“సిద్ధేశ్వరం అలుగు-రాయలసీమ వెలుగు” అంటూ రాయలసీమ సాగు,తాగునీటి ఉద్యమకారులు చలొ సిద్దేశ్వరం అంటూ పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ పల్లెల నుంచి ప్రజలు స్వచ్చందంగా చలో సిద్దేశ్వరం అంటూ సొంత వాహనాల్లో,సొంత చద్దిమూటలతో బయలుదేరారు.అది 2016 మే నెల 31 న.అప్పటి ప్రభుత్వం ఉద్యమకారులు అక్కడికి చేరకుండా దమననీతికి పాల్పడింది.ఎక్కడి వాహనాలు అక్కడ ఆపేసారు,బారికేడ్స్,ముళ్ల కంచలు పెట్టారు.ట్రెంచెస్ తవారు.అయినా చలించని ప్రజలు సిద్దేశ్వరం చేరుకుని సింబాలిక్ గా “అలుగు” శంకుస్తాపన చేసారు.
సిద్దేశ్వరానికి ఎందుకు ఈ ప్రాముఖ్యత అంటే 1951 నాటికే ప్రణాళికా సంఘం ఆమోదం పొందిన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్ ప్రారంభం కావలసిన చోటు ఇక్కడే. రాయలసీమను తడుపుతూ అరవవాళ్లకు అన్ని నీళ్లా?మనం మనం తెలుగు అంటూ నందికొండ ప్రాజెక్ట్ తెరమీదకు తెచ్చారు.అది చివరకు నాగార్జునసాగర్ అయింది.కోస్లా కమీషన్ సిఫారసు చేసిన సిద్దేశ్వరం,గండికోటలను మాత్రం అటక ఎక్కించారు.
ఇక ఈ నాగార్జునసాగర్ కు ఓవర్హెడ్ టాంక్ లా శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చింది.ఇది మరో విశాదం..వందలాది గ్రామాల మునక,లక్షలాది జనం నిరాశ్రితులవడం తప్ప ఒరిగిందిలేదు.ఆ తర్వాత ఆవిరినష్టాలు వగైరాలు లెక్కకట్టి రాయలసీమకు కృష్ణాజలాలు అంటూ శ్రీశైలం కుడికాలువ ద్వారా 19 టీయంసీలు,ఆ తర్వాత తెలుగుగంగకు 15టీయంసీలు,బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన 25..మొత్తంగా 59 టీయంసీలు.ఇవన్నీ పోతురెడ్డిపాడు ద్వారా రావలసిందే.ఇక రామారావు అట్టహాసంగా శంకుస్తాపన చేసిన గాలేరు-నగరై సుజల స్రవంతీ ఇక్కడ మొదలవ్వాల్సిందే.
ఈ నీళ్లు పారాలంటే శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాల్సిందే.పోతిరెడ్డిపాడుకు శ్రీశైలం బాక్ వాటర్స్ చేరాలంటే కనీసం 841 అడుగులు ఉండాలి.
ఆ తర్వాత ప్రపంచ బాంక్ రుణం కోసం,దాన్ని విద్యుదుత్పత్తి ద్వారా తీరుస్తానంటూ అప్పటి సీయం బాబు కనీస నీటిమట్టాన్ని జీఓ-69 1996 ద్వారా 834 కు తగ్గించాడు.ఇదే రాయలసీమకు శాపం అయింది.
సరే ఆ తర్వాత ఇదే కృష్ణా మిగులు జలాలపై ఆధారపడి గాలేరు-నగరి,హంద్రీ-నీవా ప్రాజెక్టులూ వచ్చాయి.పనులు ముక్కుతూ మూల్గుతూ సాగుతున్నాయి.
ఇక తగ్గించినా నీటిమట్టం 834 దగ్గర ఆగుతారా అంటే అదీ ఉండదు. కోస్తాంధ్ర,తెలంగాణ అవసరాలంటూ 770 అడుగులవరకూ తరలించారు.ఇక ఆ స్థాయి నుంచి 854 అడుగులు నీరు చేరి రాయలసీమకు నీళ్లిచ్చేసరికి వరి నాట్ల కాలం దాటిపోతుంది.
రాయలసీమ అవసరాలకు ఉద్దేశించిన 854 అడుగులు చేరకున్నా వారికి కేటాయించిన నికర జలాలను వాడుకోవడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఆవశ్యకత ఉంది.దీనివల్ల మరో ప్రయోజనం శ్రీశైలంలో పూడిక తగ్గడం గత 27 ఏళ్లుగా సాలీనా 3 టీయంసీల నిల్వసామర్ధ్యం పూడికవల్ల తగ్గిపోతూ ఉంది.
ఇక డ్రెడ్జింగ్ ద్వారా పూడిక తీసేయటం లో అనేక సమస్యలున్నాయి.
ఈ అలుగు నీటి సామర్ద్యం 44 టీయంసీ ఉంటుంది.న్యాయానికి రాయలసీమకు 108 టీయంసీలు నిలుపుకునే హక్కుంది.ఇక బ్రిజేష్ కుమార్ కమిటీ కూడా 60 టీయంసీ క్యారీ ఓవర్ జలాలను నిలువ ఉంచుకోవచ్చని చెప్పారు.
ఈ అలుగు నిర్మాణానికి ప్రత్యేకించి భూసేకరణ,అటవీ,పర్యావరణ అనుమతులు అవసరం లేదు,విద్యుత్ వినియోగమూ ఉండదు.
–సిద్దేశ్వరం ఉద్యమం మ్మళ్లీ ఊపందుకోవడానికి కారణం తెలంగాణ లోని కల్వకుర్తి, నంద్యాల జిల్లాను కలుపుతూ కొత్త నేషనల్ హైవే రావడం. సిద్దేశ్వరం దగ్గర నిర్మించబోతున్న వంతెన కింద ఈ అలుగును అతి సులభంగా, చౌకగా నిర్మించుకోవచ్చును.
నంద్యాల ఉప ఎన్నికల నుంచి, 2019 ఎన్నికల్లోనూ అధికార, ప్రతిపక్షాలు ఈ అలుగు, కేసీ కాలువకు గుండెకాయలాంటి గుండ్రేవుల గురించి హామీల వర్షం కురిపించడమే తప్ప ఒక్క అడుగు ముందుకు సాగలేదు.
ఇక భాజపా అలుగు నిర్మాణం గురించి మాట్లాడినా చిత్తశుద్ధి లేని మాటలే.ఈ విషయంగా తెలంగాణ భాజపా వైఖరిని స్పష్టం చేయలేదు.వైకాపా ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో మొదలైన సీమ ఎత్తిపోతల పథకాల మీద రాద్దాం చేసి గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఆపారు.
కరోనా కాలం దాటుకుని ఇవాళ జరిగిన సిద్దేశ్వర ఉద్యమ యాత్ర గురించి చెప్పాలంటే గత ప్రభుత్వానికి భిన్నం కాదు. గత రెండు రోజులుగా సిద్దేశ్వరం పరిసరప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించామంటూ ప్రసార మాధ్యమాల్లో ఊదరగొట్టారు. కొందరు ఉద్యమకారులను ఇల్ల నుంచి కదలొద్దని హెచ్చరించారు. అక్కడికి చేరే మార్గం లో సరాసరి 5 కి,మీ ఒకచోట వాహన తనికీలు చేయడం,ఫోటోలు తీయడం, ఫోన్ నంబర్ల సేకరణ జరిగింది.
ఇన్ని ఆంక్షలున్నా అనేక ప్రజా సంఘాల తరపున వేలాదిగా జనం తరలి వచ్చారు. ప్రభుత్వంలో చేతన లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు. బొజ్జా దశరధరామి రెడ్డి, విరసం అరుణ్, వైయన్,రెడ్డి, రాంకుమార్, పాణి, అప్పిరెడ్డి హరనాధ్ రెడ్డి లాంటి వక్తల ప్రసంగాలు జనం శ్రద్ధగా విన్నారు.
–వర్షాకాలంలో అయినా మంచినీళ్లను టాంకర్స్ ద్వారా సరఫరా చేయాల్సిన గ్రామాలు సుమారు 500 దాకా అనంతపురం జిల్లాలో ఉన్నాయి.
–అబ్బా ఈ పోలీసుల పహారా లో పావువంతు శ్రద్ధ అమలాపురంలో పెట్టి ఉంటే అనర్ధం జరిగేది కాదని జనం అనుకుంటున్నారు.