నిజంగా అభినందనలు