ఎన్టీఆర్ శతజయంతి : రెండో పార్శ్వం

(M A కృష్ణ)

ఎన్టీఆర్ (1923 మే 28 –  1996 జనవరి 18)  రాజకీయజీవితం మొదలై  40 ఏళ్లు, దాని గురించి నేడు అత్యధికులకు  లోతైన అవగాహన తక్కువ.   పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలకే  2/3 సీట్లతో (202/294)  గెలిచి, 1983లో  ముఖ్యమంత్రి అయిన,నాదెండ్ల భాస్కరరావు కుట్రని నెలరోజుల్లోనే  వమ్ముచేసినవైనాన్ని, తర్వాత 1985ఎన్నికల్లో మళ్లీ గెలిచిన రీతిని  ప్రస్తావిస్తుంటారు. ఎన్టీఆర్  శతజయంతి వివిధ పార్టీలకీ, మీడియాకీ పండగ…సినిమాల్లో రాజకీయాల్లో ఆయన విశిష్టతలను చాటే కథనాలు…కానీ 1983-1985లో ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిన’ ఎన్టీఆర్ 1989 ఎన్నికల్లో ఓటమి…1995లో గుండె పగిలి, ‘నేలకు రాలి పోయిన’ వైనం ఏమిటో చూడకపోతేవిశ్లేషణలు అసంపూర్ణంగానే మిగిలిపోతాయి.  బడామీడియా ఆ పనికి సిధ్ధంగా లేదు. దానికే ఈ చిన్న ప్రయత్నం; ఇది సమగ్ర విశ్లేషణ కాదు; కొన్ని అంశాలకే  పరిమితం.  

కేవలం గతచరిత్ర దృష్ట్యానే కాదు, వర్తమానరాజకీయాల్లోనూ ప్రాముఖ్యతకలది ఈ అంశం. ‘గోవిందుడు అందరివాడేలే’ అన్నట్టుగా … ఒంగోలులో ఈ మధ్య జరిగిన మహానాడు విజయవంతమైందని, ప్రతి ఏరియాలో మినీ మహానాడు జరుపుతామని టిడిపి ప్రకటించింది. వాటన్నిటిలో ఎన్టీఆర్ని కీర్తించి, ఎన్నికల ప్రచారానికి వాడుకోజూస్తున్నది. కాగా జగన్ పార్టీ చంద్రబాబు వెన్నుపోటుదారుడనీ,  ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు తామే పెట్టామని  చెప్తున్నది; ఎన్టీఆర్ ‘అర్థాంగి’ లక్ష్మీపార్వతి నేడు జగన్ బృందంలో పదవిలో ఉన్నారు. రెండు ముఠాల వాదనలతో రెండు సినిమాలు తీశారు: రాంగోపాల్ వర్మది లక్ష్మీపార్వతికి,  బాలకృష్ణది  చంద్రబాబుకి అనుకూలం. వారసత్వ రాజకీయాలని విమర్శించే బిజెపి ‘మాజీ కాంగ్రెసు మంత్రి’ దగ్గుపాటి పురందేశ్వరికి ప్రధానకార్యదర్శి పదవినిచ్చింది; కేంద్ర నాయకులకి   అనువాదకురాయ్యారు. తెలంగాణలో సైతం టీఆర్ యస్ తోసహా అన్నిపార్టీలు ఎన్టీఆర్ పేరును వాడుకోటానికి విగ్రహపూజలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని అంతా పోటీపడుతున్నారు.  

1983లో గెలిచిన  వైనం 
 

సినిమాల్లో లాగే రాజకీయాల్లోనూ డైరెక్టర్లు స్క్రిప్ట్ రైటర్లు కీలక పాత్ర పోషిస్తారు. సినిమాను పెట్టుబడి, లాభా లు శాసించినట్టే, రాజకీయాలను కూడా అవీ, వర్గ, వర్ణ స్వార్థశక్తులూ శాసిస్తూ వచ్చాయి.   ఎన్టీఆర్  దానికి మినహాయింపేమీ కాదు. ఆయనకి రాజకీయాలంటే బొత్తిగా తెలియదు, పడదు. అలాటి ఆయనని తాను, మరికొందరుకలిసి రాజకీయాల్లోకి తీసుకు వచ్చామని స్క్రిప్ట్ రైటర్లు(నాదెండ్ల) చెప్పింది అసత్యంకాదు, వాస్తవమే. అంతగా ప్రచారంలో లేని ప్రతిభాపాటిలుని, రామనాథ్ కోవిందుని, ద్రౌపది ముర్మూని రాష్ట్రపతులుగా ఎందుకు ముందుకు తెచ్చారు?  ఎన్టీఆర్ ని తెచ్చిందీ అందుకే.

ఎమర్జన్సీ (1975-77) తర్వాత జనతా ప్రభుత్వం ఏర్పడింది. ఇందిర నేతృత్వంలోని కాంగ్రెసు దేశమంతటా ఓడిపోయింది కానీ ఆంధ్రలో (కర్నాటకలోనూ) గెల్చింది. కాంగ్రెసువ్యతిరేక, ప్రజాస్వామిక చైతన్యం ఓట్లపరంగా వ్యక్తం కావటానికి ఇక్కడ ఆలస్యం జరిగింది. ఆ స్థితిలో కాంగ్రెసు స్థానం ఆక్రమించాలనుకున్న పాలకవర్గ శక్తులు రంగంలోకి దిగారు. ఐదేళ్లలో నల్గురు ముఖ్యమంత్రులను మార్చిన కేంద్ర నిరంకుశత్వాన్ని, అంజయ్యకు అవమానంనీ ప్రశ్నించాలన్నారు.  తెలుగునాట కమ్యూనిస్టులు దశాబ్దాలుగా  తమ త్యాగాలతో ఉద్యమాల ద్వారా పెంచిన కాంగ్రెస్ వ్యతిరేకతకి, ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ (సుందరయ్య గారి పుస్తకం) పేరిటఉన్న తెలుగు జాతీయభావనకి  ఎన్టీఆర్ సినిమా ఆకర్షణని జోడించారు. తెదేపా స్వంతం చేసుకొన్న ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’ పాటని  కమ్యూనిస్టు నేత వేములపల్లి శ్రీకృష్నరాసారని గుర్తు చేసుకోవాలి.  అప్పట్లో జర్నలిజంలో  కొత్తపుంతలు తొక్కిన ‘ఈనాడు’ వినూత్న పధ్ధతుల్లో ప్రచారం చేసి, ఎన్టీఆర్కి బ్రహ్మ’రథం’ పట్టి, తనూ భారీగా విస్తరించింది; మాజీ కమ్యూనిస్టు రామోజీరావు మార్కెటింగుకింగే కాక కింగుమేకరయ్యారు. ఆ పత్రికలో అహర్నిశలూ శ్రమించిన మేటి జర్నలిస్టులంతా  కమ్యూనిస్టులే అంటే అతిశయోక్తిలేదు.  ఎమర్జన్సీ  కాంగ్రెసు పట్ల వ్యతిరేకతతో,  వారంతాతెలుగు నాట కొత్త రాజకీయ శక్తిగా ముందుకు తేబడిన తెదేపాని బలపరిచారు; 1977ఎన్నికల్లో ఆంధ్రలో  ఓడినా, గణనీయంగా ఓట్లు తెచ్చుకొన్న జనతా పార్టీ వర్గాలు – అందులో కొత్త భూస్వామ్య శక్తులూ ఉన్నాయి- తమ పాత్రను తాము నిర్వహించాయి. ఇదంతా అపూర్వ సంచలనం సృష్టించింది.  

1981 ఏప్రెల్లో ఇంద్రవెల్లిలో కాంగ్రెసు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో 60 మంది గిరిజనులు మరణించారు. అది  కొమరంభీం నడయాడిన గోండుల గడ్డ; జల్ జంగల్ జమీన్ల కోసం మరోసారి కదిలిన తరుణంలో ఈ మారణకాండ (ముఖ్యంగా తెలంగాణలో) ప్రజల క్రోధాన్నిరగిలించింది. ఆ స్థితిలో పార్టీ ఏర్పడిన తొలిరోజుల్లోనే  ఎన్టీఆర్ అక్కడ  పర్యటించి, అల్లూరి స్మరణతో గిరిజనులకు అండగా ఉంటాననీ, నక్సలైట్లు దేశభక్తులనీ ప్రకటించి, ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. పై అన్నిటిలో ఆయా శక్తుల స్క్రిప్ట్ కి, డైరెక్షనుకి లోబడి ఎన్టీఆర్ హీరో వేషం వేశారు. కొత్త భ్రమలు స్రృష్టించారు. అన్నీకలిసి 1983లో రాజకీయ బాక్సాఫీసులో సినిమా పెద్ద హిట్టయింది! హిట్ అయింది కేవలం ఆయన ప్రతిభ వల్లనే కాదు. పెద్ద సినిమాలు కొన్నిసార్లు ఫెయిలవుతాయి కూడా(1989), అది వేరేకథ.   

ఎన్టీఆర్  క్రమంగా నీతిబాహ్య రాజకీయాలకు దిగజారారు; బలహీనతలు బైటపడినాయి: తెదేపాని వ్యతి రేకిస్తూ పోటీ చేసిన వారిని పార్టీలోకి తీసు కోరాదన్న నియమాన్ని పక్కన పెట్టి, ఎన్టీఆర్ 1985లో మరో సారి సీఎం అయ్యాక ’అల్లుడు చంద్రబాబు’ని తెలుగుదేశంలోకి తీసుకుని  పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారు. ఏ చట్ట సభలోనూ సభ్యత్వం లేని బాబుకు కొత్తగా ఏర్పాటు చేసిన కర్షక పరిషత్‌ చైర్మన్‌ పదవి అప్పగించారు. ఈ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

మండలవ్యవస్థను భూస్వామ్యవ్యతిరేకచర్యగా చూపెడుతుంటారు. కాంగ్రెసుని, ‘పాత భూస్వామ్య’ వర్గాలనీ తుడిచిపెట్టటం, జిల్లా తాలూకాధిపతులస్థానంలో మండలాధిపతులను నెలకొల్పటం దాని లక్ష్యం: తద్వారా ’మధ్యకులాల, కొత్త భూస్వామ్య, నయా సంపన్న’వర్గాల ఆధారంగా తమ బలాన్నిపెంచు కొన్నారు. దానికే బీసీలను, బడుగువర్గాలను పైకి తేవటం అని పేరుపెట్టారు కానీ,

గ్రామ రెవెన్యూ వ్యవస్థలో (కరణం,మునసబులు, వారూ వంశ పారంపర్యంగా ఉన్నవ్యవస్థలో) మార్పులని  ‘విప్లవాత్మక’ చర్యగా చెప్తుంటారు. జమీందారీలు రద్దయినా భూస్వాముల పట్టు పోనట్టుగానే, ఇదీ ఒక పరిపాలనా సంస్కరణగానే మిగిలిపోయింది. అంతేకానీ గ్రామీణ పేదల భూమిహక్కులను కాపాడే మౌలిక చర్యగా లేదు. భూమిలేని పేదలకు కొత్తగా భూములను పంచే(కాంగ్రెసు వారు కాయితాలకు పరిమితం చేసిన భూసంస్కరణల, సీలింగు చట్టం అమలు) కార్యక్రమమేదీ లేదని గమనించాలి.

కాగా,అంతలోనే కారంచేడు, 1988 డిసెంబర్ లో వంగవీటి రంగా హత్య, అవి రగిల్చిన కుల చిచ్చుతెల్సినవే.  ఇతరులను రౌడీలని నిందిస్తూనే, ప్రత్యర్థి హంతకముఠానాయకులకు పార్టీలో పెద్ద పీటవేసారు. డజన్లకొద్దీ హత్యలు చేసి జైలుపాలైన పరిటాలరవిని తర్వాతిదశలో మంత్రిగా చేసారు; అతడి ప్రత్యర్థులను 41మందిని ఎన్ కౌంటర్ల ద్వారా చంపించారని  పౌరహక్కులనేత ప్రొ. శేషయ్య వివరాలు ప్రకటించారు

 అలాగే  శాసనమండలి రద్దు కూడా కాంగ్రెసుని  దెబ్బతీయటానికే; సూత్రబధ్ధత ప్రాతిపదికపై కాక రద్దుకి ఎన్టీఆర్ చూపిన కారణాల్లో అదనపు ఖర్చు(కోటి రూ.లోపే) కూడా ఉన్నది; తర్వాత అవకాశవాదంతో మండలిని పునరుద్ధరించారు. 1985లో అటు లెఫ్టునీ,ఇటు బీజేపీనీ కలుపుకొని పోటీ చేసి బలం పెంచుకొన్నారు. ఎన్టీఆర్ ఉండగానే ఎన్నికల్లోఉదా తాడేపల్లి గూడెంతణుకులో 15-35 రూ ఇచ్చి ఓట్లు కొన్నారు. ఐనా తప్పలేదు…

1989 ఎన్నికల్లో ఓటమి   

ఎన్టీఆర్ ఘనవిజయం సరే…అనతికాలంలోనే ఘోరఓటమి గురించి,  ఆయన వర్గస్వభావం గురించీ పెద్దగా మాట్లాడరు.  చంద్రబాబు వెన్నుపోటు గురించి రోజూ వింటుంటాం. 1989నాటికి అది జరగలేదని గుర్తు చేయాలి. నాదెండ్ల వెన్నుపోటుని (1984 ఆగస్టు, నెలరోజుల సంక్షోభం) అంతగా అధిగమించ గలిగిన ఎన్టీఆర్ చంద్రబాబుని ( 1995 ఆగస్టు తర్వాత) ఎందుకు ఏమీ చేయలేక పోయారు అన్న ప్రశ్నకి జవాబు చెప్పాలి కదా!  ‘(మార్గ)దర్శకుల’, స్క్రిప్టురైటర్ల, వారు ప్రాతినిధ్యం వహించిన పాలకవర్గాల నేరాలే  1989 ఓటమికి కారణం.  కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణంతో  ప్రజల్లో బలంగావున్న నిరసన వల్ల మొదటి దెబ్బని కాసుకొని, ఎన్టీఆర్  నిలదొక్కుకోగలిగారు. ఆనాటికి ఎన్టీఆర్ కి చెడ్డ పేరు లేదు. ’అధికారం ఎవరినైనా అవినీతిపాలు చేస్తుంది, అది నిరంకుశాధికారం అయితే మరింతగా దెబ్బతీస్తుంది’ అంటారు.  1989 ఎన్ని కల్లో అదే జరిగింది: తెదేపా రాష్ట్రంలోని 294 సీట్లలో 74 మాత్రమే గెలిచింది (1985లో 216 సీట్లు). పోలైన ఓట్లలో9.67 శాతం ఓట్లు కోల్పోయి, 36.54 శాతం పొందింది. కాగా చెన్నారెడ్డినేతృత్వంలో కాంగ్రెసు 47       శాతం ఓట్లు, 181సీట్లతో  రికార్డు నెలకొల్పింది. ఈ పరిణామాలకు కారణం? ఎన్టీఆర్ ప్రతిభ ఏమైపోయింది? 1989లో తెదేపాఓటమికి కారణాలేమిటి?దీని గురించి లోతుగా విశ్లేషించకుండా దాటవేస్తుంటారు.  మూడు ప్రాంతాల్లోనూ పేద రైతాంగంలో, కార్మికుల్లో, మధ్య తరగతిఉద్యోగుల్లోనూ వ్యతిరేకత పెరిగిపోయింది. కొన్ని వివరాలు చూద్దాం. 

పోలీసురాజ్యం – కారంచేడు

ఈమధ్యనే మహానాడుజరుపుకొన్నఒంగోలు లోనే తెదేపాకి  మొదటి ఎదురు దెబ్బ తగిలింది: ఆ జిల్లాలో 1983 టంగుటూరుపోలీసు కాల్పుల్లో ముగ్గురు రైతుల మరణంతో, 20మంది పత్తి రైతుల  ఆత్మహత్యలతో    తెదేపాకి ఓట్లు వేసిన రైతాంగం కోపంతో రగిలి పోయారు.  ‘మమ్మల్ని తాగిపారేసిన సిగరెట్లకన్నా అధ్వాన్నంగా చూస్తున్నార’ని  70 ఏళ్ల వృధ్ధరైతు పమిడి కోటయ్య చౌదరి,  గిట్టుబాటుధరల్లేవని రైతునేత యలమంచిలి    శివాజీ అన్నారు. 

ఈనాడు కార్టూన్

‘స్క్రిప్టు రైటర్లయిన కారంచేడు భూస్వామ్య వర్గాలు’విజయగర్వంతో గ్రామీణపేద దళితులపై 1985 జూలైలో    మారణకాండకి పాల్పడ్డాయి: ఆర్గురి హత్య, శవాల గల్లంతు, మానభంగాలు, 20మందికి గాయాలు… చాలామందికి  క్రింది కోర్టులో శిక్షలు  పడ్డా,  హైకోర్టులో ’మేనేజి’ చేసుకొని,  అంతా బైటపడ్డారు. 20 ఏళ్ల తర్వాత కానీ సుప్రీంకోర్టులో కొందరికి శిక్షలు ఖాయం కాలేదు. (జడ్జీలను మేనేజి చేయటం ఆనాడే పెద్దఎత్తున మొదలయింది. ఎన్టీఆర్ హయాంలో ఎన్ని న్యాయ విచారణలకు  ఆదేశించారో, వాటి సాయంతో గట్టెక్కారో లెక్కలు తీస్తే నభూతో నభవిష్యతి అని  బైటపడుతుంది.)

ఈ కేసులో ఒక మహిళ సహాకీలక సాక్షులు హ త్య చేయబడ్డారు.  మళ్లీ రెండేళ్లకే  (1987 జూలై) నీరుకొండ మారణకాండలో ఐదుగురు పేదల హత్య! తర్వా త కాంగ్రెస్ పాలనలోనూ దౌర్జన్యాలు  కొనసాగి, చుండూరులో ఎనిమిది మంది దళితులు బలై పోయారు(1991 ఆగస్టు).  ఈ క్రమంలో ప్రజల విశ్వాసాన్నిపొందే రీతిలో ఎన్టీఆర్ ఏనాడూ  వ్యవహరించలేదు; భూస్వామ్య  పెత్తందారీ వర్గాలకు వ్యతిరేకంగా నోరెత్త లేదు. కర్ణ సినిమాలో డైలాగులు తప్ప అగ్ర వర్ణాల   దౌర్జన్యాలని మనస్ఫూర్తిగా ఖండించలేదు.హంతకులకు శిక్షలు పడేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయలేదు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్  వియ్యంకుడు, కారంచేడు భూస్వామి దగ్గుబాటి చెంచు రామయ్య హత్యకు గురయ్యారు. దాంతో ప్రభుత్వ నిర్బంధాలకి తోడు భూస్వాముల స్వైర విహారానికి వీలు  కల్పించే రీతిలో ‘గ్రామ రక్షణ దళాల’ను ఏర్పాటు చేస్తాం, ప్రతిగ్రామంలోఇద్దరికి (పెత్తందార్లకి) తుపాకీ లైసెన్సు ఇస్తాం అని ఎన్టీఆర్ ప్రకటించారు.( తీవ్రవ్యతిరేకతల వల్ల ఇలాటి అనేక నిర్బంధాలకు బ్రేకు పడింది.) కులతత్వం నిరంకుశత్వం పతాకస్థాయి కి చేరాయి.ఈ ఘటనలు రాష్ట్రంలోనే కాక దేశంలోనే దళిత ఉద్యమ రూపంలో కొత్త రాజకీయాలకునాంది పలి కాయి.   

కాంగ్రెసువారి పోలీసు రాజ్యాన్ని కొనసాగించిన ఎన్టీఆర్ ప్రభుత్వం 

  ఎన్టీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా కొన్ని విషయాల్లో, కొన్ని వర్గాల కోసం మాట్లాడారు కాని, కేంద్రం ప్రజలపై సాగించిన పోలీసు మిలటరీ రాజ్యాన్ని ఎన్నడూ అడ్డుకోలేదు. హోంశాఖ రాష్ట్ర  జాబితాలో ఉన్నా, మిధ్య అంటున్నకేంద్రంతో చేతులు కలిపి, తీవ్ర నిర్బంధ పాలన సాగించారు. ముఖ్యంగా తెలంగాణలో కేంద్ర సాయుధ బలగాలను (సీఆర్పీని), ‘కల్లోల ప్రాంతం’ చట్టాల వంటివాటిని, టాడాని,ఎస్మాని విచ్చలవిడిగా  ప్రయోగించారు. ఇందిరమ్మ, కాంగ్రెసుల  నిరంకుశ విధానాలనే ఎన్టీఆర్ ప్రభుత్వం కొనసాగించింది: ఎన్టీ ఆర్ పాలనలో ప్రజలు నిరంకుశత్వాన్ని, నిర్బంధాలను, చిత్ర హింసలను,పోలీసు కాల్పులను, నల్లచట్టా లను, వెరసి  పోలీసు రాజ్యాన్ని చవిచూశారు: 1994-95లో 75 కాక, 1983-89 లోనే సుమారు 200 ఎన్ కౌంటర్ మరణాలని ఎందరికి గుర్తుంది? పౌరహక్కుల నేత డాక్టరు రామనాధంని పోలీసులు కాల్చిచంపింది, 1989 ఆగస్టులో బాలగోపాలుని కిడ్నాపు చేసిందీ (ఎన్ కౌంటర్ చేస్తారేమోనని భయపడ్డారు) ఈ హయాములోనే! పెద్దలు ‘మర్చిపోయిన’, యువతరానికి తెలియని ఈ గాథని హక్కుల ఉద్యమంకోసమైనా  కొంత వివరంగానే గుర్తుచేయాలి.

చంద్రబాబు ఆందోళనకారులని గుర్రాలతో తొక్కించారని చెప్పేవారు దీన్ని ఎందుకు గుర్తుచేయరో? తర్వాతి వరసలో ప్రజాగాయకుడు గద్దర్ పై గుర్తు తెలియని వ్యక్తులు (పోలీసులు) తెదేపా హయాంలోనే  కాల్పులు (1997 ఏప్రిల్ 7) జరిపారు.  ఆనాటి బుల్లెట్లు నేటికీ శరీరములో ఉండి బాధిస్తున్నాయని, నేరస్తులను శిక్షించాలని ఈ మధ్యే  గద్దర్ మళ్లీ కోరారు. నక్సలైట్లు దేశభక్తులు అంటూ 1983 లో అధికారంలోకి వచ్చిన  తెదేపా, ఎన్టీఆర్ సృష్టించిన ఈ ‘రక్త చరిత్ర’ గురించి చెప్పరు. కాంగ్రెసు నిరంకుశ పాలన మాటున ఇది కన్పడకుండా పోతున్నది.   

విరాటపర్వం సినిమాలో చూపినవి పూర్తి వాస్తవాలే: గ్రామీణ పేదల ఉద్యమాన్ని అణచటానికి  గ్రామాల్ని తెల్లవారు జామునే చుట్టుముట్టి, నక్సలైట్ ముద్రవేసి, వందలాదిగా నిర్బంధించారు.  గ్రామాల్లో ప్యాంటు వేసుకున్న యువకులు అడుగుపెట్టడానికి భయపడే స్థితి. పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ చిత్ర హింసలు, బూటకపు  ఎన్ కౌంటర్లు, అక్షరాలా నిత్యకృత్యం. 1975-77 ఎమర్జెన్సీ తర్వాత రగిలిన పౌర ప్రజా స్వామిక హక్కుల ఉద్యమాలు 1983 తర్వాత మళ్లీ ఊపిరి సలప కుండా పనిచేయాల్సి వ చ్చింది.  ’పోలీస్ రాజ్యం తుపాకిరాజ్యం’  నినాదం మార్మోగింది. 

కార్మికులు తమ సమస్యలపై ఆందోళనలు చేస్తే నక్సలైట్ ముద్ర వేసి ఆయుధ చట్టాలను ఉపయోగించి అణచివేయచూశారు.  సింగరేణి కార్మిక కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్లలో రోజుల తరబడి చిత్రహింసలు పెట్టారు; రోలరు ట్రీట్మెంట్ వంటివి ఇచ్చారు. ఉదా.కి 1989లో చిత్రహింసలని తట్టుకోలేక ఒక కార్యకర్త పగలగొట్టిన సీసాతో మెడలో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.  తప్పుడు కేసులు పెట్టారు. వాల్ రైటింగ్ కూడా నేరం అయిపోయింది. సింగరేణి గని కార్మిక సంఘం(SGKS) కార్యదర్శి మొగిలయ్యను చిత్రహింసలు పెట్టి, యూనియన్ని రద్దుచేయాలని ఒత్తిడి చేశారు! చివరికి ఉద్యోగం నుంచి తొలగించారు. అక్రమంగా నిర్బంధించిన 15 రోజులకు గానీ అరెస్టును చూపెట్టలేదు.  

రాయలసీమలోనూ ఇలాగే.. ఉదా. కి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీనివాసులు అన్న మేస్త్రి  1989 జూన్ 18న కస్టడీలో చనిపోయాడు. దానికి నిరసనగా వెయ్యి మంది ప్రదర్శన చేస్తే, వారిపైనా పోలీసులు కాల్పులు! గ్రామీణ పేదల సంఘం నిజనిర్ధారణ కమిటీ వాస్తవాలను బయటపెట్టింది. తిరుపతిలో రౌడీలకు కబ్జాదారులకు, చిట్ఫండ్ పేరిట వున్న మోసగాళ్ళకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన నవోదయ యువజన సంఘం నాయకులపై 1987లో తప్పుడుకేసులు పెట్టారు. తాడేపల్లిగూడెంలో పోలీసుకాల్పులు.. 

రైతాంగం కార్మిక వర్గాలే కాదు; ఎన్టీఆర్  మధ్యతరగతి వర్గాల విశ్వాసమూ కోల్పోటం 1983లోనే మొద లైంది:  వచ్చీరాగానే ప్రభుత్వోద్యోగులకు రిటైర్మెంట్ వయసు 58 నుంచి 55 కి తగ్గించారు; వారు  53 రోజులు  సమ్మెచేసినా ఏ ఒక్క డిమాండునీ అంగీకరించకుండానే 1986 చివర్లో విరమించుకోవాల్సి వచ్చింది. 1986 పిఆర్ సి ప్రకారం 750 రూ. బేసిక్  అడిగితే 740 కి మించి ఇవ్వం అన్నారు; వారు కోరినట్టు జనవరి నుంచి కాదు జూలైలోనే అమల్లోకి వస్తాయని మొండికేశారు. నిరంకుశత్వం సరేసరి: ఎస్మాని, జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి  12 మంది నాయకుల్ని జైల్లో నిర్బంధించారు.  రాజ్యాంగం ఆర్టికల్ 311 విశేషాధికారాలతో  బర్తరఫులు చేసారు. ఈరోజు ప్రభుత్వ పర్మనెంటు  ఉద్యోగుల వేతనాలు, సౌకర్యాలు పెరిగి,  ఉన్నత మధ్య తరగతి స్థాయికి చేరుకొన్నారు…ఆనాటి పరిస్తితి అధ్వాన్నం.

 అప్రజాస్వామిక, నిరంకుశ పాలన  

ఏళ్ల తరబడి రాజధానిలో నిషేధాజ్ఞలే; సభలకు, ఊరేగింపులకూ అనుమతి నిరాకరించారు(ఉదా.కి ఓపిడిఆర్ సభలకు 1985-86-89లో); 1986లో హైకోర్టు అనుమతించాక గుడివాడలో పోలీసులు హాలుని ఆక్రమించుకొని అడ్డుకొన్నారు! గిరిజన భూహక్కుల రక్షణకని చేసిన 1/70  చట్టాన్ని రద్దు చేయ జూసారు. శ్రీశైలం ముంపు బాధితుల ఇబ్బందులు కల్వకుర్తిలో ఓటమికి తోడ్పడ్డాయి. ఎన్టీఆర్ తెలుగు భాషాభిమానం కూడా తమ గ్రూపు ప్రయోజనాలకు లోబడినదే. ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (DSO) మాతృభాషలో విద్యపై సదస్సు నిర్వహించింది; ముఖ్య అతిథి గాంధేయుడు  వావిలాల గోపాలకృష్ణయ్య. అలాంటి సభకు సైతం ప్రభుత్వం అనుమతి నిరాకరించింది! షరతులతో హైకోర్టు అనుమతించింది. తెలుగు యూనివర్శిటీ స్థాపన మంచిదే కాని, అందులో జాతకం, వాస్తులాటి అశాస్త్రీయ అంశాలను చేర్చారు. ఆయన తెలుగు అభిమానం వారుణీ వాహినీ పథకం (ప్ర.సా.దు.) వంటి తెలుగు పేర్లు పెట్టడానికి పనికొచ్చింది. నిషేధం నినాదంతో మొదలుపెట్టి, ప్రభుత్వమే మద్యపానాన్ని ప్రోత్సహించింది. పోలీసు స్టేషన్లలో సారాన్ని పెట్టి అమ్మిన ఘనమైన తెలుగు రాష్ట్రం మనది.  1989 ఓటమికి ఇతర రాజకీయ కారణాలూ ఉన్నాయి: ఎన్టీఆర్  నిరంకుశ వైఖరితో,  నలుగురినీ సంప్రదించకుండా, హఠాత్తుగా 1989మొదట్లో మంత్రివర్గాన్ని రద్దుచేసి  పునర్నిర్మించారు: జానారెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, వసంత నాగేశ్వరరావు,కేఇ  కృష్ణమూర్తి, ముద్రగడ వంటివారు పార్టీ నుంచి వైదొలగి వేరుకుంపటి పెట్టారు: తెలుగు నాడు అనేపార్టీ ప్రారంభించారు. చివరికి ఎన్నికల ముందు వారంతా కాంగ్రెసు‌లో చేరారు.

1985లో జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్య , ‘పరువునష్టం బిల్లు’, పత్రికల నోరునొక్కటానికి బీహార్       నమూనాలో ప్రెస్ బిల్లు ముసాయిదా, గ్రామాల్లోనే కాక పట్టణాల్లోనూ పోలీసు రాజ్యాన్ని బలపరచ డానికి వారికి మేజిస్ట్రేట్ అధికారాల్నిసైతం కల్పించే పోలీసు బిల్లు ముసాయిదా…ఇలాటి నిర్బంధ వ్యతిరేక చైతన్యము, ఉద్యమాలు పెరగటంతో నక్సలైట్లతో చర్చలు జరుపుతామని  1989 మధ్యలో-చాలా ఆలస్యంగా- ప్రకటించారు; నిరసనోద్యమాలవల్ల కొన్ని బ్రేకులు వేసారు గానీ, అప్పటికే  ఆలస్యమై పోయింది. ప్రజాగ్రహం వల్ల ఎన్టీఆర్ తోపాటు తామూ మునిగిపోతామన్నభయ సందేహాలతో తెలుగుదేశం బీటలు వారింది. 1989 ఓటమికి ఇద్దరు అల్లుళ్ళ కంట్రోలు (వెంకటేశ్వరరావు, చంద్రబాబు)కూడా ఎలా ఒక కారణం అయిందో, రెండోసారి ఎదురుదెబ్బకి లక్ష్మీపార్వతి అలా కారణమయ్యారు. అలాకులతత్వంతో పాటు బంధు ప్రీతి బాహాటంగా పెచ్చరిల్లింది; పై అన్నిటి ఫలితంగా 1989 చివర్లో ఎన్నికల్లో తెదేపా- స్వయంగా కల్వకుర్తిలో ఎన్టీఆర్- ఓటమి; కాంగ్రెసు మళ్లీ గెలిచింది. తెదేపా పది శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిందని గురుంచుకోవాలి. 

 ఎన్టీఆర్  జీవిత విషాదాంకం  

ఎన్టీఆర్ కి 1989 మొదటి విషాదాంకం అయితే, 1995 వెన్నుపోటు రెండో  విషాదాంకం.  ఎన్టీఆర్ రాజకీయ జీవితం మలుపుతిరగటంలో లక్ష్మీపార్వతిది ప్రముఖ పాత్రే. 1991లో పరిచయం, 92లో రహస్యంగా పెళ్లి, 93లో బహిరంగ ప్రకటన. తన పెళ్లి వెనుక జాతీయ ప్రయోజనాలున్నాయని ఎన్టీఆర్ చెప్పుకున్నారు!  అది మహిళా ఉద్ధరణ కోసం అని ఆయన మద్దతు దారులు (రేణుకా చౌదరి) చెప్పారు. (అమర్నాథ్ మీనన్, ఇండియా టుడే 1993 అక్టోబర్ 15).రాజకీయాల్లో జోక్యంతో లక్ష్మీపార్వతి పాత్ర వివాదాస్పదంగా తయారై, చీలికకు దారితీసింది. 1996 జనవరిలో ఎన్టీఆర్ మరణం తర్వాత, ఆయన రాజకీయ వారసురాలిగా ఆమె సొంత పార్టీ పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు (సింహగర్జన విజయవాడ ); ఎన్టీఆర్ బొమ్మతో సింహం గుర్తుతో లక్ష్మీపార్వతి పోటీ చేశారు. తెలుగుప్రాంతంలో ఆమె జయలలిత అవుతారని కొందరు ఆశించారు.  1994లో ఎన్టీఆర్ మళ్లీ గెలిచారు అంటే ఆయనపై నమ్మకం వల్ల కాదు. ఎన్నికల్లో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు.దానికి అనేక కారణాలు ఉంటాయి.ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి అపఖ్యాతి పాలైన కాంగ్రెసు ఆయనకు ఆంధ్రుల ఆత్మగౌరవ ఆయుధాన్నిచ్చింది. వారి అవినీతిసరేసరి. ప్రజల్లో కాంగ్రెస్ వ్యతిరేకత, పార్టీ నిర్మాణం (అందులో ఆయన పాత్రపరిమితం), ధనబలం, మిత్రపక్షాలతో (ఒక దశలో ఏకకాలంలో లెఫ్టుతో, బిజెపితో) కల్సి పోటీ చేయటం (247 సీట్లలో గెలుపు) ఉపయోగపడినాయి. 1995 ఆగస్టులో చంద్రబాబు గ్రూపు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్ అవకాశవాద పధ్ధతులే 1995లో చంద్రబాబు వెన్నుపోటుకి ఆయుధాలైనాయి. టిడిపిచీలికలో 213 మందిలో 21 మందే ఎన్టీఆర్ వెంట వచ్చారు. 

తమిళనాడు అనుభవాలు – ఆంధ్రలో?

తమిళనాడు రాజకీయాలకీ ఎన్టీఆర్ ఉదంతానికీ – ఎన్నికలకు రథయాత్రలూ, రెండురూ.లకి కిలో బియ్యం (అన్నారైస్), ఎంజి రామచంద్రన్ సినిమా చరిస్మా, ‘రెండో మహిళ పాత్ర’ వంటివే కాక  చాలా పోలికలున్నాయి; తేడాలూ ఉన్నాయి.   కాంగ్రెస్ వ్యతిరేకతతో కూడిన ద్రవిడ రాజకీయాలనివదిలి, అందులో చీలికతెచ్చి, కాంగ్రెసుకి ఉపయోగపడిన పావు యంజిఆర్. కాగా ఆంధ్రలో ఎన్టీఆర్ కాంగ్రెసు వ్యతిరేకతను, కమ్యునిస్టుల ప్రజా పునాదినీ, కమ్యూనిస్టు ఓటునీ వాడుకొని గెలిచారు.  చిరంజీవి (డాక్టర్ మిత్ర వంటివారిని ముంచేసి) ప్రజారాజ్యం పార్టీని  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ముందుతరంలో ఎన్టీఆర్ ది అలాటి అవకాశవాదమే; కాంగ్రెస్ వ్యతిరేకతతో 1983 లో గెలిచిన ఎన్టీఆర్ 1984 లోనే ఆనాటి కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న ఎంజిఆర్  పార్టీకి అనుకూలంగా క్యాంపేన్ చేసి సాయం చేశారు. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారితో  మైత్రి తన విధానం అని చెప్పి,  అవకాశవాదాన్ని  తన రాజకీయ విధానంగా చేసుకున్నారు యంజిఆర్. తెదేపా అదే  దారిలో  బీజేపి కాంగ్రెసు  రెంటితో చేతులు కలిపింది.    

భారీ అవినీతి కేసుల్లో దొరికిపోయి జైలుపాలైన జయలలిత అంత్యక్రియలకు బీజేపీ నేతలు రావటమే కాక, ఆమెనువారు కీర్తించినతీరుని గుర్తుచేసుకోవాలి. జయలలిత తర్వాత జైలు పాలైన  శశికళ కూడా ఆకోవకి చెందిన వారే. మోడీ నేతృత్వంలోని బిజెపి అన్నాడీఎంకే పార్టీని, దానిలోని ముఠాలను తమిళనాడులో వాడుకున్నది. అధికార యంత్రాంగాలు, పోలీసు న్యాయవ్యవస్థలు, సిబిఐ, ఈడి ఎలా పనిచేస్తాయో చూస్తున్నాం. అలాగే ఎన్టీఆర్ లోని చీకటి కోణాలను దాచిపెట్టి అందరూ శతజయంతి జరుపుతున్నారు; భారతరత్న ఇవ్వాలంటున్నారు. ఆంధ్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ఎవరికి ఏమేరకు ఉపయోగపడుతారో చూడాలి! 


 (ఇందులో వ్యక్తీకరించిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు సంబంధంలేదు)
 


 
 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *