రాష్ట్రంలో డీఏపీ కొరత తీర్చి రైతులను ఆదుకోవాలని బహిరంగ మార్కెట్లో అధిక ధరల నియంత్రణ చేయాలని విజ్ఞప్తి
గౌరవనీయులైన
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్.
రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పంటలకు అవసరమైన ఎరువులు సకాలంలో లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల నిల్వలు సరిపడినంత ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా… క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల్లో అవసరమైన ఎరువులు అరకొరగా లభిస్తున్నాయి. ఈ సీజన్ లో వరితో పాటు పత్తి, మొక్కజొన్న, మిరప, అపరాలు సాగు చేసిన రైతులకు డీఏపీ దొరక్క అవస్థలు పడుతున్నారు. సకాలంలో డీఏపీ అందుబాటులో ఉంచకపోవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. అప్పులు చేసి పెట్టుబడిగా పెట్టిన రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డీఏపీ, ఎరువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ఖరీఫ్ పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఈ ఏడాది ఖరీఫ్ సీజనుకు 2.25 లక్షల టన్నుల డీఏపీని కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. ఆగష్టు నెల వరకు రాష్ట్రానికి 81వేల టన్నుల డీఏపీ చేరాల్సి ఉంటే.. ఇప్పటి వరకు సగం కూడా చేరలేదు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గతంలో ప్రాథమిక సహకార పరపతి సంఘాల ద్వారా ఎరువులను విక్రయించే వారు. రైతులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి తీసుకెళ్లేవారు. గతేడాది వ్యవసాయశాఖ వీటికి కేటాయింపులు తగ్గించింది. దీంతో అక్కడ ఎరువులు లభించడం లేదు. ఆర్బీకేల్లో ఆర్డర్ పెట్టి తెప్పించి ఇస్తామని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
మరోవైపు బహిరంగ మార్కెట్ లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముకుంటున్నా చర్యలు మాత్రం శూన్యం. డీఏపీ ఎమ్మార్పీ ధర రూ.1,350 ఉండగా.. రూ.150 వరకు అధికంగా వసూలు చేస్తూ రైతుల్ని దోచుకుంటున్నారు. దీనిని నియంత్రిచాల్సిన అవసరం ఉంది. దుకాణాల్లో డీఏపీ బస్తా కొనాలంటే నానో యూరియా, ఇతర ఫోలియర్ స్ర్పేలు కొంటేనే డీఏపీ ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు వాటి కోసం రూ.300 వరకు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇతర ఎరువుల ధరలు కూడా పెరగడంతో రైతులపై మోయలేని భారం పడుతోంది. పొటాష్ ధర గణనీయంగా పెరిగింది. ఏకంగా బస్తాపై రూ.825 వరకు పెరిగింది. 20-20.0 రకం ఎరువుల బస్తా ధర రూ.495 పెరిగింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. రూ.150 నుంచి రూ.900 వరకు పెరిగాయి. దీంతో సగటున ఒక్కో ఎకరానికి రూ.4వేల వరకు రైతులపై భారం పడుతోంది.
రాష్ట్రంలో సరిపడా డీఏపీ సహా ఇతర ఎరువుల నిల్వలు సరిపడా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొరతను నివారించాలి. ధరలు పెంచి దోచుకునే వ్యవస్థను నిర్మూలించి రైతులకు అండగా నిలవాలి.
…నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి