ఎన్టీఆర్ ది విలక్షణ వ్యక్తిత్వం, ఎలాగంటే…

(టి.లక్ష్మీనారాయణ)

1. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ నాలుగు మాటలు వ్రాయాలనిపించింది. విలక్షణ సినీ నటుడుగా తెలుగు జాతి ఆరాధించిన ఎన్.టి.రామారావు గారు, ముఖ్యమంత్రిగా అనుసరించిన రాజకీయ విధానం, పాలనా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు సమాజంపై బలమైన ముద్రవేశాయి.

2. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసే నాటికి కేంద్రంలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నది. తెలుగు నాట అప్రతిష్టపాలైన కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి వామపక్షాలతో కూడిన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి పురుడు పోసుకొంటున్న తరుణం. అధికార మార్పిడికి, రాజకీయంగా భౌతిక పరిస్థితులు సానుకూలంగా పరిణమిస్తున్న దశ. ఎన్టీఆర్ తనకున్న సినీ గ్లామర్ తో, తెలుగు ప్రజల “ఆత్మగౌరవం” నినాదంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహాన్ని చక్కగా వినియోగించుకున్నారు. బడుగు బలహీన వర్గాలను, ప్రత్యేకించి వెనుకబడిన తరగతులను, మహిళలను సమీకృతం చేసుకొన్నారు. అనూహ్యంగా రాజకీయాల గమనాన్ని మార్చి, అధికార పగ్గాలను చేజిక్కించుకున్నారు.

3. ముఖానికి రంగులు వేసుకొనే ఎన్టీఆర్ అనే చులకన భావం వ్యక్తం చేసిన వాళ్ళ నోళ్ళకు ముఖ్యమంత్రిగా ఆచరణలో తాళాలు వేశారు. భూస్వామ్య వ్యవస్థకు పట్టుగొమ్మ, అవినీతి – అక్రమాలకు మారుపేరుగా నిలిచిన మునసబ్ – కరణాల(పటేల్ – పట్వారీ) వ్యవస్థను కూకటివేళ్ళతో పెకలించి వేశారు. మండల వ్యవస్థతో పరిపాలనా వ్యవస్థను ప్రజల చెంతకు చేర్చారు. రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పాలనలో భాగస్వాములు కావడానికి తద్వారా బడుగు బలహీనవర్గాలు, మహిళలు సాధికారత వైపు నడక సాగించడానికి మార్గాన్ని సుగమం చేశారు. మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు అమలు వైపు చర్యలు చేపట్టారు. పేదలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో రెండు రూపాయలకు కేజీ బియ్యం పథకం అమలు చేశారు. బావులు – బోరు బావులపై ఆధారపడి సేద్యం చేస్తున్న మెట్టప్రాంతాల రైతులకు బరోసా కల్పిస్తూ “హార్స్ పవర్” కు రు.50 పథకాన్ని అమలు చేశారు.


ఎన్టీఆర్ శతజయంతి  సందర్భంగా…


4. అవిశ్రాంత భూ పోరాటం ద్వారా పేదలు ఆక్రమించుకొన్న చల్లపల్లి జమిందారు భూములను పేదల సొంతం చేస్తూ ఎన్టీఆర్ పట్టాలు పంపిణీ చేయడంతో కమ్యూనిస్టులు నిర్వహించిన సుదీర్ఘ భూపోరాటానికి ఘనవిజయం లభించింది. “చెట్టు పట్టాల పథకం”ద్వారా పేదల జీవనోపాధికి చిట్టడవులను సాగు చేసుకోవడానికి అవకాశం కల్పించాలన్న ఒక వినూత్నమైన సూచనను కమ్యూనిస్టు నేత అమరజీవి కొల్లి నాగేశ్వరరావు చేస్తే భేషజాలకు పోకుండా అంగీకరించి, అమలుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్.

5. కరవు పీడిత రాయలసీమ ప్రాంతం సమగ్రాభివృద్ధి చెందాలంటే కృష్ణా జలాలను మళ్లించడమే ఏకైక మార్గమని కమ్యూనిస్టులు, ఇతరులు సాగించిన ఉద్యమాలకు ప్రభావితుడైన ఎన్టీఆర్ తెలుగు గంగ, హంద్రీ – నీవా సుజల స్రవంతి, గాలేరు – నగరి సుజల స్రవంతి పథకాలను ప్రముఖ ఇంజనీర్ శ్రీరామకృష్ణయ్య తోడ్పాటుతో రూపొందించి, నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాల అలసత్వం కారణంగా మూడున్నర దశాబ్దాలు గడచిపోతున్నా తెలుగు గంగ మినహా మిగిలిన రెండు ప్రాజెక్టుల నిర్మాణాలు నత్తనడకన సాగించబడుతున్నాయి. గాలేరు – నగరి రెండవ దశ నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించాయి. ఎన్టీఆర్ ప్రభుత్వం రూపకల్పన చేసిన ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తే మిగులు జలాలు లేదా వరద జలాలతోనైన రాయలసీమ నీటి కడగండ్లకు కొంత పరిష్కారం లభిస్తుంది.

6. తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు జాతి ప్రతిష్టను అనుమడింప చేయడంలో ఎన్టీఆర్ అగ్రభాగాన నిలిచారు. హైదరాబాదు మహా నగరం నడిబొడ్డులో ఉన్న ట్యాంక్ బండ్ ను సందర్శిస్తే మొదట గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. సిద్ధాంతాలు – రాజకీయ అనుబంధాలకు అతీతంగా అక్కడ దర్శనమిచ్చే మహనీయుల విగ్రహాలు మన తెలుగు జాతి ముద్దు బిడ్డలను స్ఫురణకు తెస్తాయి. వారు సమాజ అభివృద్ధికి చేసిన కృషి, త్యాగాల చరిత్ర గుర్తుకు వస్తాయి.

7. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నేను మూడు సార్లు కలిశాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలో మొదటిసారి కలిశాను. అప్పుడు నేను ఏ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఐ.టి.ఐ. విద్యార్థుల సమస్యలపై “ఛలో హైదరాబాద్” ఆందోళనకు పిలుపిచ్చాం. రెండు, మూడు వేల మంది హైదరాబాదుకు వచ్చారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని సమర్పించడానికి ఇంటర్యూ కోరితే, ఉదయం 6 గం.లకు అబిడ్స్ లోని ఎన్టీఆర్ స్వగృహం వద్ద కలవడానికి అవకాశం ఇచ్చారు. నా నాయకత్వంలో ఒక ప్రతినిధివర్గంగా వెళ్ళాం. ముందు గదిలో ఒక సోఫా మాత్రమే ఉన్నది. ఎన్టీఆర్ వచ్చి ఆ సోఫాపై కూర్చున్నారు. నేను వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చొని, వినతిపత్రం అందజేసి, అందులోని విద్యార్థుల న్యాయమైన కోర్కెలను ఒకదాని తర్వాత ఒకటి వివరించడం మొదలు పెట్టాను. ఎన్టీఆర్ కాస్తా అసహనంగా, అసంతృప్తిగా ముఖం చిట్లించుకొని, విధిలేక వింటున్నట్లు అనిపించింది. ఈలోపు మా ఉద్యమ సహచరుడొకరు తన వద్ద ఉన్న చిన్న కెమెరాతో ఫోటో తీయబోయే ముఖ్యమంత్రి సిబ్బంది కెమెరాను లాగేసుకొన్నారు. అలాంటి వాతావరణంలో వినతిపత్రాన్ని అందజేసి వచ్చాం.
రెండవసారి, ఒక ప్రతినిధివర్గంలో సభ్యుడుగా వెళ్ళి సచివాలయంలో కలిశాను. ఒక పెద్ద హాలులో ఎన్టీఆర్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. దరిదాపుల్లో కుర్చీలు లేవు. ఆయన్ను కలవడానికి వెళ్లిన వాళ్ళు చచ్చినట్లు నిలబడే మాట్లాడాల్సిన పరిస్థితి. ఈ రెండు ఘటనలను బట్టి నాకు అనిపించింది, ఎన్టీఆర్ ఫ్యూడల్ మనస్తత్వం మూర్తీభవించిన వ్యక్తని.

8. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పలు దఫాలు విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర సచవాలయం ప్రధాన ద్వారం దగ్గర ఫికెటింగ్ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాం. పోలీసుల లాఠీచార్జీల్లో తీవ్రంగా గాయపడిన ఘటనల అనుభవాలు ఉన్నాయి.

9. మూడవసారి కలిసే నాటికి చాలా మార్పులు సంభవించాయి. అప్పుడు నేను కడప జిల్లా సీపీఐ కార్యదర్శిగా ఉన్నాను. కడప జిల్లా కలెక్టరుగా ఉన్న అమరజీవి పి. సుబ్రమణ్యం(డా.వై.ఎస్.ఆర్.తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు)గారు జమ్మలమడుగు కో – ఆపరేటివ్ సొసైటీలో జరిగిన అవినీతి కుంభకోణాన్ని వెలికితీశారు. జిల్లా ప్రజలు హర్షించారు. కానీ, రాజకీయ వత్తిళ్ళతో ఆయన్ను ఆకస్మికంగా బదిలీ చేశారు. బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నా నాయకత్వంలో అఖిల పక్ష కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడానికి హైదరాబాదుకు ఒక ప్రతినిధివర్గంగా వెళ్ళాం. ఆ ప్రతినిధివర్గంలో కడప జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులు పి.వి.ఎస్. మూర్తి గారు కూడా ఉన్నారు. విద్యార్థి దశ నుండి పరిచయం ఉన్న వారు కాబట్టి నాడు మంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు గారిని ముందు రాష్ట్ర సచివాయంలో కలిశాం. అప్పుడు సి.రామచంద్రయ్య(ప్రస్తుతం వైఎస్సార్సీపీ యం.ఎల్.సి.) గారు కూడా అక్కడున్నారు. చంద్రబాబునాయుడు గారు తన నిస్సహాయతను వ్యక్తం చేసి, ముఖ్యమంత్రినే కలవమని సూచించారు. వెళ్ళి ఎన్టీఆర్ గారిని కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళాం. సానుకూలంగా స్పందించి, కలెక్టర్ బదిలీ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా కడపకు తిరిగి వెళ్ళాం. మేం ఉదయం కడపకు చేరిన కొద్ది సేపటికే ఆ ఆనందం ఆవిరై పోయింది. అప్పుడు కడప ఎస్.పి.గా ఉన్న ఆర్.పి.ఠాకూర్(రాష్ట్ర విభజన తర్వాత డి.జి.పి.గా బాధ్యతలు నిర్వహించారు) గారు ఫోన్ చేసి, మీ ప్రయత్నం నిస్ఫలమయ్యిందని, కలెక్టర్ బదిలీ ఉత్తర్వులే ఖరారయ్యాయని తెలియజేశారు. అప్పుడు నిర్ధారణకు వచ్చాను, ఇంటిలో వేళ్ళూనుకొని ఉన్న రాజ్యాంగేతర శక్తి ఎంత బలమైనదో!

10. ఎన్టీఆర్ గారిని అప్రజాస్వామికంగా నాదెళ్ల భాస్కరరావు గారు పదవీచ్యుతుడిని చేసినప్పుడు జరిగిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ మహోద్యమంలో నేను పాల్గొన్నాను. నాడు సీపీఐ, అగ్రనేతల్లో ఒకరైన అమరజీవి కా.నీలం రాజశేఖరరెడ్డి గారి నేతృత్వంలో ఒక బృందంగా రాయలసీమ నాలుగు జిల్లాలలో పర్యటించి, పలు సభల్లో పాల్గొన్నాను. అదొక గొప్ప అనుభూతి. ఎన్టీఆర్ గారు ధన్యజీవి.

T Lakshminarayana
T Lakshminarayana

(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *