విజయవాడలో ఓ దండల పెళ్లి!

*పడమటి సాంస్కృతిక గాలి దుమారంలో సైతం కొట్టుకుపోకుండా నిలిచి స్ఫూర్తినిచ్చే ఆదర్శం!

 

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

విప్లవ, వామపక్ష, హేతువాద, భౌతికవాద, నాస్తికసంస్థల నిర్మాణాల్లో ప్రధాన నాయకత్వాల్లోని కొందరు సీనియర్ నేతలకి సైతం అసాధ్యమైన పనిని ఓ ఆదర్శ దంపతులు సుసాధ్యం చేస్తున్నారు. జీవన పోరాట క్రమంలో భాగంగా ఒకనాటి తమ రాజకీయ నిర్మాణాలకు దూరంగా జరిగినా, గత నిర్మాణాలలో నేర్చుకొని అలవర్చుకున్న ప్రగతిశీల *సంస్కృతి* కి దూరం కాకపోవడం ఓ విశేషమే! ఇది ఒక కాలంలోనైతే పట్టించుకునే వార్త కాదు. వేలాది అతి సాధారణ వార్తల్లో ఒకటి మాత్రమే! ఈ కాలంలో మాత్రం ఇదో ప్రోత్సాహకర వార్తయే!

తూర్పుగాలులు వీచే కాలంలో సామ్యవాద రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాల ప్రభావంతో భౌతికవాద సంస్కృతిని ప్రతిబింబించే పెళ్లిని ఆ *దంపతులు* 32 ఏళ్ల క్రితం చేసుకున్నారు. అదే *దంపతులు* తమ గత చరిత్రను తమ ఇంట్లోనే పునరావృతం చేయడం విశేషం! అదేదో కేవలం ఆషామాషీ వ్యవహారంగా కాకుండా, నిరంతర చైతన్యయుతమైన కృషితోనే సాధ్యమైనది.

తూర్పు గాలులు నేడు మందగించాయి. పడమర గాలులు బలపడి వీస్తున్న కాలమిది. ఈ అభివృద్ధి నిరోధక పడమర గాలుల్ని కమ్యూనిస్టు, హేతువాద, నాస్తిక నిర్మాణాల్లో వుండే కొందరు నేతలు సైతం తమ ఇళ్ళల్లోకి రాకుండా నియంత్రణ చేయలేని కష్ట కాలమిది. తలుపులను మూసివేసి అడ్డుకుంటే కిటికీల గుండా, గవాక్షాల ద్వారా పడమర గాలులు వారి ఇళ్లలోకి దూరిపోయే కాలమిది. ఆ పరిస్థితుల్లో కూడా విప్లవ ప్రగతిశీల సాంస్కృతిక నిబద్ధతని ఆ దంపతులు చిత్తశుద్ధితో పాటించారు. ఫలితంగా వారి ఇల్లు *దండల పెళ్లి* కి ఆలంబనగా మారింది.

*మా పెళ్లికి రండి అని పెళ్లి ఆహ్వాన పత్రికతో ఆ దంపతులు నాడు పెళ్లికి ఆహ్వానించారు. వారే నేడు మా కూతురు పెళ్లికి రండి అని ఆహ్వానిస్తూ పెళ్లి ఆహ్వాన పత్రిక పంచుతున్నారు. అది అందింది. స్పందించడం కనీస ధర్మoగా భావించా.

ఔనుమరి, ఎడారిలో ఓ ఒయాసిస్సు కనిపిస్తే…, దట్టమైన అరణ్యంలో ఓ కోయగూడెం కనిపిస్తే…, చీకట్లో ఓ మిణుగురు కనిపిస్తే…, చెట్లులేని చోట ఒక ఆముదం మొక్క కనిపిస్తే.. ఎంత ఆనందం! ఈ క్షణంలో అదే భావన కలిగింది. ఫలితమే ఈ చిన్న ప్రతిస్పందన!

కొన్నిపరిమిత ప్రాంతాల్లో నేటికీ తూర్పు పవనాలు హోరెత్తుతూనే ఉన్నాయి. అలాంటి చోట నిలబడి చూసే చూపుకు ఇదేమీ విశేషం కాదు. కానీ అది నేటి సార్వత్రిక స్థితి కాదు. అత్యధిక భారతావనిని నేడు అభివృద్ధి నిరోధక సాంస్కృతిక సుడిగాలి చుట్టుముడుతోంది. మన తెలుగు సీమను కూడా ఆ ప్రతీఘాతుక సాంస్కృతిక గాలి దుమారం క్రమంగా చుట్టుముడుతోంది. ఈ ప్రత్యేక ప్రతికూల భౌతిక స్థితిగతుల్లో ప్రశంసించి, ప్రోత్సహించాల్సిన ఓ విశేష వార్తగా భావించా.

సుమారు నూరేళ్ళ క్రితమే బ్రాహ్మణీయ సంస్కృతి పై త్రిపురనేని రామస్వామి లేవనెత్తిన తిరుగుబాటు సృష్టించిన సాంస్కృతిక వారసత్వం తెలుగు సీమకు ఉంది. దానికి ముందే సాంఘిక సంస్కర్తలు సృష్టించిన సాంస్కృతిక వారసత్వం ఉంది. కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించిన సాంస్కృతిక వారసత్వం వాటికి తోడై మరింత బలపడింది. కారణాలు ఏమైనా చరిత్ర గమనంలో సంభవించిన మలుపుల్లో ప్రగతిశీల సంస్కృతి మీద ప్రగతి వ్యతిరేక సంస్కృతి ఆధిపత్యం సాధించడమే కాకుండా శాసిస్తోంది. ఇదో భౌతిక సత్యం. దాని దాడి ఎదుట నేడు ప్రగతిశీల సంస్కృతి నిలబడలేక గడ్డుస్థితికి నెట్టబడుతోన్న కాలమిది. ఈ కాలాన్ని బట్టి మాత్రమే ఈ పెళ్లి ఆహ్వాన పత్రికపై ఇలా స్పందిస్తున్నా.

నాకు తెల్సిన మేరకు పై *దంపతులు* ఈనాడు నిర్మాణ రాజకీయ జీవితం సాగించడం లేదు. ఐనా ప్రగతిశీల సంస్కృతిని కుటుంబ వారసత్వంగా తమ సంతానానికి సైతం అందించడం విశేషమే!

పైనపేర్కొన్న దంపతులే *TV నరసింహారావు- సుమిత్ర గార్లు!* ప్రస్తత నివాసం విజయవాడ. కూతురు *మానవి.* జీవిత భాగస్వామిగా ఆమె *హర్ష* ను ఎంపిక చేసుకుంది. మనవి-హర్ష *మా పెళ్లికి రండి* అని విడిగా ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో *మా పిల్లల పెళ్లికి రండి* అంటూ నరసింహారావు సుమిత్ర దంపతులు విడిగా ఓ *పెళ్లి ఆహ్వాన పత్రిక* అందిస్తున్నారు.

సుమిత్ర గారి తల్లిదండ్రులైన *రామకృష్ణ చినమ్మి* గార్లు కూడా ఇలాగే *మా కూతురు పెళ్లికి రండి* అని 32 ఏళ్ల క్రితం పెళ్ళి పత్రికతో ఆహ్వానించడం గమనార్హం! (రామకృష్ణ గారు విజయవాడలో ఆంధ్రజ్యోతి ఎడిషన్ లో సుదీర్ఘకాలం పనిచేశారు) ఆనాడు సుమిత్ర గారి తల్లిదండ్రులు ఎలా ఆహ్వానించారో, నేడు మానవి తల్లిదండ్రులు కూడా అలాగే స్పందించి ఆహ్వానించడం విశేషం!

నరసింహారావు గారు 1979 దశాబ్ది చివరలో ఒంగోలు శర్మ కాలేజీలో డిగ్రీ చదువుతూ DSO లో పని చేశారు. 1980కి డిగ్రీ పూర్తి చేశారు. DSO లో జిల్లా, రాష్ట్ర స్థాయిలలో చురుకైన ఆర్గనైజర్ గా పని చేశారు. ఆ తర్వాత కాలంలో పాత్రికేయునిగా స్థిరపడ్డారు. ఆయన గారు *ఆంధ్రభూమి* దినపత్రిక లో 30 ఏళ్లకు పైగా పని చేశారు. విజయవాడ ఎడిషన్ ప్రారంభమైన రోజు నుండి ఎడిటింగ్ సెక్షన్ లో పని చేశారు. కరోనా కాలంలో పత్రిక మూతపడింది. అది ప్రారంభమైన రోజు నుండి మూతపడేంత వరకూ విజయవాడ ఎడిషన్ లో పనిచేసిన కొద్దిమందిలో నరసింహారావు గారు ఒకరు. ఆయన జీవిత భాగస్వామి సుమిత్ర గారికి కూడా పాత్రికేయ కుటుంబం నుండి వచ్చిన నేపధ్యం ఉంది. ప్రైవేటు ఉపాధ్యాయురాలిగా పని చేసిన నేపధ్యమూ ఉంది.

పై ఇద్దరూ ఒంగోలులో 14-10-1990న పెళ్లి చేసుకొని దంపతులు అయ్యారు. వారి కుమార్తె *మానవి.* ఆమె నేడు *హర్ష* ని తన జీవిత భాగస్వామిగా ఎంపీక చేసుకుంది. వారి పెళ్లి పది రోజుల్లో 19-8-2022వ తేదీన విజయవాడలో జరగనుంది. ఆనాడు ఏ పెళ్లి ఆహ్వాన పత్రికతో ఆహ్వానించారో, సరిగ్గా అదే తరహా ఆహ్వాన పత్రికతో తమ కూతురు పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. 32 ఏళ్ల తర్వాత కూడా అదే ఇంట్లో ప్రగతిశీల, సాంస్కృతిక వారసత్వం పునరావృతం కావడం ఈ కాలాన్ని బట్టి ఓ విశేషమే!

నాలుగైదు దశాబ్దాల క్రితం ఓ తెలుగుసీమలో ప్రగతిశీల *సాంస్కృతిక ఒరవడి* ఉండేది. తమ తల్లిదండ్రులు పిల్లలకు బ్రాహ్మణీయ సాంస్కృతిక పద్ధతుల్లో పెళ్లిళ్లు చేసే ప్రయత్నాలను చేస్తే, వారి ప్రయత్నాల్ని బాహాటంగా వారి పిల్లలు ధిక్కరించి, ప్రగతిశీల సాంస్కృతిక తరహా పెళ్లిళ్లు చేసుకునే ఒరవడి ఉండేది. విప్లవ, వామపక్ష, హేతువాద, భౌతికవాద సంఘాల సాంస్కృతిక ఉద్యమాల ప్రభావంతో ఈ తరహాలో పెళ్లిళ్లు జరగడం అనేది ఓ సాంస్కృతిక ఉద్యమంగా సాగిన నేపధ్య భౌతికస్థితి ఒకటుంది. కారణాలు ఏమైనా, నేడు భౌతిక పరిస్థితి మారింది. పై ప్రగతిశీల, ప్రజాతంత్ర సంస్థల నిర్మాణాల్లో ప్రధాన నాయకత్వ స్థానాల్లో పని చేస్తున్న తల్లిదండ్రులు సైతం నేడు తమ పిల్లల ఎదుట మౌన ప్రేక్షకుల్లా మారిపోతున్న స్థితి ఉంది. ఈ సాపేక్షిక స్థితిగతులలో ఈ పెళ్లిపై స్పందిద్దాం.

నూతన సాంస్కృతిక పంథాలో పెళ్లిళ్లకి పిల్లల్ని ఒప్పించాలని అరుదుగా తల్లిదండ్రులే స్వయంగా ప్రయత్నించే సందర్భాల్లో సైతం ఆశించిన ఫలితాలు రావడం లేదు. పిల్లలే పట్టుబట్టి బ్రాహ్మణీయ సాంప్రదాయ సనాతన పెళ్లిళ్లు చేసుకునే భౌతిక స్థితి నేడు ఏర్పడింది. ఆనాడు ఇంట్లో పిల్లలు *ధిక్కారపు* చైతన్యంతో ప్రగతిశీల సంస్కృతిని ప్రతిబింబించే పెళ్లిళ్లు చేసుకునే వారు. నేడు తద్భిన్నంగా పై ఉద్యమ సంస్థల నాయకుల కుటుంబాల్లో పిల్లల *ధిక్కారం* దానికి పూర్తి విరుద్ధంగా సాగుతోంది. అది అభివృద్ధి నిరోధక సంస్కృతికి చాలా బలం చేకూరుస్తోంది. ఔనుమరి, *సంస్కృతి* దానంతట అదే పుట్టదూ, పెరగదూ, వర్ధిల్లదూ! అది రాజకీయ కృషికి పరిమితమైతేనే సరిపోదు. అదో తాత్విక భావజాల నిబద్ధతతో నిరంతరం కొనసాగించే కృషితో మాత్రమే సాధ్యం. *సాంస్కృతిక విప్లవ ప్రక్రియని చేపట్టకుండా సాధించే రాజకీయ విప్లవ విజయాలు సైతం నిలబడవని చరిత్ర నిరూపించింది.* అది మరో విషయమైనా, గుర్తు చేసుకోవడానికి సందర్భోచితమే. తిరిగి మనం పెళ్లి వద్దకు వద్దాం.

పెళ్లి ఆహ్వాన పత్రికను చూసిన తర్వాత వెంటనే స్పందించి నా మిత్రులైన నరసింహారావు గారి నుండి పెళ్లి కథ వినాలని అనిపించింది. కూతురు పెళ్లి పనుల్లో ఉండగా తన విలువైన సమయాన్ని తీసుకునే ప్రయత్నం చేయకూడదనే స్పృహ వుంది. క్లుప్తంగా మాట్లాడి ఫోన్ కట్ చేద్దామని ముక్తసరిగా అడిగా. ఆయన ఒకింత సమయం తీసుకొనే వివరించారు.

ఆయన మాట్లాడిన ప్రతి మాట స్ఫూర్తిదాయకంగా ఉంది. ఒక్కమాట మాత్రం చెప్పాలని అనిపించింది. అది క్రింద ఉటంకిస్తున్నా.

*విద్యార్థి జీవితంలో DSO ద్వారా నేర్చుకొని అలవర్చుకున్న విప్లవ సంస్కృతి గొప్పది. మేం విప్లవ కార్యాచరణలో కొనసాగలేక పోయినా, విప్లవ సంస్కృతిని విడనాడేస్థితి ఎప్పటికీ రాకూడదనే నిబద్ధతని కల్గివున్నాం. మనం జారిపోకుండా ఇలాగే నిలబడి వున్నా, పిల్లల్ని ఇలా నిలబెట్టగలమా అనే ప్రశ్న వేధించేది. పిల్లల భావజాలం పై శ్రద్దాసక్తి ప్రదర్శించాం. ఏ నిర్మాణాల్లో కూడా మేం ఇప్పుడు లేకపోయినా, ఉద్యమ కార్యాచరణకి దూరంగా వున్నా, మా భావజాలం ఎప్పటికీ మారకూడదనే దీక్షని వదులుకోలేదు. అది మా వరకే పరిమితం కాకుండా, మా పిల్లల పెంపకంలో భావజాలం పట్ల ప్రత్యేక కేంద్రీకరణ చేసాం. మా కూతురుకి ప్రగతిశీల సంస్కృతిని అలవర్చే ప్రయత్నం చేస్తూనే వచ్చాము. ఏది ఏమైనా పౌరోహిత్య, బ్రాహ్మణీయ పెళ్లి మా ఇంట్లో జరిగే పరిస్థితి రాకూడదనే నిబద్ధతను ఏనాడూ విడనాడలేదు. ఈనాటి భౌతికస్థితి వల్ల ఒకవేళ మా కూతురు బ్రాహ్మణీయ పెళ్లికి అంగీకరించాల్సి వస్తే ఏం చేయాలో ఒక సమస్యయే. ఒకవేళ అదే జరిగితే మేము తల్లిదండ్రులుగా కాక, కేవలం సందర్శకులుగా మా కూతురు పెళ్లికి హాజరయ్యే నిర్ణయం ఒకటుంది. ఆ మాటను ఒక్కసారి కూడా మా అమ్మాయికి చెప్పలేదు. అలా చెప్పి అమ్మాయిని ఒప్పించాలని చూడడం ఓ బలహీనత మాత్రమే. చైతన్యయుతంగా మా బిడ్డ ప్రగతిశీల పంథాలో నూతన సాంస్కృతిక భావజాలంతో పెళ్లి చేసుకోవాలనేది మా కోరిక. మా సంకల్పం ఫలించింది. అందుకు మా బిడ్డ మనసా వాచా సిద్ధపడింది. ఈ పెళ్లికి మాది కేవలం నైతిక ప్రోత్సాహం మాత్రమే! మా పాత్ర కంటే మా బిడ్డ పాత్ర కీలకమైనది. మా బిడ్డ కంటే కాబోవు అల్లుడి పాత్ర మరింత అభినందనీయమైనది*

ఆయన మాటలు చాలా సంతోషం కలిగించాయి. అందుకే ఈ ప్రతిస్పందన.

ఆ దంపతులు నేడు విప్లవోద్యమ కార్యాచరణ లో లేకపోవచ్చు. విప్లవ, ప్రజాతంత్ర నిర్మాణాల్లో కొనసాగలేక పోవచ్చు. కానీ అభివృద్ధి నిరోధక సంస్కృతిని దృఢంగా వ్యతిరేకించి, ప్రగతిశీల సంస్కృతికి అద్దం పట్టే *దండల పెళ్లి* చేసుకునే స్థితిని సుసాధ్యం చేశారు. ఇది ఈ కాలంలో చిన్న విషయం కాదు. అందుకే నరసింహారావు, సుమిత్ర గార్ల దంపతుల్ని మనం మనసారా అభినందిద్దాం. ముఖ్యంగా ఈ పెళ్లిని సుసాధ్యం చేయడంలో కీలక పాత్ర పోషించిన నూతన దంపతులైన *మానవి హర్ష* ల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిద్దాం.

అభివృద్ధి నిరోధక రాజకీయాల కంటే, నేడు అభివృద్ధి నిరోధక సంస్కృతి విస్తృతంగా, వేగంగా, గాఢంగా, లోతుగా, ప్రమాదకరంగా వేళ్లూనుకుంటున్నది. ఈ కాలంలో ప్రత్యామ్నాయ సాంస్కృతిక కృషి కి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపధ్యంలో విజయవాడలో ఒక ఫంక్షన్ హాల్ లో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం దండల పెళ్లి చేసుకునే వధూవరుల్ని మనసారా అభినందిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *