‘బండి’ బయట పెట్టిన బిసి నిధుల లోగుట్టు

-బండి సంజయ్‌కుమార్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావొస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని ప్రజాసంగ్రామ పాదయాత్రలో భాగంగా వివిధ గ్రామాల్లో సందర్శించినప్పుడు కళ్లకు కట్టినట్లు స్పష్టంగా కనబడుతోంది. తెలంగాణ వస్తే సబ్బండ వర్గాల బతుకులు బాగుపడ్తయ్‌, సామాజిక న్యాయం జరుగుతదని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఉద్యమ సమయంలో చెప్తుండేవారు. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లయింది. కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవ్వరూ బాగుపడలేదు.

తెలంగాణలో బీసీల అణచివేత ప్రొగ్రామ్

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ రాజకీయం రోజు రోజుకూ అప్రజాస్వామికంగా తయారవుతున్నది. సంపదనూ, అధికారాన్ని చేజిక్కించుకున్నవాళ్లు మరింత పొందాలని చూస్తున్నరుగానీ, వాటిని వెనుకబడిన వర్గాలతో పంచుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నరు. వారు బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులే నామామత్రం కాగా, ఆ కేటాయించే నిధుల్లోనూ కనీసం 10 శాతం కూడా ఖర్చు పెట్టడం లేదని… సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా నేను పంపిన దరఖాస్తులకు అధికారికంగా వచ్చిన సమాధానాలే దానికి చక్కటి నిదర్శనం.

కేసీఆర్‌ చెప్పే మాటలకు, చేతలకు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
‘‘ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మాదిరిగా బీసీ సబ్‌ప్లాన్‌ను పకడ్భందీగా చట్టపద్ధతిలో తెస్తారా అని సభ్యులు అడుగుతున్నారు. తరువాతి ఫైనాన్షియల్‌ ఇయర్‌లో వందశాతం తెస్తాం. మనరాష్ట్రమే వీకర్‌సెక్షన్‌ రాష్ట్రం. ఎవరికి శషబిషలు ఉండాల్సిన అవసరం లేదు. అపోహలు అక్కర్లేదు. తరువాతి ఫైనాన్షియల్‌ ఇయర్‌లో బీసీ సబ్‌ప్లాన్‌ తెస్తం. చట్టం కూడా ఇదే సభలో పాస్‌ చేస్తం’’. 2017 మార్చిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన. ఈ ప్రకటన చేసి 5 సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటివరకు అతీగతీ లేదు. బీసీ సబ్‌ప్లాన్‌ తీసుకురాకపోగా ప్రతీ సంవత్సరం బీసీ సంక్షేమానికి కేటాయిస్తున్న నిధుల్లో కూడా కోతవిధిస్తూ బీసీల సంక్షేమాన్ని కాలరాస్తోన్న ఘనత కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుంది.

ఎంబీసీ కార్పోరేషన్‌ అలంకారప్రాయం

2017లో బీసీ మంత్రులు, బీసీ సామాజికవర్గానికి ప్రజాప్రతినిధులు శాసనసభప్రాంగణంలో మూడు రోజులపాటు సమావేశమై 210 తీర్మానాలను ఆమోదించి వాటిని ప్రభుత్వానికి సమర్పించారు. ఈ తీర్మానాలకు అతీగతీ లేదు. ఈ తీర్మానాల్లో ఎన్ని అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందా? 2017లో ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పోరేషన్‌ అలంకారప్రాయంగా మారింది. ప్రతీ బడ్జెట్‌లో రూ.1000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయనున్నట్లు డబ్బా కొట్టుకున్న ప్రభుత్వం 2017`18 నుండి 2021`22 వరకు ఎంబీసీ కార్పోరేషన్‌కు కేటాయించిన బడ్జెట్‌కు, జరిగిన ఖర్చుకు పొంతనే లేదని ఆర్టీఐ ద్వారా మేం సేకరించిన సమాచారంలో స్పష్టమౌతోంది. గత నాలుగుబడ్జెట్లలో రూ.3000 కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్‌ విభాగం ఆమోదం పొందింది రూ.350 కోట్లు మాత్రమే. దానిలో ఖర్చు చేసింది రూ.10 కోట్లకు మించి లేదు. దీనిబట్టే ఎంబీసీలపై టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎంత ప్రేమ ఉందో స్పష్టమౌతోంది.

బిసి లకు పథకం ప్రకారం ద్రోహం

ఒక సామాజిక వర్గం ఏ మేరకు రుణాలు పొందగలుగుతున్నది అనేది, వారి ఆర్థిక అభివృద్ధిని కొలిచే సూచిక. అందుకే, వివిధ సామాజిక వర్గాల అభివృద్ధికి కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తారు. కానీ, తెలంగాణలో బీసీలకు అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తూ… కేసీఆర్‌ ‘బీసీ ద్రోహి’ అవతారమెత్తిన్రు. ఎనిమిదేండ్లలో 5.70 లక్షల మంది బీసీలు స్వయం ఉపాధి లోన్లకు దరఖాస్తు చేసుకుంటే, కేవలం 50 వేల మందికే లోన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నరు. మిగిలిన 5.20 లక్షల మంది నేటికీ రుణాలు కోసం కళ్లు కాయలు కాసేల ఎదురు చూస్తున్నరు.

ఆర్టీఐ ద్వారా అందిన లెక్కల ప్రకారం ఎంబీసీ లోన్ల కోసం 13,369 మంది దరఖాస్తు చేసుకుంటే, 1,419 మంది మాత్రమే రుణాలు పొందారు. ఎనిమిదేండ్లలో ఎంబీసీ కార్పొరేషన్‌కి కేటాయించిన బడ్జెట్‌ రూ.3,305 కోట్లు కాగా, ఖర్చు చేసింది కేవలం రూ. 77.46 కోట్లు. ఇక, నాయీ బ్రాహ్మణులకు మోడ్రన్‌ సెలూన్లు కట్టిస్తమని, సబ్సిడీపై పరికరాలు ఇప్పిస్తమని చెప్పిన్రు. దేవాలయంలోని కళ్యాణకట్టలో పని చేసే క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తమన్నరు. తీరా చూస్తే ఆ హామీలన్నిటికీ కేసీఆర్‌ కత్తెరేసిన్రు. ఆర్టీఐ ద్వారా నాయూ బ్రాహ్మణ సహకారా సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఎనిమిదేండ్లలో ప్రభుత్వం వారి కోసం కేటాయించిన బడ్జెట్‌ రూ. 660 కోట్లు, అందులో రూ. 196 కోట్లు విడుదల చెయ్యగా… ఖర్చు చేసింది కేవలం రూ.60 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 35,651 మంది నాయీ బ్రాహ్మణులు లోన్లకు దరఖాస్తు చేసుకుంటే, అందులో 7,375 మందికే లోన్లు ఇచ్చిన్రు.
మాంసం ఉత్పత్తిలో రాష్ట్రాన్ని బలోపేతం చేసి, గొల్ల కురుమలను కోటీశ్వరులను చేస్తమని కేసీఆర్‌ కోటలు దాటే మాటలు చెప్పిన్రు. కానీ, గొర్రెల పంపిణీ పథకం మూలకుపడి మూడేండ్లయింది. గొర్రెల యూనిట్ల కోసం రూ. 31,250 చొప్పున డీడీలు కట్టిన మూడున్నర లక్షల మందికి ఎదురు చూపులే మిగిలినయ్‌. గొర్రెల పంపిణీకి పోయిన బడ్జెట్‌ లో వెయ్యి కోట్లు, ఈ బడ్జెట్‌ లో వెయ్యి కోట్లు కేటాయించినా… నయా పైసా విడుదల చెయ్యలే. రాష్ట్రంలో ఉన్న జలాశయాల్లో, చెరువుల్లో ప్రభుత్వమే ఉచితంగా చేపలు పోసి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తమని 2018 మేనిఫెస్టోలో చెప్పిన టీఆర్‌ఎస్‌, వాటిని కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టి మోసం చేసింది. ఫలితంగా ముదిరాజు, గంగపుత్ర సోదరులు సరైన ఉపాధి లేక ఆర్థికంగా చితికిపోతున్నరు.
వందల ఏండ్ల నుంచి మోకు ముస్తాదుతోనే తాటిచెట్లు ఎక్కుతూ ప్రమాదాల బారిన పడుతున్న కల్లుగీత కార్మికులకు, టెక్నాలజీ సాయం అందించి వారి మరణాలను ఆపడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయ్యింది. ఈ ఎనిమిదేండల్లలో 600 మంది గీత కార్మికులు తాటి చెట్ల మీద నుంచి పడి చనిపోగా, 4 వేల మంది వికలాంగులయిన్రు. ప్రతి గ్రామంలో 5 ఎకరాలు తాటి, ఈత వనాలకు కేటాయిస్తమని చెప్పిన 560 జీవో అమలుకే నోచుకోలే. కూల్‌ డ్రిరక్స్‌ కి ధీటుగా నీరా బాటిల్స్‌, నీరా కేంద్రాలు ఉత్త కతే అయ్యింది. 50 ఏండ్లు దాటిన గీతకార్మికుల పెన్షన్‌ దరఖాస్తులు నాలుగేండ్లుగా పెండిరగ్‌ లోనే పెట్టిన్రు. రాష్ట్రంలో ఉన్న గౌడన్నలందరూ ప్రభుత్వం ఇస్తనన్న మోటరు సైకిండ్ల కోసం దరఖాస్తు పెట్టుకోగా అవి కూడా కాగీతాలకే పరిమితమైనయ్‌.
ఆర్టీఐ ద్వారా పొందిన వివరాల ప్రకారం ఎనిమిదేండ్లలో సాగర ఉప్పర కార్పోరేషన్‌ 29.84 కోట్లు కేటాయిస్తే, అందులో ఖర్చు చేసింది 4.43 కోట్లు మాత్రమే. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఆ సామాజిక వర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. టీఆర్‌ఎస్‌ నిర్వాకం వల్ల ఆ సామాజిక వర్గం బుక్కెడు బువ్వకోసం కాంట్రక్టర్ల కింద కూలీలుగా నలిగిపోతూ, బతుకును బుగ్గి చేసుకుంటున్నది. ఇక 2014 నుంచి ఇప్పటి వరకు వాల్మీకి బోయ కార్పోరేషన్‌ కి రూ.30.46 కోట్లు కేటాయించగా… అందులో ఖర్చు చేసింది కేవలం రూ.5.98 కోట్లు మాత్రమే.
రజకులకు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలే అయ్యాయి. ఆస్పత్రులు, హాస్టళ్లు ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే పనులు అప్పగిస్తామని, వాళ్లకు డ్రైయింగ్‌ మెషీన్లు కూడా ఇస్తమని మాటిచ్చి మర్చిపోయిన్రు. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం రజక సహకార సంఘాల సమాఖ్యకు ఆయా వర్గాలకు చెందినవాళ్లు ఈ ఎనిమిదేళ్లలో 56,850 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే, కేవలం 5,720 మందికి చాలీచాలని రుణాలు ఇచ్చి తోక ముడిచారు. ఈ ఎనిమిదేండ్లలో రజకుల కోసం మొత్తం రూ. 551 కోట్లు కేటాయిస్తే, ఖర్చుపెట్టింది అక్షరాల అరవై కోట్లే. ఈ నాలుగేండ్లలో నిర్మించిన దోభీ ఘాట్ల
సంఖ్య 9! ఇదీ ఆయనగారి ఆచరణ శుద్ధి.
చాలీచాలని సంపాదనతో అప్పుల పాలై చావాల్నా, బతకాల్నా అనుకుంటూ నిత్యం జీవితాన్ని గడిపే స్థితిలో చేనేత రంగం ఉందంటే, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. చెమట చుక్కలనే రంగులుగా, చేనేత కార్మికుల నరాలనే దారాలుగా పరిచి చీరలు నేసే, ఆ చేనేత రంగం నిర్వీర్యం కావడానికి టీఆర్‌ఎస్‌ చేతగాని పాలనే కారణం. నేతన్నలకు 50 శాతం సబ్సిడీపై నూలు, 5 లక్షల బీమా, హెల్త్‌ కార్డులిస్తమని చెప్పినా, ఏవీ అమలు కావడం లేదు. ఇన్నాళ్లు తిప్పలు పెట్టి, తీరా ఇయ్యాళ ఎన్నికల ముందు బీమా ఇస్తమని మొసలి కన్నీరు కారుస్తున్నరు. టీఆర్‌ఎస్‌ అసమర్థ పాలన వల్ల తెలంగాణ వచ్చినప్పుడు 470 సహకార సంఘాలు ఉంటే, అవిప్పుడు 220 కి తగ్గినయ్‌.
విశ్వబ్రాహ్మిన్‌ కార్పోరేషన్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఎనిమిదేండ్లలో వారికి కేటాయించిన బడ్జెట్‌ రూ. 86 కోట్లు కాగా, ఖర్చు చేసింది కేవలం రూ.26.94 కోట్లు. ఇక, గత మూడు బడ్జెట్‌లలో విశ్వబ్రాహ్మనులకు శూన్య హస్తమే చూపించారు. కుమ్మరి శాలివాహన కార్పోరేషన్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం గత ఎనిమిదేండ్లలో వారికి కేటాయించిన బడ్జెట్‌ రూ. 55 కోట్లయితే, ఖర్చు చేసింది రూ. 12 కోట్లు మాత్రమే. ఆర్టీఐ ద్వారా భట్రాజ కార్పోరేషన్‌ పంపించిన సమాచారం ప్రకారం గత ఎనిమిదేండ్లలో భట్రాజ సామాజిక వర్గానికి కేటాయించిన బడ్జెట్‌ రూ. 13.30 కోట్లు కాగా, అందులో రూ. 95 లక్షలు ఖర్చు చేయడం సిగ్గుచేటు.
తమ వృత్తులు వదిలిపోలేక తప్పని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, పద్మశాలి, ముదిరాజ్‌, ఉప్పర, గౌడ, యాదవ తదితర కులాల గోడు ఈ టీఆర్‌ఎస్‌ ఏనాడూ వినలేదు. పాదయాత్రలో వారి గోసను స్వయంగా చూస్తున్నా. కాయకష్టం చేసుకొని బతికే వారి జీవితం దినదిన గండంగా తయారైంది. వాళ్ల వృత్తులు నాశనమవుతున్నాయి. కాబట్టి, వారు ప్రత్యామ్నాయ జీవన ఉపాధి అవకాశాలు పొందేలా, ‘బీసీ బంధు’ ప్రకటించి, కేసీఆర్‌ తను బీసీలకు చేసిన మోసాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
విద్యా రిజర్వేషన్లు అసమాన అవకాశాలను అధిగమించడానికి ముఖ్య సాధనం. కానీ, కేసీఆర్‌ తన పార్టీలో ఉన్న విద్యా వ్యాపారులకు ప్రయివేట్‌ యూనివర్సిటీలు కట్టబెట్టిన్రు. వాటిలో బలహీన వర్గాల పిల్లలకు రిజర్వేషన్లు, ఫీజు రియంబర్స్‌ మెంట్‌ లేకుండా చేసి, వారి విద్యా హక్కును కాలరాసిన్రు. ఖాళీలు నింపకుండా, నిధులు విడుదల చేయకుండా బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసిన్రు. జిల్లాకో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేస్తమన్న హామీ ఎప్పుడో గాల్లో కలిసింది. ఇక విద్యార్థులు చదువుకునే హాస్టళ్లలో పురుగుల అన్నం పెడుతున్నా పట్టించుకునే దిక్కు లేని దుస్థితి దాపురించింది.
ఆర్థికంగా, చదువు పరంగా అట్లా మోసం చేస్తుంటే, రాజ్యాధికారం తన కుటుంబం గుప్పెట్లో పెట్టుకొని బీసీలను రాజకీయంగా కూడా అణచివేస్తున్నరు. 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు తెలంగాణ అసెంబ్లీలో కేవలం 22 మందే సభ్యులు ఉన్నరు. అందులో ముగ్గురికే మంత్రి పదవులు! 0.4 శాతం మంది ఉన్న ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి మాత్రం నాలుగు మంత్రి పదవులు ఇచ్చుకున్నరు. మొత్తంగా కేసీఆర్‌ మంత్రివర్గంలో 60 శాతానికి పైగా మంత్రులు అగ్ర కులాలవాళ్లే. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉండాల్సిన 33 శాతం రిజర్వేషన్లను కూడా టీఆర్‌ఎస్‌ 15 శాతానికి తగ్గించడం, బీసీల బలాన్ని తగ్గించే కుట్ర కాదా?
బీజేపీలో ఇలాంటి కుటుంబ రాజకీయాలు నడవవు. బీసీ అయిన నరేంద్రమోదీని రెండుసార్లు ప్రధానమంత్రి చేయడం ద్వారా, ఆ ప్రధానమంత్రి నలభైశాతం బీసీలతో మంత్రివర్గం ఏర్పాటు చేయడం ద్వారా దేశంలో ఉన్న బీసీల్లో ఆత్మవిశ్వాసం నింపిన పార్టీ, బీజేపీ. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో బీసీ మంత్రుల శాతం 10 శాతానికి ఎన్నడూ మించలేదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీజేపీ తప్ప ఏ పార్టీ ఒక బీసీ నాయకుడిని ప్రధానమంత్రిని చెయ్యలేదు. ఇది బీజేపీ సాధించిన సామాజిక న్యాయం. పాలనలో ఆయా సామాజిక వర్గాలకు తగు భాగస్వామ్యం లేకపోవడం వల్లే ఆ వర్గాలు అభివృద్ధి ఫలాలు అందుకోలేకపోతున్నాయని అధ్యాయనాలు చెప్తున్నా… దొరగారికి ఇవేం చెవికెక్కవు. బీజేపీ రేపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రస్తుతం కేంద్రంలో పంచుతున్నట్టుగానే అన్ని వర్గాలకు సమానంగా రాజ్యాధికారాన్ని పంచుతుంది.
జనాభాలో పది శాతం ఉన్న ‘‘జాతీయ సంచార జాతుల సంక్షేమ అభివృద్ధి’’ బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ విద్యాలయాల్లో, సైనిక్‌ పాఠశాలలో 27 శాతం ఓబీసీలకు రిజర్వేషన్‌ ద్వారా కొన్ని వేలమంది బీసీ విద్యార్థులకు సీట్లు లభిస్తున్నయ్‌. మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. బీసీ జాతీయ కమిషన్‌కి రాజ్యాంగ హోదా కల్పించింది. రాజకీయంగా, విద్యా ఉద్యోగాల పరంగా బీసీలకు న్యాయం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది.
ప్రజలందరకీ సమానత్వాన్ని, సమాన అవకాశాలను, సామాజిక ఆర్థిక, రాజకీయ న్యాయం చేయాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని కేసీఆర్‌ తుంగలో తొక్కారు. రాజ్యాంగాన్నే అవమానించిన మహానుభావుడి నుంచి ఇలాంటి ఆదర్శాలు ఆశించడం కూడా తప్పే. తెలంగాణలో పరిపాలించేవారు, పథకాలు తీసుకొచ్చేవారు, వాటిని అమలు చేసేవారు ఆయా కులాలువారు కాదు. అలాగే వారికి బలహీనవర్గాల పట్ల కనీసం సానుభూతి కూడా లేదు. అలాంటి కేసీఆర్‌ కుటుంబం అధికారంలో ఉన్నంత వరకూ బీసీల స్థితిగతులు మారవు. కల్వకుంట్ల కుటుంబ పాలన అంతమే దీనికి విరుగుడు.

– బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *