‘సీమ సమస్యలపై సర్కారు, పార్టీలు గళం విప్పాలి’

నంద్యాల:  రాయలసీమ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన తెలుగుగంగ, గాలేరు – నగరి, హంద్రీ నీవా, వెలిగొండ, ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, సిద్దాపురం ప్రాజెక్టులను అనుమతి పొందిన ప్రాజెక్టులుగా కృష్ణా నది యాజమాన్య బోర్డులో సవరణలు చేపట్టేట్లుగా కేంద్ర ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.

సోమవారం నంద్యాలలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..

కరువుకు నిలయమైన రాయలసీమ ప్రాంత సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు గళం విప్పాలనీ, అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమ ప్రాజక్టులకు కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా విడుదల చేసిన కృష్ణా నది యాజమాన్య బోర్డ్ నోటిఫికేషన్ లో సవరణలు చేపట్టడానికి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంను ఒప్పించడానికి నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజక్టుల నిర్మాణ, నిర్వహణకు అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 [(సెక్షన్ 85 (8) XI షెడ్యుల్ (10)] చట్టబద్దమైన హక్కులను కలుగచేసిందని ఆయన అన్నారు. అదే విధంగా అంతర్గత సర్దుబాటుతో నిర్మాణంలో ఉన్న ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర, సిద్దాపురం పథకాలకు కూడా రాష్ట్ర విభజన చట్టం [(సెక్షన్ 85; పాయింట్ నం 8 (ఎ)] ద్వారా అనుమతులు లభించాయని ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోజువారీ కృష్ణా జలాల వాడుకంపై వివాదాలు రాకుండా నివారించడానికి కృష్ణా నది యాజమాన్య బోర్డ్ ఏర్పాటుకు కూడా అంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 [(సెక్షన్ 84 & 85 (1)] చట్టబద్దత కల్పించిందని ఆయన తెలిపారు. కానీ జులై 15, 2021 న విడుదల చేసిన కృష్ణా నది యాజమాన్య బోర్డ్ నోటిఫికేషన్ లో రాష్ట్ర విభజన చట్టంలో అనుమతులు పొందిన పైన పేర్కొన్న ప్రాజక్టుల అన్నింటిని అనుమతులు లేని ప్రాజక్టులుగా పేర్కొందనీ, ఈ ప్రాజక్టులకు 6 నెలల కాలం లో అనుమతులు పొందకపోతే వాటి నిర్మాణాన్ని, నిర్వహణ ను ఆపి వేస్తామని స్పష్టంగా ప్రకటించడం జరిగిందని దశరథరామిరెడ్డి తెలిపారు.

కృష్ణా నది యాజమాన్య బోర్డ్ నోటిఫికేషన్ లోని రాయలసీమ వ్యతిరేక నిర్ణయాలపైన జిల్లా స్థాయిలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాలను కడప, తిరుపతి, పుట్టపర్తి, కర్నూలు, అనంతపూర్ పట్టణాలలో జూలై, ఆగస్ట్ 2021 లో రాయలసీమ ప్రజా సంఘాల సహకారంతో ఏర్పాటు చేసి ఆయా సమావేశాలలో తీర్మానించిన తీర్మానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలకు పంపడం జరిగిందని ఆయన అన్నారు. ఈ అంశం పైన అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో అక్టోబర్ 4, 2021 న నంద్యాలలో పెద్ద ఎత్తున సత్యాగ్రహం నిర్వహించడమైనదని దశరథరామిరెడ్డి అన్నారు.

ఈ ప్రాజక్టులు అన్నింటిని రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించారని, కృష్ణా నది యజమాన్య బోర్డ్ లో సవరణలు చేపట్టి ఈ ప్రాజక్టులను అనుమతి పొందిన ప్రాజక్టులుగా ప్రకటించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి అంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ సెక్రెటరీ అక్టోబర్ 5, 2021 న ఒక ఉత్తరం వ్రాసారని ఆయన తెలిపారు. రాయలసీమ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ అంశాలు ఉత్తరాల ద్వారా పరిష్కారం అయ్యేవి కావని, పార్లమెంట్ సభ్యుల స్థాయి, మంత్రుల స్థాయి, ముఖ్య మంత్రి స్థాయి దౌత్యం చేపట్టాలని ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించిన స్పందన లేదని దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపైన రాజకీయమైన ఒత్తిడి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పైన చెయ్యమని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసిన స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.

కృష్ణా నది యాజమాన్య బోర్డ్ నోటిఫికేషన్లో పై ప్రాజక్టులకు అనుమతులు పొందడానికి ఇచ్చిన ఆరు నెలల గడువు జనవరి 14, 2022 న ముగుస్తున్న సందర్భంలో గడువును మరో ఆరు నెలలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయాన్ని దశరథరామిరెడ్డి గుర్తు చేసారు. ఇప్పుడు ఆ గడువు కూడా ఈ నెల 14 న ముగిసి పోవడంతో అనుమతులు పొందని నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజక్టుల నిర్మాణాన్ని ఆపి వేయమని కృష్ణా నది యాజమాన్య బోర్డ్ అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు రోజుల క్రితం ఉత్తరం వ్రాసిందని దశరాథరామిరెడ్డి తెలిపారు.

రాయలసీమ భవిష్యత్తుకు అత్యంత కీలకమైన పై ప్రాజక్టులను అనుమతి పొందిన ప్రాజక్టులుగా కృష్ణా నది యాజమాన్య బోర్డ్ లో సవరణలు చేపట్టాలని , ఈ కీలకమైన సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా పూనుకొనవలసిందిగా కోరుతూ బహిరంగ లేఖ వ్రాసామని, అదే విధంగా అన్ని రాజకీయ పార్డీలకు కూడా బహిరంగ లేఖలు వ్రాసామని దశరథరామిరెడ్డి తెలిపారు.

అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపైన రాజకీయ ఒత్తిడి తీసుకొని రావాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

అంధ్రప్రదేశ్ లో భాగమైన రాయలసీమకు కూడా బాసటగా నిలబడి రాయలసీమకు సమ న్యాయం చేయాలని ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర నాయుడు, మహేశ్వరరెడ్డి, కొమ్మా శ్రీహరి, M.V.రమణారెడ్డి, ఏరువ రామిరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *