గుంజనా..నా గుంజనా..
-రాఘవ శర్మ
గుంజనా..
నా గుంజనా..
నిత్యం ప్రవహించే
మాజీవనదివి!
మా నయాగరావి!
మాశ్రమ సౌందర్యానికి ప్రతిరూపానివి!
గుంజనా..
అలుపూ లేదు సొలుసూ లేదు
ఎండా లేదు వానా లేదు
కష్ట జీవులకు కులం లేదు, మతం లేదన్నట్టు..
దివారాత్రులు దుముకుతూనే ఉంటావ్!
నిత్యం శ్రమించే మా కార్మికుల్లా!
నిత్యం నీటి ముత్యాలను విరజిమ్ముతూనే ఉంటావ్
మా జాతి జనుల చెమట చుక్కల్లా!
సూర్యుడితో మాట్లాడతావ్
పక్షులను పలకరిస్తావ్
చందమామతో కబుర్లు చెపుతావ్
నక్షత్రాలతో నాట్యమాడతావ్
మేఘాలతో మాటా మంతి జరుపుతావ్
ఎవ్వరొచ్చినా మొహం తిప్పేసుకోవ్
నీకు జాతి వివక్ష లేదు
నువ్వొక విశ్వసౌందర్యానివి
నిత్యం వినిపించే నీ హోరు
మా జీవన పోరును తలపిస్తుంది
మా శ్రమ సౌందర్యాన్ని కొలవలేనట్టు
నీ సొగసునూ ఎంచలేను
మా శ్రమకు వెలకట్టలేనట్టు
నీ వయసునూ లెక్కించలేను
భూమికున్నంత వయసు నీదైతే
భూమాతకున్నంత సహనం మాది
అయినా గుంజనా..
ఎల్లకాలం ఉండదు
భూకంపం వచ్చి నీ గుండె పగిలినట్టు
మా సహనం కూడా..
బద్దలవుతుంది ఎప్పుడో ఒకప్పుడు
లంకలాగా తిరగబడతాం
ఫ్రెంచ్ లాగా ప్రకటిస్తాం
నిన్ను మేం చూసినట్టు
నువ్వూ మమ్మల్ని చూస్తూనే ఉండు!
ఎన్ని ఏర్లను
నీలో కలుపుకున్నావో
మా శ్రమలోకంలో అన్ని జాతులనూ కలుపుకున్నట్టు
ఎంత లోతైనవీ
నీ నీటి గుండాలు!
ఎంత విశాలమైనవీ మా శ్రమ హృదయాలు!
నిన్ను చూస్తుంటే
ఎన్ని అనుభవాలో!
ఎన్ని అనుభూతులో
పచ్చని అడవి తల్లి మెడలో
వెలకట్టలేని హారానివి నువ్వు!
ఎన్ని గుండాలను నింపుకుంటూ సాగుతావో!
ఎన్ని కష్టాలను ఎదుర్కొంటూ
ఈదుతామో!
గుంజనా..
ఎవ్వరూ మీటకుండానే
జల సంగీతాన్ని వినిపించే
రాతి సితారవి!
ఎవ్వరూ కోర కుండానే
కూలి కోసం శ్రమను ధారపోస్తున్న
మా జాతి జనులలాగా
నీకు దివారాత్రులూ తేడాలేదు
రుతువులతో సంబంధం లేదు
ఆ రాతి కొండపై నుంచి దుముకుతూనే ఉంటావ్
మాకు బాల్యం లేదు, యవ్వనం లేదు, వృద్ధాప్యం లేదు
ఊపిరి ఉన్నంత కాలం
కష్టపడుతూనే ఉన్నట్టు..
అసంఘటిత కార్మికుల్లాగా
బతుకును లాగు తున్నట్టు
గుంజనా..
నీలో దూకాలంటే దమ్ముండాలి
ఎంత సొగసే నీది!
నీ అనుభవాల ముందు మోకరిల్లాలనిపిస్తుంది
మళ్ళీ మళ్ళీ
నీలోకి దూకేయాలనిపిస్తుంది
దిగంబరంగా
అన్ని బంధాలనూ తెంచేసుకుని
అన్ని అవలక్షణాలనూ వదిలేసుకుని
బాధ లేదు
భయమూ లేదు
సంపాదించిన ఆస్తులూ లేవు
అనుభవించకుండా వచ్చేస్తున్నానని
పునీతుడనై తిరిగి రావడానికి
విశ్వమానవుడిగా మళ్ళీ జన్మించడానికి
గుంజనా..నా గుంజనా..
నిత్యం ప్రవహించే మా జీవనదివి
మా శ్రమ సౌందర్యానికి ప్రతిరూపానివి
మా నయాగరావి