*మృతదేహాన్ని మహబూబ్నగర్ మెడికల్ కళాశాలకు అప్పగించేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం
అచ్చంపేట: పాలమూరు ప్రాంతం ఒక ప్రజాస్వామిక ఉద్యమ నేతను కోల్పోయింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల కేంద్రానికి చెందిన విశ్రాంత మండల విద్యాధికారి, జిహెచ్ఎం బాల్ జంగయ్య మృతి చెందారు.
బాల్ జంగయ్య అనారోగ్యంతో బాధపడుతూ అచ్చంపేట పట్టణంలోని ఆదర్శనగర్లో తన స్వగృహం నందు సాయంత్రం 5:30 గంటలకు తుది శ్వాస విడిచారు.
తన జీవిత గమ్యంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని పీడిత వర్గాలు, పేదల కోసం తన రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా కాంపెయిన్ చేశారు.
ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించి విరమణ పొందిన బాల్ జంగయ్య సార్ మరణించడం చాలా బాధాకరమని మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాలజంగయ్య అచ్చంపేట ప్రాంత ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత ఈ ప్రాంత ఉద్యమాలకు పెద్దదిక్కు నాటి ఏ పి టి ఎఫ్ నుండి మొదలుకొని నేడు పాలమూరు అధ్యయన వేదిక వరకు ఎన్నో ఉద్యమాలను చేసిన గొప్ప వ్యక్తి. అసమానతలు మనిషిని మనిషిగా చూడనటువంటి సమాజంలో మనుషులందరూ సమానమే అని నినదించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కుల నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపకులలో ఒకరుగా ఉండినారు.
జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎదిరించి అందరికీ సమానమైన హక్కులు ఉండాలని కాంక్షించిన ఉద్యమకారుడు మన బాల్ జంగయ్య సార్.
నల్లమల్ల ఉద్యమ కెరటం నింగికెసి చుక్కల్లో కలిసి సూర్యుడే ఉదయిస్తాడని ప్రజాస్వామ్య వాది బాటలో పయనించడం ఆయనకు ఘనమైన నివాళి అని డెమొక్రటిక్ ఫీచర్స్ ఫెడరేషన్ నివాళులు అర్పిస్తుంది.
*బాల్ జంగయ్య మృతి పట్ల ఉద్యమ సంఘాల నేతలు, ప్రజాస్వామిక వాదులు, కుల సంఘాల నేతలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చి మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. బాల్ జంగయ్య లాంటి అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి ప్రశ్నించే ఉద్యమ నేతగా ఎదిగి మృతి చెందడం నల్లమల్ల ప్రాంతం, ఉమ్మడి జిల్లాకు తీరని లోటని పలువురు విచారం వ్యక్తం చేశారు. అనేక ఉద్యమాలలో ప్రొఫెసర్ బాలగోపాల్, కన్నాబిరాన్, హరగోపాల్, ఏంటిఖాన్, వరవర రావు, రాఘవచారి అనేక మేధావి వర్గాలు, ఉద్యమ ప్రముఖులతో కలిసి పని చేశారు. బాల జంగయ్య సార్ తాను చనిపోయే వరకు కూడా ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ గా కొనసాగుతున్నారు. బాల జంగయ్య తన చేతి నుండి దళితులు మానవ హక్కులు అనే పరిశోధన గ్రంథాన్ని ముద్రించారు. ఈ పుస్తకానికి రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కరణ జరిగింది మంచి గుర్తింపు, చర్చ జరిగింది. అనేక పత్రికలు ఇతర కవుల పుస్తకాలకు వ్యాసాలు, ముందుమాట రాశారు. తన చేతి నుండి అనేక అద్భుతమైన చిత్రాలకు జీవం పోస్తూ చిత్రకారుడుగా కూడా అనేక ఉద్యమ బ్యానర్లు, కరపత్రాలకు జీవం పోశారు. సంబంధించిన అనేక చిత్రాలను వేసి అబ్బురపరిచేవారు.* *ఉద్యమ సమయాల్లో అన్ని పాత్రలు తానై వ్యవహరించి ప్రోత్సహించే వారని ఆయనతో కలిసి పనిచేసిన ఉద్యమకారులు, మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. బాల్ జంగయ్య తండ్రి బాలయ్య కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆయన మృతదేహాన్ని మెడికల్ విద్యార్థుల పరిశోధన కోసం మహబూబ్నగర్ మెడికల్ కళాశాలకు అప్పగించారు. అదే బాటలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం తన మృతదేహాన్ని మహబూబ్నగర్ మెడికల్ కళాశాలకు అప్పగించాలని బాల్ జంగయ్య మృతి చెందక ముందు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.