ఎలిజబెత్ రాణి మరణం గుర్తుచేసే చరిత్ర 

   డాక్టర్. యస్. జతిన్ కుమార్    

 రెండవ ఎలిజబెత్ మహారాణి 96 సంవత్సరాల వయసులో సెప్టెంబర్ 8న చనిపోయింది, బ్రిటిష్ రాజ్యాంగ అధినేతగా [మహారాణిగా] 70 సంవత్సరాల సుదీర్ఘకాలం వ్యవహరించిన ఆవిడ అంత్యక్రియలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయల్స్, 500 మంది దేశాధినేతలు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కూడా లండన్ వెళ్లారు.

 ఈటెలు, కత్తులు, హల్బార్డ్లు, స్వయం చాలక ఆయుధాలు, బయోనెట్లు, ఫిరంగులు, యుద్ధ గుర్రాలు,రంగు రంగుల యూనిఫారాలతో ఆమె స్మారక ప్రదర్శనలు నిండిపోయి ఉన్నాయి. గతకాలపు అట్టహాసమంతా సాంప్రదాయాల పేరిట కొనసాగింది. పారిశ్రామిక విప్లవంతో, అధునాతన శాస్త్రీయ సంపత్తితో అభివృద్ధి చెందిన సమాజం అని ప్రఖ్యాతి చెందినప్పటికీ ఇప్పటికీ సనాతన రాజరికాన్ని వదిలించుకోవటానికి  ఆ సమాజం సిద్ధంగా లేదని రాణి మరణ సంద ర్భం తేటతెల్లం జేస్తోంది. 70 స౦వత్సరాలపాటు ఆప్యాయ౦గా, చక్కని, గౌరవప్రదమైన ప్రజాసేవ చేసిన ఎలిజబెత్ II రాణి మరణి౦చి౦దని వారు విచారిస్తున్నారు.విలపిస్తున్నారు.

 అయితే ఈ సంతాపాలలో బ్రిటీష్ రాజరికం, సామ్రాజ్యం  శతాబ్దాల తరబడి సాగించిన బానిసత్వం, వలసవాదం, నయా వలసవాదం, యుద్ధం, మారణహోమం వంటి చారిత్రక ఘట్టాలను, వాస్తవాలను విస్మరిస్తున్నారు. 

బ్రిటన్ లో  బాగా ప్రసిద్ధి చెందిన రాయల్ పరేడ్ లలో బ్రిటిష్ రెజిమెంట్లు, శ్వేత ఆంగ్లేయ పరిధిలో వుండే  ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల సాయుధ దళాల భాగస్వామ్యం ఉండటం యాదృచ్ఛికమేమీ కాదు. క్వీన్ ఎలిజబెత్ II మరణం, కింగ్ చార్లెస్ III యొక్క  అధికార స్వీకారం కూడా  భారీ సైనిక కవాతులతో -స్కాట్లాండ్ నుండి న్యూజిలాండ్ వరకు- ఆంగ్ల  భూగోళం లోసామూహిక ఫిరంగి దళాల కాల్పుల ద్వారా ఆవిష్కరించ బడుతోంది. అది ఉన్నత గౌరవం గా రాయల్ గా భావించబడుతోంది.”రాయల్” అనే పదం ప్రపంచవ్యాప్తంగా అనేక ఆసుపత్రులు సేవా సంస్థలకు మాత్రమే కాకుండా, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (RAN), రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ (RAAF), రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) వంటి సాయుధ దళాలకు, భద్రతా సేవలకు విరివిగా వాడుతుంటారు. రాచరికానికి గుర్తింపు సైనిక శక్తి అని ఎప్పుడో తేలిపోయిందే కదా! 

గత 1,000 సంవత్సరాలలో ప్రపంచంలోని 193 దేశాలలో 170 దేశాలను ఆంగ్లేయులు ఆక్రమించారు, ఆస్ట్రేలియా 85, ఫ్రాన్స్ 82, యుఎస్ 72 (రెండవ ప్రపంచ యుద్దం తరువాత 52), జర్మనీ 39, జపాన్ 30, రష్యా 25, కెనడా 25సందర్భాలలో పరాయి ప్రాంతాలపై దాడులు చేసి పాగా వేశాయి.1066 లో ఇంగ్లాండును ఆక్రమించిన నార్మన్ల నుండి, 21 వ శతాబ్దంలో యు.కె-మద్దతుతో యు.ఎస్. చేస్తున్న ముస్లిం ప్రపంచ వినాశనం వరకు, ఈ దండయాత్ర లు  ఆ ప్రాంతాల స్థానిక జాతులను నిర్మూలిస్తున్నాయి. జాతి నిర్మూలన నేరం యొక్క నివారణా, శిక్షపై  ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్- ఆర్టికల్ 2 ద్వారా “ఒక దేశం లేక ప్రాంతంలోని జాతి, లేదా మత సమూహాన్ని మొత్తంగా లేదా పాక్షికంగా నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన చర్యలు, జాతి నిర్మూలన నేరం క్రింద పరిగణించబడతాయని” నిర్వచించింది 

 1066 లో కొత్తగా స్థాపించబడిన నార్మన్ ఇంగ్లీష్ వ్యవస్థ – ఆంగ్లో-సాక్సన్ సంస్థలను  హింసాత్మకంగా తొలగించడం, ప్రతిఘటించిన రైతాంగాన్ని మూకుమ్మడి హత్యలతో అణచి వేయడం ద్వారా జాతి నిర్మూలనను ప్రారంభించింది. అప్పటి నుండి జాతి వివక్ష, హత్యాకాండ కొనసాగుతునే వున్నాయి. దాదాపు గా ప్రపంచంలో నేడున్న ప్రతి దేశమూ బ్రిటిష్ దండయాత్రను, వారి చేతుల్లో వినాశనాన్ని చవిచూసింది.  

ఈ సహస్రాబ్దిలో బ్రిటిష్ రాజ్యం భూమ్మీద దాదాపు ప్రతి దేశాన్ని ఆక్రమించింది.[మంగోలియా, కజకస్తాన్  వంటి  కొన్ని దుర్గమమైన మధ్య ఆసియా రాజ్యాలు మినహాయింపులు] ఆ దాడుల చరిత్ర గురించి క్లుప్తంగా చెప్పాలంటే కూడా పెద్ద పుస్తకం రాయాల్సి వుంటుంది.క్వీన్ ఎలిజబెత్-II స్మారక ఏర్పాట్లకు, కింగ్ చార్లెస్ III కిరీట ధారణకు  సంబంధించిన అద్భుతమైన వేదికలు, వజ్ర భూషిత కిరీటాలు, రాణి కిరీటం తో శవపేటిక దగ్గర ప్రకాశించిన భారత కోహినూర్ వజ్రంతో సహా ఇతర సంపదల సంచయాలు- ఇంగ్లిష్ రాచరికం యొక్క హింసాత్మక దోపిడి చరిత్రను వివిధ రకాలుగా సూచిస్తున్నాయి.

ఆంగ్లేయుల -ప్రమేయం అంతో ఇంతో వున్నఅత్యంత భయంకరమైన -ప్రాణాంతక సంఘటనలు  చరిత్రలో చాలా హెచ్చు.15-19 వ శతాబ్దపు ఆఫ్రికన్ వినాశనం [ట్రాన్స్-అట్లాంటిక్ బానిస వాణిజ్యం] లో 60 లక్షల  మరణాలు, 19 వ శతాబ్ద పు చైనా పెను విపత్తులో [నల్లమందు యుద్దాలతో సహా] 2-10 కోట్ల మరణాలు, మొదటి  ప్రపంచ యుద్దం (1914-1918)లో 4 కోట్ల మరణాలు, రెండవ ప్రపంచ యుద్దంలో (1939-1945) 9 కోట్ల మరణాలు మరచి పోలేనివి.  

 బ్రిటిష్-పాలనలో(1757-1947) జరిగిన భారతీయ వినాశనం పరిమాణాత్మకంగా మానవ చరిత్రలో అత్యంత ఘోరమైన మానవకల్పిత దారుణం. విపత్తులు, ప్రపంచ యుద్దం, బెంగాల్ కరువు వంటి కారణాల వల్ల , హింస, నిర్బంధం, ఉద్దేశ్య పూరితంగా నిర్లక్ష్యం చేసిన కాటకాల వల్ల 18 కోట్ల మంది భారతీయులు మరణించారు.45 లక్షల కోట్ల డాలర్ల విలువైన సంపత్తిని  వారు తరలించుకు పోయారు.ఇక గుణాత్మక దృక్పథం నుండి చూస్తే, 1788 నుండి ఆస్ట్రేలియలోని  ఆదిమ వాసుల మారణకాండ, స్థానిక జాతుల ప్రజలపై సాగించిన దోపిడి మానవ చరిత్రలోమరో క్రూరమైన దారుణం. 

క్వీన్ ఎలిజబెత్-2, పాలనలో[1952 నుంచి 2022] యూ కే ఇతర దేశ ప్రజలపై దాడి చేసి భయంకరమైన, ప్రాణాంతకమైన యుద్ధాల్లో ముంచడంలో దాని మిత్రదేశాలతో కలిసి విస్తారంగా పాల్గొన్నది. ప్రస్తుతం రాణిని తమ దేశాధినేతగా గుర్తించే 15 దేశాలు ఉన్నాయి. (యుకె, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, బహమాస్, గ్రెనడా, పపువా న్యూ గినియా, సోలమన్ దీవులు, తువాలు, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, బెలిజె, ఆంటిగ్వా,బార్బుడా, సెయింట్ కిట్స్ మరి నెవిస్) ఈ  దేశాలలో కేవలం 4 శ్వేత జాతి దేశాలు (యుకె, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్) మాత్రమే  ఇతర దేశాలను ఆక్రమించే దాడులలో పాల్గొన్నాయి .

క్వీన్ ఎలిజబెత్-2 కొంతకాలంపాటు  సార్వభౌమురాలిగా ఉన్న మరో 18 దేశాలు ఉన్నాయి: దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, సిలోన్ (శ్రీలంక), ఘనా, నైజీరియా, సియెర్రా లియోన్, టాంజానియా, ట్రినిడాడ్ -టొబాగో, ఉగాండా, కెన్యా, మలావి, మాల్టా, గాంబియా, రోడేషియా, గయానా, బార్బడోస్, మారిషస్, ఫిజి-ఇవన్నీఅంతర్గత హింసకు లోనయ్యాయి. వా టికి పొరుగు దేశాలతో సంక్షిప్త సంఘర్షణలు జరిగాయి. కొద్దిపాటి చొరబాట్లు ఉన్నప్పటికీ, నాలుగు వైట్ ఆంగ్లో స్పియర్ దేశాల మాదిరిగా ఇతర దేశాలపై జాతి వివక్ష ఆక్రమణలలో ఇవి పాల్గొనలేదు.

1950-2005 మధ్య కాలంలో ప్రపంచం మొత్తంలో 130 కోట్ల అదనపు మరణాలుసంభవించాయి.[అంటే సాధారణ పరిస్థితులలో సహజంగా మరణించే జనాభా కన్నా అధికంగా మరణించారు]. వీటిని నివారించదగిన మరణాలు అంటారు. రెండవ ప్రపంచ యుద్దానంతర యుగంలో యు కె వివిధ కారణాలతో ఆక్రమించిన దేశాలలో ఈ అదనపు మరణాలు 72.7 కోట్లు [మొత్తం ప్రపంచంలో 56%] ఉన్నాయి. 1952-2022 మధ్య [ క్వీన్ ఎలిజబెత్-2 పాలనా కాలం] మొత్తం ప్రపంచం లో అదనపు మరణాలు సుమారు 150 కోట్లు కాగా,యు కె ఆక్రమిత దేశాలలోనే 50% మరణాలు ఉన్నాయి. ప్రభుత్వ అలక్ష్యం, పేదరికం, ప్రజల మౌలిక అవసరాలు తీరక పోవటం, తగు జాగ్రత్త లు తీసుకోకపోవటం వల్లనే ఈ నివారించదగిన మరణాలు సంభవిస్తాయని గమనించాలి 

అందువలన ఈ ఎలిజబెత్ రాణి పాలనా కాలంలో ఆవిడ సామ్రాజ్యంలో 75 కోట్లమంది ప్రజలు (5 కోట్ల మంది 5 సంవత్సరాల లోపు పిల్లలతో సహా) నివారించదగిన మరణాల మారణహోమంలో మసైపోయారు. దీనికి కారణం  వలస వాదం, నయా-వలసవాదం తన ఆధీన ప్రాంతాల ప్రజల సంక్షేమం పట్ల చూపిన నిర్లక్ష్యమే.

 2022 సెప్టెంబర్ 8న మహారాణి మరణం నుండి, 19 సెప్టెంబర్ 2022 న వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరిగిన ఆమె అధికారిక అంత్యక్రియలకు మధ్య సంతాప దినాలలో చెప్పబడని భయంకరమైన వాస్తవం ఇది. సంతాప ప్రకటన లలో ప్రస్తావించని అంశం ఇది. విషాద మేమంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆ రాణి అంత్య క్రియలను టీవీలో చూసి ఖిన్నులవుతున్నారు..

“ వేల్స్, స్కాట్లాండ్ అడవుల నుండి,ఆస్ట్రేలియా ఎడారులనుండి, ప్రపంచానికి అవతలి వైపున ఉన్న రాయల్ పసిఫిక్ ద్వీపాల వరకు వందల లక్షల మంది ప్రజలు ఆమెను ఎంతగానో ప్రేమించారు. ఆమె ప్రశాంతత, మంచితనం, అంకిత భావం కలిగిన ప్రజా సేవకు ఒక ఉదాహరణ గా నిలిచింది.” అని చెబుతున్నారు. అయితే మారణహోమంతో ముడి పడి ఉన్న అత్యంత సైనికీకృత ప్రపంచవ్యవస్థలో భాగమైన బ్రిటిష్ రాజ్యానికి ఆమె 70 సంవత్సరాల పాటు అధ్యక్షత వహించింది. ఇది కఠోర వాస్తవం. అయినప్పటికీ  భారీ స్మారక  సైనిక ప్రదర్శనల పట్ల ప్రజల అసమ్మతి అంతగా వినపడలేదు. UKలో నిరసన తెలిపిన కొంతమంది ప్రజా అసమ్మతి వాదులను  వెంటనే అరెస్టు చేశారు .

 మొదటి  ఎలిజబెత్ రాణి 1600 లో ఈస్టిండియా కంపెనీని ప్రారంభించింది, ఇది 2 శతాబ్దాలలో చైనా, భారత్ వంటి తూర్పు దేశాలని నాశనం చేసింది. దాదాపు 18 కోట్ల భారతీయులు, కొన్నివందల లక్షల చైనీయులు, ఇతరులు మరణించారు. మొదటి ఎలిజబెత్ పాలనలో అమెరికాపై దండయాత్ర చివరికి 9 కోట్ల ప్రజలను చంపివేసి , రాబోయే శతాబ్దాలలో భయంకరమైన బ్రిటిష్ దురాగతాలకు వేదికను ఏర్పాటు చేసింది. రెండవ ఎలిజబెత్ పాలనలో యుకె ప్రభావిత దేశాలలో సుమారు 75కోట్ల మంది ప్రజల నష్టాన్నినివారించి వుండవచ్చు. ఏదేమైనా, ప్రధాన స్రవంతి మీడియా పైన  పేర్కొన్న దురాగతాలను ఉద్దేశ్య పూరితంగానే విస్మరిస్తుంది,  

ఎలిజబెత్-2, 1997లో చివరి సారిగా భారతదేశానికి వచ్చింది. అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ ను ఆమె సందర్శించింది.1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ చేసిన చర్యలతో ఈ ప్రదేశం రక్తసిక్త  మయ్యింది.379 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు మరణించారు. అపఖ్యాతి పాలైన ఈ బ్రిటిష్ దురాగతానికి రాణి క్షమాపణ చెప్పాలని, చెబుతుందని ప్రజలు ఆశించారు. కానీ ఆవిడ చెప్పలేదు “మన గతాలలో కొన్ని క్లిష్టమైన ఘట్టాలు జరిగాయనేది రహస్యం కాదు – నేను రేపు సందర్శించబోయే జలియన్ వాలా బాగ్, బాధాకరమైన ఉదాహరణ. కానీ చరిత్రను తిరిగి వ్రాయలేము, దానికి దుఃఖం, అలాగే సంతోషం యొక్క క్షణాలు ఉన్నాయి. మనము దుఃఖము నుండి నేర్చుకొని సంతోషమును పెంపొందించుకొనాలి ” అని వ్యాఖ్యానించింది. రెండు శతాబ్దాల అమానుష  బ్రిటిష్ పాలనలో సృష్టించిన బీదరికం కారణంగా మరణించిన కోట్లమంది భారతీయుల గురించి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ విషాద చరిత్ర పట్ల ఆమె ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదు.

 కానీ ఆ రాణి మరణానికి నేటి భారత ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవనతం చేసింది. సంతాప దినంగా ప్రకటించింది. అది సబబా, కాదా అన్నది  ప్రక్కన పెడితే,  వలస పాలన, బానిసత్వపు ఆఖరి గుర్తులను కూడా చెరిపి వె య్యాలని మోదీగారు పిలుపునిచ్చిన నెలలో పే, ఈ విధంగా చేయవలసి వచ్చింది.  బానిస చిహ్నాలను తొలగిస్తున్నామని చెప్పి రోడ్ల పేర్లు మార్చుతూ, భారతీయ నావికా సేన పతాకంలోని సెయింట్ జార్జ్ క్రాస్ ను తొలగించారు. ఈ  ప్రభుత్వం  జాతీయ సంతాపం  ప్రకటించడం స్వవచన వ్యాఘాతంగా, మన ప్రజల మనోభావాలను దెబ్బతీయటంగా చాలామంది  భావిస్తున్నారు.  మన దేశం ఇప్పటికీ 56 దేశాల  కామన్ వెల్త్ బృందంలో సభ్యురాలు. కనుక దౌత్యపరంగా తప్పదని పాలకులు  సమర్థించు కుంటు న్నారు . ఒక దేశాధినేత పోయినప్పుడు సంతాపం కూడా ప్రకటించకపోవడం మానవ  సంస్కృతికి విరుద్ధమైన విషయం. క్రొత్త రాజు, క్రొత్త ప్రధానులతో ఏర్పడుతున్న బ్రిటిష్ ప్రభుత్వంతో భవిష్యత్తులో ఉండవలసిన సంబంధాల దృష్ట్యా కూడా ఇది  అవసరం. బ్రిటన్లో పెద్ద సంఖ్యలో ఉన్న భారత సంతతి ప్రజలకు మాట పడాల్సిన అవసరం లేకుండా చేయడం కూడా ముఖ్యమే, అని కొన్ని సమర్ధనలు వెలువడుతున్నాయి. ఈ సంతాప దినం  ప్రకటనలో మోదీ గారి దౌత్యనీతి, వ్యాపార ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి.  

 నిజానికి మన పాలకులు నాగరిక  సంప్రదాయాలకు, ప్రజల భావాలకు విలువ ఇచ్చేవారు కాదు. వారు  బ్రిటిష్ ప్రయోజనాలకే  కాక అన్నిసామ్రాజ్య వాద  శక్తులతోను  కలిసి నడుస్తున్నవారే.  ఆస్ట్రేలియన్  ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ , పార్లమెంటును సస్పెండ్ చేసి, రాణి మరణానికి గుర్తుగా ఒక సెలవు దినాన్ని ప్రకటించాడు, ఆ రోజు కోల్పోయిన ఉత్పత్తిని  $ 4 బిలియన్లు గా అంచనా వేశారు. బ్రిటిష్ వలస లన్నీటిలో ఈ సానుభూతి, సానుకూల స్థితి లేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాద బాధితుల వారసులు ఈ సంతాపాలకు  విముఖంగా నే ఉన్నారు.

 కాన్బెర్రాలోని ఆదిమవాసుల రాయబారిగా ఉన్న గ్వె౦డా స్టాన్లీ ఇలా వ్యాఖ్యా ని౦చాడు: “ఆమె మారణహోమానికి స౦బ౦ధి౦చిన వారసత్వాన్ని వదిలి వెళ్ళింది. మేము దాని నిజమైన ఉత్పాదనలమే,  ఈ దేశ౦లో 232 స౦వత్స రాల మారణహోమ౦ జరిగినది. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఆదిమవాసుల మారణ కాండలోభారీ భూ ఆక్రమణ, లక్ష మంది స్వదేశీ ప్రజలు హింసతో మరణించారు. లేమి, వ్యాధి కారణంగా సుమారు 20 లక్షల మంది మరణించారు.సుమారు ఒక లక్ష మంది పిల్లలు వారి తల్లుల నుండి వారి సంస్కృతుల నుండి బలవంతంగా దూరం చేయబడ్డారు.” అని అన్నారు. 

 పిట్స్ బర్గ్ లోని  కార్నెగీ మెల్లన్ యూనివర్శిటీలో భాషాశాస్త్ర విభాగ౦లో అసోసియేట్ ప్రొఫెసర్,  నైజీరియాకు చె౦దిన ఉజు అన్య చాలా కోప౦తో, కటువుగా ఇలా వ్యాఖ్యాని౦చారు : “దోపిడీకి పాల్పడే మారణ హోమ సామ్రాజ్యా నికి చె౦దిన సామ్రాజ్ఞి  చివరకు మరణి౦చబోతున్నదని విన్నాను. ఆవిడకు అంతం బాధాకరంగా వుండాలి “ “నా కుటు౦బ౦లో సగ౦ మ౦దిని ఊచకోత కోసి, స్థానభ్ర౦శానికి గురిచేసిన మారణహోమాన్ని, నేటికీ మరచి పోలేక పోతున్నాము. ఆ మారణహోమాన్ని ప్రోత్సహి౦చిన ప్రభుత్వాన్ని పర్యవేక్షి౦చిన రాజును, నేను తృణీకరి౦చడ౦ తప్ప మరేదైనా వ్యక్త౦ చేయాలని ఎవరైనా ఆశిస్తే, మీరు అతిగా ఆశిస్తున్నారని చెప్పక తప్పదు.”అని ట్వీట్ చేసింది. 1967-1970 లలో  నైజీరియాకు చెందిన ఇగ్బో ప్రజలు స్వతంత్ర దేశమైన బియాఫ్రాను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు 30 లక్షలకు పైగా పౌరులు ఊచకోత కోయ బడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఈ మారణకాండ సమయంలో నైజీరియా ప్రభుత్వానికి రహస్యంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసింది.”నేను నా ట్వీట్ కు కట్టుబడి ఉన్నాను. నాకు  ఎటువంటి పశ్చాత్తాపం లేదు… నేను  ఆమె ప్రభుత్వ మారణ హోమం నుండి బయటపడిన వారి బిడ్డను, తోబుట్టువును. ఇంకెలా మాట్లాడతాను”అన్నది.   

మరణ సమయంలో ఇలాటి ప్రశ్నలు ఆడగవచ్చునా ? ఈ సందర్భాన్ని రాజకీయం చేయవచ్చునా అని కొందరుఅసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు . అయితే బ్రిటిష్ ప్రభుత్వమే సందర్భాన్ని రాజకీయం చేసిందని వారు గుర్తించడం లేదు.

ప్రస్తుత రాజకీయ వాతావరణం  [ఉ క్రైన్ యుద్దం]  ఆ యా దేశాలతో వున్న సంబంధాలను పరిగణనలోకి తీసుకొని- రష్యా, బెలారస్, మయన్మార్, వెనిజులా, సిరియా, అఫ్గానిస్థాన్ లను ఈ  అంత్యక్రియలకు యు. కె. ఆహ్వానించలేదు. ఉత్తర కొరియా, నికరాగ్వా, ఇరాన్ దేశాల అధినేతలను కాక రాయబారులను  ఆహ్వానించారు. చైనా ప్రభుత్వాన్ని ఆహ్వానించారని  బ్రిటిష్ శాసనసభ్యుల బృందం ఒకటి  ఆందోళన వ్యక్తం చేసింది. చైనాలోని జెన్ జి యాంగ్ లో ఉయ్ఘర్ జాతి సమూహంతో వ్యవహ రించడంలో చైనా చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలను పరిగణిస్తూ  ఈ ఆహ్వానాన్ని రద్దు చేయాలని వారు అన్నారు.   ఈ విధంగా ఈ సందర్భంలోనే  యు. కె. స్వయంగా  రాజకీయ అంశాలను పరిగణన లోనికి తీసుకున్నప్పుడు మనం కొన్ని ప్రశ్నలు  లేవనెత్తడంలో సందర్భోచితం కానిదేముంది? 

1945 లో ఓటమి తరువాత జర్మనీ –  నేరాలను నిలిపివేయడం, యుద్ధ నేరాలను అంగీకరించడం, నేరాలకు క్షమాపణ, తప్పు ధోరణులను సవరించు కోవడం చేసింది, “మళ్ళీ ఎవరికీ ఎప్పటికీ ఇలా చేయము”  అనే ఒక C4A- ప్రోటోకాల్ ను స్వీకరించారు. కానీ బ్రిటన్ తాను చేసిన నేరాలను అ౦గీకరి౦చడ౦, క్షమాపణ చెప్పడ౦,లేదా “మళ్ళీ  ఇలా ఎన్నడూ జరగదు” అని చెప్పటం గాని దురదృష్టవశాత్తూ జరగలేదు. 

 వలసవాద౦, యుద్ధ౦, నయా వలసవాదం  ద్వారా ప్రప౦చానికి ఎ౦తో హాని కలిగి౦చిన రాజ్యాధినేత  రెండవ ఎలిజబెత్ రాణి. తన సుదీర్ఘ రాజ్యాధికారంలో, గత  రాచరిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. రాణి కార్యాలయం ఒక సహస్రాబ్ది ఆక్రమణలు, వలసవాద దురాగతాలతో అనివార్యంగా ముడిపడి ఉందని విస్మరించ లేము. ఆమె పూర్వీకులు వివిధ రకాలుగా చేసిన దురాగతాలనుండి విడగొట్టుకునే ప్రయత్నం చేయకుండా, నేటి ఆధునిక కాలంలోని ఆలోచనా ధోరణులను అలవరచుకోకుండా, గతంలో మాదిరి నాయకత్వం వహించిన వ్యక్తి ఈ రాణి. ఆవిడ మరణం తో ఇవన్నీ విస్మరించబడుతున్నాయి. 

 కానీ అమరులైన కోట్లాది మందిని మనం మరచిపోకూడదు. చరిత్రను విస్మరించడం చరిత్రను పునరావృతం చేస్తుంది. ప్రజలందరూ సమానంగా సృష్టించబడ్డారు, మనమందరం మానవాళి యొక్క ప్రాథమిక ఆవశ్యకతలైన దయకీ, సత్యానికి  కట్టుబడి ఉండాలి.

[డాక్టర్ గిడియాన్ పొలియ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్  కు చెందిన రచయిత, పాత్రికేయుడు, శాస్త్రవేత్త, విద్యావేత్త, లెక్చరర్, చిత్రకారుడు, మానవతావాద న్యాయవాది. గత రెండు దశాబ్దాలుగా, ఆయన నయా ఉదారవాదం, యుద్ధం, ప్రధాన స్రవంతి మీడియా వంచన, వాతావరణ మార్పుల యొక్క మానవ పర్యవసానాలపై అనేక కథనాలను ప్రచురించారు. లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. 18-09-22న ఆయన ప్రచురించిన ఒక  సుదీర్ఘ వ్యాసం నుండి కొన్ని అంశాలు సంక్షిప్త పరిచి అదనపు సమాచారం జోడించ బడింది.  ] 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *