ప్రజాస్వామ్య పద్దతిలో అధికారం లోనికి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు సమాధానాలు చెప్పడం ఎప్పుడో మరిచాయి. పాలకపక్షంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న కార్యనిర్వాహక అధికారులు తమ మనసాక్షిని చంపుకొని పనిచేస్తున్నారన్న దానికి నిలువెత్తు నిదర్శనం జులై 30 వ తేదిన నంద్యాలలో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.
భవిష్యత్తులోనైన సాగునీటి అంశాలపై దశ , దిశ నిర్దేశం చేసేలాగా సమావేశాలు నిర్వహించాలని హితువు పలికారు.
సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ సమావేశ ఏర్పాటు, జరిగిన చర్చ, చేసిన తీర్మాణాలపైన సభ్యసమాజం తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేక భావనను ఎందుకు వ్యక్త పరుస్తుందో సహేతుకంగా వివరించారు.
1. *సమావేశ ఏర్పాటు:
సాగునీటి అంశాలపై చర్చించి సహేతుకమైన నిర్ణయాలు తీసుకొనడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు రైతు సంఘాలు కూడా పాల్గొనడానికి ఏర్పాట్లు చేయాలి. సమావేశానికి రైతులను, రైతు సంఘాలను ఆహ్వానించడం అటుంచి, సమావేశ ఏర్పాటు గురించి కూడా పత్రికలలో వార్తలు కూడా రాకుండా జాగ్రత్త పడింది ప్రభుత్వం. ప్రజలకు తెలియకుండా అత్యంత గోప్యంగా సమావేశం నిర్వహించడం ఈ ప్రాంత సాగునీటి సమస్యలపట్ల సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరగే ప్రయత్నమే అన్న భావన ప్రజలలో బలంగా ఉంది.
2. *సమావేశంలో చర్చనీయ అంశాలు :
తుంగభద్ర నదిలో నీరు పుష్కలంగా ప్రవహిస్తూ గత 20 సంవత్సరాలలో 15 సంవత్సరాలు వందల టి ఎం సీ ల నీరు సుంకేశుల ఆనకట్ట దాటి కృష్ణా నదిలో కలుస్తున్నది. ఈ నీటిని నిలబెట్టుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే సర్వే అనుమతులు పొంది, సర్వే పూర్తి అయిన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం గురించి చర్చ జరగలేదు. కానీ నీరంతా కృష్ణార్పణం అవుతుంటే కళ్ళు అప్పగించి చూస్తూ, నదిలో నీటి ప్రవాహాన్ని బట్టి పలానా తేది వరకు కే. సి. కెనాల్ కు నీరు అందిస్తామనే గత 20 సంవత్సరాలుగా చేస్తున్న తీర్మాణల నేపథ్యంలోనే చర్చ జరిగింది.
కె .సి. కెనాల్ స్థిరీకరణకు నిర్మించిన అలగనూరు రిజర్వాయర్ కుంగిపోయి ఐదు సంవత్సరాలైనా మరమ్మత్తులకై ప్రతిపాధనలు ముందుకు వెనకకు కదలుతున్నాయి. కానీ బడ్జట్ కేటాయింపులు జరగడం లేదు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఆర్థిక మంత్రి హాజరైనా ఈ ప్రాజెక్ట్ మరమ్మత్తులకు నిధులు ఎప్పడు కేటాయిస్తారు, ఎప్పటికి మరమ్మత్తులు పూర్తి చేస్తారు అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు.
శ్రీశైలం రిజర్వయర్ నుండి విద్యుత్ ఉత్పత్తికి 264 టి ఎం సీ లే నీటిని మాత్రమే వినియోగించాల్సి ఉంది. మిగులు జలాలను రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన తెలుగుగంగ, హంద్రీనీవా ప్రాజె క్టులకు వినియోగించడంపై చర్చే జరగలేదు. చర్చే జరగనప్పుడు ఆ దిశగా తీర్మానాలు చేసే పరిస్థితితే లేదు.
కుందూ నది మీద ఆధారపడి అనేక గ్రామాలు వెలిసాయి. కుందూ నదిని వినియోగించుకుంటూ లక్ష యాబై వేల ఎకరాలలో నంద్యాల, కడప జిల్లాలో వ్యవసాయం జరుగుతుంది. అలాంటి నదిని వెడెల్పు, లోతు చేసి కాలువగా మారుస్తున్నారు. దీనితో కుందూ నది పరిసరాలలో రైతులు సేద్యం చేసుకుంటున్న పట్టా భూములు, డికెటి పట్టా భూములు కోల్పోతున్నారు. నది మీద ఆధారపడిన వేలాది మంది రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లు తొలగించబడుతున్నాయి. వీటి నష్ట పరిహారం గురించి కాని, కుందూ నదిపైన ఆధారపడిన ప్రాంతానికి నూతన ఆయకట్టు అభివృద్ధికి బ్యారేజిల, చెక్ డ్యాంల నిర్మాణం పైన గాని, నదిని లోతు చేస్తే భూగర్బ జలాలు అడుగంటడం పైన గాని, పర్యావరణ ఇబ్ఫందుల పైన గాని, నదితో ముడిపడిన గ్రామీణ సామాజిక అంశాలపైన గాని చర్చనే జరగలేదు. ఈ అంశాలు ప్రభుత్వ దృష్టికి రాలేదా అంటే గత నాలుగు నెలలుగా ఈ అంశాన్ని రైతులు, రైతు సంఘాలు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించారు. ఈ అంశాలన్నింటితో కూడిన నోట్ ను జున్ 16 వ తేదీన సాగునీటి శాఖ, రెవెన్యు శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అందచేసింది. ఇంత కీలకమైన అంశంపై చర్చ అసలే జరగలేదంటే రాయలసీమ సాగునీటి అంశాలపట్ల ప్రభుత్వ విధానం అవగతం అవుతున్నది.
రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన ప్రాజెక్టులను అనుమతిలేని ప్రాజెక్టులుగా కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రటించినప్పటికి రాయలసీమ ప్రజా సంఘాల ఉద్యమంతో రాష్ట్ర ప్రభుత్వం వాటికి అనుమతులు సాదించింది. కాని ఈ అనుమతులలో తెలుగుగంగ హెడ్ వర్క్స్ కు మాత్రమే అనుమతి లభించింది. తెలుగుగంగకు సంబందించిన మిగిలిన అనుబంధ నిర్మాణాలను కూడా అనుమతిస్తూ సవరణలు చేపట్టాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ కూడా జరగలేదు.
*సమావేశంలో తీర్మానాలు* :
నదిలో “నీటి ప్రవాహాన్ని బట్టి పలానా నెల పలాన తేది వరకు నీరు అందిస్తాం” అన్న గత పది సంవత్సరాలుగా మొక్కు బడిగ జరుగుతున్న సాగునీటి సలహా మండలి సమావేశంలోని తీర్మాణ పరంపరను ఈ సంవత్సరం కూడా కొనసాగించారు.
వర్షాకాలం మొదలై కాలువలకు నీరు వదులుతున్న సందర్భంలో కాలువల మరమ్మత్తులు చేపట్టాలని, వాటికి నిదులు లేకపోతే నిదులకు ప్రతిపాధనలను పంపి, నిదులు పొంది మరమ్మత్తులు పూర్తి చేసి నీటిని సక్రమంగా రైతులకు అందచేయాలని సాగునీటి శాఖ అధికారులకు ప్రజా ప్రతినిధులు ఆదేశాలివ్వడం అన్న పరంపర ఈ సమావేశంలో కూడా కొనసాగించారు.
సభ్యసమాజం వ్యక్త పరుస్తున్న పై అంశాలను పరిగణనలోకి తీసుకొని, సమర్థవంతంగా సాగునీటి వ్యవస్థ నిర్వహణకు సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన భాద్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. సాగునీటి సలహా మండలి సమావేశాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పారదర్శకంగ చర్చించి సాగునీటి వ్యవస్థ సక్రమ నిర్వహణకు కార్యాచరణ చేపట్టాలని తద్వారా రైతులకు సకాలంలో సాగునీరు విడుదల చేయాలని బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేసారు.