నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో రాయలసీమ సాగు నీటి సాధన సమితి, ప్రజాసంఘాల సమన్వయ వేదికల సంయుక్తముగా మంగళవారం నిర్వహించిన సిద్దేశ్వరం అలుగు సాధన జలదీక్ష విజయవంతమైనట్లు రాయలసీమ సాగునీటిసాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు.
బుదవారం నంద్యాల రాయలసీమ సాగు నీటి సాధన సమితి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని నిర్భంధాలు పోలీసులతో పెట్టినా తమ హక్కులు, సాగు, తాగు నీరు సాధించుకునేందుకు రాయలసీమ 8 జిల్లాల రైతు ప్రతినిధులు, ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు వేలాది మంది గాంధేయ మార్గంలో స్వచ్చందముగా సొంత వాహనాల్లో తమ వెంట సద్దికట్టుకొని (అన్నం ), తాగు నీరు తెచ్చుకొని జలదీక్షలో పాల్గొని విజయవంతం చేశారని వివరించారు.
*బానిస సంకెళ్ల నుండి విముక్తి పొందడానికి భారతావని స్వతంత్ర పోరాటంలో స్వచ్చందంగా పాల్గొన్నట్లుగా త్రాగు, సాగునీటి విషయంలో మన సీమ పట్ల చూపుతున్న వివక్షతకు వ్యతిరేకంగా సీమ ప్రజానీకం కూడా సీమ నీటి హక్కులను సాధించుకోవడానికి తామంతకు తామే స్వచ్చందంగా ముందుకు రావడం స్వతంత్ర పోరాటాన్ని గుర్తుకు తెస్తోందని దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.
ఈ జలదీక్ష ఉద్యమ స్పూర్తితో రాబోవు రోజుల్లో రాయలసీమ 8 జిల్లాల్లో ని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యం చేస్తామని, రాయలసీమకు చట్ట బద్ధంగా రావాల్చిన సాగు, తాగు నీటిని సాధించుకుంటామని తెలిపారు.
సంగమేశ్వరంలోని అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నిర్వాహకులకు, నీరులేక బురదమైన కృష్ణా నది రిజర్వాయర్ లో జలదీక్ష సందర్భంగా రైతుల ప్రాణ రక్షణకు ప్రత్యేక శ్రద్ద తీసుకున్న నంద్యాల జిల్లా ఎస్. పి. రఘువీరారెడ్డి కి, పోలీసులు అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాతికేయులకు, అన్ని ప్రాంతాళనుండి వచ్చిన రైతులకు, ఉద్యమకారులకు బొజ్జా దశరథరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.