అమరావతి కంటే విశాఖ రాయలసీమకు మేలా?ఎలా?

అమరావతి రాజకీయాలు సరే , సీమ నేతల తీరేంటి?

(అరుణ్)

హైకోర్ట్ అనుమతితో అమరావతీ రైతుల “న్యాయస్థానం నుండి దేవస్థానం” పాదయాత్ర ,ఆ తర్వాత తిరుపతిలో వారి మహాసభ ముగిసాయి.పాదయాత్రకు,సభ నిర్వహణకు కూడా న్యాయస్థానాలనాశ్రయించాల్సి వచ్చే అతిపెద్ద ప్రజాస్వామ్యo మనది.ప్రజల సమావేశాలకు(అవే పార్టీకి సంభందించిన వైనా),ప్రభుత్వాలు(ఏ పార్టీకి చెందినవయినా)ఎందుకoత బెదురుతాయో అర్థంగాని విషయం.ఆయాత్రకు,అన్ని ప్రతిపక్షాల మద్దతువున్నందువల్ల ,బహుశా, పాలక పార్టీ అనుమతులు నిరాకరించివుండవచ్చు.అయితే,ఈ సమస్య,పైకి కనపడినంతగా సరళమైనది కాదు.కేవలం ఒక ప్రాంత రైతు సమస్యగానే చూడలేం.అందువల్ల,ఆ ఉద్యమo ఎంత మద్ధతు పొందినదో,అంతే వివాదాస్పదమైనది కూడా.అంతేగాక,ఇందులోఅధికార రాజకీయాల ప్రమేయాల పాత్రను విస్మరించలేము.అంతేకాదు,అధికార రాజకీయాలoటే,అధికార పార్టీల రాజకీయాలని అర్థం జేసుకుంటే,ఈ వివాదం పట్ల ప్రజాస్వామిక వైఖరి తీసుకోలేం. అధికార,ప్రతిపక్షపార్టీలన్నీ ఈ సమస్యను తమ రాజకీయ లబ్ధికి వినియోగించుకొనడంతో,ఈ సమస్య మరింత జటిలంగా మారిందని చెప్పవచ్చు.ఇప్పుడది ప్రాంతాల మధ్య సమస్యగా రూపుదిద్దుకుంది.దాంతో, దాన్ని ప్రజాస్వామికంగా చర్చల ద్వారా పరిష్కరించుకొనే అవకాశంలేదు.ప్రజలమధ్య వైరుధ్యాల సృష్టించి,తమ రాజకీయప్రయోజనాలకోసం వాడుకోవడం మన రాజకీయ పార్టీలకు పరిపాటే.

మొదటినుండి,అనేకన్యాయమైన కారణాలవల్ల,కోస్తా ప్రాంతంపట్ల సీమ ప్రజలకువ్యతిరేకత వుంటూ వస్తుంది.దీన్ని తనకనుకూలంగా మార్చుకొనడంలో వై ఎస్ ఆర్ పి సఫలమైందని చెప్పవచ్చు.అమరావతీ ప్రాంత రైతులపట్ల,వారి డిమాండ్ల పట్ల సీమలో,ముఖ్యంగా మధ్యతరగతి బుద్ధిజీవుల్లో,కొంతమేరకు విద్యార్థి లోకంలోవున్న వ్యతిరేకతను, ఆగ్రహాన్నివైసీపీ అనునాయులు తమకనుకూలంగా వాడుకోగలిగారు.

ఆ వ్యతిరేకత,అమరావతి రైతులను తిరుపతిలో బహిరంగ సభను నిర్వహించవద్దని హెచ్చరిక చేసేదాక పోయింది.ఇది చాలా బాధాకరం. అమరావతీ రైతుల ఉద్యమానికి తెలుదేశం పార్టీ మద్ధతు ఉందనడంలో సందేహం లేదు.అది ఆ పార్టీ ప్రాయోజితకార్యక్రమం అని కూడా చెప్పవఛూ.అంతేగాక,ఇతర ప్రతిపక్షాల మద్ధతూవుంది.అందుకనే,వై ఎస్ ఆర్ పి శ్రేణులు అమరావతి రైతుల తిరుపతి సభను అడ్డుకో చూసాయి.వై ఎస్ ఆర్ పి కి అనునాయులే గాక, అమరావతీ రైతుల డిమాండ్లు రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు అడ్డుగా ఉన్నాయని బావన కలిగినవారూ రైతులసభ తిరుపతిలో జరగడానికి వీల్లేదని చెప్పారు. అలాంటి అప్రజాస్వామిక ధోరణి ప్రదర్శించడం సమర్థనీయం కాదు. ఆ వైఖరి వై ఎస్ ఆర్ పి గొంతును వినిపించినట్టే. అదే సమయం లో,తామూ ఆదే రోజున తిరుపతిలోనే సభజరుపుతామని కోరడం విచిత్రం.ఇదంతా చూస్తున్నవారికి కొన్నిరాయలసీమ ప్రజాసంఘాలు నిర్వహించాలనుకున్న సభ వెనుక వై ఎస్ ఆర్ పి ప్రోద్భలం,ప్రోత్సాహమే గాక, దాని వెన్ను దన్నూ ఉన్నాయని స్పస్టమవుతుంది.

Kurnool Kondareddy Burj
ప్రత్యేక రాష్ట్రమేర్పడకుండా రాజధాని కర్నూల్ కు వస్తుందని నమ్మేoత అజ్ఞానులు కారు సీమ ప్రజలు!

నిజంగా,రాయలసీమవాసుల వ్యతిరేకత ఉండవలసింది,ఆనాడు అమరావతిని రాజధానిగా ప్రతిపాదించిన అప్పటి ప్రభుత్వo పై ,అందులో భాగస్వాములైన తెలుగు దేశం,బిజేపిపైనే గాక,ఆ అమరావతీ ప్రతిపాదనను పూర్తిగా సమర్థించిన జగన్ అండ్ కొ పై ఉండాలి.అంతేగానీ,ఆ ప్రభుత్వపు హామీలను నమ్మి భూములిచ్చిన వారిపై వుండటం హేతుబద్ధతేనా? సీమవాసులు, తమకు న్యాయంగా రావాల్సినవి ఎందుకు రావడం లేదో ఆలోచించక, దానికి కారణాలను సరిగా విశ్లేసించక, ఏం కావాలో వాటికై ఉద్యమించక, దానికి అమరావతీ రైతులను బాధ్యుల చేయడం సరికాదు. ఇది, వాదనకు నిలిచేది కాదు కూడా. అలాంటి ఆఫర్ ఇక్కడ, సీమలో, రైతాంగానికిచ్చి, ఆ తర్వాత అమలు జేయకుండా వుoడివుంటే, ఈ ప్రాంత ప్రజాస్వామ్య మేధావులు రైతుల హక్కుల కోసం పోరాడేవారా? కాదా? అనే ప్రశ్న ఉదయించడం సహజమే కదా! ఇది అమరావతీ రైతుల డిమాండ్లను పూర్తిగా సమర్థించడం కాదు. అసలు రాయలసీమకు అన్యాయం చేసిన వారినీ, చేస్తున్న వారిని వదలి ,అమరవతి రైతులపై ఆగ్రహం ప్రదర్శించడంవల్ల సీమకు కలిగే ప్రయోజనం ఏమిటి?


సీమవాసులు, తమకు న్యాయంగా రావాల్సినవి ఎందుకు రావడం లేదో ఆలోచించక, దానికి కారణాలను సరిగా విశ్లేసించక, ఏం కావాలో వాటికై ఉద్యమించక, దానికి అమరావతీ రైతులను బాధ్యుల చేయడం సరికాదు.


అమరావతి కి భూములిచ్చినవారు రైతులాకాదా? సాధారణ రైతులున్నారా లేదా అనేది వాదనల వల్ల తేలేది కాదు.అక్కడ అంతర్గత ఒప్పందాలు జరిగాయని చాలామంది అభిప్రాయం.అయితే,అలా జరిగాయనే వాదన కోర్టులలో ఋజువుకాలేదు.ఆవిషయానికోస్తే,అమారావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటుజేయాలనే ప్రతిపాదన అక్కడి ప్రజలనుండి రాలేదు.పాలక పార్టీ తన ప్రయోజనాలను,ప్రజా ప్రయోజనాలుగా ముందుకు తెచ్చింది.తమ ప్రయోజనాలను ప్రజల ప్రయోజనాల ముసుగులో నెరవేర్చుకోవడం అన్నీరాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టినవిద్యేగా.( వైఎస్ఆర్ పి మూడు రాజధానుల ప్రతిపాదంలోని ఆంతర్యమూ అదేఅంటున్నవారూ వున్నారు).
ఇక భూములెవరిచ్చినా,వారికిచ్చిన హామీలు అమలు జేయాల్సిన భాధ్యత ప్రభుత్వానిది.అందులోనూ,ఆ నిర్ణయం ఆనాడు అధికారంలో వున్న తెలుగుదేశం,బిజేపి పార్టీలదే కాదు,దానికి సంపూర్ణ మద్ధతును,అదీ బేషరుతుగా ఇచ్చిన అన్నీపార్టీలదీ.అందులో ప్రధాన భాధ్యత,నాడు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పి ది కూడా.ఆ విషయాన్ని మరుగుపరుస్తూ,భూములిచ్చిన వారిని నిందించడం ఎంత సమర్థనీయమో పై మేధావులు ఆలోచించాలి.

ఇక, శ్రీశైలం ప్రాజెక్ట్ కై భూములిచ్చిన రాయలసీమ ప్రాంత రైతుల గురించి మన మేధావులకు ఇప్పుడు జ్ఞప్తికి రావడం విచిత్రం. అందులోనూ,దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత,అదీ,అమరావతి రైతుల ఉద్యమంకు పోటీగా వీరికి జ్ఞాపకం రావడం,మరీ విచిత్రం.అయితే, శ్రీశైలం ప్రాజెక్ట్ కై భూములిచ్చిన రాయలసీమ రైతులకై సీమ ప్రజలు పోరాడుతే,అంతకన్నా సంతోషమేముంది?అంతేగాక,వీరిని సీమ రైతుల హక్కులకోసం ఉద్యమించవద్దనికోరే హక్కుఎవరికీ,మరీ ముఖ్యంగా అమరావతీ రైతులకు లేదు.సీమ డిమాండ్లపై మన ఉద్యమించే హక్కునూ ఎవ్వరూ కాదనలేరు. ఎవ్వరికీ సీమఉద్యమాన్ని అడ్డుకొనే హక్కులేదు కూడా.అలాంటప్పుడు, సీమప్రాంత రైతుల హక్కులకు అమరావతీ రైతులఉద్యమాన్ని పోటీ పెట్టడం అసమంజసం,అప్రజాస్వామికం కూడా. వారి డిమాండ్లు మనకు నచ్చకపోతే వారికి మద్దతునివ్వాల్సిన అవసరం లేదు.అంతేతప్ప,సీమ సమస్యలకు అమరావతీ రైతులను తప్పుపట్టడం,రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహంలో పావులు కావడమే.

విభజనానంతరం సీమపట్లరాజకీయ పార్టీల వైఖరి.

అన్ని రాజకీయపార్టీలూ,1953 నుండి సీమప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవే.ఈ ప్రాంతప్రజల అవసరాలను తమ స్వప్రయోజనాలకోసం,కోస్తాప్రాంత ధనికరైతాంగంకు తాకట్టు పెట్టినవే.ఈ ప్రాంత రాజకీయానాయకులు చేపట్టిన ఉద్యమాలు వారిని అందలమెక్కిoచాయి తప్ప,ప్రజలకు ఒనగూడినదేమీలేదని చెప్పవచ్చు.పోతే,తమ ప్రాంతంవాడు ముఖ్యమంత్రి అయ్యాడన్న అల్పసంతోషమే ప్రజలకు మిగిలింది.దీనికి నిందించాల్సింది సీమ ప్రాంతపు రాజకీయపార్టీలన్నిటినీ ,వారిని నిలదీయలేని ఈ ప్రాంత ప్రజలచైతన్యాన్ని. అలాంటి చైతయాన్ని అందించని సీమ మేధావులను.

ఇక 2014 లో, రాష్ట్ర పునర్విభజన తర్వాత, ఇప్పటి రాష్ట్రం,1953 నాటి ఆంధ్ర రాష్ట్ర భౌగోళిక సరిహద్దులతో ఏర్పడిందని,అందువల్ల రాష్ట్ర రాజధాని కర్నూల్ లో ఏర్పాటవుతుందని కొత్త ఆశ సీమ విద్యావంతుల్లో కొందరికైనా చిగురించింది.అయితే,ఈనాడు అధికార,అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదించిన నేటి అధికార పార్టీ గానీ,దాని అనునాయులుగానీ,అంతేకాదు,నేడు అమరావతి రైతుల డిమాండ్ల ను వ్యతిరేకిస్తున్న మేధావులుగాని కర్నూల్ లో రాజధాని డిమాండ్ కై ఉద్యమం చేయడం అటుంచి,నోరుకూడా విప్పిన దాఖలాలు లేవు.కేవలం కొన్నిప్రజా,విద్యార్తి సంఘాలు మాత్రమేకొంత అలజడిజేసాయి.ఇక,YSRP సానుభూతిపరులైన కొందరు మేధావులు,మాజీ ఐఏఎస్ లు,ఇంజనీర్లు మాత్రం దొనకొండలో రాజధాని ఏర్పాటుజేయాలని సీమ అన్నీ జిల్లాలలో కాలికి బలపంకట్టుకొని తిరిగారు. జగన్ ,ఆయన సహ MLAలు మాత్రం నోరు విప్పలేదు. రాబోయే ఎన్నికలలో అన్నీ ప్రాంతాల ఓట్లు కావాలిగా!


రాయలసీమ మేధావుల కష్టానికి తగిన ఫలితం నేడు దక్కింది.

లక్షల వేతనం తో ప్రభుత్వ సలహాదారులయ్యారు. సీమడిమాండ్లను గాలికొదిలేసారు. అంతేకాదు,తెలంగాణాలో కొత్తనీటి ప్రాజెక్టుల వల్ల కృష్ణా డెల్టా(రాయలసీమ కాదు)

ఎడారి అవుతుందని కర్నూల్ లో మూడు రోజులు నిరసన దీక్ష వహించిన చరిత్ర ,నేడు సమదృష్టి అంటున్న జగన్ ది. ఇదీ, సీమపై నాడు YSRPకి వున్న ప్రేమ.


మూడు రాజధానులవిషయాని కొద్దాం.జగన్ కు ఆలస్యంగానైనామంచి ఆలోచన కలిగిందనికొంతసేపుభ్రమిద్దాం. అప్పుడు,ముఖ్యమంత్రిగా,ప్రజలకు భాధ్యత వహించేనాయకునిగాచేయాల్సిందేమిటి?తన నూతన విధానంవల్ల నష్ట పోతున్నామంటున్న వారితో చర్చలు జరపాలి. వారికి తమ విధానపు హేతుబద్ధత వివరించాలీ. వారుపొందే నష్టానికి తగిన పరిహారమిస్తానని హామీ యివ్వాలి.ఇదీ ప్రజాస్వామ్యపద్ధతి.మరి,జగన్ ఏంజేశారు? మోదీకన్నా పెద్దనియంతగా ప్రవర్తించాడు.మోదీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమకారులతో కనీసం నామమాత్రపు చర్చలన్నా జరిపింది. మన చక్రవర్తికి,ఆయన గారి మంత్రివర్యులకూ ఆ మాత్రం తీరుబాటుకూడా దొరక  లేదుపాపం. హడావిడిగా అసెంబ్లీలో,తనకున్న బ్రూట్ మెజారిటీతోచట్టం జేశాడు. న్యాయస్థానంలో తిన్న మొట్టికాయలతో చట్టాన్ని రద్దు జేశాడు.అంతటితో ఆగితే, ఆయన జగన్ ఎలా అవతాడు?మళ్ళీ ఎలాంటి ఆటంకాలురాకుండా మూడురాజధానుల చట్టం తెస్తానన్నాడు.దానికి సీమ వాసుల అభ్యంతరమేమీ వుండాల్సిన అవసరంలేదు.

అమరావతి కంటే విశాఖ రాయలసీమకు ప్రయోజనమా?

జగన్ కు సీమపై నిజమైన ప్రేమవుంటే,  పాలక రాజధానీని విశాఖగా ఎందుకు ప్రకటించేవాడు? సీమప్రాంత ప్రజలకు,అమరావతి కన్నావిశాఖ అనుకూలమనుకోవాలా?లేక,రాజధానికన్నా,న్యాయరాజధానిఎక్కువమందికిఉపాధికల్పిస్తుందనుకోవాలా?ఈ ప్రశ్నలు,మూడురాజధానుల మద్ధతుగా సభల జరిపి, సీమలో రాజధాని ఏర్పాటుజేయాలని తామూశ్రీశైలం నుండిఅమరావతీ వరకు పాదయాత్ర చేస్తామని భీష్మప్రతిజ్ఞ చేసిన మేధావులకు కలగకపోవడం ఆశ్చర్యకరం. వీరంతా కేవలం,టీవిలకు,దినపత్రికప్రకటనలకు,ముఖపుస్తక రాతలకూ పరిమితమయి అకస్మాత్తుగా అజ్ఞాతం నుండి బయటకు వచ్చిన వారు కావడం గమనార్హం.

అయితే,రాజధాని తరలింపుచట్టానికి కోర్ట్ లు అడ్డుపడ్డాయి గాని,హైకోర్ట్ ఏర్పాటుకు జగన్ చట్టం చేయాల్సిన అవసరం లేదు.ఆయన హైకోర్ట్ తరలింపుకై కేంద్రప్రభుత్వం పై ఒత్తిడితెచ్చి రాష్ట్రపతి అనుమతి ఉత్తర్వులను పొందాలి.ఆ ప్రయత్నాలు ఇంతవరకు చేయలేదంటే ఏమనుకోవాలి?ఇక్కడే మరో విషయం,తన పరిధిలో వున్న కృష్ణానది నిర్వహణ బోర్డ్ కార్యాలయాన్ని సీమలో కాకుండా,విశాఖలో ఏర్పాటుకయి ప్రతిపాదించడంలో గల మతలబు ఏమిటో జగన్ అభిమానులూ,అనునాయులూ చెప్పగలరా? పై విషయాలపై,పై మేధావులు ఎప్పడూ రోడ్డుకెక్కలేదు,సరికదా,కనీసం గొంతులూ విప్పలేదు.

కేంద్రంలో అధికారంలోఉన్న బిజెపి,రాష్ట్రం లో అధికారం లో ఉన్న జగన్ రెడ్డి లకు అంగీకారమైన హైకోర్ట్ కు అతీ,గతీ లేదు.అంతో,ఇంతో సీమ గొంతుకలను తడుపుతూ,అరకొరా భూములకు సాగునీరందించే హంద్రీ-నీవా,గాలేరు-నగరి,వెలిగొండ ,గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలను కేంద్ర నోటిఫికేషన్ అనుమతిలేని ప్రాజెక్టులుగా పరిగణించబోతుంటే,కేంద్రం పై ఒత్తిడి తెచ్చి,వాటిని రక్షించుకునే ప్రయత్నాలే లేవు.జగన్ రెడ్డి పరిధిలో ఉన్న కృష్ణా యాజమాన్య బోర్డ్ కార్యాలయాన్ని కర్నూల్ లో ఏర్పాటుఊసే లేదు,మూక మెజారిటీ కలిగినా 69 జీవో రద్దు ఊసేలేదు.వీటిపైఈ మేధావులకు,రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీద్దామనే ఆలోచనే లేదు గాని,”రాయలసీమకు రాజధాని” అనే వినసొంపైన స్లోగన్ తో మాత్రం మన ముందుకు రావాలకుంటున్నారు.
“ ఆలూలేదు,చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం”,అన్నాడట వెనుకటికొక పెద్దమనిషి.సాధ్యాసాధ్యాలు,నిర్ధిష్ట పరిస్థితులు,ప్రజల చైతన్య స్తాయి,ఉద్యమ సంసిద్ధత-ఇవన్నీ పట్టించుకోకుండా ఎవరో ఆడమన్నట్టు ఆడితే,కొంతకాలం ప్రజలు మోసపోతారేమో గానీ,ఆ తర్వాత వీళ్ళ నిజస్వరూపం గ్రహించక మానరు.

నిజమే,”రాయలసీమకు రాజధాని” ని సీమ ప్రాంత ప్రజలు తమహక్కుగా భావిస్తున్నారు.అది,సీమ ప్రజల హక్కుగా,సీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒప్పందం లో స్పస్టంగా వుందికూడా.జగన్ రెడ్డి కి శ్రీబాగ్ ఒప్పందం పై అంత గౌరవం వుంటే,మూడు రాజధానుల ప్రతిపాదన సమయంలో,సీమ ప్రాంతంలో సీమ ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఉండాలి.పోనీ,కనీసం పాలనా రాజధానిని కర్నూల్ లో ఏర్పాటుజేయాలి. అలాగాక,తన పరిధిలోలేని హైకోర్ట్ ఏర్పాటు హామీని చేయడం లో గల మతలబు ఏమిటో,ఇప్పుడు వైసీపి ప్రాయోజిత కార్యక్రమాన్ని తమభుజస్కంధాలపై వేసుకున్న రాయలసీమ అభివృద్ది ప్రజాసంఘాల సమాఖ్య మేధావులు వివరిస్తారా?
“ ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చన వేసిందట”.పాలనా రాజధానికే గతిలేదు,రాజధాని కోసం పోరాడుతామని ప్రగల్భాలు.ఇప్పటికే బలమైన దక్షిణ కోస్తా సంపన్నవర్గాన్ని దూరంజేసుకున్న జగన్,పాలక రాజధానిని కర్నూల్ లో ఏర్పాటు జేసి,విశాఖ ప్రాంతవ్యతిరేకతను మూటకట్టుకోలేడుగా.అక్కడి రియల్ ఎస్టేట్ లాభాలను వదుకోగలడా?అదే వారి రాజకీయ,ఆర్థిక ప్రయోజనాల రీత్యా అసాధ్యమైనపుడు,ఏకంగా రాజధానిని కర్నూల్ లో ఏర్పాటుజేస్తాడని ఎలా అనుకోగలం?ఎవరి చెవులో,ఎవరి పూలు పెట్టాలనుకుంటున్నారు ఈ మేధావులు?
సీమ ప్రజలకు అత్యంత అవసరమైనది,తక్షణమే సాధించుకోవాలసినది చేజారిపోతున్ననీటి హక్కు(హంద్రీ-నీవా,గాలేరు-నగరి,వెలిగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపు,అనుమతిపొందిన ప్రాజెక్టులుగా పరిగణ).దానికి సంభంధించిన కె ఆర్ ఎం బి కార్యాలయం.ఆతర్వాత,హైకోర్ట్ ఏర్పాటు.వీటిపై ప్రజల్ని ఉద్యమాలకు సంసిద్ధం చేయాల్సి ఉంది.ఏ ఉద్యమానికైనా తక్షణ కర్తవ్యాలు,దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి.వాటికనుగుణంగా ఎత్తుగడలు,వ్యూహాలూ వుండాలి.అంతేతప్ప,పాలకుల ఉచ్చులో పడి,సాధ్యంగాని లక్ష్యాలను ప్రజల ముందంచడం వల్ల నష్ట పోయేది మనమే .నిర్ధిష్ట పరిస్థితులలో,అప్పటి ప్రజా చైతన్యాని కనుగుణంగా,స్వీయ, ప్రతిపక్ష బలాబలాలను అంచనావేస్తూ ఉధ్యమ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. సీమ ప్రజలు ఇంకనూ స్వామి భక్తి నుండి,కుల బంధాలనుండి బయటపడలేదు. అంతేగాక,సీమ ప్రాంతంలో ప్రజాస్వామ్య ఉధ్యమాలు జరిగిన చరిత్ర లేదు. గతంలో,సీమ హక్కులకోసం జరిగిన ఉద్యమాలు కొంతమంది నాయకుల చుట్టూ తిరిగినవే.వాళ్ళను అందలమెక్కిచ్చిన తర్వాత వాటి లక్ష్యాల ఊసే లేదు. నిజమైన ప్రజాచైతన్యం,ప్రజలనుండి ఆవిర్భవించిన ఉద్యమాల అనుభవాలతో సంతరించేదే దప్ప,  ఆకర్షణీయమైన లక్షాన్ని నిర్ధేశించుకోవడం వల్ల కాదు.ఆ దిశలో పై మేధావులు ఉద్యమిస్తే అందరూ సంతోషిస్తారు,చేతులు కలుపుతారు కూడా.అలాగాక, స్వీయ ప్రయోజనాల సం రాజకీయపార్టీల తోకలైతే ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదు. .

సీమలో, వారి హక్కుల పట్ల పెరుగుతున్న చైతన్యాన్ని, ఆగ్రహాన్ని పక్కదారి పట్టించే పై ప్రయత్నం ఫలించదని వారికీ తెలుసు.అయితే,తాత్కాలికంగానైనా ప్రజలదృష్టిని మళ్లించగలమనే ఆశ వారిది.“రాజధాని డిమాండ్” సీమ ప్రజల్లోకి బలంగా పోతే, ప్రోత్సహించిన పాలకులపైనే బూంరాంగ్ అయ్యే ప్రమాదముందని పాలకులు తెలుసుకోవడం మంచిది. ఇప్పుడున్న రాష్ట్ర పరిధిలో ,“రాజధాని డిమాండ్” ఆకలితో వున్నవాడికి అద్దం లో విందు భోజనం చూపెట్టడమే, నోరెండిన వాళ్ళకు ఎండమావుల వెంట పరుగెత్తమన్నట్టే. సీమలో రాజధాని ఏర్పాటును కాదనే వాళ్ళెవరూ సీమలో లేరు. అయితే, ఇప్పటి పరిస్తితి లో సీమ ప్రజల ప్రాధాన్యత ఏది అని గుర్తించాలి. దేనికైనా ప్రజలను చైతన్యపరిచి, సంఘటిత ఉద్యమానికి సిద్ధం చేయడం మనoదరి భాద్యత.

రాష్ట్రాభివృద్దిలో తమవంతు వాటా పొందనపుడు,సీమ ప్రజలూ, తెలంగాణ ప్రజల బాట పట్టక తప్పదు. ప్రత్యేక రాష్ట్రమేర్పడకుండా రాజధాని కర్నూల్ కు వస్తుందని నమ్మేoత అజ్ఞానులుకారు సీమ ప్రజలు.ఇక,సీమప్రజల ఆకాంక్షల నెరవేరుస్తారో,లేక వారి కుంపటి వారిని పెట్టుకోమంటారో,తేల్చాల్సిoదీ పాలక పార్టీలే .

(అరుణ్,రాయలసీమ విద్యావంతుల వేదిక, కర్నూలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *