(భూమన్)
విపశ్యన మన దేశపు అతి ప్రాచీనమైన ధ్యాన పద్ధతి. నా 66 వ యేట ఈ విపశ్యన గురించి విన్నాను. వెంటనే దాని గురించి తెలుసుకొని మన దేశంలోనే ఇప్పటికీ ఆరు, పది రోజుల శిభిరాలు “ఒక సేవకుడిగా” పది రోజులు పూర్తి చేసినాను.
నా జీవితంలో అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన అపురూపమైన కళ “విపశ్యన”.
2600 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు చేసిన జ్ఞాన పద్ధతి విపశ్యన. This is nothing but technique of Buddha Meditation.
విపశ్యన అంటే “ఉన్నది ఉన్నట్లుగా చూడటం. మనం తీసుకునే శ్వాస మీద ధ్యాస పెట్టడం. పరధ్యాశ లేకుండా ఉండటం” ఇందులోని రహస్య బహిర్గత ప్రక్రియ.
ఈ విపశ్యన ధ్యాన కేంద్రాలు ప్రపంచం మొత్తంలో 200 పైగా ఉన్నాయి. తాత్కాలికంగా 10 రోజులు శిబిరాలు 100కు పైగానే ఉంటాయి. పది రోజులు శిక్షణ తీసుకున్న వారికి ఒకటి, రెండు, మూడు రోజుల శిబిరాలు ఉంటాయి. పది రోజులకే కాకుండా 30 రోజులు 60 రోజులు శిక్షణ ఇచ్చే కేంద్రాలు కొన్ని ఉన్నాయి.
2500 సంవత్సరాలుగా మరుగున పడిన ఈ విపశ్యన ప్రక్రియ బర్మాలో స్థిరపడిన సత్యనారాయణ గోయెంక Sayagi ubakhin ద్వారా తెలుసుకొని ప్రపంచవ్యాప్తం చేశారు. గోయెంక బర్మాలో అత్యంత ధనవంతుడు. విపశ్యన ద్వారా పొందిన ప్రయోజనం వల్ల కృతజ్ఞుడుగా తన యావదాస్తిని ట్రస్ట్ క్రింద ఈ కేంద్రాలు ఏర్పాటుకు స్వీకారం చుట్టారు.
ఎక్కడా గాని… ఏ కేంద్రానికి గాని.. ఆయన పేరు గాని.. ఆ మహానుభావుని ఊసుగానీ ఉండదు. అన్ని కేంద్రాలు “సేవకులు” ద్వారానే నడుస్తుంటాయి.
ఆ పది రోజులు Noble silence. వచ్చిన వారు ఎవరూ ఎవరితోనూ మాట్లాడకూడదు. సంజ్ఞలు చేసుకోకూడదు. కంటి తాకిడి ఉండరాదు. పేనా గాని, పెన్సిల్ గాని, పుస్తకం గాని, సెల్, టీవీ లాంటివి ఏవి ఉండరాదు. మీ Purse వారి దగ్గర జమ చేయాలి. 10 రోజులు పూర్తి మౌనమే. ఇతరత్రా వ్యాయామాలు లేవు. నడక తప్పిస్తే ఎప్పుడైనా అవసరానికి వాలంటీర్తో గుసగుసగా మాట్లాడవచ్చు.
కొత్తలో కఠినమే అనిపించింది. రాను రాను ఎంతో బాగా ఉందిరా అనిపించింది.
పది రోజులు మంచి వసతి, మంచి భోజనం ఉంటాయి. వారే పరుపు, దుప్పట్లు ఇస్తారు. ఒక దమ్మిడి కూడా వీటికి చెల్లించవలసిన పనిలేదు. అంతా డొనేషన్స్ మీదనే. అన్ని రోజులు ఉన్నవారు అక్కడ విధానానికి మురిసిపోయి ఉత్సాహంగా డొనేట్ చేయడం చూశాను్. ప్రతి మారు నేను, నా భార్య 5000 రూపాయలు చొప్పున సంతోషంగా ఇచ్చే వాళ్ళము. ఇవ్వకపోయినా నిన్ను అడిగే వారు ఎవరూ లేరు. ఒక్క రూపాయి ఇచ్చినవారు కోటి రూపాయలు ఇచ్చిన వారు ఒక్కటే.
ఆహారం ఉదయం 6:30 – 8 గంటల మధ్యన అల్పాహారం. మధ్యాహ్నం 11 – 11:30 గంటల మధ్యన భోజనం. రాత్రి 6 -7 గంటల మధ్యన ప్రతిరోజు ఒక పూట మరమరాలు, ఇంకో రోజు అటుకులు, మరొక రోజు పాప్కార్న్ మాత్రమే. పండు కూడా రెండవసారి వచ్చిన వారికి రాత్రి ఆహారం, నిమ్మరసం మాత్రమే. పది రోజులు అంతే.
ప్రతిరోజు కార్యక్రమం ఉదయం 4:30 గంటలకు మొదలై రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. మధ్య మధ్యలో విరామం ఉన్నా కఠినంగా ఉన్నట్లు తొలి రోజుల్లో అనిపిస్తుంది.
మొదటి మూడు రోజులు ఆనాపానా నేర్పిస్తారు టీచర్. శ్వాస ఎట్లా పోతున్నది… ఎట్లా వస్తున్నదో గమనిస్తూ ఉండటమే. మన ఆలోచనలు ఎక్కడెక్కడికో పోతుంటాయి. లాక్కొచ్చి శ్వాస మీదకి రావటమే.
నాలుగవ రోజు మధ్యాహ్నం 3:15 గంటలకు విపశ్యన మొదలు. తల మీద ఆవు పట్టు నుండి ముఖం, కళ్ళు, చెవులు, ముక్కు, కనుబొమ్మలు, నోరు, బుగ్గలు, పెదవులు, మెడ, చేతులు.. అలా శరీరం మొత్తంగా పాదాల వరకు గమనిస్తూ ఉండాలి. ఎక్కడ స్పందనలు ఉన్నాయి…. అవి ఎలా ఉన్నాయి… నొప్పిగానా… కష్టంగానూ… సుఖంగానా.. టెక్లింగ్ గానా.. మత్తు గాన.. ఎలా ఉన్నాయో స్థిరంగా గమనిస్తుండటమే మన పని. ఏ ఏ సంవేదన / Sensation ఎలా ఉన్నదో ఎరుక పలుచుకోవటమే విపశ్యన. పైన నుంచి కిందికి… కింది నుంచి పైకి ఎరుక పరుచుకోవటమే.
సంవేదనలు రకరకాలుగా వస్తుండటం… పోతుండటం మనకు ఎరుకవుతూ ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. ఏది అశాశ్వతం కాదు. ప్రతిదీ పుడుతుంది. నశిస్తుంది. నిత్యం మారుతుందనే ఎరికే “విపశ్యన”.
విపశ్యన అంటే మార్పు. మనలో ప్రకృతిలో నిరంతర మార్పులు. ఈ గతి తర్కమే జీవన సూత్రం. విపశ్యన ఒక అద్భుతమైన జీవన కళ.
ప్రతిరోజు రాత్రి 7:15 నుండి 8.45 వరకు గోయెంక గారి ఆడియో ఉపన్యాసాలు ఉంటాయి. అంత గంభీరమైన గొంతు మంచి సంగతులతో ఆకట్టుకుంటుంది. ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషల్లో ఉంటాయి. ఈ విపశ్యనా కేంద్రంలో గంటలకొద్దీ మనలో మనం గడపడం వల్ల…. మనలో పేరుకున్న వికారాలు, రాగం, ద్వేషం ఎరుకలోకి వస్తాయి.
బుద్ధుడు అభివృద్ధి చేసిన ఈ పద్ధతి బౌద్ధంకు సంబంధం లేకుండా… మతం, కులం, ప్రాంతం లేకుండా అందరికీ చెందినదిగా సార్వజనీనమైంది. కొన్ని లక్షల మంది ప్రభావితులైనారు… అవుతున్నారు.
ఈ సిస్టం ఒక అద్భుతం. పేరు ప్రఖ్యాతులు, ఆర్థికాల జోలికి పోకుండా విపశ్యకులతో మాత్రమే ఈ 50 సంవత్సరాలలో 200 కేంద్రాలు విరాజిల్లుతున్నాయంటే ఆశ్చర్యం గాక మరి ఏమిటి ?
శిబిరం ముగిసే రోజున “మంగళమైత్రి” Metta గోయెంకా గారి ఉపన్యాసం అద్భుతంగా ఉంటుంది. సకల మానవాళికి అదొక ప్రేరణ.
చివరికి Nobel Silence. దాన్నే ఆర్య మౌనం ముగుస్తుంది. అప్పుడే ఒకరినొకరు పరిచయం చేసుకోవడం.. సంభాషించడం.
కాలిఫోర్నియాలో Jo shua tree లో ( ధమ్ము వద్దన ), గిల్రాయ్ లో ( ధమ్మ సంతోష ) కెల్స్ విల్లీ ( ధమ్మ మండ ) ఉన్నాయి. ఇంకా కొన్నిచోట్ల తాత్కాలిక కేంద్రాలు కూడా ఉన్నాయి. మోఫోమిట్ లో కూడా పెద్ద కేంద్రం ఉంది.
ఉత్తర కాలిఫోర్నియాలో Cobb mountain మంచి అడవిలో Pine, Fir, Oak చెట్లు… కొండలు.. పచ్చదనపు మధ్యలో ప్రకృతి ఒడిలో ఈ ధమ్మ మండ ఉంది…
(భూమన్ ప్రముఖ రచయిత, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు)
Lucidly explained about Vipassana meditation as taught by Gouthama Buddha Bhuman garu. Practice well regularly and evolve and make others also evolved. Spiritual practices are very much important now a days.