సెప్టెంబర్ 17: 3 నినాదాల్లో 3 రాజకీయ విధానాలు

*మూడు నినాదాల్లో మూడు రాజకీయ విధానాలు.

*ఆ విధానాల వెనక మూడు ఉత్పత్తి వ్యవస్థలు.

*1-విలీనవాదం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానిది.

*2-విద్రోహవాదం జనతా ప్రజాస్వామ్యానిది.

*3-విమోచనావాదం ఫాసిజానిది.

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

ఇండియన్ యూనియన్ లో 17-9-1948న నిజాం సంస్థానం చేరింది. అది చేరిందంటే, వాస్తవికతకు అద్దం పట్టదు. నిజానికి అది బలప్రయోగంతో చేర్చబడింది. అది జరిగి నేటికి సరిగ్గా 74 ఏళ్ళు.

ఈ సెప్టెంబర్ 17నాటి పరిణామంపై భిన్నమైన మూడు వాదాలున్నాయి. వాటిని ఉదహరిస్తున్నా. (మూడింటి ముందు *వి* అక్షరం ఉండడం విశేషం)

*విలీనవాదం.

*విద్రోహవాదం.

*విమోచనా వాదం

పై మూడు నినాదాలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలు, సంస్థలున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రధాన వాదోపవాదాలు జరిగే స్థితి ఉంది. దానికంటే, వాటి వెనక దాగిన వివిధ రాజకీయ విధానాల ఆధారంగా చర్చించడం సమగ్రమైనది. అంతకంటే మించి, అవి ప్రాతినిధ్యం వహించే ఆయా ఉత్పత్తి విధానాలపై చర్చిస్తే ఇంకా సమగ్రంగా వుంటుంది.

ఏకకాలంలో ఒకవైపు ఫ్యూడలిజం, మరోవైపు కాపీటలిజం, ఇంకోవైపు సోషలిజం అనే మూడు భిన్న సామాజిక వ్యవస్థల రాజకీయ స్రవంతుల మధ్య సంఘర్షణలకూ, పొందికలకూ ఆనాటి తెలంగాణా ఆలంబనగా మారడం విశేషం!

పై మూడు భిన్నమైన సామాజిక, రాజకీయ, ఆర్ధిక వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ శక్తులకి నాటి తెలంగాణా ఆలంబనగా మారింది. భారతదేశంలో మరెక్కడా లేని విశిష్ట భౌతికస్థితి తెలంగాణాలో ఏర్పడింది. దాచేస్తే దాగని చారిత్రక సత్యమది.

పై మూడు రాజకీయ వ్యవస్థలు మూడు భిన్న వర్గాలకు చెందినవి. మొదటిది, భూస్వామ్య వర్గానిది. రెండవది పెట్టుబడిదారీ వర్గానిది. మూడవది, కార్మిక, కర్షక వర్గాలది. వీటిలో రెండు వ్యవస్థలు దోపిడీ వర్గాలవి. ఒకటి శ్రామిక వర్గానిది.

ఫ్యూడలిజం, కాపీటలిజం అనే రెండు దోపిడీ వర్గాల మధ్య *వర్గ ఐక్యత* కి ప్రాతిపదిక ఉంది. వాటికి సోషలిజం గిట్టనిది.

వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణా గ్రామీణ ప్రాంతాల భౌతిక స్థితిగతులను మౌలికంగా మార్చింది. తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యూడలిజం ఒకవైపు బలహీనపడుతోన్న కాలమది. మరోవైపు పట్టణ, నగర ప్రాంతాల్లో క్రమంగా బూర్జువా వర్గం బలపడుతోన్న కాలమది. ఇటు బలహీనపడుతోన్న భూస్వామ్య వర్గానికీ, అటు బలపడుతోన్న బూర్జువా వర్గానికీ ‘సోషలిజం’ ఒక ఉమ్మడి శత్రువే. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో; అటు పట్టణ ప్రాంతాల్లో విప్లవోద్యమ వెల్లువలు తలేత్తే కాలంలో సోషలిజానికి వ్యతిరేకంగా కాపీటలిజం, ఫ్యూడలిజం మధ్య పొత్తు సహజం. అదే జరిగింది. రహస్య ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం 13-9-1948న *ఆపరేషన్ పోలో* ప్రారంభమైనది. దీన్ని ప్రజల భాషలో *పోలీసు యాక్షన్!* అనేవారు. నాలుగు రోజులకు 17-9-1948న సోకాల్డ్ విలీనానికి దారి తీసింది.

బ్రిటీష్ కామన్వెల్త్ లో కొనసాగే ప్రాతిపదికన అధికారం చేపట్టిన స్వదేశీ పాలక వర్గాలకీ, అప్పుడే దేశం విడిచి వెళ్లిన విదేశీ పాలక వర్గాలకీ మధ్య భౌతిక ఎడబాటు జరిగినా ఆర్ధిక రాజకీయ రంగాల్లో పొత్తు రద్దు కాలేదు. అది మరో కొత్త పొత్తుకు దారి తీసింది.

నిన్నటి ఫ్యూడలిజం, నేటి కాపీటలిజం కలిసి రేపటి సోషలిజం గొంతు పిసకడానికి ఆనాడు కుట్ర పన్నాయి. అవి పొత్తు కుదుర్చుకొని సోషలిజం పై కత్తులు నూరాయి. ఆ పొత్తును కుదర్చడంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా అనుభవ దక్షతలు గల విదేశీ సామ్రాజ్యవాద శక్తుల నేతృత్వం దొరకడం యాదృచ్చికం కాదు.

గత ఫ్యూడలిజానికి పార్లమెంటరీ వ్యవస్థతో పని లేదు. కాపీటలిస్టు వ్యవస్థకి దాని అవసరం బలంగా ఉంది. సోషలిజం నాటి నిర్ధిష్ట స్థితిగతుల్లో జనతా ప్రజాస్వామ్య వ్యవస్థను తన తక్షణ లక్ష్యంగా ఎంచుకుంది. తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో అప్పటికే నిరంకుశ భూస్వామ్య పాలన స్థానంలో జనతా ప్రజాస్వామ్య పాలన బీజరూపంలో ఉనికిలోకి వస్తోంది.

రైతాంగానికి నాటి సాయుధ పోరాటం భూమిని ఇచ్చింది. ఆ భూమితో పాటు గ్రామీణ ప్రజలకు చరిత్రలోనే తొలిసారి ప్రజాస్వామ్య స్వేచ్ఛను ఇచ్చింది. నాటి బ్రిటీష ఇండియాలోని వలస బాధిత ప్రజల కంటే నాటి ఫ్యూడల్ తెలంగాణ ప్రాంత ప్రజలు ముందుగా ఓ మెరుగైన ప్రజాస్వామ్య స్వేచ్ఛని అనుభవించారు. అదే తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో వర్ధిల్లిన జనతా ప్రజాస్వామ్యం.

మిగిలిన విశాల భారత దేశ ప్రజలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన త్వరలో ఏర్పడబోతోన్న పరిస్థితిని ఊహించుకొని సంతోషించే కాలమది. రాజ్యాంగ రచనా ప్రక్రియ త్వరగా పూర్తి కావాలని ఆశించే కాలమది. రేపటి పార్లమెంటరీ ప్రజాతంత్ర పాలన ఎలా ఉంటుందో స్వీయ అనుభవజ్ఞానంతో తెలుసుకోకుండానే, దాని పట్ల మిగిలిన దేశ ప్రజలు మోతాదుకు మించిన ఆశల్ని పెంచుకునే స్థితి ఉంది. మిగిలిన దేశ ప్రజలు దానికై మానసిక సంతృప్తి పొందుతుంటే, తెలంగాణ ప్రజలు మాత్రం గుణాత్మకంగా మెరుగైన జనతా ప్రజాస్వామ్య పాలనను అప్పటికే తమ వాస్తవ జీవితంలో అనుభవిస్తున్నారు.

తెలంగాణా సాయుధ పోరాటం మొత్తం మూడు దశలుగా సాగింది. 1946 జులై 4 దొడ్డి కొమురయ్య అమరత్వం పొందిన రోజు నుండి 1947 ఆగస్టు 15 వరకు 13 నెలలి మొదటి దశ. నాటి నుండి పోలీసు యాక్షన్ 13-9-1948 వరకు మరో 13 నెలలు రెండో దశ. ఆనాటి నుండి 1951 అక్టోబర్ 21న సాయుధ పోరాట విరమణ వరకు 37 నెలలు మూడో దశ. ఈ మూడు దశల్లో కలిపి 63 నెలలు రైతాంగ సాయుధ పోరాటం సాగింది. ఈ 63 నెలలలో నిజాం సర్కార్ మీద 26 నెలలు సాగింది. నెహ్రూ పటేల్ ఇండియన్ యూనియన్ సైన్యాలపై 37 నెలలు సాగింది. నిజాం సర్కారుపై రెండు దశల్లో కలిపి సాగించిన కాలం కంటే, యూనియన్ సైన్యాలపై మరో ఏడాదికి పైగా సాగడం గమనార్హం!

మూడు దశల సాయుధ పోరాటంలో (ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో) తెలంగాణలో జనతా ప్రజాస్వామ్య పాలన రూపు దిద్దుకున్న క్రమం ఎలా సాగిందో చూద్దాం.

మొదటి దశలో ఫ్యూడల్ జమీందార్లు, దొరలు ప్రధానంగా తమ స్వంత గ్రామాల్లోనే వున్నారు. గడిల్లో వుంటూ పోలీసు, రజాకార్ల ద్వారా ప్రజల పై టెర్రర్ సాగిస్తూ పెత్తనం సాగించారు. ఆ దశలో కమ్యూనిస్టు గెరిల్లా దళాలది సాపేక్షికంగా రక్షణస్థితి (డిఫెన్స్) కాగా, ఫ్యూడల్ దొరలది దాడి స్తితి (అఫెన్సివ్) ఉండేది. చివరి నెలలలో పరిస్థితి కొంత మారింది. ప్రజలు అఫెన్సివ్ స్థితిలోకి వచ్చే క్రమం ఏర్పడసాగింది. *దున్నేవాడికే భూమి* ఇంకా పోరాట నినాదంగా వుంది. అది ఆచరణాత్మక ప్రక్రియగా అప్పటికింకా మారలేదు. చివరి నెలల్లో భూస్వాధీన ప్రక్రియ బలపడుతూ వచ్చింది. అప్పటికింకా జనతా ప్రజాస్వామ్య పాలన ఉనికిలోకి రాలేదు. అదేసమయంలో విప్లవ వెల్లువ ప్రాంతాల్లో జనతా ప్రజాస్వామ్య గాలులు వీయసాగాయి. పగలు ఫ్యూడల్ పాలన, రాత్రి జనతా ప్రజాతంత్ర పాలన చొప్పున ద్వంద్వ పాలన సాగిన ప్రాంతాలు సైతం వున్నాయి. జనతా ప్రజాస్వామ్య పాలన ప్రజల అనుభవంలోకి వస్తోన్న క్రమమది.

రెండో దశలో ఫ్యూడల్ దొరలు హైదరాబాద్ కి పారిపోయారు. కోటలు, గడిల్ని ప్రజల స్వాధీనం చేసుకున్నారు. సాయుధ దళాలు గుట్టల వంటి అజ్ఞాత స్థలాల నుండి ప్రజల మధ్యకి వచ్చాయి. *భూస్వాధీన దశ* ముగిసి *భూపంపిణీ దశ* ప్రవేశించింది. ఆ భూముల పంపిణీతో పాటు జనతా ప్రజాతంత్ర పాలనా దశకు చేరింది. మూడు వేలకి పైగా గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. రేపటి జనతా ప్రజాతంత్ర రాజ్యవ్యవస్థ గ్రామాల్లో బీజరూపంలో ఏర్పడింది.

మూడో దశలో సాయుధ పోరాటం రక్షణ స్థితిలో పడింది. దళాలు ఊర్లతో పాటు గుట్టలు, చేలు సైతం వదిలి అడవులకు చేరాయి. జమీందార్లు హైదరాబాద్ నుండి కొత్త టోపీలతో తిరిగి స్వంత పల్లెలకి చేరారు. అత్యంత రహస్య పార్టీ సర్క్యూలర్ల ద్వారా పోరాట ప్రజలతో కలయికల్ని సాగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో జనతా ప్రజాతంత్ర సంస్కృతిని పార్టీ బ్రతికిస్తూ వచ్చింది.

నిజానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే రాజకీయ పరిభాషలో బూర్జువా ప్రజాస్వామ్యం. బూర్జువా ప్రజాస్వామ్యం, జనతా ప్రజాస్వామ్యం మధ్య పోలికలేదు. ఒకటి, శ్రమదోపిడీ పాలన కాగా, మరొకటి శ్రమజీవులను శ్రమజీవులే వర్గదృష్ఠితో పాలన సాగించుకునేది.

చరిత్ర గర్భం ఎన్నో చేదునిజాల్ని చెబుతుంది. చరిత్ర మీద రాజకీయ పార్టీలకూ, సంస్థలకూ తమకు తోచిన స్వంత తీర్పులిచ్చే హక్కు లేదు. ఈ వాదనల గూర్చి నాటి తెలంగాణా ప్రజలు 70 ఏళ్ల క్రితం గొప్ప విశిష్ట తీర్పు ఇచ్చారు. ఆ మట్టి మనుషులు ఇచ్చిన నాటి సమున్నత, చరిత్రాత్మక తీర్పుని గౌరవిద్దాం. ఆ ప్రజా తీర్పుతో సంబంధం లేని వాదనలతో నేడు కొత్త తీర్పులిచ్చే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అలా ఎవరు వాదించినా చరిత్రను వక్రీకరించడమే.

నాటి ప్రజలతీర్పుకి అద్దం పట్టే మచ్చుతునక వంటి ఒక ఉదాహరణని ఇద్దాం.

1952నాటి పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో మొత్తం లోక్ సభ నియోజక వర్గాల్లో అత్యధిక మెజార్టీ ఎవరికి వచ్చిందో తెలిస్తే, విస్మయం కలిగిస్తుంది. నెహ్రూ పొందిన మెజార్టీని రెండో స్థానానికి నెట్టి ప్రధమ స్థానాన్ని పొందిన ఘనత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిదే. ఇది తెలిస్తే పై మూడు వాదాల్లో ఏది సరైనదో తెల్సిపోతుంది.

నల్గొండ లోక సభకు పోటీ చేసిన కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి రావి నారాయణ రెడ్డికి నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీ లభించింది. (పార్టీ పై నిషేధంతో నాడు PDF అభ్యర్థిగా పోటీ చేయడం గమనార్హం) ఆనాటికి బహుశా 500 వరకు లోక్ సభా స్థానాలు ఉన్నట్లు గుర్తు. నెహ్రూయే కాక దేశంలో ఆనాటి ఎన్నికల్లో ఎందరెందరో పేరుమోసిన హేమాహేమీలు కాంగ్రెస్ పార్టీ తరపు పోటీ చేశారు. అందరిలో వీర తెలంగాణ సాయుధ పోరాట శిఖర ప్రాంత వీరజనం అత్యధిక మెజారిటీతో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిని ఎందుకు గెలిపించారు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు చిత్తుగా ఓడించారు?

కాంగ్రెస్ పార్టీ విలీన వాదానికి ప్రాతినిధ్యం వహించింది. ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ఆనాటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలకు విద్రోహం చేసిన పార్టీగా విమర్శించింది. తెలంగాణాలో 1952 నాటి తొలి ఎన్నికలలో పోటీ అంశాల్లో విలీన వాదానికీ, విద్రోహ వాదానికీ మధ్య పోటీ కూడా ఒక అంశమే. ఆ పోటీలో విలీనవాదాన్ని నాటి తెలంగాణ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు. 1948 సెప్టెంబర్ 17 నాటి పోలీసు యాక్షన్ ని పచ్చి విద్రోహచర్యగా భావించిన కమ్యూనిస్టు పార్టీకి పట్టం కట్టారు.

యూనియన్ సైన్యాల క్రూర దాడికి బలై, ఘోర భంగపాటుకు గురై, ప్రతి ఇంటా లాఠీ దెబ్బలు తిని, ప్రతి వీధిలో ఒకరిద్దరిని ఏళ్ల తరబడి నిర్బంధ శిబిరాలకి బలిపెట్టుకొని, ప్రతి ఊరిలో ఒకరిద్దరి యోధుల్ని కోల్పోయి, ఇల్లిల్లూ శోక సముద్రంగా మార్చిన దారుణ విలీనం పట్ల తెలంగాణ ప్రజలు ధర్మాగ్రహంతో ఇచ్చిన విశిష్ట, విలక్షణ, వినూత్న చరిత్రాత్మక తీర్పు. అది పుస్తకాలు చదివి రాజకీయ పండితులు ఇచ్చింది కాదు. వర్తమాన రాజకీయ విధానాల్ని దిద్దుబాటు చేసుకొని, పంథాల్ని మార్చుకొని, కార్యక్రమాల్ని సవరించి, విలీనాన్ని సానుకూల పరిణామంగా చెబితే మన తాత ముత్తాతల తరం ఇచ్చిన తీర్పుకు విరుద్ధమైనదే.

వేలాది మంది తమ నిండు ప్రాణాల్ని బలిపెట్టి, లక్షలాదిమంది కొంపా గోడుతో సహా సర్వం కోల్పోయిన మన పూర్వ తరాల త్యాగాల తరం ఏ తీర్పు ఇచ్చారో దాన్ని నిండు మనస్సుతో గౌరవిద్దాం. అమర వీరుల స్మారక స్థూపాల సాక్షిగా గత వీర, ధీర చరిత్రను స్వంతం చేసుకుందాం. వారి ప్రాణాల్ని బలిపెట్టిన విద్రోహపూరిత విలీనాన్ని నిరసిద్దాం. నాటి తరం సాగించిన అశేష, విశేష త్యాగాల్ని, వారి పోరాట చరిత్రని శ్లాఘిస్తూనే, వారిచ్చిన నాటి తీర్పుకి విరుద్ధమైన వాదన చేసే ప్రయత్నం చేయడం సముచితం కాదని భావిద్దాం.

తెలంగాణలో ఆనాడు మతం పాత్ర లేదు. నాడు ప్రధానంగా రెండే మత సంస్థలు ఉండేవి. కాశిం రజ్వీ నేతృత్వంలో మజ్లిస్ సంస్థ ఇస్లామ్ మతతత్వ సంస్థగా పని చేసేది. ఆర్య సమాజ్ హిందు మత సంస్థగా పని చేసేది. వాటి ఉనికి హైదరాబాద్ వరకే పరిమితం. హైదరాబాద్ లో కూడా ఉర్దూ మాట్లాడే అత్యధిక మెజార్టీ పేద ముస్లిమ్స్ మజ్లీస్ సంస్థని అనుసరించ లేదు. అలాగే సాధారణ హిందు జనం ఆర్య సమాజ్ వెనక లేరు. అరబిక్ భాషీయుల్లో ఒక చిన్న సమూహమే మజ్లీస్ ని అనుసరించింది. అట్లే, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర భారత్ నుండి వలస వచ్చిన వ్యాపార, వాణిజ్య వర్గాలు, కొద్ది శాతం మంది స్థానిక ఆర్య వైశ్యవర్గీయులు మాత్రమే ఆర్య సమాజ్ సంస్థను అనుసరించారు. వాటిలో అతి కొద్ది సమూహాలు తప్ప హైదరాబాద్ నగర సామాన్య ప్రజలు సైతం మతాతీతంగా జీవనం సాగించిన చరిత్ర ఉంది. ఈరోజు విమోచన వాదం పేరిట హిందుత్వ శక్తులు చరిత్రను వక్రీకరించడం ఫాసిస్టు కుట్రలో భాగమే.

1947-51 మధ్య గానీ, ఆ తర్వాత దశాబ్దాలలో గానీ విమోచన వాదం ఉనికిలో ఉంది. అది ఆ రోజుల్లో కోఠీ, అబిడ్స్ సెంటర్లలో మార్వాడీ వంటి వర్తక, వాణిజ్య ప్రముఖులకే పరిమితం. బాబరీ మసీదు విధ్వంసం తర్వాతే అదో వాదనగా ముందుకు వస్తోంది. ఇది హిందూత్వతో ముడిపడ్డ కార్పోరేట్ ఫాసిజం దేశం లో పెరిగేప్రక్రియలో భాగం.

నేటి దేశ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకి ముమ్మాటికీ ప్రధాన శత్రువు విమోచనా వాదమే. కానీ చరిత్రలో పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణలో విమోచనా వాదమూ, విద్రోహ వాదమూ పరస్పర వ్యతిరేక శత్రు వర్గాలకు ప్రాతినిధ్యం వహించాయి. ఈనాటి విమోచనా వాదం మీద మనం ప్రదర్శించాల్సిన ధర్మాగ్రహాన్ని చూపించి, నాటి మట్టి మనుషులు తమ రక్తంతో లిఖించిన చరిత్రను మరుగు పరిచే హక్కు నేటి మన తరానికి లేదు. ఈ వెలుగులో నాటి విద్రోహా చరిత్రని ఎలుగెత్తి ఖండిద్దాం. విద్రోహవాద వ్యతిరేక నెత్తుటి జండాపై ప్రతిన చేస్తూనే నేటి అతి ప్రమాదకర విమోచనా వాదం పై ప్రధాన పోరాటం చేపట్టే కర్తవ్యానికి దీక్ష వహిద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *