నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ గారిని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కలిసి సిద్దేశ్వర అలుగు నిర్మాణ ఆవశ్యకత గురించి వివరించారు.
సిద్దేశ్వరం అలుగు నిర్మాణ ఆవశ్యకత గురించి వ్రాసిన లేఖను ముఖ్యమంత్రి కి మీ ద్వారా పంపాలని కోరుతూ కలెక్టరుకి లేఖను అందచేసారు.
ఈ సందర్భంగా లేఖలోని అంశాలను దశరథరామిరెడ్డి ప్రస్తావిస్తూ…
సిద్దేశ్వరం దగ్గర అలుగు నిర్మాణం చేపడితే రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న త్రాగు, సాగునీటి కష్టాలను పూర్తిగా నిర్మూలించవచ్చని ఆయన తెలిపారు.
కృష్ణా – పెన్నార్ ప్రాజెక్టుతో సిద్దేశ్వరం దగ్గర రిజర్వాయర్ నిర్మాణం కొరకు 1932 సంవత్సరంలోనే రూపకల్పన జరిగిందనీ,అయితే దురదృష్టవశాత్తు అప్పుడు ఆగిపోయినప్పటికీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1951 లో ప్లానింగ్ కమీషన్ అనుమతించినప్పటికీ మరోసారి ఈ ప్రాజెక్టు రూపకల్పన జరగలేదని ఆయన వివరించారు.
రాయలసీమకు రెండు సార్లు దురదృష్టం వెంటాడినప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారి రూపంలో రాయలసీమకు మరొకసారి సువర్ణావకాశం లభించిందని ఆయన కలెక్టరుకు తెలిపారు.
సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలన్నది రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అనీ, ప్రతిపాదిత అలుగు నిర్మాణ స్థలం దగ్గరే జాతీయ రహదారిలో భాగంగా వంతెన నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని వంతెనతో పాటు అలుగు నిర్మాణం కూడా చేపట్టాలని రాయలసీమ ప్రజలు కోరుతున్నారని దశరథరామిరెడ్డి కలెక్టరు కు వివరించారు. ఇక్కడ అలుగు నిర్మాణం వలన రాయలసీమ ప్రజలకు త్రాగునీరు అందించడమే గాక, హంద్రీనీవా, గాలేరు – నగరి, SRBC, తెలుగుగంగ, కె.సి. కెనాల్, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల క్రింద వున్న ఆయకట్టుకు సకాలంలో నీరు అందించవచ్చని, దీని ద్వారా రాయలసీమ ప్రజల త్రాగు, సాగునీటికి భరోసా కల్పించవచ్చని దశరథరామిరెడ్డి కలెక్టరు కు వివరించారు.
సిద్దేశ్వరం అలుగు నిర్మాణం వలన శ్రీశైలం ప్రాజెక్టులోకి పూడికను నివారించడం వలన శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెరుగుతుందని, శ్రీశైలం ప్రాజక్టు కు రక్షణగా ఉంటుందని, ఈ అలుగు నిర్మాణానికి ఎటువంటి భూసేకరణ అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో నిర్మాణం చేపట్టవచ్చని ఐదు మందితో కూడిన ఇంజనీర్స్ – ఇన్ -ఛీప్స్ కమిటీ 2011 సంవత్సరంలోనే ఫీజుబిలిటి నివేదిక ఇచ్చిందని ఈ సందర్భంగా కలెక్టరు కు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలోనే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం తక్షణమే చేపట్టాలని కోరుతూ మే 31 న సిద్దేశ్వరం దగ్గర జలదీక్ష చేపట్టామని ఈ జలదీక్షలో రాయలసీమ లోని అన్ని ప్రజా సంఘాలు, రైతులు పాల్గొని అలుగు నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ను బలంగా వినిపించారని ఆయన వివరించారు.
పై అంశాలతో కూడిన లేఖను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి పంపాలని కోరుతూ లేఖను కలెక్టరు గారికి అందచేశారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, M.V.రమణారెడ్డి, సుధాకర్ రావు పాల్గొన్నారు.