సీఎం జగన్ కు రాయలసీమ నేత లేఖ

రాయలసీమ ప్రాజెక్టుల అనుమతికి వ్యతిరేకంగా తెలంగాణా వాదులు  కోర్టుకు పోయిన అంశంపైన  రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా స్పందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని విజ్ఞప్తి

***

జగన్ మోహన్ రెడ్డి గారికి

గౌరవ ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

 

అయ్యా

విషయం :- రాజ్యాంగ విరుద్ధ తెలంగాణా రాష్ట్ర చర్యలను నిలువరించి,  రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుకు ప్రభుత్వ క్రియాశీలక కార్యాచరణకు విజ్ఞప్తి.

హైదరాబాద్ నగరం తో కూడిన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు చట్టబద్దత కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014,  రాయలసీమ భవిష్యత్తుకు కీలకమైన రెండు అంశాలకు చట్టబద్దత కల్పించింది. ఇందులో ఒకటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణా ప్రభుత్వం సమ్మతి తెలిపినట్లుగా భావించపడుతుందన్న నియమబద్దమైన ఒప్పందంను విభజన చట్టంలో చేర్చడం. మరొకటి రాయలసీమలో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా విభజన చట్టంలో చేర్చడం.

పోలవరం నిర్మాణానికి తెలంగాణా రాష్ట్రం అంగీకరించిందన్న నిబ్బందనతోనే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరిగింది. దీనితో పోలవరం నిర్మాణం ద్వారా ఆదా  అయ్యే 45 టి ఎం సి ల కృష్ణా జలాల పై  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపూర్ణ  హక్కులను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం కలుగ చేసింది. పోలవరానికి తాత్కాలిక ప్రాజెక్టుగా పట్టిసీమ నిర్మాణం పూర్తిచేసి కృష్ణా డెల్టాకు 80 టి ఎం సి ల నీటిని 2017 వ సంవత్సరం నుండి అందిస్తున్నారు. ఇందులో  కర్ణాటక, మహారాష్ట్ర  వాటా పోను మిగిలిన 45 టి ఎం సి ల నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించ వలసి ఉంది. ఈ నీటిని రాయలసీమలో మిగులు జలాల మీద నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులకు త్రాగునీటి ప్రాధాన్యతగా కేటాయించాలని గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనేక విజ్ఞాపన పత్రాలను పంపి ఉన్నాము. కాని చట్టపరమైన హక్కులున్న ఈ నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్సార్యం చేస్తున్నది.  ఈ లోపుగా ఎలాంటి హక్కులు లేకపోయినా తెలంగాణా రాష్ట్రం ఈ 45 టి ఎం సి ల నీటిని ఏకపక్షంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కు నికరజాలాలు కేటాయించింది. కృష్ణా జలాలో తెలంగాణా రాష్ట్రానికి  చిన్న నీటి ప్రాజక్టుల కు కేటాయించిన నీటి నుండి మరో 45 టి ఎం సి ల నీటిని కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజక్టుకు కేటాయించింది. దీనితో  ఈ ప్రాజక్టుకు అవసరమైన 90 టి ఎం సి ల నికర జలాలు ఉన్నాయని, ఈ ప్రాజక్టుకు అనుమతులు మంజూరు చెయ్యమని కేంద్ర జలవనరుల కమీషన్ కు ప్రతిపాధనలు పంపింది.

బొజ్జా దశరథరామిరెడ్డి
బొజ్జా దశరథరామిరెడ్డి,
అధ్యక్షులు,
రాయలసీమ సాగునీటి సాధన సమితి.

ఈ నేపధ్యంలో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు పోలవరం/పట్టిసీమ ద్వారా పంపడం వలన ఆదా అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కైన 45 టి ఎం సి ల కృష్ణా జలాలను రాయలసీమ ప్రాజక్టులకు తక్షణమే  కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  రాష్ట్రవిభజన చట్టం ద్వారా హక్కు పొందిన ఈ కృష్ణా జలాలను ఎలాంటి హక్కులేని తెలంగాణా రాష్ట్రం తమ రాష్ట్ర ప్రాజెక్టులకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

రాయలసీమలో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టులను  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుమతించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాధరహితంగా కృష్ణా జలాల పంపిణికై కృష్ణా నది యాజమాన్య బోర్డ్ ను కూడా రాష్ట్ర విభజన చట్టం  ఏర్పాటు చేసింది.   కానీ కృష్ణా నది యాజమాన్య బోర్డ్ మిగులు జలాలు మీద నిర్మాణంలో ఉన్న పై ప్రాజెక్టులను అనుమతులు లేని ప్రాజక్టులుగా ప్రకటించింది.  కృష్ణా నది యాజమాన్య బోర్డ్ నోటిఫికేషన్ లో ఈ ప్రాజక్టులను అనుమతి పొందిన ప్రాజెక్టులుగా సవరించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అలుపెరగని పోరాటం చేసింది. రాయలసీమ ప్రజా సంఘాల సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచింది. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి స్థాయి దౌత్యం అవసరం అన్న రాయలసీమ సాగునీటి సమితి డిమాండ్ ను గౌరవించి ముఖ్యమంత్రి గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రాజెక్టులు అనుమతించిన ప్రాజెక్టులుగా కృష్ణా నది యాజమాన్య బోర్డ్ లో సవరణలు చేయించినందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారా మిగులు జలాల మీద నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టులకు  అనుమతి లభించడం  ద్వారా కృష్ణా జలాలపై ఈ ప్రాజక్టులకు హక్కు లభించింది. దీనితో శ్రీశైలం  రిజర్వాయర్ నుండి బచావత్ ట్రిబ్యునల్   నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు  విద్యుత్  ఉత్పత్తికి  కేటాయించిన  264 టి ఎం సి లు మాత్రమే విడుదల చేసి,  మిగిలిన నీటిని శ్రీశైలం రిజర్వాయర్ లో  నిలువ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రాయలసీమ ప్రాజెక్టులకు కల్పించిన హక్కులను కాలరాచేలాగా కొందరు తెలంగాణా వాదులు తెలంగాణా హైకోర్ట్ ను ఆశ్రయించారు. అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హైదరాబాద్ నగరాన్ని తెలంగాణా కు కేటాయించడంతో సహా అనేక అంశాలపైన  అంధ్రప్రదేశ్ ప్రజలకు అభ్యంతరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని తెలంగాణా గౌరవించక  అనుమతించిన రాయలసీమ  ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే హైదరబాద నగరాన్ని తెలంగాణకు కేటాయించే అంశంతో పాటు అనేక అంశాలపై సవరణలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంపై ఒత్తిడికి సిద్దం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదే సంధర్బంలో రాయలసీమ ప్రాజెక్టుల అనుమతికి వ్యతిరేకంగా తెలంగాణా వాదులు  కోర్టుకు పోయిన అంశంపైన  రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా స్పందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము

ధన్యవాదాలు

బొజ్జా దశరథ రామి రెడ్డి

అధ్యక్ష్యులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *