దళిత కుటుంబాలకు ఎప్పటికైనా సాగుభూమి దక్కేనా ?

(కన్నెగంటి రవి)

నిజానికి సాగు భూమి ఎవరి చేతుల్లో ఉండాలి ? వ్యవసాయాన్ని, పశు పోషణను జీవనోపాధిగా ఎంచుకునే కుటుంబాల చేతుల్లో ఉండాలి. ఎందుకంటే , సాగు భూమి మిగిలిన ఆస్తి పాస్తుల లాంటివి కాదు. అది ప్రకృతి వనరు . ఇతర జీవ జాతులకు ఆవాసమయ్యేలా ప్రకృతి సజీవంగా కొనసాగడానికి, దానినే నమ్ముకుని ఉన్న ప్రజల జీవనోపాధిని కొనసాగించడానికి అది వనరుగా ఉండాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో 18 శాతం ఉన్న దళితుల జనాభాలో ఈ నిర్వచనం ప్రకారం , కొద్దిపాటి భూమికి సాగుదారులుగా , నిత్యం కాయకష్టం చేసే వ్యవసాయ కూలీలుగా , ఈ రాష్ట్రంలో దళిత కుటుంబాలకు మించి సాగు భూమి పొందడానికి హక్కు దారులు ఎవరు ఉంటారు?

కానీ రాష్ట్ర ప్రభుత్వ కీలక పథకం రైతు బంధు పెట్టుబడి సహాయ పథకం 61,07,762 మంది లబ్ధి దారులలో దళితులు 8,10,372 ( 13 శాతం) మంది మాత్రమే ఉన్నారు. రైతు బంధు సహాయం పంపిణీ చేస్తున్న ఒక కోటీ 47 లక్షల 56 వేల ఎకరాలలో , 2021 నాటికి దళిత కుటుంబాల చేతుల్లో ఉన్న సాగు భూమి విస్తీర్ణం కేవలం 13,52,145 ( 9 శాతం ) ఎకరాలు మాత్రమే . 2021 వానాకాలం సీజన్ లో పంపిణీ చేసిన రైతు బంధు సహాయం 7377 కోట్ల 63 లక్షలలో దళిత సాగుదారులకు అందిన మొత్తం కేవలం 676 కోట్ల 6 లక్షలు రూపాయలు ( 9 శాతం) మాత్రమే. అంటే, ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు బంధు పథకం లో నిజమైన లబ్ధిదారులుగా ఉండాల్సిన దళిత సాగుదారులకు అందుతున్న వాటా అతి తక్కువ అని అర్థమవుతుంది.

2015-2016 లో చేసిన భూ కమతాల లెక్క ప్రకారం దళితుల చేతుల్లో ఉన్న భూ కమతాలు 7 లక్షలు ( 11 .8 శాతం) . 2021 నాటికి కమతాల సంఖ్య 8,10,372 కు పెరిగినట్లు కనపడినా , నిజానికి మొత్తం కమతాలలో కేవలం 13 శాతానికి మాత్రమే పెరిగాయి. 2015-16 నాటికి దళిత కుటుంబాల చేతుల్లో ఉన్న భూ విస్తీర్ణం 13 లక్షల 15 వేల ఎకరాలు (8.9 శాతం) కాగా, ఐదేళ్లలో 2021 నాటికి అదనంగా మరో 37,571.48 ఎకరాలు మాత్రమే పెరిగి 13,52,145 ఎకరాలకు ( 9 శాతం) చేరింది.

దున్నే వారికి భూమి నినాదం కేంద్రంగా 1940-50 దశకాలలో తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం జరిగినా , 1970 – 80 దశకాలలో సమర శీలంగా నక్సల్బరీ ఉద్యమాలు జరిగినా , 1969 నుండీ ప్రారంభించి 2014 వరకూ వివిధ పేర్లతో , ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు చేసి భూ పంపిణీ చేశామని చెప్పుకున్నా, రాష్ట్రంలో దళిత కుటుంబాలకు ఇంకా సాగు భూమి హక్కుగా అందలేదని ప్రభుత్వ గణాంకాలే బయట పెడుతున్నాయి.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడే 2014 నాటికి దళితులకు ఉన్న పట్టా భూములకు తోడు అదనంగా అసైన్డ్ భూములు, భూదాన్ భూములు , మిగులు భూములు, దేవాదాయ భూములు, ఇనామ్ భూములు , వక్ఫ్ భూములు, అటవీ భూములు , సి‌జే‌ఎఫ్‌ఎస్ భూములు పేరుతో ,భూ పంపిణీ చేశామని చెప్పుకున్నా , ఆ భూమి దళితుల చేతుల్లోకి సంపూర్ణ హక్కుగా రాలేదనీ, సాగుకు పనికి రాక కొంతా, , పేదరికం వల్ల కొంతా వారి చేతుల్లోంచి జారిపోయిందనీ మనకు అర్థమవుతుంది.

2010-2011 లో చేసిన జాతీయ వ్యవసాయ లెక్కల ప్రకారం తెలంగాణా రాష్ట్ర పరిధిలో దళితుల ఆధీనం లో ఉన్న కమతాలు 5 లక్షల 80 వేలు కాగా , వారి చేతుల్లో సాగు భూమి 11లక్షల 78 వేల ఎకరాలు ఉంది. . అంటే 2021 నాటికి 10 ఏళ్ళు గడిచినా దళిత కుటుంబాల చేతుల్లోకి సాగు భూమి గణనీయంగా పెరగ లేదు . ఫలితంగా మెజారిటీ దళిత కుటుంబాల సభ్యులు , వ్యవసాయ కూలీలుగా మిగిలిపోయారు లేదా అసంఘటిత రంగ కార్మికులుగా పొట్ట చేత పట్టుకుని నగరాలకు వలసపోయారు.

2014 జూన్ 2 నుండీ తెలంగాణా రాష్ట్రం ఉనికి లోకి వచ్చాక తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం 2014 జులై 26 న జారీ చేసిన జీవో నంబర్ 1 కు అనుబంధంగా విడుదల చేసిన గణాంకాలలో తెలంగాణా రాష్ట్రం లో గ్రామీణ ప్రాంతంలో 9 లక్షల కుటుంబాలు ఉంటే , అందులో మూడు లక్షల కుటుంబాలకు అసలు సాగు భూమి లేదనీ , మరో రెండు లక్షల 40 వేల కుటుంబాలకు ఎకరం లోపు మాత్రమే భూమి ఉందనీ , మరో లక్షా 67 వేల 942 మంది రెండున్నర ఎకరాల లోపు భూమి కలిగి ఉన్నారనీ స్పష్టం చేసింది . ప్రభుత్వ నిధులతో భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తామనీ , మూడెకరాల లోపు ఉన్న దళిత కుటుంబాలకు, మూడెకరాలు ఉండేలా భూమిని కొని భర్తీ చేస్తామనీ ప్రభుత్వం ప్రకటించింది . కానీ 2018 వరకూ అరకొరగా నడచిన ఈ పథకం ద్వారా కేవలం 6242 కుటుంబాలకు 15,571 ఎకరాల భూమి మాత్రమే కొనుగోలు చేసి ఇచ్చారు .

1973 భూ సంస్కరణల చట్టం అమలు చేసి , భూ గరిష్ట పరిమితి ప్రకారం మిగులు భూములను తేల్చి , భూమి లేని పేదలకు సాగు భూమిని హక్కుగా అందించాల్సిన ప్రభుత్వాలు, ఆ ప్రక్రియ మానేసి కొనుగోలు ద్వారా ఎంతమందికి భూమి అందించ గలుగుతారు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు , అప్పటికి పని చేస్తున్న కొందరు దళిత ఉద్యమ కార్యకర్తల నుండి ఎస్‌సి ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ఈ భూమిని ప్రభుత్వం కొంటానని చెబుతుంది కనుక, ఆ నిధులకు ఇంతకు మించి నిజమైన సార్ధకత ఏముంటుంది ?అందువల్ల సాధ్యమే అనే జవాబు వచ్చింది . కానీ ఆచరణలో అలా జరగలేదు .

2014 నుండీ 2021 వరకూ బడ్జెట్ లో 85,913 కోట్లు ఎస్‌సి సబ్ ప్లాన్ నిధులు కేటాయించినా , నిజానికి ఖర్చు చేసింది కేవలం 47,685 కోట్లు మాత్రమే. ఖర్చు చేసిన నిధులు పక్కదారి పట్టయన్న విమర్శలు ఎలాగూ ఉన్నాయి. కానీ ఈ నిధులతో, సాగు భూములు పూర్తి స్థాయిలో కొని ఇవ్వక పోగా , కొనుగోలు చేసిన భూములకు కూడా అనేక సమస్యలు దళిత కుటుంబాలు ఎదుర్కున్నాయి. సాగు నీటి సౌకర్యం లేకపోవడం, దారి లేకపోవడం, సాగు యోగ్యం కాక పోవడం, పెట్టుబడి అందక పోవడం లాంటి అనేక సమస్యలు ఈ కుటుంబాలు ఎదుర్కున్నాయని డి‌బి‌ఆర్‌సి, డి‌బి‌ఎఫ్ లాంటి సంస్థలు అధ్యయనం చేసి నివేదిక వెల్లడించాయి.

గ్రామీణ జీవితంలో నిజంగా వ్యవసాయాన్ని అంటి పెట్టుకుని ఉన్న దళిత కుటుంబాలకు భూమి దక్కక పోవడం ఎంత నిజమో, ఆధిపత్య కులాలలో అత్యధికులు తమ ప్రధాన జీవనోపాధులను నగరాలకు, ఇతర రంగాలకు వేగంగా మార్చుకుంటున్నా, సాగు భూములను మాత్రం తమ కబ్జాలోనే ఉంచుకుంటున్నారు. మొత్తం రైతు బంధు లబ్ధిదారులలో 21 శాతంగా ఉన్న ఆధిపత్య కులాల చేతుల్లో ఇంకా 43,99,000 ఎకరాల (30 శాతం ) భూమి ఉన్నది.

వీళ్ళే కాక , వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహా అసలు వ్యవసాయంతో సంబంధం లేని అనేక మంది వ్యవసాయేతర వృత్తుల వాళ్ళు గతం నుండీ ఉన్న తమ భూములను కౌలుకు ఇస్తూనే , ఇంకా కొత్తగా వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.

జీవనోపాధి వనరుగా ఉండాల్సిన సాగు భూమిని ఆస్తిగా మార్చి స్పెక్యులేటివ్ మార్కెట్ సరుకుగా మార్చారు. ఇప్పుడున్న భూముల ధరలతో ఏ ఒక్క దళిత కుటుంబమూ, లేదా వాస్తవ సాగు దారు కుటుంబమూ భూమి కొనుక్కునే పరిస్తితి లేక , కౌలు రైతులుగా మారుతున్నారు.
మెరుగైన జీవనోపాధి, దాని నుంచీ , తగిన ఆదాయమూ ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా అభివృద్ధి చెందుతుంది. ఎటువంటి హక్కులు, గౌరవం లేకుండా కేవలం కూలీ పనిపై ఆధారపడే వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలను అందుకోవడం కష్టం. అందుకే వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే గ్రామీణ సాగుదారుల చేతుల్లోనే సాగు భూములు ఉండాలని, ఆదివాసీలకే అడవులపై హక్కు ఉండాలని మేం మాట్లాడేది.

కానీ విషాదం ఏమిటంటే , కమ్యూనిస్టు పార్టీల ఎజెండా లో భూమి పై చర్చ ఒక అంశంగా లేకుండా పోయింది. దళిత, బహుజనుల కోసం ఏర్పడిన రాజకీయ పార్టీలు,సంస్థలు కూడా దీనిని ఒక కీలక అంశంగా మాట్లాడడం లేదు. దళిత కుటుంబాల పిల్లలకు చదువు, చదువు ఆధారిత జీవనోపాధి తప్పకుండా అవసరమే అయినా, మొత్తంగా గ్రామీణ దళిత కుటుంబాల జీవనోపాధి అంశాన్ని అది పరిష్కరించదు. తగిన చదువు, నైపుణ్యాలు లేకుండా వ్యవసాయేతర రంగాలలో మొత్తం గ్రామీణ దళిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు దొరకవు.
దేశ, రాష్ట్ర సహజ వనరులను వ్యవసాయంతో సంబంధం లేని వాళ్లకూ , పైగా కార్పొరేట్ కంపెనీలకూ ప్రభుత్వాలు అప్పగించేసే ప్రక్రియను మనం ఆపలేమనీ, అది పెట్టుబడి దారీ విధాన సహజ ప్రక్రియ అనీ, కాబట్టి భూమి సమస్యను లేవ నెత్తడం వల్ల ఉపయోగం లేదనీ భావిస్తున్న వాళ్ళు కూడా ఎదురవుతున్నారు.

మిగిలిన డిమాండ్ల మాటెలా ఉన్నా , భూమి సమస్యను మాట్లాడిన ప్రతిసారీ , రాజ్య హింస విరుచుకు పడుతుందని ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. చెరువులు ,ప్రాజెక్టులు ఎన్ని కట్టుకున్నా, వాటి ఆయకట్టు పరిధిలో గ్రామీణ దళిత కుటుంబాలకు గుంట భూమి కూడా లేనప్పుడు , ఎస్‌సి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వాలు సరిగా అమలు చేయనప్పుడు, హక్కుగా రావాల్సిన నిధులు కూడా విడుదల చేయనప్పుడు , దళిత కుటుంబాల పిల్లలకు సరైన చదువు అందించనప్పుడు, స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకుల నుండీ సబ్సిడీపై రుణాలు దొరక నప్పుడు, దళిత కుటుంబాలకు భూమి హక్కుగా అందించాల్సిన పథకాలు కూడా ఆపేసినప్పుడు న్యాయం ఎలా దొరుకుతుంది ?

చట్ట బద్ధంగా భూ సంస్కరణలు అమలు కావాలనీ , వ్యవసాయేతర ఆదాయాలు ప్రధానంగా కలిగిన వాళ్ళు, వ్యవసాయ భూములు కొనకూడదనే చట్టం రావాలనీ కోరుతూ, నిజమైన ప్రజా సంస్థలు, పార్టీలు ఉద్యమ కార్యాచరణకు సిద్దం కానప్పుడు, దళిత, భూమి లేని నిరుపేద కుటుంబాలకు విముక్తి దొరకదు.

 

(కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక ,ఫోన్: 9912928422)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *