ఆ కోర్టు అంత చెవిటి, గుడ్డి, మూగదా ?

– మూలం: సుమంత బెనర్జీ

సంక్షిప్త అనువాదం: కె.వేణు*

అత్యున్నత న్యాయస్థానంలోని గౌరవనీయులైన న్యాయమూర్తులు రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారం అన్యాయమైన చట్టాల బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం అందించవలసి ఉన్నది. “న్యాయం చెప్పటంలో జాప్యం అంటే న్యాయాన్ని నిరాకరించటమే” అనే సూక్తి వారికి గుర్తుందా? ఏదేమైనా గత కొన్ని సంవత్సరాలలో సుప్రీంకోర్టు బెంచ్‌ల పనితీరును గమనిస్తే “న్యాయం ఆలస్యమే” అని అభివర్ణించవచ్చు.

కళ్లకు గంతలు, చేతిలో ఒక తూకం త్రాసు పట్టుకుని ఉన్న స్త్రీ సుపరిచితమైన ప్రతిమ న్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది- కొన్ని కోర్టుల ఆవరణలో ఈ విగ్రహం తరచుగా కనిపిస్తుంది. కళ్లకు గంతలు కట్టడం అనేది న్యాయమూర్తు ల నిష్పాక్షికతకు ప్రతీక అని వారు తమ తీర్పులను వెలువరిస్తున్నప్పుడు, నిందితుల సంపద, అధికారం లేదా ఇతర ప్రాబల్యాలను చూడకూడదని, వివాదంలో ఇరుపక్షాలను సమానంగా చూడాలని, వినాలని న్యాయమైన తీర్పు ఇవ్వడానికి వారి వాదనలను న్యాయమైన రీతిలో తూకం వేయాలని త్రాసు సూచిస్తున్నాయి.

విచారకరం ఏమిటంటే, చాలామంది భారతీయ న్యాయమూర్తులు, దిగువ స్థాయి కోర్టుల నుండి, రాష్ట్ర హైకోర్టుల వరకు, చివరకు అత్యున్నత స్థాయి వరకు, న్యాయ దేవతా విగ్రహానికి ద్రోహం చేస్తున్నారు. చాలా తరచుగా, న్యాయమూర్తులు కళ్ల గంతలు తీసి అన్యాయానికి గురైన వారి కేసులలో వ్యక్తులను చూసి, శక్తిమంతులకు అనుకూలంగా తూకం వేస్తున్నారు. అంతే కాకుండా, మానవ హక్కుల కార్యకర్తల అభ్యర్ధనలను వినేటప్పుడు వారు చెవిటివారిగా, ఈ అభ్యర్ధన లపై తీర్పులను వాయిదా వేయడం లేక నిలిపి వేయడం ద్వారా మూగవారిగా వ్యవహరిస్తున్నారు.

భారతీయ న్యాయవ్యవస్థ లో గజిబిజిగా సాగే చిక్కుల మార్గంలో సుదీర్ఘ ప్రయాణం తర్వాత, పౌరులు న్యాయం కోసం తమ చివరి గమ్య స్థానంగా సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారు. దానిని చేరుకున్న తర్వాత కూడా, వారు తరచూ న్యాయ నిరాకరణకు గురవుతున్నారు.
ప్రజా ఫిర్యాదులను అవమానకరంగా, వారికి వ్యతిరేకంగా భావించి కొట్టిపారేయడం పై సుప్రీంకోర్టులోని గౌరవ ప్రదమైన న్యాయమూర్తులలో కొందరు నిజంగానే ‘ఆరోపణలు’ ఎదుర్కోవాల్సి వుంది [ఇది జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యాన మే]. ఈ ఫిర్యాదులలో చాలా వరకు పౌరుల హక్కులను ప్రభావితం చేసే ప్రధాన సమస్యలపై న్యాయం అందించడంలో వారు చేస్తున్న విపరీతమైన జాప్యానికి సంబంధించినవి. 2019 నుండి, పౌరుల రాజ్యాంగ హక్కుల ను ఉల్లంఘించే UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) అమలును సవాలు చేస్తూ వ్యక్తులు, మానవ హక్కుల సంఘాలు సమర్పించిన అనేక పిటిషన్లపై ఈ సాచివేత వుంది. రిటైరయిన సివిల్ ఉన్నతాధికార ఉద్యోగుల బృందం కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన చేసింది.

క్రూరమైన ఈ చట్టం కింద వందలాది మంది అరెస్టయ్యి జైళ్ల లో మగ్గుతున్నారు. ఇప్పటి వరకు వారి అభ్యర్థనలపై సుప్రీంకోర్టు నోరు మెదపటం లేదు.
మరో ఉదాహరణ తీసుకుంటే, జమ్మూ కాశ్మీర్‌ కున్న రాజ్యాంగ హోదాను మార్చాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ వచ్చిన ఒక వాదనను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుందని ఆగస్టు 28, 2019న సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. మార్చి 2, 2020న అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ఏ బాబ్డే నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ విషయం లిస్ట్ చేయబడింది. రెండేళ్లు గడిచినా, ఇంకా న్యాయమూర్తుల అభిప్రాయం తెలియలేదు. ఇంతలో, కాశ్మీర్ లోయలో(అక్కడి నివాసితులకు కొన్ని రక్షణ హక్కులను అందించిన) ఆర్టికల్ 370 ని రద్దు చేయాలనే కేంద్రం నిర్ణయం ప్రజలలో అశాంతిని సృష్టించింది. ఇది మరో హింసాత్మక విస్ఫోటనానికి దారి తీయవచ్చని అనిపించింది.

డిసెంబర్ 11, 2019 నాటి పౌరసత్వ (సవరణ) చట్టంపై కేసు మరో ఉదాహరణ. ముస్లింల పై వివక్ష విషయంగా అనేక మంది వ్యక్తులు, పౌర సమూహాలు ఈ చట్టాన్ని సవాలు చేశాయి. దీని రాజ్యాంగ బద్ధత ను ప్రశ్నిస్తూ దాదాపు 143 అభ్యర్థనలు సుప్రీంకోర్టుకు సమర్పించబడ్డాయి. ఆ పిటిషన్లపై ఇప్పటి వరకు సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి స్పందన లేదు.

గత రెండేళ్లుగా సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ లన్నింటి విషయంలో కిమ్మనకుండా కూర్చొని వుంది. అంతే కాదు, ఇంతే ముఖ్యమైన అనేక ఇతర పిటిషన్లు కూడా అనేకం పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటిలో 2017లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సవాలు చేస్తూ, సిపిఐ(ఎమ్), ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం” వంటి పౌర హక్కుల సంఘాలు దాఖలు చేసిన ఒక పిటిషన్‌ ఉంది- ఈ పధకాన్ని “ఏవిధమైన తనిఖీలు లేని నిగూఢమైన నిధుల వ్యవస్థ” అని వారు ఆరోపించారు.”నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణకు అనుసరించాల్సిన విధి విధానాలకు సంబంధించిన ఈ అత్యవసర అంశం” పై కూడా సుప్రీంకోర్టు ఇప్పటికీ నోరు తెరవలేదు.

షాహీన్ బాగ్‌లో మే 9, 13 తేదీల్లో దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ తలపెట్టిన భూఆక్రమణ వ్యతిరేక చర్యలను సవాలు చేస్తూ సిపిఐ(ఎమ్) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఉన్నత న్యాయస్థానం తిరస్కరిం చింది. తద్వారా, సాధారణ పౌరులకు ఆవాసం కల్పించే ప్రాథమిక హక్కులకు సంబంధించిన అభ్యర్ధనలను పరిశీలిం చడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయమూర్తులు పిటిషనర్‌ను హెచ్చరిస్తూ ఇలా “రాజకీయ పార్టీ తరపున రావద్దు” అన్నారు. ఎంత విచిత్రమైన వాదన! పౌరుల సమస్యలపై పోరాడి న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు రాజకీయ పార్టీకి లేదని దానర్థమా ?

మెజారిటీ మత-రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన పిటిషనర్ల పట్ల అసాధారణ అనుకూలత – సుప్రీంకోర్టు యొక్క మరొక పార్శ్వం. సుప్రీంకోర్టు తన తీర్పులను ప్రకటించడంలో జాప్యం చేయడం, పౌర హక్కులకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించడానికి నిరాకరించడం వంటి పైన పేర్కొన్న కేసులకు భిన్నంగా, దాని గౌరవనీయ న్యాయమూర్తులు హిందూ మతతత్వ సమూహాలు, సంఘాలు లేదా వాటి అనుకూల పిటిషనర్ల నుండి అభ్యర్ధనల ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వారికి వెను వెంటనే బెయిల్ మంజూరు చేసే ఉదాహరణలు ఉన్నాయి. ధ్వంసం చేసిన బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిరాన్ని నిర్మిస్తామని పాలక బిజెపి పార్టీ మద్దతుతో హిందూ మత సమూహాలు చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు నవంబర్ 9, 2019 నాటి తీర్పు ఇలాటి సానుకూల వైఖరికి అత్యుత్తమ ఉదాహరణ. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, బాబ్రీ మసీదు విధ్వంసాన్ని విమర్శిస్తూనే, దానిని ధ్వంసం చేసిన విధ్వంసకారులకు ఆ స్థలంలో రామమందిరాన్ని నిర్మించే హక్కును కల్పించారు.

మరో మాటలో చెప్పాలంటే, అధికార బిజెపిచే ప్రోత్సహించబడిన ఈ హిందూ మత సమూహాలు చేసిన నేరాల పట్ల న్యాయమూర్తులు మెతకగా ఉంటారు, వారి అభ్యర్ధనలను తక్షణమే ఆమోదించి, వారికి అనుకూలంగా తీర్పులను మంజూరు చేస్తారు. ఈ విధానానికి రామమందిరం తీర్పు పెద్ద ఊతమిచ్చి, మరింతమంది న్యాయమూర్తులలో ఈ వైఖరిని బలీయం చేస్తున్నది.

నేరస్థుల పట్ల ఉదాసీనతకు ఉదాహరణగా చెప్పాలంటే, మే 17, 2022న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం జితేంద్ర నారాయణ్ త్యాగికి బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 2021లో హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ (హిందూ మత సమూహాలచే నిర్వహించబడింది)లో ముస్లిం లకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేశాడని ఈయన పై ఆరోపణ వుంది. అయినప్పటికి న్యాయమూర్తులు అతనికి వైద్య పరమైన కారణాలతో బెయిల్ మంజూరు చేశారు-అతను ఏ వ్యాధులతో బాధ పడుతున్నాడో దేనికి అతనికి అత్యవసర చికిత్స అవసరమో ఎక్కడా పేర్కొనలేదు.

ముస్లిం వ్యతిరేక ద్వేషంతో ఉన్న ఈ హిందుత్వ ఛాంపియన్‌కు ఇచ్చిన ఈ ఉపశమనానికి పూర్తి విరుద్ధంగా, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబా పట్ల న్యాయవ్యవస్థ పూర్తి గుడ్డిదిగా వ్యవహరించింది. వైద్య పరంగా తొంభై శాతం శారీరక వైకల్యం ఉన్న వ్యక్తిగా ధృవీకరించబడినప్పటికీ, చక్రాల కుర్చీలో కొట్టుమిట్టాడుతున్న ప్పటికీ- గత ఐదేళ్లుగా ఆయన నాగపూర్‌ సెంట్రల్ జైలులో ఉన్నాడు. పౌర హక్కుల కార్యకర్తగా, పేదలకు అన్యాయం జరిగిన కేసులను పట్టించుకుని వారి పక్షాన నిలవడమే అతను చేసిన తప్పు.

మావోయిస్టులతో సంబంధాలున్నా యన్న ఆరోపణలపై 2014లో తొలిసారి అరెస్టయ్యాడు. 2016లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ అతనికి బెయిలు మంజూరు చేసింది. కానీ 2017లో అతన్ని మళ్లీ అరెస్టు చేసి, జీవిత ఖైదు విధించారు. అప్పటి నుండి, గత ఐదేళ్లుగా నాగపూర్ సెంట్రల్ జైలులో అపఖ్యాతి పాలైన `అండా సెల్’ (గుడ్డు ఆకారపు పరిమిత స్థలం)లో ఆయన ఖైదు చేయబడ్డాడు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రత్యేక విలేఖరుల బృందం జూన్ 2018లో ఆయన ఫిర్యాదులను పరిష్కరిం చాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఒక నివేదికను సమర్పించిన తర్వాత కూడా- సుప్రీంకోర్టు దాని న్యాయమూర్తులు జోక్యం చేసుకునే స్వయంప్రతిపత్తి అధికారం కలిగి ఉన్నప్పటికీ అతని కేసు వినడానికి సిద్ధ పడలేదు. అతని విషయంలో కోర్టు చెవిటి దానిగా, మూగ సాక్షిగా మిగిలిపోయింది.

హిందూత్వ గ్రూపుల అభ్యర్థనలను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సుముఖత చూపుతుందనడానికి మరో ఉదాహరణ గా చెప్పాలంటే, 1991 నాటి పూజా స్థలాల చట్టం యొక్క రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ మార్చి 2021లో బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించింది. ఈ చట్టం- ఏదైనా ప్రార్థన స్థలానికి ఆగస్టు 15, 1947 [భారత స్వాతంత్ర్య దినోత్సవం] నాడు దానికున్న మతపరమైన స్థితిని కొనసాగిస్తామని హామీ ఇస్తుంది. అయోధ్య లోని ‘వివాదాస్పద నిర్మాణం’ అని పిలిచే- బాబ్రీ మసీదు విషయంలో మాత్రం దీన్ని మినహా యించారు. ఇక్కడ ఈ చట్టం వర్తించదు. సంఘ్ పరివార్ నేతృత్వంలో బాబ్రీ మసీదు కూల్చివేత ఉద్యమం అద్వానీ సారథ్యంలో హత్యాసదృశమైన రథయాత్ర ద్వారా ఊపందుకుంటున్న సమయంలో ఈ చట్టం అమల్లోకి వచ్చిందనేది గుర్తుంచు కోవాలి.

రథయాత్ర ద్వారా రెచ్చిపోయిన హిందువుల మనోభావాలను శాంతింప జేసేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రాయితీగా బాబరీ మసీదును చట్టం పరిధి నుంచి మినహాయించాలని నిర్ణయించారు. ఈ రాయితీ నిజానికి 1992లో మసీదు కూల్చివేతకు మార్గం సుగమం చేసింది.

ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించడం ద్వారా, మథుర, వారణాసి ల లోని మసీదుల స్థలాలపై తమకు హక్కు వుందని సంఘ్ పరివార్‌ చేస్తున్న పాత వాదనలకు సుప్రీంకోర్టు పరోక్షంగా మద్దతు నిస్తోంది. ముస్లిం పాలకులు ధ్వంసం చేసిన హిందూ దేవా లయాల శిథిలాల మీద నిర్మించారని పేర్కొంటూ, కుతుబ్ మినార్, తాజ్ మహల్ వంటి ప్రదేశాలను తవ్వి చూడాల ని డిమాండ్ చేస్తూ సంఘ్ పరివార్ సమర్పించిన మరిన్ని పిటిషన్లతో ఇది జఠిలమైన సమస్యల తేనెతుట్టెను కదిలించి నట్లయింది.
వారణాసి లోని గ్యాన్ వాపి [జ్ఞాన్ వాపి] మసీదు ప్రాంగణాన్ని ఒక సర్వే కమిషన్ తనిఖీ చేయడానికి అనుమతిం చడం ద్వారా సంఘ్ పరివార్ డిమాండ్‌లను సుప్రీంకోర్టు ఇప్పటికే అంగీకరించింది. కానీ వారి పరిశీలనల చుట్టూ వివాదాలు చెలరేగటంతో అది ఆ కమిషన్ అధ్యక్షుని తొలగింపుకు దారితీసింది. సర్వే కమీషన్ తన నివేదికను ఇంకా ప్రచురించలేదు, కానీ లీకైన సమాచారం ప్రకారం, మసీదు యొక్క చెరువులో అది ‘శివలింగం’ అని చెప్పుకునే ఒక రాతి బొమ్మను కనుగొన్నట్లు భావిస్తున్నారు, ముస్లిం మత పెద్దలు దీనిని మసీదు భక్తులు తమ ప్రార్థనలకు వెళ్లే ముందు చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి వీలుగా నీటిని అందించే ఒక ఫౌంటెన్‌గా వర్ణించారు.

సుప్రీం కోర్టు- నివేదిక ను బహిరంగంగా విడుదల చేయకుండా, దాన్ని సమగ్రంగా పరిశీలించి ఆ సమస్యపై తానొక గట్టినిర్ణయం తీసుకో కుండా, కేసును జిల్లా జడ్జికి బదిలీ చేసి న్యాయ నిర్ణయంలో దోబూచులాడుతోంది.

జిల్లా స్థాయి, సెషన్స్ కోర్టు వంటి ఈ దిగువ కోర్టు న్యాయమూర్తుల పనితీరు యొక్క రికార్డు సంతృప్తికరంగా లేదు. వారిలో ఎక్కువ మంది న్యాయశాస్త్రంలో పూర్తి అవగాహన వున్నవారు కాదు. లోతుపాతులన్నీ అధ్యయనం చేసిన వారు కాదు. వీరు ఇచ్చిన అనేక తీర్పులు, అనేక అప్పీళ్ల తరువాత, ఎంతో కాలయాపన తరువాత చివరికి ఉన్నత న్యాయస్థానాలచే కొట్టివేయబడటం పరిపాటి.

దిగువ కోర్టులు చేసిన న్యాయ విరుద్ధ నిర్వాకానికి తాజా ఉదాహరణ-గత ఏడాది అక్టోబర్‌లో మాదకద్రవ్యాలు కలిగి ఉన్నారనే ఆరోపణపై ఎన్‌ సి బి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) పట్టుకున్న ఆర్యన్ ఖాన్‌ కేసు. అతను 27 రోజులు కటకటాల వెనుక గడపవలసి వచ్చింది, ఆ సమయంలో బెయిల్ కోసం అతని అభ్యర్ధన మొదట మేజిస్ట్రేట్ కోర్టు, తదుపరి సెషన్ కోర్టుచే రెండుసార్లు తిరస్కరించబడింది- ఎట్టకేలకు బాంబే హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ ఖాన్ ఏడు నెలల మానసిక హింస అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అతనిపై ఆరోపణలు చేయడంలో తన తప్పును అంగీకరించి అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.

దిగువ కోర్టుల యొక్క ఈ దారుణమైన రికార్డు (క్షుణ్ణంగా పరిశీలించకుండా కేవలం ఎన్‌ సి బి నివేదిక ఆధారంగా నిర్దోషికి జైలు శిక్ష విధించటం వంటివి) తెలిసి కూడా, జ్ఞానవాపి మసీదు కేసును సుప్రీం కోర్టు మరొక దిగువ కోర్టుకి, మరో జిల్లా జడ్జికి ఎందుకు తోసివేసింది?
దిగువ కోర్టులలో న్యాయవ్యవస్థ పనితీరు ప్రమాణాలు పడిపోవటం గురించి మాట్లాడుతున్నప్పుడు, సుప్రీంకోర్టులోని కొంతమంది న్యాయమూర్తుల వృత్తి పరమైన నిపుణత, సమగ్రత విషయంలో కూడా ఇదే విధమైన క్షీణత వుండటా న్ని విస్మరించ లేము. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ రాజద్రోహ చట్టాన్ని విమర్శిస్తూనూ , సామాన్య ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూనూ బహిరంగ వేదికలపై ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. కానీ ఆయన తన కోర్టు ఆవరణలో, తన సహచర న్యాయమూర్తుల చేత, పైన వివరించిన కేసులలో మాదిరిగా దారుణమైన అన్యాయాలు జరుగుతుంటే అరికట్టటం లేదు. సామాన్య ప్రజలకు న్యాయాన్ని నిరాకరించే ఇటువంటి తీర్పులు మినహాయింపులు కాదు సర్వసాధారణంగా జరుగుతున్నవి. రాజకీయంగా అసమ్మతిని ప్రద ర్శించేవారి మానవ హక్కులను విస్మరించడం, హిందూ మెజారిటీ డిమాండ్లకు లొంగడం కోర్టులలో ఒక సార్వత్రిక నమూనాగా అనుసరించబడుతోంది.

[ ఈ వ్యాసం కౌంటర్ కరంట్స్.ఆర్గ్ (countercurrents.org) సంచికలో మొదట ప్రచురించబడింది]
Abridged in Frontier Weekly Vol 54, No. 50, Jun 12 – 18, 2022

[*అనువాదకుడు  కె, వేణు న్యాయశాస్త్ర అంశాల పరిశీలకుడు]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *