ఉద్రిక్తత పెంచడానికేనా నాన్సీ తైవాన్ యాత్ర

 

 

[అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన అనంతర పరిణామాలపై పరిశీలన ]

డాక్టర్ యస్. జతిన్ కుమార్

అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీకి అమెరికా మద్దతుకై ఉవ్విళ్లూరుతున్న కొందరు తైవాన్ నాయకులు 2 ఆగస్ట్ 2022న  తైపీలో  స్వాగతం పలికారు. అనేకమంది తైవాన్ ప్రజలు, సంస్థలు తమ నిరసనలు తెలిపారు. బుధవారం తిరిగి వెళుతూ తన వెనుక, ఆమె తైవాన్ లో ఒక సంక్షోభాన్ని విడిచి పెట్టి పెట్టింది.

శ్రీమతి పెలోసి, తైపీ సాంగ్‌షాన్ విమానాశ్రయానికి చేరుకున్న కొద్దిసేపటికే, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ తైవాన్ వ్యవహారాల కార్యాలయం, చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ నేషనల్ కమిటీ ఫారిన్ అఫైర్స్ కమిటీతో సహా ఐదుగురు చైనా అధికారు లు, జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ పర్యటనను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేసింది, ఇది చైనా-యుఎస్ సంబంధా ల రాజకీయ పునాదిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.”తైవాన్ స్వాతంత్ర్యం” దళాలకు అవాంఛనీయ మైన సంకేతాలు పంపుతున్నదని  అన్నారు యుఎస్ స్పీకర్ పర్యటనకు ప్రతిస్పందనగా చైనా తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను దృఢంగా కాపాడుకోవడానికి అవసరమైన అన్నిచర్యలను ఖచ్చితంగా తీసుకుంటుంది. అన్ని పరిణామా లకు, పర్యవసానాలకు  అమెరికా మరి “తైవాన్ స్వాతంత్ర్యం” వేర్పాటువాద శక్తులు తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది అని  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

శ్రీమతి పెలోసీ తైవానీ చట్టసభ్యులతో, ఆ తర్వాత తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్-వెన్ తో సమావేశమై, వారికి అమెరికా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. పెలోసీ మాట్లాడుతూ, ప్రపంచం “ప్రజాస్వామ్యం మరియు నిరంకు శత్వం మధ్య విభజించబడింది. అమెరికా ప్రజాస్వామ్యం పట్ల నిబద్దమై వుంది. అందువల్ల .తైవాన్ పట్ల మా నిబద్ధత ను వదులుకోదు. మన  శాశ్వత స్నేహానికి మేము గర్విస్తున్నాము”అని అన్నారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ స్పందిస్తూ, “ఆమె పర్యటన యొక్క స్వభావం ప్రజాస్వామ్యానికి సంబంధించినది కాదు. ఆమె చేసినది చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత లను ఉల్లంఘించడం. రెచ్చగొట్టడం” అని వ్యాఖ్యా నించారు.

ఈ సమావేశాలు ఏ గుణాత్మక మార్పులకు, ఒప్పందాలకు దారి తీయనప్పటికీ ఒక అరుదైన విజయ౦గా అభి వర్ణించబడుతున్నాయి. ఇది అమెరికా ప్రభుత్వ అధికారిక పర్యటన కాదనీ, స్పీకర్ స్వంత నిర్ణయమని ఒకవైపు, అమెరికా ప్రజాస్వామ్య పరిరక్షణా ప్రియత్వానికి, దాని నిబద్దతకీ ఈ పర్యటన నిదర్శనమని మరోవైపు  చెబుతున్నా రు. ఏది ఏమైనా ఈ పర్యటనను అమెరికా ప్రతిష్టకు ముడిపెట్టి, మొండిగా వ్యవహరిస్తూ, అమెరికా మిలటరీ శక్తుల పర్యవేక్షణలో, 20 అమెరికా యుద్ధవిమానాలు, ఫైటర్ జెట్ విమానాల రక్షణ వలయంలో దాక్కొని, అమెరికా వాయు సేనకు చెందిన ఒక విమానంలో పేలోసీ తైవాన్ చేరుకుంది. ఒక డాన్ లా, పళ్లబిగువున పూర్తి చేసిన పర్యటన ఇది. దీని  ప్రారంభ దశ ఒక దాగుడుమూతల ఆట లాగా సాగింది. తైవాన్ సందర్శన గురించిన ప్రణాళిక గాని, సందర్శన సమయం షెడ్యూల్ గురించి గాని బహిరంగ ప్రకటన లేదు. ఆమె విమానం ముందు తూర్పుగా ప్రయాణించి అకస్మాత్తుగా దారి మార్చి తైవాన్ వైపు తిరిగింది. దాని ల్యాండింగ్ చీకటిలో జరిగింది. విమానం నుండి దిగేటప్పుడు ఆమె, విమానం మెట్ల దగ్గరున్న వ్యక్తులు కనిపి౦చనంత చీకటి వుంది. మొత్తం సన్నివేశం డిటెక్టివ్-నవలలోని ఒక భాగంలా ఉంది. చైనా ఈ విమానాన్ని ఏక్షణంలో నయినా పేల్చి వేస్తుందేమోనని భయ పడుతున్నట్లు అంతా దొంగ చాటుగా జరిగింది. అదో పెద్ద విజయంగా, అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు.

చైనా ను౦డి తీవ్ర వ్యతిరేకత వున్నప్పటికీ, ఒక ప్రధాన విదేశీ శక్తి తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటోంది. అంతర్జాతీయ సంప్రదాయాలను, విదేశీ సంబంధాల న్యాయ సూత్రాలను,ముఖ్యంగా చైనా- అమెరికా దేశాల మధ్య గల సంబంధాలకు రాజకీయ పునాదిగా వున్న “ఒకే చైనా” అన్న అవగాహనకు తిలోదకాలు ఇచ్చి, తాను అంగీక రించిన అంశాన్నే అతిక్రమించి అమెరికా ప్రదర్శించిన ధూర్త ప్రవర్తన ఇది. తన ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధి కారాన్ని రక్షించు కోవటానికి చైనా కఠిన చర్యలు తీసుకోవలసిన స్థితిని కల్పించారు. ఇప్పటివరకు అంతర్గత సమస్య గా వున్న పునరేకీకరణ విషయంలో తాము దూరి అమెరికా ఒక పక్షానికి మద్దతు పలుకుతూ, వారికి ఆయుధాలు, సహకారం అందిస్తామని వాగ్దానం చేస్తూ ఉన్నత స్థాయి అధికారిక పర్యటన చేయడంతో ఈ వివాదం ఇప్పుడు చైనా ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక యుద్ధ  చర్యలకు పూనుకోవాల్సిన అవసరాన్ని కలిగించింది.

గురువారం నాడు, చైనా పెద్దఎత్తున తన సైన్య విన్యాసాలు ప్రారంభించింది. ఒకవిధంగా ఇది తైవాన్ జలసంధిని  నాలుగు రోజుల పాటు గగన మార్గాలను, జలమార్గాలను సమర్థవంతంగా మూసివేస్తుంది. ఫలితంగా  తైవాన్ లోని టావోయువాన్ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం ఒక్కరోజే 51 అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు  తెలిపింది. ఇప్పుడు లైవ్-ఫైర్ సైనిక విన్యాసాలను ప్రారంభించడానికి చైనా సిద్ధమయ్యింది. తైవాన్ ద్వీపాన్ని సముద్ర, ఆకాశ మార్గాలలో  చుట్టుముట్టగల వ్యూహాన్ని ప్రదర్శిస్తోంది.  తైవాన్ ను దిగ్బంధనం చేయటమే కాక అక్కడి సముద్ర మార్గాలన్నిటిలో సరుకుల రవాణాను నిలిపి వేయగలుగుతోంది. అది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావి తం చేస్తుంది. తైవాన్ తీరం నుండి కేవలం 10 మైళ్ళ దూరంలో క్షిపణులను వదిలే విన్యాసాలు చూపిస్తోంది. చైనా తైవాన్ కు సహజ ఇసుక ఎగుమతులను నిలిపివేసింది. ద్వీపం నుండి కొన్ని రకాల పండ్లు, చేపల దిగుమతు లను నిలిపివేసింది.  చైనా ప్రతిచర్య నాటకీయం కాదని, వారిది ఒకేసారి విరుచుకుపడి పని  పూర్తి చేసుకోవటం కాదని అర్థ మవుతోంది. ఇది తైవాన్ లోని తన సహోదర ప్రజలపై సమరం కాదని, స్వాతంత్ర్యం పేరుతో సామ్రాజ్య వాద కుట్రలకు దళారులుగా మారిన విచ్చిన్న నాయకులను తొలగించి చైనా పునరేకీకరణను త్వరితం చేసే వ్యూహం అనుసరిస్తున్నది ప్రధాన భూభాగంలోని చైనా ప్రభుత్వం. అమెరికా చర్య, చైనా ప్రతిచర్యల ను ప్రపంచం భయాందోళ నలతోనూ, ఉత్కంఠ తోనూ పరిశీలిస్తున్నది. అమెరికా యుద్ధోన్మాదులు ఉక్రైన్ నుండి తైవాన్ కు యుద్ధరంగాన్ని మార్చుతున్నారా అని అనుమానిస్తున్నారు. తన భూభాగం లో ప్రవేశించిన అమెరికా యుద్ధవిమానాలను చైనా ఎందుకు కూల్చివేయలేదా అని ఆవేశపడేవారు కొందరు, ఆవేశ పడకుండా తన వ్యూహా లను మెల్లగా అమలు చేస్తూ ప్రత్యక్ష యుద్ధాన్ని నివారిస్తున్నదని భావించేవారు వారు కొందరు.

అనేక యూరప్ దేశాలు తైవాన్ స్వతంత్రత పేరిట చైనా వ్యతిరేకతను స్వీకరించటానికి సిద్ధంగా లేవు. అనేక దశాబ్దా లుగా వారు  తైవాన్ ను చైనాలో అంతర్భాగంగా గుర్తించారు. ఆ దేశాలు ఇప్పుడు ఆ వైఖరిని మార్చు కోవడానికి సిద్ధంగా లేవు. అందువల్ల అవి  ప్రస్తుతం ఈ వివాదానికి దూరంగా ఉన్నాయి. యుఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసి  తైవాన్‌కు వెళ్లడాన్నిరష్యా “పూర్తిగా రెచ్చగొట్టే” చర్యగా పరిగణిస్తోంది. “మేము దీనిని గమనిస్తున్నాము , ఇది ప్రపంచంలోని అన్ని దేశాలచే రికార్డ్ చేయబడుతోంది. మేము చైనాకు సంపూర్ణ సంఘీభావాన్ని తెలియ జేస్తు న్నాము. ఈ సమస్యలోగల సున్నితత్వం అర్థమవుతోంది. ఇది సమర్ధనీయ మైనది. దీనిని గౌరవించే బదులు  అమెరికా ఘర్షణ మార్గాన్ని ఎంచుకుంటున్నది. ఇది మంచిది కాదు, వాషింగ్టన్ నిర్ణయం విచారకరమైనది” అని క్రెమ్లిన్ ప్రతినిధి అన్నారు,.

ఇక తైవాన్ ద్వీపంలో పౌర సమూహాలు, రాజకీయ నాయకులు, వ్యాపార మరియు పరిశ్రమల ప్రతినిధులు ఆగస్ట్ 2 న  యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటనకు వ్యతిరేకంగా చైనా క్షిపణి డ్రిల్ జరుగుతుండగా తమ నిరసన  కూడా తెలిపారు. తైపీకి చెందిన చైనీస్ పేట్రియాటిక్ కాన్ సెంట్రిక్ అసోసియేషన్, పెలోసి బస చేసే గ్రాండ్ హయత్ హోటల్ కు సమీపం లో ఉన్న స్థలంలో నిరసన ప్రదర్శన చేసింది. సుమారు 1,000 మంది వరకు పాల్గొన్నారు. గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గుజిజున్ గ్లోబల్ టైమ్స్ తో మాట్లాడుతూ, “తైవాన్ లో పెలోసీ ఎక్కడ కనిపించినా నిరసనలు బహిష్కరణలు ఆమె వెంట పడతాయి” అని అన్నారు. ర్యాలీలో పాల్గొన్న తైవాన్ నివాసి జాంగ్ జియుయే, యు. ఎస్  రాజకీయ నాయకులు నిరంతరం తైవాన్ జలసంధి వద్ద ఉద్రిక్తతలను సృష్టిస్తారని, వారు  తైవాన్ ను తమ ఎటిఎమ్ గా ఉపయోగిస్తు న్నారని చెప్పారు.”తైవాన్ జలసంధికి రెండు వైపులా ఒకే కుటుంబం వున్నది. యాంకీల [అమెరికన్లు]  జోక్యం లేకుండా మనం కూర్చుని మాట్లాడుకోవచ్చు. ముందస్తు పునరేకీకరణను మేము హృదయ పూర్వకంగా ఆశిస్తున్నాము అని అన్నారు.  పునరేకీకరణ అనుకూల న్యూ పార్టీ చైర్మన్, వు చెర్ంగ్-డీన్ మాట్లాడు తూ, పెలోసి పర్యటనను పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఆ సందర్శన తైవాన్ ను మంటల్లోకి నెట్టి ద్వీపాన్ని యుద్ధ భూమి గా మారుస్తుందని అన్నారు.

పెలోసి పర్యటన సందర్భంగా తైవాన్ లోని అమెరికన్ ఇన్ స్టిట్యూట్ (AIT), సాంగ్ షాన్ విమానాశ్రయం,ఆవిడ బస చేసిన  గ్రాండ్ హయత్ హోటల్ వద్ద అనేక సమూహాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి “అమెరికన్ మంత్రగత్తె, తైవాన్( చైనా)ను విడిచి పెట్టు” “నాన్సీ పెలోసీ గో బాక్ ” వంటి నినాదాలతో వందలాది మంది ప్రజలు AITముందు  గుమి గూడారు.  తైవాన్ “మూడవ బుధవారం క్లబ్” యొక్క డైరెక్టర్ లిన్ పోర్-ఫాంగ్, తైవాన్ యుద్ధంతో సహా వివా దాలలో పాల్గొనకుండా ఉండాలంటే “పెలోసి సందర్శనను ధైర్యంగా తిరస్కరించాలి” అన్నారు. “తైవాన్  జలసంధి, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి,  స్థిరత్వం తైవాన్ ఆర్థిక అభివృద్ధికి మూలస్తంభం” అని తైవాన్ “చాంబర్ ఆఫ్ కామర్స్” ఛైర్మన్ హ్సు షు-పో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన వల్ల తైవాన్‌కు ఎలాంటి స్పష్టమైన ప్రయోజ నం లేదని ఆయన అన్నారు. “పెలోసి  తైవాన్ కు మద్దతు ఇవ్వడం గురించి మాట్లాడు తున్నారు , కానీ నిజానికి ఆమె ఒక విపత్తుకు సృష్టికర్త. ఆమె సందర్శన అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించవచ్చు కనుక “పెలోసీ ని ద్వీపం స్వాగతించలేదని బహిరంగంగా ప్రకటించాలని” అధ్యక్షురాలు త్సాయ్ ను ఆయన కోరారు
వేర్పాటువాద DPP  బాహ్య శక్తులతో కుమ్మక్కైంది.  పెలోసీ ని తైవాన్ కు ఆహ్వానించాలని పట్టుబట్టింది, ఇది చాలా ప్రమాదకరమైనది మరియు తీవ్ర పరిణామాలను రేకెత్తిస్తుంది. అయితే మంగళవారం DPP అధికారులు పెలోసి పర్యటనను రద్దు చేయాలని భావించారని,కానీ పెలోసి గట్టిగా పట్టుబట్టారని వార్తలు వచ్చాయి. “తైవాన్ అమెరికాకు బంటు మాత్రమే. దానికి  అమెరికా  ప్రతిపాదనలు ఆచరించటం మినహా అంగీకరించే లేదా తిరస్కరించే హక్కు లేదని మరోసారి రుజువు అయ్యింది” అని తైవాన్ కు చెందిన మీడియా చైనా టైమ్స్ రాసింది. “ఈ ద్వీపం ఒక  చదరంగంగా మారింది, దానిపై చైనా ప్రధాన భూభాగం- యుఎస్ మధ్య ఘర్షణ, సంఘర్షణ సంభవిస్తుంది, అయితే, తైవాన్ పర్యవసానాలను భరించవలసి ఉంటుంద”ని చాంగ్ చెప్పారు.

PLA యొక్క భారీ సైనిక, క్షిపణి కసరత్తులు: పేలోసీ పర్యటన పర్యవసానాలను జిన్హువాతో సహా చైనా మీడియా నివేదికలు ఇలా పేర్కొన్నాయి: తన రెచ్చగొట్టే పర్యటన కోసం పెలోసి తైవాన్ లో అడుగుపెట్టిన రాత్రి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA), తైవాన్ ద్వీపం చుట్టూ భారీ సైనిక కసరత్తులు ప్రారంభించింది, ఇందులో సుదూర లైవ్ ఫైర్ కూడా ఉంది. తైవాన్ జలసంధిలో డ్రిల్, తూర్పు న లైవ్ ఫైర్ కన్వెన్షనల్ మిస్సైల్ డ్రిల్ వున్నాయి. సందర్శి స్తున్న యుఎస్ రాజకీయవేత్త మాత్రమే చైనాలక్ష్యం కాద ని, వేర్పాటువాద అధికారులకు వ్యతిరేకంగా నిలబడుతోం దని విశ్లేషకులు చెప్పారు. పునరేకీకరణ ప్రక్రియను నిర్దిష్టంగా, వేగవంతం చేయడం చైనావారి లక్ష్యం. తైవాన్ చుట్టూ ఉన్న ఆరు పెద్ద సముద్ర ప్రాంతాలు, గగన తలంలో ఈ సైనిక కసరత్తులు జరుగుతున్నాయి. మంగళవారం సాయం త్రం  పెలోసీ విమానం తైపీలో దిగిన వెంటనే PLA ఈస్టర్న్ థియేటర్ కమాండ్ తైవాన్ ద్వీపం చుట్టూ సంయుక్త సైనిక కార్యకలాపాల శ్రేణిని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.తైవాన్ ద్వీపానికి ఉత్తరం, నైరుతి మరియు ఆగ్నేయం  లో ఉమ్మడి ప్రదేశాలలో నావికా బలమూ, వాయు సైన్యమూ విన్యాసాలు జరుపుతాయి, తైవాన్ జలసంధిలో దీర్ఘ-శ్రేణి లైవ్-ఫైర్ షూటింగ్ నిర్వహించ బడుతోంది. సాంప్రదాయ క్షిపణి పరీక్ష ప్రయోగాలు జరుగుతున్నయి అని కల్నల్  షి యి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర, నైరుతి,ఆగ్నేయంలోని విన్యాసాలు, యుద్ధ విమానాలు యుద్ధ నౌకల సామర్థ్యాలను, వాయు మార్గాల పై ఆధిపత్యాన్ని, సముద్ర మార్గాలపై నియంత్రణను పొందటానికి అవకాశం కల్పిస్తాయి. క్షిపణులను ప్రధాన భూభాగం నుండి ప్రయోగిస్తే, అవి తైవాన్ ద్వీపం మీదుగా ఎగురుతాయని విశ్లేషకు లు తెలిపారు. ద్వీపానికి తూర్పున ప్రయాణిస్తున్న PLA నేవీ నౌకల నుండి క్షిపణులను ప్రయోగించే అవకాశం కూడా ఉంది, తూర్పు నుండి పునరేకీకరణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే బాహ్య శక్తులను ఈ చర్య లక్ష్యంగా చేసుకుంటుందని సైనిక నిపుణులు తెలిపారు. “తైవాన్ స్వాతంత్ర్యం”అనే వేర్పాటువాద శక్తుల ప్రయత్నాని కిది తీవ్రమైన హెచ్చరిక అని చెప్పారు. PLA ఈస్టర్న్ థియేటర్ కమాండ్ యొక్క డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గు ఝాంగ్ మాట్లాడుతూ ఈ కసరత్తులో ఉమ్మడి దిగ్బంధనం, సముద్రపు దాడి, భూమి దాడి, వైమానిక దాడితో ఆధిపత్యాన్ని సాధించటం జరుగుతుందన్నారు. ద్వీపాన్ని తిరిగి కలపడానికి అవసరమైతే బలప్రయోగం చేయడానికి  PLAకి ఈ  కసరత్తులు రిహార్సల్స్ అని నిపుణులు చెప్పారు. పెలోసి తైపీ సందర్శనకు ప్రతిస్పందనగా చైనా “లక్ష్యంగా వరుస సైనిక కార్యకలాపాలను” ప్రకటించిన తర్వాత, తైవాన్ రక్షణ అధికారులు బీజింగ్, ద్వీపం యొక్క ప్రాదేశిక జలాలు, గగనతలంపై “దాడికి” ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

పునరేకీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి చైనాముందు  సైనిక కసరత్తులు కాక అనేక ఇతర మార్గాలు  ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. PLA మునుపటి తైవాన్ జలసంధి సంక్షోభంలో చేసినట్లుగా, జాతీయ పునరేకీ కరణ కోసం కొత్త చట్టాన్ని ముందుకు తీసుకురావడం, ద్వీపం యొక్క “గగనతలం” “జల ప్రాంతాల”లోకి సైనిక విమానాలను, నౌకలను పంపడం వంటి చర్యలు వుండవచ్చు అని భావిస్తున్నారు.
కొత్త స్థితి: ఈ సమయంలో చైనా-యుఎస్ ల మధ్య పోరాటం, చైనా దేశ గౌరవమూ, నిర్దిష్ట వ్యూహాత్మక ప్రయోజ నాలకు సంబంధించినది, అయితే రెండోది చాలా ముఖ్యమైనది, కాబట్టి చైనా పెలోసి తో, ముఖాముఖీ, నువ్వా నేనా అన్నరీతిలో ఎదుర్కోదు, అని  చైనా విశ్లేషకులు భావిస్తున్నారు, వారికి ప్రాంతం యొక్క మొత్తం పరిస్థితి చాలా ముఖ్యమైనది. విలువైనది. చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో రీసెర్చ్ ఫెలో అయిన లూ జియాంగ్, “చైనా ప్రతిచర్య కేవలం క్షణిక చర్య మాత్రమే కాదు, తైవాన్ ప్రజల మొత్తం భద్రతను పరిగణిస్తుంది. చైనా హెచ్చరికను పూర్తిగా విస్మరించి పెలోసి తైపీ రావడంతో, తైవాన్ జలసంధి పరిస్థితి యొక్క యథాతథ స్థితి విచ్ఛిన్నమైందని,  చైనా దానిని కొత్త స్థితికి చేరుస్తుందని నొక్కిచెప్పారు.

వ్యూహాత్మక సహనం: 2019లో కేంద్ర ప్రభుత్వ అనుసంధాన కార్యాలయంపై దాడి చేసినప్పుడు చైనా హాంకాంగ్ కల్లోలాన్ని బలవంతంగా అణిచివేస్తుందని చాలా మంది ఊహించారు, కానీ చైనా అలా చేయలేదు. తన ” వ్యూహా త్మక సహనం”తో  చివరికి హాంకాంగ్ లో తన పాలనను పటిష్టం చేసేందుకు విజయాన్నిసాధించింది. దీని ప్రాముఖ్యత చైనా ప్రధాన నాయకత్వానికి బాగాతెలుసు. తైవాన్ జలసంధిలో  పరిస్థితిని సమగ్రంగా మార్చడానికి యు.ఎస్  జోక్యం చేసుకున్నది కాబట్టి ఈసారి, చైనా మళ్లీ యుఎస్ కు గుణపాఠం నేర్పుతుంది” అని అంతర్జాతీయ సంబంధాలపై బీజింగ్ కు చెందిన సీనియర్ నిపుణుడు చెప్పారు. తైవాన్‌పై తన సార్వభౌమాధికారాన్ని బలపరిచేం దుకు చైనా ఈ ఘటనను ఉపయోగించుకోనుందని హాంకాంగ్‌లోని సిటీ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర ప్రొఫెసర్ వాంగ్ జియాం గ్యు అన్నారు. యు.ఎస్ లేక ఇతర పాశ్చాత్య దేశాలు చేసే కవ్వింపులను సమర్థవంతంగా నియం త్రించడానికి చైనా తన కఠినమైన సంకేతాన్ని పంపగలిగితే, భవిష్యత్తులో పరిస్థితి చైనా వైపు అనుకూలంగా ఉంటుం ద ని వాంగ్ చెప్పారు.

చైనా సార్వభౌమాధికారంపై అమెరికా చొరబాట్లను ఖండిస్తూ చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యీ బుధవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.  చైనా  అభిప్రాయాలను అభ్యంతరాలను పట్టించుకోకుండా పెలోసి నిర్మొహమాటంగా ద్వీపాన్ని సందర్శించారు, ఇది “ఒకే చైనా” సూత్రాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే, చైనా సార్వభౌమాధికారానికి ఇది హానికరమైన ఉల్లంఘన” అని వాంగ్ చెప్పారు. ఇలా రెచ్చగొట్టడం  చైనా ప్రజలలో  తీవ్ర ఆగ్రహాన్ని, అంతర్జాతీయ సమాజం నుండి విస్తృత వ్యతిరేకతను రేకెత్తించింది. యు.ఎస్  తో సంబంధాలు,  తైవాన్ జలసంధిలో శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి ఇది “అతిపెద్ద విధ్వంసకం” గా మారిందని వాంగ్ చెప్పారు. చైనా పునరే కీకరణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం, చైనా అభివృద్ధిని విధ్వంసం చేయడం, భౌగోళిక రాజకీయ పరిస్థితిని తారు మారు చేయడం, తప్పు-ఒప్పులను గందరగోళ పరచడం ఆపాలని వాంగ్ అమెరికాను కోరారు. “ తైవాన్ చైనాలో భాగం, పునరేకీకరణ అనేది అనివార్యమైన చారిత్రక ధోరణి“ అని వాంగ్ పేర్కొన్నారు. “తైవాన్ స్వాతంత్ర్యం”  పేర  వేర్పాటువాద శక్తులు లేదా బాహ్య శక్తులు జోక్యం చేసుకోవడానికి మేము ఎప్పటికీ  చోటు ఇవ్వము” అన్నారు  యుఎస్ తన ప్రాంతీయ వ్యూహంలోకి  తైవాన్ ను ప్రవేశపెట్టింది. ప్రాంతీయ అభివృద్ధి, ఆసియా-పసిఫిక్ ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా పని చేసే ఘర్షణను రెచ్చగొట్టింది, ఇది చాలా ప్రమాదకరమైనది, తెలివితక్కువది” అని వాంగ్ పేర్కొన్నారు.

‘ఒకే చైనా’ సూత్రం అంతర్జాతీయ సంబంధాలలో ప్రాథమిక ప్రమాణంగా మారింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ క్రమంలో అది అంతర్భాగంగా ఉంది. యుఎస్ చేయవలసింది ఏమిటంటే “యుఎన్ చార్టర్ సూత్రాలను ఉల్లంఘించడం తక్షణమే మానేయడం. తైవాన్ కార్డు తో ఆడటం మూసివేయడం, ఆసియా-పసిఫిక్ కు అంతరా యం కలిగించడాన్ని తక్షణమే ఆపివేయడం”  అని  చైనా అధికారి తెలిపారు. “తైవాన్ జలసంధిలో శాంతి- స్థిరత్వా ల కి ప్రాథమిక ఆధారం ‘ఒకే చైనా’ సూత్రం. శాంతియుత చైనా-యు.ఎస్ సంబంధాలకు ప్రాతిపదిక చైనా-యు.ఎస్. చేసిన ఉమ్మడి ప్రకటనలు. “తైవాన్ స్వాతంత్ర్యం” కోసం యుఎస్ ఎవరితో నయినా కుమ్మక్కై చేసే ఏ ప్రయత్నాలూ ఫలించవు. చైనాను అరికట్టడానికి తైవాన్ ద్వీపాన్ని ఉపయోగించడం విఫలమవుతుంది“ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్చెప్పారు.
పెలోసి సందర్శన స్వభావం చాలా దుర్మార్గంగా వుంది దీని పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయి. చైనా పక్షం చూస్తూ ఊరుకోదు. అమెరికా తన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. “మేము ఏమి భావిస్తున్నామో అదే అంటున్నాము”  అని చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను విజ్ఞతతో  అర్ధం చేసుకోవాలి

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *