“కుందూ నది ఆధునీకరణ పనులపై రైతులకు స్పష్టత ఇవ్వండి. కుందూనది వెడల్పు ద్వారా రాయలసీమలో ఎన్ని వేల ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధి చేస్తారు”
***
శ్రీశైలం రిజర్వాయర్ కు వరద వచ్చిన సందర్భంలో ఆ నీరంతా సముద్రం పాలు కాకుండా రాయలసీమకు నీరు మళ్ళించే లక్ష్యంతో మరియు ఈ నీటిని మళ్ళించడం వలన రాయలసీమ లోని పొలాలు మునిగి పోకుండా ఉండే లక్ష్యంతో కుందు నదిని వెడుల్పు మరియు నది ఒడ్డులను ఎత్తు పెంచి బలోపేతం చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేస్తోందని, అయితే కుందూ పరీవాహక రైతులకు నష్టం కలిగించవద్దని, ఈ ప్రాంత రైతులకు సాగునీరు, త్రాగునీరు అందించే చర్యలు కూడా చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు.
గురువారం K.C.కెనాల్ E.E. ప్రతాప్, తెలుగుగంగ S.E.గారికి కుందూ ఆధునీకరణ పనుల స్పష్టత కోసం బొజ్జా దశరథరామిరెడ్డి నాయకత్వాన రైతు ప్రతినిధులు వినతిపత్రాలను అందచేసారు.
ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…
కుందు నది వెడల్పు కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా నుండి కడప జిల్లా వరకు అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో మొదలు పెట్టారనీ, ఈ నేపధ్యంలో కుందూ నది వెంట భూములు ఉన్న రైతులు, మనషుల, పశువుల త్రాగునీటికి, సాగు నీటికి మరియు తదితర అవసరాలకు ఈ నది పై ఆధారపడిన వారు కుందు వెడెల్పు కార్యక్రమం పైన స్పష్టత కావాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.
అలాగే …
1. కుందు నదిని ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎంత వెడల్పు చేయాలని నిర్ణయించారు ?
2. ఈ వెడెల్పు చేసే కార్యక్రమం లో రైతులకు సంబంధించిన “భూ సేకరణ” ఎక్కడెక్కడ ఎంత చేపట్టాలని నిర్ణయించారు ? దీనికి సంబంధించి రైతులకు “నోటీసులు ఇచ్చారా”? “నష్టపరిహారం నిర్ణయించారా” ?
3. నది వెడల్పు చేసే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టినట్లుగా కనపడడం లేదు. నదికి అనుకోని ఉన్న ప్రభుత్వ బంజరు భూములలోనే నదిని వెడెల్పు చేసే కార్యక్రమాన్ని ప్రస్తుతం చేపట్టారు. రేపు వరదలు వస్తే ఈ వెడుల్పు చేసిన నది ఒడ్డు ప్రాంతానికి ఆనుకొని ఉన్న “రైతుల భూములు కోత”కు గురికాకుండా ఏమి రక్షణ చర్యలు చేపట్టారు ? గురి అవుతే నష్టపరిహారానికి ఎంత బడ్జట్ కేటాయించారు?
4. ఈ వెడెల్పు చేసే కార్యక్రమంలో రైతులు స్వయంగా ఏర్పాటు చేసుకున్న “ఎన్ని ఎత్తిపోతల పంపులు (ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ్యూనిటి ఎత్తిపోతల పథకాలను మినహాయించి) తొలగించాల్సి” ఉంటుందో లెక్కకట్టారా ? దీనికి నష్ట పరిహారం నిర్ణయించారా ? నది వెడెల్పు పూర్తి అయిన తరువాత నది వెంట ఉన్న ప్రాంతానికి నీరు అందేలాగా “బ్యారేజిల నిర్మాణాని”కి ప్రణాళిక చేపట్టారా ?
5. కుందు నది వెంట అనేక ప్రాంతాలలో కుందు నదిలోనికి వచ్చి చేరే అనేక వంకలు వున్నాయి. సామర్థ్యాన్ని పెంచిన కుందు నదిలోనికి నిండుగా వరద నీరు ప్రవహించే సందర్భంలో, ఈ నదికి అనుసందానమై ఉన్న ఈ వంకల లోనికి నీరు ఎగదన్నడం వలన ఈ వంకలకు దగ్గర ఉన్న పొలాలు మరియు గ్రామాలు మునిగి పోకుండా “పర్యావరణ పరిరక్షణ”కు ఏమైనా కార్యాచరణ రూపొందించారా?
6. కుందు నది “ప్రస్తుత సామర్థ్యం” ఎంత మరియు వెడెల్పు ద్వారా నది “సామర్థ్యాన్ని ఎంతకు పెంచాలని” నిర్ణయించారు. ? రాయలసీమకు నీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న ఈ నది వెడెల్పు వలన రాయలసీమలో నీటిని నిలువ ఉంచడానికి రిజర్వాయర్లు ఎంత “నీటి నిలువ” మరియు “విడుదల సామర్థ్యం”తో “ఎక్కడెక్కడ” చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించారు ?
7. ఎన్ని రోజుల వరద జలాలను రాయలసీమ అవసరాలకు వినియోగించడానికి ప్రణాళిక చేసారు ? రాయలసీమ నీటి అవసరాల కోసం చేపడుతున్న ఈ ప్రాజక్టు ద్వారా “ఎన్ని వేల ఎకరాలకు నూతన ఆయకట్టు అభివృద్ధి” చేయడానికి ప్రణాళిక చేసారు? దీనికి సంబంధించి “పంట కాలువల నిర్మాణం” చేపడుతున్నారా ? ఈ ప్రాజక్టు నిర్మాణానికి ఎంత బడ్జట్ అంచనా వేసారు ?
8. నదిని వెడెల్పు చెయ్యడంతో పాటు లోతు కుడా చెయ్యాలని నిర్ణయించారా ? దీనివలన “భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం” ను ఏ విధంగా అరికట్టాలని నిర్ణయించారు?
9. నదిలోని నీరు బట్టలు ఉతకడానికి, చేలకు మందు కొట్టడానికి ఉపయోగ పడేది. నది గట్లను ఎత్తు చేసిన సంధర్భంలో ఈ కార్యక్రమాలకు నీటిని పొందడానికి కావలసిన నిర్మాణాలకై ఏమి చర్యలు చేపట్టారు?
10. వరద నివారణ లక్ష్యంతో నది గట్ల ఎత్తు పెంచతున్న సందర్భంలో నదిని అనుకోని ఉన్న పొలాలలోని “వర్షపు నీరు నదిలోనికి పోవడానికి తగిన నిర్మాణా”లకు ప్రణాళిక రూపొంధించారా? ఈ నిర్మాణాల నిర్వహణ లోపం వలన రైతుల పొలాలలోని నీరు తొలిగి పోకుండా ఉండే ప్రమాదం ఉంది. దీనితో రైతులు పంట నష్టపోకుండ నివారించడానికి వినూత్న కార్యాచరణ చేపడుతున్నారా ?
11. నది వెడెల్పులో వస్తున్న మట్టి/ఇసుక పరిమాణం నది గట్ల వెడెల్పు మరియు ఎత్తు పెంచడానికి సరి పోతుందా? మట్టి మిగిలితే “పాత చెరువుల గట్లు బలోపేతం” చేయడానికి, లేదా “నూతన చెరువుల గట్ల నిర్మాణా”నికి వినియోగించడానికి కార్యక్రమాలను చేపడుతున్నారా ?
అని ప్రశ్నలు సంధించారు.
రాయలసీమ రైతుల కోసం చేపడుతున్న కుందు నది వెడెల్పు కార్యక్రమం లో రాయలసీమ రైతాంగం కోరుకుంటున్న పై అంశాలపై స్పష్టత ఇస్తూ, కుందు నది వెడెల్పు పైన సమగ్ర ప్రణాళికను ప్రకటించాలని లేకుంటే కుందూ పరీవాహక రైతులతో ఉద్యమం చేస్తామని దశరథరామిరెడ్డి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, అల్లూరు ఆరికట్ల శివరామకృష్ణారెడ్డి, కాతా రామకృష్ణారెడ్డి, ఏరువ రామిరెడ్డి, M.V.రమణారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.