( ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యు యేల్ మాక్రాన్ ప్రసంగానికి సంక్షిప్త అనువాదం)
డాక్టర్. యస్. జతిన్ కుమార్
[వ్యాఖ్య : ఫ్రాన్స్ ఉన్నత దౌత్యవేత్తలు, రాయబారులతో జరిగిన ఒక అంతర్గత సమావేశంలో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితి గురించి విశ్లేషించారు అని 24-8-2022 న కొన్ని వార్తలు వచ్చాయి. “పాశ్చాత్య ఆధిపత్యానికి అ౦త౦ సమీపిస్తున్నది!” అని ఆ రహస్య సమావేశంలో ఆయన వాపోయారట. ప్రస్తుతం రష్యా యూరప్ ల మధ్యగల సంబంధాలను గురించి అనేక వ్యాఖ్యలు చేశారు. 27/08/2019 న ఒక కీలక ప్రసంగం లో “ఐరోపా నుండి రష్యాను దూరంగా నెట్టడం ఒక తీవ్రమైన వ్యూహాత్మక లోపం” అని మాక్రాన్ అన్నారు. ఐరోపా “బలహీనతలు, పొరపాట్లు” రష్యాను చైనాతో పొత్తును పెంచుకోవడానికీ, సిరియా, లిబియా, ఆఫ్రికా చుట్టుపక్కల దాని ప్రభావాన్ని పునరుద్ధ రించడానికీ దోహదపడ్డాయి. “రష్యాతో మన స౦బ౦ధాలలో శాంతిని నెలకొల్పి, చక్కబరుచు కోకుంటే యూరోప్ ఖ౦డ౦ ఎప్పటికీ స్థిర౦గా ఉ౦డదు, ఎప్పటికీ భద్రంగా ఉ౦డదు.” అని యూరప్ సమాఖ్య దేశాలకు ఆయన నొక్కి చెప్పాడు. ఈ ప్రసంగంలో కూడా శ్రీ మాక్రాన్ అలాటి అభిప్రాయాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్లాదిమిర్ పుతిన్ బహుశా దీని గురి౦చి విని, మాక్రాన్ తో నేటి ప్రప౦చ౦ లోని నాటకీయ పరిస్థితుల గురి౦చి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. 19-08- 22 నాటి ఫోను సంభాషణ లో ఐరోపా కు రష్యా గోధుమలు, ఎరువుల ఎగుమతులపై ఇయు ఆంక్షలను తొలగి౦చడ౦ గురి౦చి ఆయన ప్రస్తా వించి నట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాలలో పాశ్చాత్య ఆధిపత్యంపై తెరపడుతున్న దృశ్యాలతో యూరోప్ మనస్సును పట్టి పీడి స్తున్నఒక తెలియని భయాన్ని శ్రీ మాక్రాన్ ప్రసంగం సూచిస్తుంది. సాధారణంగా మనం అమెరికా సామ్రాజ్య వాదం గురించి, మూడవ ప్రపంచ దేశాలపై దాని ఆధిపత్యం గురించి చదువుతాము. ఈ ప్రసంగం లో పెట్టుబడిదారీ దేశాల మధ్య వున్న ప్రయోజనాల ఘర్షణ ,వారి మధ్య వున్నవిభేదాలు తెలియ వస్తాయి.]
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:
ఇప్పుడు అంతర్జాతీయ వ్యవస్థ పూర్తిగా కొత్త మార్గంలో పయనిస్తోంది. అంతర్జాతీయ క్రమంలో పరివర్తన, ఒక భౌగోళిక రాజకీయ ఏకీకరణ, ఒక వ్యూహాత్మక పునర్వ్యవ స్థీ కరణ జరుగుతున్నాయి. అవును, పాశ్చాత్య ఆధిపత్య౦ అ౦తమవుతోందని నేను ఒప్పుకోవాలి. 18 వ శతాబ్దం నుండి పాశ్చాత్య ఆధిపత్యంపై ఆధారపడిన అంతర్జాతీయ వ్యవస్థకు మనం అలవాటు పడ్డాము. అది 18 వ శతాబ్దం లో జ్ఞానోదయ-ప్రేరేపిత ఫ్రాన్స్ కావొచ్చు, పారిశ్రామిక విప్లవం నేతృత్వంలోని 19 వ శతాబ్దపు బ్రిటన్ కావొచ్చు, 20 వ శతాబ్దం నుండి రెండు ప్రపంచ యుద్ధాలలో ఉద్భవించిన అమెరికా కావొచ్చు. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్, యునై టెడ్ స్టేట్స్ 300 సంవత్సరాలుగా పాశ్చాత్య దేశాలను మహోన్నత స్థానంలో వుంచాయి. ఫ్రాన్స్ అంటే సంస్కృతి, ఇంగ్లాండు అంటే పరిశ్రమ, అమెరికా అంటే యుద్ధం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ,రాజకీయాలపై మనకు సంపూర్ణ ఆధిప త్యాన్ని ఇచ్చే ఈ గొప్పతనానికి అలవాటు పడ్డాము. కానీ పరిస్థితులు మారుతున్నాయి. కొన్ని సంక్షోభాలు మన స్వంత తప్పుల నుండి వచ్చాయి, మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు విసిరిన సవాళ్ల నుండి వచ్చాయి. పాశ్చాత్య దేశాలలో, సంక్షోభాల నేపథ్యంలో అమెరికా తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాలు మన ఆధిపత్యాన్ని లోతుగా కదిలించి వేశాయి. ఇది కేవలం ట్రంప్ పరిపాలనతో ప్రారంభం కాలేదని, ట్రంప్ కంటే చాలా కాలం ముందు నుండీ యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇతర అధ్యక్షులు కూడా తప్పుడు నిర్ణయాలు చేశారని గమనించండి, క్లింటన్ చైనా విధానం, బుష్ యుద్ధ విధానం, ఒబామ పరిమాణాత్మక సరళీకరణ విధానం వంటి అమెరికన్ నాయకుల తప్పుడు విధానాలు పాశ్చాత్య ఆధిపత్యాన్ని క్షీణింప జేసిన తప్పిదాలు. మరోవైపున, అభివృద్ధి చెందుతున్న శక్తుల పెరుగుదలను చాలా తక్కువగా అంచనా వేశాము. అలా అంచనా వేసింది, కేవలం రెండు,మూడు సంవత్సరాల నుండి కాదు, పది లేదా ఇరవై సంవత్సరాలుగా ఆ పొరపాటు జరిగినది. మనం మొదటి నుండి వారిని తక్కువగా అంచనా వేశాము. చైనా, రష్యాలు వివిధ నాయకత్వ శైలులలో కొన్ని సంవత్సరాల లోనె గొప్ప విజయాన్ని సాధిం చాయని మనం అంగీకరించాలి. భారతదేశం కూడా త్వరితగతిన ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అదే సమయంలో అది ఒక రాజకీయ శక్తిగా కూడా ఎదుగుతున్నది. చైనా, రష్యా, భారతదేశం, ఈ దేశాలు యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్ లతో పోల్చబడుతున్నాయి. వారి రాజకీయ ఊహాశక్తి నేటి పాశ్చాత్యుల కంటే చాలా బలంగా ఉంది. వారు బలమైన ఆర్థిక శక్తిగా మారిన తరువాత, వారు తమ స్వంత “తత్వశాస్త్రం మరియు సంస్కృతి” కోసం వెతకడం ప్రారంభిస్తారు. వారు ఇకపై పాశ్చాత్య రాజకీయాలపై ఆధారపడరు, వారు తమ స్వంత “జాతీయ సంస్కృ తి ని” అనుసరించడం ప్రారంభించారు. దీనికి ప్రజాస్వామ్యంతో సంబంధం వుందా అనేది ప్రశ్న కాదు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం, అది కూడా తన స్వంత “జాతీయ సంస్కృతి” కోసం చూస్తున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ స్వంత జాతీయ సంస్కృతిని కనుగొని, దానిని నమ్మడం ప్రారంభించినప్పుడు, వారు తమలో లోతుగా నాటుకున్న “పాశ్చాత్య ఆధిపత్య తాత్విక సంస్కృతిని” క్రమంగా వదిలించుకుంటారు. ఇది పాశ్చాత్య ఆధిపత్య అంతానికి ప్రారంభం!
పాశ్చాత్య ఆధిపత్యం యొక్క అంతం ఆర్థిక క్షీణతలో కాదు, సైనిక క్షీణతలో కాదు, సాంస్కృతిక క్షీణతలో ఉంది. మీ విలువలను ఇకపై అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేయలేనప్పుడు, అది మీ క్షీణతకు ప్రారంభం. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల రాజకీయ ఊహాశక్తి మనకంటే మెరుగుగా ఉందని నేను అనుకుంటున్నాను. రాజకీ య ఊహాశక్తి చాలా ముఖ్యం. ఇది బలమైన సమ్మిళిత అర్ధాలను కలిగి ఉంది. మరింత రాజకీయ ప్రేరణకు దారి తీస్తుంది. రాజకీయాల్లో మనం ధైర్యవంతులంగా ఉన్నప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాల రాజకీయ ఊహాశక్తి నేటి యూరోప్ లో కంటే చాలా ఎక్కువగా ఉంది, ఇవన్నీ నన్ను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేశాయి!
చైనా 70 కోట్ల ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకువచ్చింది, భవిష్యత్తులో మరింత మంది పేదరికం నుండి బయటపడతారు, కాని ఫ్రాన్స్ లో, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంతగా ఆదాయ అసమానతలను పెంచుతోంది. గత ఏడాదిలో మధ్యతరగతి వారి ఆగ్రహావేశాలు ఫ్రెంచ్ రాజకీయ వ్యవస్థలో పెనుమార్పులను తీసుకు వచ్చాయి,19వ శతాబ్దం నుండి ఫ్రెంచ్ జీవితం ఒక విధమైన సమతుల్యతలో ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం , సంపన్న మధ్యతరగతి- ఈ మూడూ ఫ్రాన్స్ రాజకీయాలను సమతుల్యం చేసే త్రిమూర్తులు, కానీ మధ్యతరగతి మన దేశానికి మూలస్తంభం కానప్పుడు, మధ్యతరగతి తన ప్రయోజనాలు బలవుతున్నాయని భావించినప్పుడు సంక్షోభం పుట్టుకొస్తుంది. వీరికి ప్రజాస్వామ్యం, మార్కెట్ వ్యవస్థల గురించి ప్రాథమిక సందేహాలు కలుగుతాయి. అటువంటి వ్యవస్థ ఇప్పటికీ నాకు మంచి జీవితాన్ని ఇవ్వగలదా? అని వారికి సందేహపడే హక్కు ఉంది. రాడికల్ రాజకీయ ఉద్యమంలో చేరే హక్కు కూడా ఉంది.
ఇంగ్లాండ్ [UK]లో, రాజకీయ వ్యవస్థ పతనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. బ్రెగ్జిట్ ప్రతిధ్వనించే నినాదం, నియంత్రణను వెనక్కి తీసుకోండి అని. ప్రజలు తమ స్వంత భవితవ్యం ఇక తమ చేతుల్లో లేదని భావిస్తున్నారు. కాబట్టి వారు “నియంత్రణను తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు”. “నియంత్రణను వెనక్కి తీసుకోవడా నికి” ప్రత్యక్ష మార్గం EU నుండి నిష్క్రమించడం. వారు ఇ యు ను ద్వేషిస్తున్నారు, వారు పాతకాలపు రాజకీయా లను ద్వేషిస్తున్నారు, వారు రాజకీయంగా మరింత మెరుగైనదానిని కోరుతున్నారు. అంతిమ విశ్లేషణలో, ఈ రాజకీయ వ్యవస్థ బ్రిటిష్ వారికి ప్రయోజనం చేకూర్చడంలో విఫలమైంది, వారి జీవితాలను మరింత దిగజార్చింది, కానీ ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకులు దీనిని గ్రహించలేదు. అంటే వారు విఫలమయ్యారు.
యునైటెడ్ స్టేట్స్ విషయానికొస్తే, అమెరికన్లు పాశ్చాత్య శిబిరానికి చెందిన వారు అయినప్పటికీ, వారికీ ఎల్లప్పుడూ ఐరోపా నుండి భిన్నమైన మానవతా ప్రమాణాలు (మతాన్ని సూచిస్తూ) వున్నాయి. వాతావరణ సమస్యల పట్ల, సమానత్వం పట్ల, సామాజిక సమతుల్యత పట్ల అమెరికన్ల సున్నితత్త్వం ఐరోపాలో వలె లేదు. ఐరోపాలో కంటే యు ఎస్ లో ధనికుల- పేదల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది. అమెరికా నాగరికత -యూరోప్ నాగరికతల మధ్య స్పష్టమైన అంతరం ఉంది. యునైటెడ్ స్టేట్స్ మరియు ఐరోపాల మధ్య గాఢమైన సఖ్యత ఉన్నప్పటికీ, విభేదాలు కూడా ఎల్లప్పుడూ ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి రావడం విభేదాలను మరింతగా పెంచింది. ఐరోపా యునైటెడ్ స్టేట్స్ కంటే భిన్నమైనదని నేను నొక్కి చెప్పాలి.
రష్యాను ఐరోపా ఖండం నుండి బహిష్కరించడానికి యునైటెడ్ స్టేట్స్ తో కలిసి ఐరోపా దీర్ఘకాలికంగా అనుసరించిన విధానం సరైనది కాదు. యునైటెడ్ స్టేట్స్ కు రష్యాను,యూరప్ ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండవచ్చు కానీ, ఐరోపాకు రష్యాను కాదనుకోవడం అవసరమా? రష్యాను బహిష్కరించడానికి ఐరోపా యునైటెడ్ స్టేట్స్ తో సహక రిస్తోంది. ఇది 21 వ శతాబ్దంలో ఐరోపా చేస్తున్న అతిపెద్ద భౌగోళిక రాజకీయ తప్పిదం కావచ్చు. రష్యాను బహిష్క రించడం యొక్క ఫలితం ఏమిటంటే, పుతిన్ కు చైనాను ఆలింగనం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు, ఇది చైనా, రష్యాలను వేడెక్కించడానికి అవకాశం ఇస్తుంది. మన పోటీదారులు ఇద్దరూ కలిసి భారీ ఇబ్బందిని సృష్టించ గలరు. ఇది అమెరికన్లు చేసిన దాని ఫలితం. ఐరోపా రష్యాను బహిష్కరించి ఉండకపోతే, రష్యా విధానాలు పాశ్చాత్య వ్యతిరేకమైనవిగా ఉండేవి కావు.
ఇప్పుడు భౌగోళిక రాజకీయాల పరంగా, ఐరోపాకున్నసమస్య దాని స్వంత సైన్యం లేకపోవటం. నాటో ఉనికి కారణంగా, ఐరోపాకు మరొక యూరోపియన్ సైన్యాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టంగా వుంది. కానీ “యూరోపి యన్ సైన్యం” ఉనికిలో లేనంత కాలం, ఐరోపా యునైటెడ్ స్టేట్స్ యొక్క రాజకీయ ఆదేశాలచే నియంత్రించ బడు తుంది. నేను జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో దీని గురించి మాట్లాడాను. అయితే అంతటా నిరాశావాదమె నిండి వుంది. ఐరోపాలో, యూరోపియన్ సైన్యాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం ఎవరికీ లేదు. కొన్ని నిధులు మాత్రం సమకూర్చుతారు.అంతకు మించి ఎవరూ సిద్ధం కావటం లేదు.కానీ యునైటెడ్ స్టేట్స్ ను అదుపు చేయడానికి బలాబలాలను సమతుల్యం చేయడానికి యూరోపియన్ మిలిటరీ కీలక అంశం. యూరోపియన్ మిలిటరీ లేకపోతే, అమెరికా పై ఆధారపడవలసి వుంటుంది. అంటే ఐరోపాకు నిజమైన స్వాతంత్ర్యం లేనట్లే .
నిజమే. యునైటెడ్ స్టేట్స్ మనకు ఒక మిత్రుడు, దీర్ఘకాలిక మిత్రుడు, కానీ అదే సమయంలో, అతను చాలా కాలంగా మనల్ని కిడ్నాప్ చేస్తున్న మిత్రుడు కూడా. ఫ్రాన్స్ ఒక శక్తివంతమైన దౌత్య శక్తిగా, భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా, ఐరోపా సమాఖ్యకు గుండెకాయగా ఉంది. ఫ్రాన్స్ రష్యాను తిరిగి యూరప్ లోకి లాగలేకపోతే, , రష్యాను ఏకాకిని చేస్తూ పోతే అది ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తూ విముఖతను పెంచుతుంది. రష్యా గానీ, తూర్పుమహా శక్తి గానీ ఒక కూటమిని ఏర్పరచడానికి ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదు. కాని పాశ్చాత్య ప్రపంచం మరింత కఠినంగా వుంటే ఏమి జరుగుతుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. అప్పుడు తాము కూటమిని ఏర్పాటు చేయబోమని చైనా, రష్యాలు ఖచ్చితంగా చెబుతాయా? మన స్నేహితుని శత్రువు తప్పని సరిగా మన శత్రువేనా? రష్యా యునై టెడ్ స్టేట్స్ కు శత్రువు, కాబట్టి అది ఐరోపాకు శత్రువుగా ఉండాలా? మనం ఐరోపా యొక్క స్వంత క్రమాన్ని, కొత్త నమ్మకాన్ని, భద్రతా నిర్మాణాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది, ఎందుకంటే మనం రష్యాతో సంబంధాల ను సులభతరం చేయకపోతే, ఈ ఖండంలో శాంతి ఉండదు.
అమెరికా వారు రష్యాను ఆయుధాలు, పరికరాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టే దేశమనీ, వృద్ధులు పెరుగుతూ, శక్తి క్షీణిస్తున్నజనాభా గల దేశం అనీ అంటారు. ఈ దేశానికి మేము భయపడాలా? అటువంటి దేశంతో మనం రాజీ పడా లా? అని అమెరికన్లు నన్ను అడుగుతారు. అయితే రష్యా మరియు కెనడా స్థానాలను భౌతికంగా మార్చడం కుదురుతుందా అని నేను అమెరికన్లను అడిగాను.
ఆర్థిక సంక్షోభం, భౌగోళిక రాజకీయ కల్లోలానికి అదనంగా, మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న మూడవ ప్రధాన కల్లోలం నిస్సందేహంగా సాంకేతిక విప్లవ కల్లోలం. బిగ్ డేటా ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబలైజేషన్ లో పెద్ద మేధస్సు వ్యాప్తి చెందినప్పుడు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతి అపూర్వమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. మేధస్సు యొక్క ప్రపంచీకరణతో ఒక సమస్య భావోద్వేగాలు. హింస , ద్వేషం యొక్క ప్రపంచీకరణ. సాంకేతిక విప్లవం మనకు లోతైన మానవశాస్త్ర మార్పులను తీసుకువచ్చింది, ఇది మనకు ఒక కొత్త స్థితిని కూడా సృష్టించింది, మానవులు నియమాలను పునః పరిశీలించడానికి, సూత్రీకరించడానికి అవసరమైన ఒక పరిస్థితిని కూడా ఇది సృష్టించింది. ఇది ప్రపంచం ఎన్నడూ ముట్టుకోని ఒక కొత్త టెక్నాలజీ రూల్ స్పేస్, ఇది ఇంటర్నెట్ అంతర్జాతీయ క్రమం యొక్క నియమం, ఇది ప్రతి ఒక్కరూ అంగీకరించాలి, పాల్గొనాలి. కానీ ఈ కొత్త నియమాల సమితి పూర్తిగా స్థాపించబడక ముందే, కొత్త సాంకేతిక విప్లవం మనకు ఆర్థిక అసమతుల్యత లను మాత్రమే కాకుండా, మానవ వర్గ వైరుధ్యాలను, సైద్ధాంతిక వైరుధ్యాలను కూడా తీసుకువచ్చింది. అంతిమం గా, ఇది మన గర్వించే ప్రజాస్వామ్యంలో భారీ చీలికను, అస్థిరతను తెస్తుంది.
ఆర్థిక కల్లోలం, భౌగోళిక రాజకీయ కల్లోలం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కల్లోలం, ప్రజాస్వామ్య కల్లోలం – ఈ అల్లకల్లోలాలు అన్నీ ఒకే సమయంలో జరుగుతున్నాయి, ఇప్పుడు మనం ఏమి చేయాలి? మన౦ ప్రేక్షకులుగా కొనసాగబోతున్నామా, వ్యాఖ్యాతలుగా ఉ౦టామా, లేదా మన౦ ఏవైనా బాధ్యతలను చేపట్టబోతున్నామా? కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, మనమందరం మన రాజకీయ ఊహాశక్తిని కోల్పోయి, గత దశాబ్దాలు లేదా శతాబ్దా ల అలవాట్లతోనే మన వ్యూహాలను నిర్దేశిస్తే, అప్పుడు మనం… ఒక రిపబ్లిక్ అధ్యక్షుడు, ఒక మంత్రి, ఒక దౌత్యవేత్త, ఒక సైనికుడు, ఈ గదిలోని ప్రతి ఒక్కరూ గతంలో ఉన్నవిధంగానే వుండిపోతాము. అందువల్ల ఖచ్చితంగా, మనం “నియంత్రణ కోల్పోతాము.” “అదుపు తప్పిన” తర్వాత, మనకు మిగిలేది ఇక అదృశ్యమవ్వడమే. నాగరికత మసకబారుతుంది, ఐరోపా మసకబారుతుంది, పాశ్చాత్య ఆధిపత్యపు క్షణం దానితో మసకబారుతుంది. అంతిమం గా, ప్రపంచం రెండు ధృవాల చుట్టూ తిరుగుతుంది: అమెరికా మరియు చైనా. ఇక ఐరోపా ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. ఐరోపా, పూర్తిగా తన నియంత్రణను కోల్పోతుంది.
కొన్ని సాహసోపేతమైన, సృజనాత్మక రాజకీయాలను ప్రయత్నించడం ద్వారా మాత్రమే ఫ్రెంచ్ జాతీయ స్ఫూర్తిని, ఉత్తమ పద్ధతిని లోతుగా ప్రతిబింబించగలమని నేను అనుకుంటున్నాను. ఫ్రాన్స్ మాత్రమే ఒక లోతైన ఐరోపా నాగరికతను తిరిగి స్థాపించగలదు; యూరోపియన్ వ్యూహం మరియు అంతర్జాతీయ రాజకీయాల కోణం నుండి యూరోపియన్ మనుగడ సమస్యను ఫ్రాన్స్ మాత్రమే పరిగణనలోకి తీసుకోగలదు. ఫ్రెంచ్ ఆత్మ- ప్రతిఘటన యొక్క దృఢమైన ఆత్మ, భిన్నమైన ప్రపంచాన్ని వెంబడించగల ఆత్మ. ప్రతిఘటనా స్ఫూర్తి అనివార్యతను అనుస రించగలదు. అది ఎప్పటికీ లొంగదు. ఫ్రెంచ్ ప్రజల ఆత్మ యొక్క అసాధారణ స్ఫూర్తితో ప్రతికూలతలను అధిగ మించ గలదు. “రెండు ధ్రువాలు” ఐరోపాను క్రమంగా మింగేస్తున్న చారిత్రక ధోరణిని ఫ్రాన్స్ మాత్రమే మార్చగలదు
తరువాత, ఫ్రాన్స్ కు అనేక ముఖ్యమైన ఎజెండా దిశలు ఉంటాయి. మొదటిది “యురేషియన్ ఎజెండా”. యూరోపి యన్ కనెక్టివిటీ వ్యూహంతో చైనా చేస్తున్నకొత్త సిల్క్ రోడ్ వల్ల కలిగే మెరుగైన కలయికలను ఫ్రాన్స్ ప్రోత్సహిస్తుంది, అయితే ఇది మన సార్వభౌమాధికారం, నియమాలకు అనుగుణంగా జరగాలి. పదేళ్ల క్రితం యూరప్, ఆసియా దేశా ల ఏకీకరణలో కొన్ని పొరపాట్లు చేశాం. ఐరోపా ప్రధాన ఆర్థిక సంక్షోభంతో వ్యవహరించేటప్పుడు, సహాయం పొందడా నికి, ఐరోపా సార్వభౌమత్వంలో కొంత తగ్గించేలా ప్రైవేటీకరణను చేపట్టవలసి వచ్చింది. దక్షిణానఇటలీ నుండి ఉత్తరా న ఇంగ్లాండు వరకు ఇది జరిగినది. అయితే దీనికి మేము తెలివైన చైనీయులను నిందించము, మేము మూర్ఖుల మని మాత్రమే నిందించుకోగలము.
దీనికి తోడు చైనా విజృంభణ నేపథ్యంలో ఫ్రాన్స్ కూడా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ తో కలిసి ఒక “ఫ్రెంచ్ వ్యూహం” అనుసరించాలి. చైనావారి సిల్క్ రోడ్ ను స్వాగతించే ఫ్రాన్స్ వ్యూహానికి ఇది ఒక “అనుబంధం”. మన ప్రత్యర్థికి మనం ఒక చోట సహాయం చేస్తే, దానిని ఇతర ప్రదేశాలలో అదుపు చేసి, సమతుల్యం చేయాలి. ఇది రాజకీయాల యొక్క సాధారణ మార్గం. ఈ ప్రాంతంలో చైనా శక్తి పెరుగుదలను సమతుల్యం చేయడానికి ఫ్రాన్స్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో “ఫ్రెంచ్ ప్రభావాన్ని” నెలకొల్పాలి. ఈ ప్రాంతంలో ఫ్రాన్స్ లక్షల మంది నివాసితులు, దాదాపు 10,000 మంది సైనికులను కలిగి ఉంది. ఫ్రాన్స్ సముద్రంలో ప్రధాన సముద్ర శక్తులలో ఒకటిగా మారాలని కోరుకుంటుంది.
ఐరోపా సార్వభౌమత్వ స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వడం ఫ్రాన్స్ యొక్క రెండవ ముఖ్యమైన ఎజెండా. ఐరోపా సార్వ భౌమాధికారం అనేది ఒక ఉత్త మాట కాదని నేను చాలా మందితో అన్నాను. అయితే సార్వభౌమాధికారం అనే స్వరాన్ని జాతీయవాదులకు వదిలేసి మనం ఇప్పటికే తప్పు చేశాం. జాతీయవాదులు మన సార్వభౌమత్వానికి ప్రాతినిధ్యం వహించరు, సార్వభౌమత్యం అనేది మన ప్రజాస్వామ్య మూలానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ప్రభు త్వం అన్నింటిపైనా నియంత్రణ కోల్పోతే, సార్వభౌమాధికారంలో ఏమీ మిగలదు. జాతీయవాదులకు తమ స్వరాల ను వినిపించే హక్కు ఉంది, కాని వారు ఏ విధంగానూ యూరోపియన్ సార్వభౌమత్వానికి ప్రాతినిధ్యం వహించరు.
దశాబ్దాలుగా, ఐరోపా ఒక బలమైన, స్నేహపూర్వక మార్కెట్ ను నిర్మించింది, కానీ అదే సమయంలో, మేము కూడా అత్యంత బహిరంగంగా, అమాయకంగా ఉన్నాము. యూరోపియన్ సార్వభౌమాధికారాన్ని చర్చి౦చినప్పుడు, యునైటెడ్ కింగ్డమ్ ను కూడా మన౦ చేర్చుకోవాలి. బ్రెగ్జిట్ యొక్క అంతిమ ఫలితంతో సంబంధం లేకుండా, యూర ప్ సార్వభౌమాధికారం లో యునైటెడ్ కింగ్ డమ్ ఒక భాగస్వామి. యూరోపియన్ సార్వభౌమాధికారం యొక్క మరొక దిశ జాతీయ రక్షణ. ఐరోపా రక్షణకు సంబంధించి, 1950ల నుండి ఎటువంటి పురోగతి లేదు, దాన్ని గురించి చర్చించడం కూడా నిషేధించబడింది. కానీ యూరోపియన్ నిధులు, యూరోపియన్ సైన్యాలపై ఆధారపడి, జాతీయ రక్షణ సార్వభౌములతో ఒక చొరవను నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. “యూరోపియన్ రక్షణ సార్వభౌమ త్వం” గురించి చర్చించడానికి దశాబ్దాలలో ఇది ఉత్తమ సమయం అని నేను భావిస్తున్నాను, ఇక్కడ ఉన్న రాయబారులందరూ డానికై కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఐరోపా సార్వభౌమత్వం యొక్క మరొక దృష్టి సరిహద్దుల గురించి ఐరోపా యొక్క ఆలోచన, ఇది జనాభా మరియు వలసల అంశానికి కూడా విస్తరిస్తుంది. ఐరోపా 2015 నుండి అపూర్వమైన వలస సంక్షోభం ఎదుర్కొన్నది. పారిస్ లో మనం చేసిన ఇమ్మిగ్రేషన్ వడపోతను పునరుద్ధరించడానికి మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తో కలిసి పనిచేయాలి.
చివరి భాగం ఆర్థికం,ఆర్థిక సార్వభౌమత్వాలకి సంబంధించినది. ఇరాన్ గురించి మేము ఇప్పుడు చురుకుగా మాట్లాడుతున్నాము. ఇరాన్ ఎజెండాను సమర్థించడం కొనసాగిస్తున్నాము. కానీ యు.ఎస్. డాలర్ దాని “ప్రత్యేకత” ను కలిగి ఉంది, మేము ఇరాన్ ను రక్షించాలని నిర్ణయించుకున్నప్పటికీ, మా సంస్థ ముందుకు సాగడానికి యుఎస్ డాలర్ పై ఆధారపడుతుంది. డాలర్ తో పోరాడాలని నేను చెప్పడం లేదు, కానీ మేము నిజమైన “యూరో యొక్క సార్వభౌమత్వాన్ని” నిర్మించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంది, మేము చాలా నెమ్మదిగా పురోగమిస్తున్నాము! మరియు డిజిటల్. సి స్థాపనలో, ఐరోపా కూడా పునరాలో చించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు ఆర్థిక సార్వభౌమత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
ఐరోపా సార్వభౌమత్వం, ఆర్థిక సార్వభౌమత్వం, జాతీయ రక్షణ సార్వభౌమాధికారం, సరిహద్దుల సార్వభౌమ త్వాన్ని పునర్నిర్మించడం, ఇతర దేశాల జోక్యం లేకుండా యూరోపియన్ సమైక్యతను నిజంగా బలోపేతం చేయడానికి ఏకైక మార్గం.మనం ఒక బలమైన, పొందికైన దౌత్యాన్ని అనుసరించాలి. పాశ్చాత్య ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న సమయంలో, మనం మన సంబంధిత రాజకీయ ఊహలను ఉపయోగించాలి. యూరోపియన్ల స్వంత భవితవ్యాన్ని మనమే నియంత్రించాలి. మన ప్రజలపై నియంత్రణను తిరిగి పొందాలి. దౌత్యంలో మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారని నేను నమ్ముతున్నాను. మన జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి, మన జాతీయ ప్రయోజనాలను అధిగమిం చడానికి, మన విలువలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి మన రాయబారులకు ప్రపంచవ్యాప్తంగా బలమైన ప్రాతినిధ్య శక్తి ఉండేలా చేయండి.” అని ఫ్రెంచ్ అధ్యక్షుడు తన దౌత్యవేత్తలకు అ ప్రభుత్వ విధానాలను, ప్రాధాన్యతలను వివరించారు. ఈ విధంగా అభివృద్ధిపొందిన పశ్చిమ యూరప్ దేశాలే తమ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా స్వార్ధ రాజకీయ వ్యూహాలను ప్రశ్నిస్తుంటే , మనదేశం నిర్నిబంధంగా అమెరికా సామ్రాజ్య వాద ప్రయోజనాలకు తలవొగ్గి తన విదేశీ నీతిని రూపొందించుకోవటం ఎంత వరకు సబబో మనం ఆలోచించుకోవాలి .