దేశద్రోహ చట్టంపై స్టే ఉ.పా రద్దుకు స్ఫూర్తియా

 

*కేంద్రం సమీక్ష చేసేంత వరకూ దేశద్రోహ చట్టం పై సుప్రీంకోర్టు స్టే!*

*మరికొన్ని రేపటి ముందడుగులకు తోడ్పడే ముందడుగు!

*ఇంతకన్న ప్రమాదకర ఉపాచట్టం రద్దుకై ఇది స్ఫూర్తినిస్తుంది.

 

బ్రిటీష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నేటికీ కొనసాగించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో మొదలైన చర్చ ఓ *ముందడుగు* వేసింది. సుప్రీంకోర్టులో *పునసమీక్ష* చేస్తామని కేంద్రం కోరడం తెల్సిందే. అప్పటివరకూ ఆ చట్టంపై వైఖరి ఏమిటనే ప్రశ్నను కేంద్రాన్ని సుప్రీంకోర్టు అడిగింది. *సమీక్ష చేసే వరకూ దేశద్రోహ చట్టం కొనసాగుతుంది* అని కేంద్రం జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఓ సంచలన ఉత్తర్వు ఇచ్చింది.

సమీక్ష చేసేంత వరకు పై చట్టాన్ని *అబయాన్స్* లో పెట్టాలని ఉత్తర్వు ఇచ్చింది. అంటే దాని *అమలును తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ ఆపండి* అని చెప్పడమే. ఈ లోపుగా పై చట్టం క్రింద కొత్త కేసుల్ని నమోదు చేయరాదని కూడా స్పష్టం చేసింది. పై కేసుల్లో జైళ్లల్లో ఉన్నవారు బెయిల్ కోసం కోర్టుల్ని ఆశ్రయించాలని కూడా సూచించింది. ప్రస్తుత *నిర్బంధ భారత దేశం* లో ఇదో సానుకూల పరిణామం. *సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుని స్వాగతిద్దాం.*

తాజా సుప్రీంకోర్టు ఉత్తర్వుకు గల విస్తృతి సాంకేతికంగా చూసేది కాదు. నేటి ప్రకటిత *రిపబ్లిక్ ఇండియా* ని మున్ముందు *ఫాసిస్టు భారత్* గా మార్చే దిశలో పరివర్తన చెందే కాలమిది. ఈ పరివర్తనా కాలంలో ఈ తీర్పుకు గల విస్తృతి చాలా విశాలమైనది. ఈ తాజా సానుకూల తీర్పుకి కారణాలు ఏమైనప్పటికీ, దీని పర్యవసానాలు, ఫలితాలు, ప్రభావాలు చాలా విస్తృతమైనవిగా వుండే అవకాశం ఉంది. ఐతే అవి వాటంతట అవే విశాల, విస్తృత రూపం దరిస్తాయని కాదు. తాజా భౌతికస్థితిని మెలకువగా సద్వినియోగం చేసుకునే కృషి, సామర్ధ్యాల మీద ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ ఉనికిలో ఉన్న దేశద్రోహ చట్టాన్ని రేపు రద్దు చేసినంత మాత్రాన *నిర్బంధ విధానం* రద్దు ఐనట్లు భావించరాదు. *నిర్బంధ విధానాన్ని వ్యతిరేకించే ప్రజాతంత్ర ఉద్యమాలు, ప్రజా చైతన్యమే వాస్తవ ఫలితాల్ని ఇస్తాయి.* చట్టబద్ధమైన తీర్పులతో సమాజంలో లభించే ప్రజాతంత్ర సావకాశ పరిస్థితి (Democretic space) కంటే, ప్రజల ప్రజాస్వామిక చైతన్యమే ఎక్కువ ప్రభావశీలమైన అంశంగా వుంటుంది. అదే సాపేక్షికంగా నిర్బంధ విధానాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాన్ని నియంత్రించడంలో అది స్థిరకారణంగా పని చేస్తుంది. ఐతే ఇలాంటి సానుకూల తీర్పులు అట్టి సుస్థిరమైన ప్రజాతంత్ర ఉద్యమాల నిర్మాణానికి సహకరిస్తాయి.

ఒక కాలంలో *టాడా చట్టం* వల్ల వేల మంది క్రూరమైన నిర్బంధానికి గురయ్యారు. దానిపై దేశ ప్రజల్లో నిరసన వెల్లువ తలెత్తింది. ఆ స్థితిలో అది రద్దయినది. ప్రజాతంత్ర వాతావరణం ఏర్పడింది. ఆనాడు తాత్కాలికంగా *ప్రజాతంత్ర భారత్* ఊపిరి పీల్చుకుంది. నాడు *నిర్బంధ భారత్* వెనకడుగు వేసింది. ఆ తర్వాత ఏం జరిగింది?

ఆనాడు రద్దు చేసిన *టాడా* లోని నిర్బంధ క్లాజుల కంటే ప్రమాదకర క్లాజులతో *పోటా చట్టం* ఉనికిలోకి వచ్చింది. తిరిగి షరా మామూలే! అది కూడా రద్దై పోయింది. దానికంటే ప్రమాదకర క్లాజుల్ని ఉపా చట్టంలో చేర్చారు. ఇది *నిర్బంధ భారత్* చేపట్టిన *కొత్త సీసాలో పాతసారాయి* వంటి విధానమే.

1960వ దశాబ్దంలో *ఉపా చట్టం* ఉనికిలోకి వచ్చింది. *పోటా రద్దు* వల్ల తాత్కాలికంగా *నిర్బంధ భారత్* ఓ పెద్ద లోటుకు గురైనది. దాని భర్తీ కోసం UPA సర్కార్ బహుశా 2005 లో *ఉపా* చట్టానికి కొత్త కోరలను బిగించింది. అది పోరాట సంస్థల్ని టార్గెట్ చేసింది. 2019 లో NDA సర్కార్ వ్యక్తుల్ని కూడా టార్గెట్ చేసే క్లాజుల్ని చేర్చింది. ఆచరణలో దేశద్రోహ చట్టం కంటే *ఉపా చట్టం* మరింత ప్రమాదకర *ఫాసిస్టు చట్టం* గా మారింది. దాని రద్దుకై చేపట్టాల్సిన ప్రజాతంత్ర పోరాటానికి తాజా సుప్రీంకోర్టు తీర్పుని ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జమ్మూకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలోని సరిహద్దు ప్రాంతాల్లో అమలు జరిగే *ఫాసిస్టు నిర్బంధ చట్టాల* మీద నేడు జరిగే ప్రజాతంత్ర ఉద్యమాలతో పరస్పరం సమన్వయం చేసుకొని విశాలమైన ప్రజాతంత్ర ఉద్యమాల నిర్మాణం జరగాల్సి ఉంది.

ఏది ఏమైనా తాజా సుప్రీంకోర్టు తీర్పు నేటి భౌతిక పరిస్థితుల్లో *ఒక ముందడుగు!* పైగా నేడు *నిర్బంధ భారత్* దశ నుండి భారతదేశం *ఫాసిస్టు భారత్* దిశలో ప్రయాణం చేస్తోంది. ఈ పరివర్తనా కాలంలో ఇదో *పెద్దముందడుగు!* ఈ సానుకూల భౌతికస్థితిని ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. అవి అందుకై ప్రయత్నిస్తామని ఆశిద్దాం.

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
11-5-2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *